బ్రిటిష్ వలస పాలిత
ప్రాంతాల్లో ఎంతో కొంత ఉదారవాదం కనబడితే సంస్థానాల్లో మాత్రం నియంతృత్వ నాదమే వినబడేది. బ్రిటిష్‌వారు తమను తీవ్రంగా విమర్శించిన పత్రికల మీదే కత్తికట్టారు. సంస్థాన పాలకులు మాత్రం పత్రికల స్థాపనను కూడా ఇష్టపడలేదు. హైదరాబాద్ సంస్థానంలో ఆనాడు పత్రికలకు స్వాతంత్య్రం లేదు, తెలుగు భాషా సాహిత్య సంస్కృతులకు సర్కారుద్వారా వీసమెత్తు సాయమూ అందలేదు. అయినా ధీరులైన మేధావులు తెలుగు పత్రికను స్థాపించారు. సాహసంతో నిర్వహించారు. చైతన్య వీచికలు విస్తరించేందుకు శాయశక్తులా కృషి చేశారు. భారతీయ పత్రికారంగ చరిత్రలో నాటి తెలంగాణ పత్రికలది ఒక త్యాగమ యమైన అధ్యాయం.
19వ శతాబ్ది చరమాంకానికి చేరిన దశలో హైదరాబాద్ నగరం కేంద్రంగా కొన్ని ఆంగ్ల పత్రికలు ప్రచురణ పొందేవి. అప్పటికే జాతీయస్థాయిలోనూ నిలిచాయి. మదరాసు ప్రధాన కేంద్రంగా కొన్ని ఇంగ్లిష్ పత్రికలు బాగా స్థిరపడ్డాయి. ఆనాటికి నగరంలో ఆయా పత్రికల విలేకరులు ఉండేవారు. అయితే ఆనాటి హైదరాబాద్ సంస్థాన సామాజిక స్థితిగతులు మాత్రం పత్రికల వ్యాప్తికి అంతగా అనుకూలమైనవికాదు. అధికారిక భాషలో ఉర్దూ ప్రభావం బాగా పెరిగిన కాలం అది. ఇంగ్లిష్ పత్రికల పాఠకుల సంఖ్య నగరానికే పరిమితం. తెలుగు పత్రికల గురించిన ఊహలు సైతం లేని దశ. కాలం క్రమేపీ మారింది. 20వ శతాబ్ది అరుణోదయంలో తొలి తెలుగు పత్రికకు తెలంగాణ నాందీ గీతం వినిపించింది. ఆ పత్రిక పేరు ‘హితబోధిని’. పాలమూరు (మహబూబ్ నగర్) జిల్లా కేంద్రంనుండి బండారు శ్రీనివాస శర్మ ఆరంభించిన మాసపత్రిక ‘హితబోధిని’. పరిశోధకులు అందించిన విశేషాల ప్రకారం అది ఈకాలం నాటి న్యూస్ మేగజైన్ వంటిది. వ్యవసాయ విశేషాలతో పాటు సకల అంశాలకు హితబోధిని చక్కటి వేదిక. సరోజినీ విలాస్ ముద్రాక్షరశాలలో అచ్చు పనులు జరిగేవి. పత్రికలలో సామాన్యులకు పరిచయం లేదు కనుక ప్రతుల సంఖ్య కూడా పరిమితమే. పత్రికకు ఊపిరిలూదేందుకు శ్రీనివాసశర్మ తన ఊపిరినే ధారపోశాడు. వీలోకకాప్య మండలి పేరుతో నాటక సంస్థను నిర్వహించాడు. అందులో అందివచ్చిన మొత్తాన్ని పత్రికకోసం కేటాయించాడు. అన్ని ప్రయత్నాలు చేసినా పత్రిక ప్రాయం మాత్రం నిలబడలేదు. కొద్ది కాలానికే హితబోధిని అధ్యాయం ముగిసింది.
