తాను పుట్టి పెరిగిన పల్లె జనం గుండె చప్పుడు విన్నారు. పెద్ద చిన్న, ముసలి, ముతక తేడా లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని గ్రామ సమగ్ర అభివృద్ధికి సంకల్పించారు. చింతమడక దశ దిశ మార్చి చింతలేని గ్రామంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శ్రీకారం చుట్టారు. అనుకున్నదే తడువుగా గ్రామ పర్యటన జరిగిన 24 గంటల్లోనే రూ.100 కోట్ల ప్రత్యేక నిధులతో చింతమడక గ్రామంతోపాటు గతంలోని మధిర గ్రామాలకు కూడా మహర్దశ పట్టించారు.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రాకతో చింతమడక పులకించిపోయింది. గ్రామ సమగ్రాభివద్ధికి ప్రణాళిక పడింది. గ్రామ ప్రజల శాశ్వత జీవనోపాధికి బాట పడాలని, చింత లేకుండా చింతమడక.. బంగారు తునక కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. తన సొంతూరు సిద్ధిపేట జిల్లా సిద్ధిపేట రూరల్‌ మండలం చింతమడకలో సీఎం కేసీఆర్‌ పర్యటన సందర్భంగా అక్కడ ఆత్మీయ అనురాగ సభ ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్‌ వద్ద సీఎం కేసీఆర్‌కు జిల్లా కలెక్టర్‌ పి.వెంకట్రామ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, మాజీ మంత్రి, స్థానిక శాసన సభ్యుడు హరీశ్‌ రావు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. హెలిప్యాడ్‌ దిగి సభా స్థలికి చేరుకున్న సీఎం వేదిక పైకి చేరుకోకుండానే నేరుగా గ్రామస్తుల గ్యాలరీకి వెళ్లి అందరినీ పలకరిస్తూ.. కరచాలనం చేస్తూ వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం సభా వేదిక పైకి రాగానే తన చిన్నాన్న బాలకిషన్‌ రావుకు పాదాభివందనం చేసి, ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఆశీర్వాదం పొందారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ”నన్ను కని పెంచి ఈ స్థాయికి ఎదిగేలా చేసి రాష్ట్రానికి అప్పజెప్పిన చింతమడక గ్రామ రుణాన్ని తీర్చుకునేందుకు వచ్చిన. మీ కాళ్లలో చేతుల్లో పెరిగిన బిడ్డను. ఈ గ్రామంలోని తల్లులంతా నా తల్లులే. ఈ మట్టి గొప్పతనాన్ని దేశమంతా చాటాలని ఆశీర్వదించి పంపిండ్రు. అలాంటి నా ఊరికి ఎంత చేసిన తక్కువే. నా ప్రజలకు ఏమిచ్చినా తక్కువే. చింతమడక గ్రామ రూపురేఖలు మారాలి. దీన్ని మోడ్రన్‌ విలేజ్‌ గా చేసే బాధ్యత నాది. దేశంలోనే చింతమడక పేరు మార్మోగేలా బంగారు తునకలా తీర్చిదిద్దుతా” అని స్పష్టం చేశారు.

చింతమడక వాస్తు పరంగా కూడా బాగుంటుందని, గ్రామానికి నాలుగు వైపులా చెరువులు ఉన్నాయంటూ.. తన చిన్నప్పుడు చెరువు ఊట.. తమ బజార్‌ ముందు నుంచి పోయేదని తన జ్ఞాపకాలను పంచుకున్నారు. ”చాలా కాలం తర్వాత నా కోరిక నెరవేరుతోంది. రైతుబంధు, రైతుబీమా సౌకర్యం కల్పించిన రోజు చాలా సంతోషపడ్డాను. ఈ ఊరికి నాలుగు మూలల్లో నాలుగు అద్భుతమైన తటాకాలు ఉన్నాయి. ఇప్పుడు నీళ్ల కోసం 800 అడుగుల బోర్లు వేశాం. కానీ మళ్లీ గ్రామంలో నీటి ఊటలు, బావుల్లో జాలు చూడబోతున్నాం” అని పేర్కొన్నారు. మీ ఊరి బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడంటూ.. తనను పెంచిన ఈ ఊరు చింతమడకతో పాటుగా.. మరో మూడు గ్రామాలు గూడూరు, తోర్నాల, దుబ్బాక, పుల్లూరు గ్రామాలు తనకు విద్యా బుద్ధులు నేర్పించాయని గుర్తు చేసుకున్నారు. మొదటి ఐదేళ్లలో రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలను పరిష్కరించామన్నారు. విద్యుత్‌, తాగునీటి సమస్యలు లేకుండా చేశామని చెప్పారు. ఊరు బాగుపడాలంటే గ్రామ ప్రజలంతా ఐకమత్యంగా

ఉండాలని సూచించారు. ఎర్రవల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని బాగు చేశానన్నారు.

ఈ ఊరికి అర్జెంట్‌గా రెండు రోడ్లు కావాలి.. మూడు నెలల్లో వేయిస్తామని, ఒక్క చింతమడకనే బాగు చేస్తే కలవదు., కాబట్టి.. సిద్ధిపేట నియోజకవర్గమంతా అభివద్ధి చేస్తామన్నారు.

హెల్త్‌ ప్రొఫైల్‌ కు చింతమడక నాంది కావాలి

చింతమడక ఊరంతా ఆరోగ్య పరీక్షలు చేసేందుకు శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన వైద్యం అందించాలి. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను వెంటనే చేయాలని స్థానిక శాసన సభ్యుడు హరీశ్‌ రావును కోరుతున్నానని తెలుపుతూ.. ముందుగా ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేయాలన్నారు. నెల రోజుల్లో చింతమడకలో ఆరోగ్య సమస్యలు లేకుండా చేయాలని కలెక్టర్‌, ఎమ్మెల్యేలను కోరారు. గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి అన్ని రకాల పరీక్షలు చేయించాలని., ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా.. ప్రభుత్వ ఖర్చుతో కార్పొరేట్‌ ఆసుపత్రిల్లో చికిత్స చేయి స్తామని వివరించారు. చింతమడక ప్రజల ఆరోగ్య నివేదిక (హెల్త్‌ ప్రొఫైల్‌) తయారు చేయాలని, యావత్‌ తెలంగాణ ఆరోగ్య సూచిక తయారు చేయాలనే ఆలోచన ఉందని పేర్కొంటూ.. తెలంగాణ హెల్త్‌ పొఫైల్‌కు చింతమడక నాంది కావాలన్నారు.

ఆ రోజుల్లో మా సార్లు భాగవతం నేర్పిండ్రు..

”నేను చదువుకునే రోజుల్లో గొప్పఉపాధ్యాయులు ఉండేవారు. నా క్లాస్‌ మేట్లుగా కిష్టారెడ్డి, సంజీవ రెడ్డి ఉండేటో ళ్ళు. దుబ్బాకలో రాఘవ రెడ్డి సార్‌ ఇంట్ల మేము విద్య నేర్చుకున్నాం. చింతమడక, గూడూరు, తోర్నాల, పుల్లూరు, దుబ్బాకలో గురువులు విద్య నేర్పిండ్రు. గూడూరులో అక్క దగ్గర గోరు ముద్దలు తినుకుంట పంట పొలాల్లో గట్ల పొంట పోతూ సర్కారు బడికి పోయేటోన్ని. మత్యుంజయ శర్మ సార్‌ ఎంతో గొప్ప గురువు. పద్యం, తాత్పర్యం చెప్పి కంఠస్తం చేసి దోషం లేకుండా అప్పజేప్పినోళ్లకు నోట్‌ పుస్తకం ప్రైజ్‌ అని ఇచ్చేవారు. ఉత్తర గోగ్రహణం అనే పాఠం చెప్పిండు. ఆ పద్యం జర గొట్టుగా ఉంటది. నాలుక తిరగటం కష్టం. ఆ పద్యం అప్పజెప్పిన వారికి 200 పేజీల నోట్‌ పుస్తకం ఇస్తానన్నడు. అప్పుడే బట్టీ పట్టుడు అలవాటు ఉండే. సార్‌ మీరు అనుమతి ఇస్తే… ఇప్పుడే అప్ప జెప్తానంటే సారు నమ్మలేదు. తర్వాత పద్యం అప్పజెప్పితే సరస్వతీ అమ్మవారి అనుగ్రహం ఉన్నదని మెచ్చుకున్నడు. రోజూ పొద్దున్న 5 గంటలకే వెళితే, సారు పూజ చేసుకున్న తర్వాత విద్య నేర్పేవాడు. అప్పుడే పరవస్తు చిన్నయ సూరి వ్యాకరణం నుంచి భాగవతం వరకు నేర్పిండు. పదో తరగతి వచ్చేటప్పటికీ దుబ్బాక రామసముద్రం చెరువు కట్టపై కూర్చొని పద్యాలు రాసేవాడిని. అలాంటి గొప్ప గురువులు బుద్ధి చెప్పిన జాగ ఇది” అని కెసిఆర్‌ తన బాల్యాన్ని గుర్తుచేసుకున్నారు. అందరితో కలిసిమెలసి మమేకమై బతికిన అంటూ.. మన ఊరు బాగు కోసం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని అన్నారు. ఊరిని ఏకతాటి పైకి తెచ్చే బాధ్యత తీసుకోవాలని కోరారు.