హితబోధినితో శ్రీనివాసశర్మ పొందిన చేదు అనుభూతులు అందించిన పాఠాలవల్ల కావచ్చు, మరో దశాబ్దికాలంపాటు తెలుగు పత్రికా స్థాపనకు ఎవరూ కదం కదపలేదు. ఈలోగా ఒకటిరెండు పత్రికలు వచ్చినా వాటికి పెద్దగా ప్రచారం లేదు. ఇది సంస్థాగత పత్రికలు. వాటి తాలూకు ప్రభావమూ కనిపించదు. ఇంతలోనే అంటే 1922లో ఒకేసారి రెండు వారపత్రికలు వేర్వేరు జిల్లాలనుండి ఆవిర్భ వించాయి. అందులో ఒకటి నల్లగొండ నుండి షబ్నవీసు రామనరసింహా రావు సంపాదకత్వం వహించిన ‘నీలగిరి’ పత్రిక. రామనరసింహారావు ఆనాటి ఆంధ్రజన సంఘంలో చురుకైన కార్యకర్త. పురోగామి ధోరణిలో కవిత్వాన్ని రచించిన సుమనస్వి, పత్రికను ఐదు సంవత్సరాలు నిర్విఘ్నంగా నిర్వహించాడు. అకాల మృత్యువు ఆయనను కబళించింది. నీలగిరి నిలిచిపోయింది.
షబ్నవీసు సంపాదకత్వ ప్రతిభ నీలగిరిపై తనదైనరీతిలో ముద్ర వేసింది. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ప్రతిభాపాండిత్యాలే ప్రాణవాయువులుగా ఇనుగుర్తి అనే పల్లెటూరునుండి ఇద్దరు అన్నదమ్ములు ఒద్దిరాజు సీతారామచంద్రరావు, రాఘవ రంగారావులు తెనుగు పేరుతో ఒక వారపత్రికను ప్రారంభించారు. మాడపాటి మహోదయులు ఆశీస్సులు అందించారు. ఇనుగుర్తి వరంగల్లు జిల్లాల్లో చిన్న ఊరు. ఆనాడు ఆ ఊరికి విద్యుత్తు లేదు, రవాణా సదుపాయాలు శూన్యం. తపాలా సేవలకోసం మహబూబాబాద్ వరకూ వెళ్లాలి. అయినాసరే ఇన్ని ఇబ్బందుల్నీ ఎదుర్కొంటూ పత్రికను నడిపారు ఒద్దిరాజు సోదరులు. వారి ప్రతిభాపాటవాల్ని పరిచయం చేసేందుకు ఏ ఉపమానాలూ సరిపోవు. వారు బహుభాషా పండితులు, సృజనాత్మక రచనలు చేశారు. అద్భుతమైన అనువాదాల్ని అందించారు. వారికిరాని విద్యలేదు. వారు స్పృశించని సాహిత్య ప్రక్రియా కనిపించదు. పత్రికా రచనలోనూ తాము మేటి అని నిరూపించుకున్నారు. ఇద్దరూ కలిసి పత్రికను ఆసాంతం రూపొందిం చుకొనేవారు.