వలస వెళ్లిన వారికి కూడా పథకాలు అందేలా చూడాలి

జీవనోపాధి కోసం వలసపోయిన వాళ్ళను సైతం పిలిపించి.. వారికి కావాల్సిన సాయం అందిస్తామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. గ్రామంలోని ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు లబ్ధి చేకూరుస్తామని., ప్రభుత్వం అందించే లబ్ధి ద్వారా యువత ఉపాధి పొందాలని సూచించారు. ఎవరు ఏ ఉపాధి మార్గాలను ఎంచుకున్నా అభ్యంతరం ఉండకూడదని తెలుపుతూ.. వరి నాట్లు వేసే మిషన్లు కొనుక్కుంటే లాభసాటిగా ఉంటుందన్నారు. ఎవరికి నచ్చిన పని వారు చేసుకుంటే అనుకున్న లబ్ధిని తప్పకుండా పొందుతారని చెప్పారు. పైసలు మిగిలితే ఆవులు, బర్రెలు కొనుక్కోవాలని, ఊరిలోని 2 వేల కుటుంబాలు బాగుపడాలన్నదే తన కోరిక అన్నారు. చింతమడకలో మూడు, నాలుగు నెలల్లో రోడ్ల నిర్మాణం పూర్తి కావాలని, నాలుగు నెలల్లో అభివద్ధి పనులన్నీ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. గతంలో చింతమడక గ్రామ పంచాయతీలో అనుబంధంగా ఉన్న సీతారాంపల్లి, మాచాపూర్‌, అంకంపేట గ్రామాల్లో కూడా ఇక్కడ జరిగే తరహాలోనే అభివద్ధి పనులు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.

నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామాభివద్ధికి రూ.25లక్షలు

సిద్ధిపేట నియోజకవర్గం తనను రాజకీయంగా పెంచిందని, ఎన్నో అద్భుతమైన విజయాలు ఇచ్చిందని, సిద్ధిపేటలో తెచ్చిన ఇంటింటి నల్లా పథకం స్ఫూర్తితో మిషన్‌ భగీరథ తెచ్చామని కేసీఆర్‌ చెప్పారు. చింతమడక, సిద్ధిపేట జిల్లాకు సీఎం నిధుల వరాల జల్లు కురిపించారు. సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామానికి అభివద్ధి కోసం 25 లక్షలు, అలాగే రంగనాయక సాగర్‌ కట్ట అభివద్ధి కోసం రూ. 5కోట్ల రూపాయలు, సిద్ధిపేట పట్టణ అభివద్ధికి రూ. 25 కోట్ల రూపాయలు, దుబ్బాక పట్టణ అభివద్ధికి రూ.10కోట్ల రూపాయలు మంజూరు చేశారు. అలాగే పుల్లూరు, తోర్నాల, రాజన్న- సిరిసిల్ల జిల్లాలోని గూడూరు అభివద్ధికి ఒక్కో గ్రామానికి కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. అదే విధంగా చింతమడకలో నిర్మించనున్న శివాలయం, రామాలయానికి కూడా నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. జై తెలంగాణ.. జై చింతమడక అంటూ సీఎం కేసీఆర్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

చింతలేని గ్రామంగా చింతమడక

పుట్టి పెరిగిన ఊరును పునర్నిర్మాణం చేసేందుకు చింతలేని చింతమడకగా తీర్చిదిద్దేందుకు వచ్చిన సీఎం కేసీఆర్‌ రాకతో చింతమడక గ్రామం ఇవాళ పులకించి పోతున్నదని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు చెప్పారు. చింతమడక బిడ్డ.. ఆరు దశాబ్దాల కల స్వరాష్ట్రం సాధించి యావత్తు తెలంగాణ గర్వించేలా చేశారని.. ఎవరైనా ఊరి పేరుతో గౌరవం పొందుతామని.. కానీ కేసీఆర్‌ చింతమడకకు గౌరవం తెచ్చారని అన్నారు. సీఎం రాకతో గ్రామ ప్రజలంతా ఉప్పొంగిన గుండెలతో, ఉత్సాహంగా స్వాగతం తెలియజేశారని పేర్కొన్నారు.

చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు, చిన్ననాటి దోస్తులు.. ఎవరెవరైతే వారి మీద ప్రేమతో ఈ సమావేశానికి విచ్చేశారో.. వారందరినీ స్వాగాతిస్తున్నాని తెలిపారు. జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ పెద్దలు అన్నట్లుగా.. ఉన్న ఊరు కన్నతల్లి స్వర్గంకన్నా మిన్న అంటూ.. మీ అందరి ప్రేమను పంచుకుని యావత్‌ రాష్ట్రాన్ని సాధించడం మనందరికీ గర్వకారణ మని చెప్పారు. అందరికీ ఊరు గుర్తింపు తెస్తే.. మన చింతమడక ఊరికి మన రాష్ట్రానికి మన సీఎం కేసీఆర్‌ గుర్తింపు తెచ్చారని చెప్పారు. నిమ్స్‌లో నిరాహార దీక్ష చేసినప్పుడు చింతమడక గ్రామం చిన్నబోయిందని, ప్రజలంతా టీవీల ముందు కూర్చుని మిమ్మల్ని చూస్తూ వారి కళ్లల్లో నీళ్లు తెచ్చుకున్నారని.. అప్పుడు ఒక్క ఇంట్లో పొయ్యి వెలుగ లేదని, ఎవరూ అన్నం ముద్ద తినలేదని.. ఉద్యమ సమయ జ్ఞాపకాలను గుర్తు చేశారు. ఉద్యమ కాలంలో అడుగడుగునా ఈ చింతమడక గ్రామం అండగా నిలిచింది. కేసీఆర్‌ ఆశీర్వాదంతో ఈ గడ్డకు ఎమ్మెల్యేగా సేవ చేసే అదష్టం రావడం పూర్వజన్మ సుకతంగా భావిస్తున్నాని చెప్పారు. గ్రామాల అభివద్ధి, నియోజకవర్గ అభివద్ధిపై నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. గ్రామంలో ప్రతి ఒక్కరికీ ఉపాధి చూపించాలని కేసీఆర్‌ ఆదేశించారని, చింతమడక నుంచి ఇతర గ్రామాలకు అనుసంధాన రోడ్లు, లైబ్రెరీ, ఓపెన్‌ జిమ్‌, కావాలని గ్రామస్థులు కోరారని సీఎం దష్టికి తెచ్చారు. గ్రామానికి అనుబంధంగా ఉన్న 98ఎకరాల అటవీ భూమిలో పార్క్‌ అభివద్ధి చేయాలని గ్రామస్థులు కోరినట్లు హరీష్‌ రావు వివరించారు.

ఊర్లో కలియదిరిగి కుటుంబాలతో మాటామంతి

”నేనున్నా.. రంది పడొద్దు అమ్మా..” అంటూ తన చిన్ననాటి గురువు రాఘవ రెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. రాఘవారెడ్డి ఇంటికి వెళ్లి రాఘవ రెడ్డి భార్య మంగమ్మతో మాటామంతీ కలిపారు. ”ఏం కావాలమ్మా.. ఏమైనా రంది పడుతున్నావా..” అని సీఎం అడుగగా.. ”నువ్వు ఉన్నంక నాకు రంది ఏందీ బిడ్డ” అంటూ.. ఆత్మీయంగా పలకరించింది. ఆమె కుటుంబీకులతో ఫోటో దిగి.. మీరేం రంది పడకండి.. నేనున్నాను. మీకేం కావాల్నో నేను చేసి పెడుతానని మంగమ్మకు సీఎం చెప్పారు.

మణెమ్మ అనే మహిళా తనకు సాయం కావాలని కోరగా.. పక్కనే ఉన్న జిల్లా కలెక్టర్‌ వెంకట్రామ రెడ్డికి ఆదేశాలు ఇచ్చారు.