ఆనాటి తెనుగు పత్రిక తేట తెనుగు పదాల మూట అని ఈనాటి తెలుగు పత్రికలకు ధీటుగా ఉండే దని చెబితే అతిశయోక్తికాదు. ఒద్దిరాజు సోదరులు తమ పత్రికలో తెలంగాణ సాంస్కృతికోద్యమాన్ని (ఆంధ్ర జనసంఘం కార్యక్రమాలతో) ప్రచారం చేశారు. గ్రంథాల యోద్యమానికి పత్రికలో తావును కల్పించారు. కొత్తకొత్త కవుల్ని, రచయితల్ని భుజంతట్టి ప్రోత్సహించారు. తెలంగాణ ప్రాంతంలో స్వచ్ఛంద స్థాయిలో జరుగుతున్న విద్యావికాస ప్రయత్నాల్ని ప్రశంసించారు. కరీంనగర్ జిల్లా కోరుట్లలో స్థాపించబడిన సంస్కృత విద్యాలయాన్ని గురించి తమ పత్రికలో ఒక సంపాదకీయాన్నే రచించడం ఇందుకు తార్కాణం. ఆ రోజుల్లో తెనుగు పత్రిక వేయి ప్రతులు ప్రచురణ జరిగేది. చందాదారులతోపాటు కొన్ని పత్రికలు ఉచి తంగా పంపిణీ చేసేవారు. నాలుగు సంవత్సరాలు నష్టాల్లో నడిచిన తర్వాత ఐదవ సంవత్సరంలో తెనుగు వెలుగులు ఆరిపోయాయి. ఒద్దిరాజు సోదరుల వాఙ్మయసేకరణపై ఇటీవలి కాలంలో మంచి పరిశోధనలు జరుగుతూ ఉండడం హర్షించదగింది.
తెలంగాణ పత్రికారంగ చరిత్రలో ‘గోలకొండ’కు సింహభాగాన్ని కేటాయించవలసి ఉంటుంది. భాగ్యనగర కొత్వాల్‌గా ప్రసిద్ధులైన రాజబహదూర్ వెంకటరామారెడ్డి ప్రేరణతో ప్రారంభమైన ద్వైవారపత్రిక ఇది. న్యాయవాద విద్యను పూర్తి చేసుకొన్న రచయిత, కవి, పండితుడు సురవరం ప్రతాపరెడ్డి గోలకొండ సంపాదకుడిగా పత్రికను తీర్చిదిద్దారు. ఒకవైపు పత్రిక నిర్వహణకోసం అవసరమైన రచయితల్ని తయారుచేసుకోవాలి, పత్రిక ఆరిపోకుండా మరోవైపు నిలబెట్టాలి. పత్రిక సుదీర్ఘ భవితవ్యం కోసం బలమైన పునాదులూ వేయాలి. తనదైన సంకల్ప దీక్షతో ఈ కార్యభారమంతా కొనసాగించిన అక్షర తపస్వి ప్రతాపరెడ్డి. 1926లో ప్రారంభమైన గోలకొండలో పుష్కరకాల వ్యవధి దాటే లోపలే ఎందరో రచయితలు ఎదిగారు. గర్వించదగినంత పాఠక ప్రపంచం తయారైంది. మరికొంత కాలానికి సమర్ధవంతమైన ఉపసంపాదక బృందమూ రూపుదిద్దుకుంది.
ఆనాటి తెలంగాణలో సుప్రసిద్ధ రచయితలు వెల్దుర్తి మాణిక్యరావు, భాస్కరభట్ల కృష్ణారావు, దేవులపల్లి రామానుజరావు, వీఆర్ అవధాని, కోదాటి నారాయణరావు-వీరందరికీ గోలకొండ పత్రికతో అవినాభావ అనుబంధం ఉండేది. గోలకొండ కార్యాలయంలో పండితులు,
రచయితలు, కవులతో సందడిగా ఉండేదట. ఒకవైపు పత్రికా నిర్వహణ, ఇంకొకవైపు ఆంధ్ర మహాసభల్లో చురుకైన భూమిక, వీటితోపాటు సామాజిక సంస్థలతో సంబంధం, పునాదిస్థాయిలో పెనవేసుకున్న రచనారంగం-ఇట్లా క్షణం తీరికలేని తీరులోనూ అన్ని రంగాలకూ న్యాయం చేసిన వైతాళికుడు ప్రతాపరెడ్డి. రెండు దశాబ్దాలు గడచిన తరువాత ప్రతాపరెడ్డి గోలకొండ పత్రిక నుండి నిష్క్రమించారు. గోలకొండ క్రమేపీ దినపత్రికగా మారింది. జనవాణిని విని పించడంలో ఎటువంటి మొహమా టాలకూ చోటులేని వైఖరిని ప్రదర్శించింది. ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నిర్ణయాన్ని అతి నిశితంగా విమర్శించింది. ఆ నిర్ణయాన్ని ప్రతిఘటించే వారికి ప్రతినిధిగానూ నిలిచింది. చరిత్ర ఈ సత్యాన్ని స్పష్టం చేస్తోంది.
తెలుగు సాహిత్య పత్రికల చరిత్రలోనూ తెలంగాణకు పెద్దపీట లభించాలి. ఇక్కడ ఎన్నెన్నో సాహిత్య పత్రికలు అవతరించాయి. భారతికి సమానస్థాయిలో సాహిత్యానికి హారతిపట్టాయి. 1922లోనే వరంగల్లు నుండి కోకల సీతారామశర్మ ఆంధ్రాభ్యుదయం పేరుతో ఒక పత్రికను నిర్వహించారు. ఇది కొద్దికాలంపాటే నడిచింది. సాహిత్య పత్రికలులేని లోటును తీర్చేందుకు ‘సుజాత’ మాసపత్రికావిర్భవించింది. 1927లో బలమైన సంకల్పంతో హైదరాబాద్ కేంద్రంగా ఈ పత్రిక ప్రారంభమైంది. మాడపాటి హనుమంతరావు, పసుమాముల నరిసింహశర్మ, సురవరం ప్రతాపరెడ్డి సంపాదకమండలి సభ్యులు. అయితే ప్రధానమైన బాధ్యత ప్రతాపరెడ్డిదే. ఆయన ఈ పత్రికను అత్యుత్తమ స్థాయిలో తీర్చిదిద్దారు. ప్రతాపరెడ్డికి అఖండకీర్తిని సాధించి పెట్టిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర తొలిరూపం కొంత సుజాతలో కనబడుతుంది. ఆయన ఈ దశలో రచించిన కొన్ని వ్యాసాలు సుజాతలో వెలుగు చూశాయి. చాలామంది పరిశోధకులు తమ ప్రతిభకు పదునుపెట్టుకునే వేదికగా సుజాత నిలబడింది. అత్యంత ప్రామాణికమైన చారిత్రక వ్యాసాల ప్రచురణకు ఆలంబనగా మారింది.
పరిశోధక పరమేశ్వరుడనే గుర్తింపు కలిగిన నిడదవోలు వేంకటరావువంటి సాహితీవేత్తలు సుజాత పత్రికను ప్రశంసించారు. అయితే ఈ పత్రిక కూడా మూడు సంవత్సరాలు మాత్రమే ముద్రణ పొందింది. దానితో సుజాత తొలి అధ్యాయం ముగిసింది. తిరిగి ఇదే పత్రికను 1950లో ప్రసిద్ధ పండితులు గడియారం రామకృష్ణశర్మ నిర్వహించారు. ఈ సందర్భంలోనూ కొన్ని సంచికలతోనే పత్రిక ఆగి పోయింది. అయితే ఒక ఆదర్శవంతమైన సాహిత్య పత్రిక ఎట్లా
ఉండాలో సుజాత నిరూపించింది. సుజాత పత్రిక ప్రచురణ జరుగుతున్న రోజుల్లోనే మెదక్ జిల్లాలోని వడ్డేపల్లి నుండి నరసింహాచార్యులు అనే పండితుడు ‘దేశబంధు’ మాసపత్రికను నిర్వహించారు. మౌలిక వసతుల విషయంలో వడ్డెపల్లి కూడా ఇనుగుర్తి వంటిదే. అయినా సంపాదకుల సంకల్పదీక్షతో ‘దేశబంధు’ నాలుగేళ్ళు ప్రచురణ పొందింది. అన్ని పత్రికలవలెనే అది కూడా ఆగిపోయింది. దేశబంధులో ప్రచురణ పొందిన కొన్ని వ్యాసాలు ఆనాటి తెలంగాణలో వికసించిన వచన, రచనా వికాసానికి నిలువెత్తు దర్పణాలుగా ఉన్నాయి. ఒద్దిరాజు సోదరులు ఎదుర్కొన్న అన్ని ఇబ్బందుల్ని నరసింహాచార్యులు సైతం అనుభవించారు.