ఇలా చింతమడక గ్రామంలో సీఎం కేసీఆర్‌ పాదయాత్ర చేస్తూ.. ఇంటింటా తిరిగారు. పేరుపేరునా పలకరించి.. ఆత్మీయంగా వారి యోగ క్షేమాలను అడిగితెలుసు కుని.. వారికి కావాల్సిన సాయానికి అక్కడికక్కడే భరోసా ఇచ్చారు. అంతకు ముందు రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మహాత్మాజ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల బాలికల గురుకుల విద్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ ఆతర్వాత కావేరి సీడ్స్‌ వారి సహకారంతో నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. అనంతరం రామాలయాన్ని పరిశీలించారు. శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

చింతమడకలో.. ఎర్రవల్లి లాంటి అభివృద్ధి

చింతమడకకు ఎంత చేసినా తక్కువేనని.. చింతమడక అభివృద్ధి కోసం అదనంగా 50కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. చింతమడకలో కూడా.. ఎర్రవల్లి లాంటి అభివృద్ధి జరగాలని., ఊరికి 1500 నుంచి 2000 ఇళ్లు కేటాయిస్తున్నట్లు కార్తీక మాసంలోపు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని.., ఊరంతా ఒకే రోజు గహ ప్రవేశాలు జరిపి పండగ చేసుకుందామని చెప్పారు. ఆ రోజున అందరం కలిసి వన భోజనాలకు వెళ్దామని.. అప్పుడు తమ కుటుంబ సభ్యులను కూడా తీసుకొస్తానని తెలిపారు. ఎర్రవల్లి గ్రామంలో ప్రతి ఇంటికి 24 గంటల నీటి సరఫరా, సోలార్‌ పవర్‌ ఏర్పాటు చేశామంటూ.. అదే తరహాలో చింతమడక కూడా కావాలంటే.. గ్రామంలో ఒకరినొకరు ప్రేమించుకునే తత్వం, ఓర్చుకునే తత్వం ఉండాలని.. అట్లా ఉంటేనే.. అనుకున్నట్లు అన్నీ సాధ్యమైతాయని.. చింతమడక.. బంగారు తునక కావాలని స్పష్టం చేశారు. కార్తీక మాసంలో మళ్లీ వస్తానని., అప్పుడు తానే ఆశ్చర్యపోయేలా చింతమడక గ్రామ అభివృద్ధి చెయ్యాలన్నారు.

24గంటల్లోనే.. రూ.100 కోట్లు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వగ్రామమైన చింతమడక ఆత్మీయ అనురాగ సమ్మేళనానికి వచ్చిన 24గంటల్లోనే నిధులు మంజూరు చేశారు. ఈ మేరకు ప్రత్యేక అభివృద్ధి నిధి కింద సంక్షేమం, అభివృద్ధి కార్యకలాపాల కోసం సిద్ధిపేట నియోజక వర్గంలో అభివృద్ధి పనులకు రూ.100 కోట్లు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చింతమడక గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులతో పాటు 3 గ్రామ పంచాయతీలైన చింతమడక, సీతారాంపల్లి, మాచాపూర్‌ గ్రామాలకు రూ.50 కోట్లు మంజూరయ్యాయి. అలాగే సిద్ధిపేట మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు రూ.25 కోట్లు, దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు రూ.10 కోట్లు మంజూరయ్యాయి.

అదే విధంగా సిద్ధిపేట నియోజక వర్గానికి చెందిన 81 గ్రామ పంచాయతీలలో అభివృద్ధి పనులకు గానూ రూ.50 కోట్ల విడుదల, సిద్ధిపేట నియోజక వర్గం పరిధిలోని ప్రతి మండల కేంద్రమైన నారాయణరావు పేట, నంగునూరు, చిన్నకోడూరు గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులకు రూ.1 కోటి రూపాయల చొప్పున నిధులు విడుదలయ్యాయి. సిద్ధిపేట మండలానికి చెందిన తోర్నాల, పుల్లూరు గ్రామ పంచాయతీలకు రూ.1 కోటి రూపాయలు, అదే విధంగా రాజన్న సిరిసిల్లా జిల్లాలోని ముస్తాబాద్‌ మండలం గూడూరు గ్రామ అభివృద్ధికి రూ.1 కోటి రూపాయలు మంజూరయ్యాయి. చింతమడక గ్రామం నుంచి రాఘవాపూర్‌ వయా శింగ చెరువు ద్వారా బీటీ రోడ్డు నిర్మాణం, బూడిదకుంట నుంచి చెల్లాపూర్‌-రాజక్కపేట గ్రామాలకు అనుసంధానంగా బీటీ రోడ్డు, అలాగే దమ్మచెరువు నుంచి నార్లగడ్డ వరకు బీటీ రోడ్డు నిర్మాణ అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. చింతమడక గ్రామంలోని పురాతన శివాలయ పునరుద్ధరణ పనులకు రూ.2.50 కోట్లు నిధులు మంజూరయ్యాయి.

మామిడాల రాము

Other Updates