1940లలో అభ్యుదయ సాహిత్యోద్యమం యావద్భారతదేశంలోనూ తన ప్రభావాన్ని ప్రసరిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌నుండి ఒక సాహిత్య మాసపత్రిక ప్రారంభమైంది. అది ‘తెలుగుతల్లి’ పత్రిక. ఈ పత్రిక తెలంగాణలో అభ్యుదయ సాహిత్యానికి చక్కని బాటలు నిర్మించిందని పరిశోధకుల అభిప్రాయం. రాచమళ్ళ సత్యవతీదేవి పత్రికకు సంపా దకత్వం వహించారు. ప్రసిద్ధ రచయిత వట్టికోట ఆళ్వార్‌స్వామి పత్రిక నిర్వహణకు సంబంధించిన బాధ్యతలు చూసేవారు. అడవి బాపి రాజువంటి ప్రసిద్ధ రచయితల సహకారమూ ఉండేది. ఎన్నెన్నో అభ్యుదయాంశాల్ని తెలుగుతల్లి వెలుగులోకి తీసుకొని వచ్చింది. ఆధునిక ప్రక్రియల్ని ప్రోత్సహించింది. ప్రత్యేక సంచికలు వెలువరించింది. సాహిత్యంలో పురోగామి దృక్పథానికి బాసటగా నిలిచింది.
దేవులపల్లి రామానుజరావు న్యాయశాస్త్ర విద్యార్థిగా ఉన్న కాలంనుండే రచయితగా గుర్తింపును పొందిన ప్రతిభాశాలి. తెలుగు భాషా సాహిత్య వికాసాలకోసం నిరంతరం కృషి చేయాలని విద్యార్థి దశలోనే ఆయన నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్టుగా సాహిత్య పత్రికను స్థాపించారు. ఆయన ఆరంభించిన ”శోభ” మాసపత్రిక తొలుత వరంగల్లులో ప్రచురణ పొందింది. తెలుగువారి దృష్టిని విశేషంగా ఆకట్టుకున్నది. అటు తరువాత కొంత కాలానికి ప్రచురణ హైదరాబాద్‌కు మారింది. శోభలో ఆధునిక సాహిత్య ప్రక్రియల ప్రచురణ జరిగేది. సంపాదకులుగా రామానుజరావు ముద్ర స్పష్టంగా కనిపించేది. ఎంతోమంది యువ కవులు, రచయితల్ని ప్రసిద్ధ సాహితీవేత్తలుగా శోభ తీర్చిదిద్దింది. తెలుగు సాహిత్య పత్రికల చరిత్రలో శోభకు విశిష్టమైన స్థానం తప్పకుండా ఉంటుంది.
హైదరాబాద్ సంస్థానం విశాల భారతంలో విలీనమైన తరువాత పలు పత్రికల స్థాపన జరిగింది. గోలకొండ నుండి నిష్క్రమించిన తరువాత ప్రతాపరెడ్డి ప్రజావాణి పేరుతో ఒక పత్రికను స్థాపించారు. అయితే అది ఎక్కువ కాలం నిలవ లేకపోయింది. ప్రసిద్ధ పరిశోధకుడు వెల్దండ ప్రభాకరామాత్య జయ భారత్ అనే పేరుతో ఒక మాసపత్రికను ప్రారంభించారు. ఇదో విలక్షణపత్రిక. తెలంగాణ సమాజం సంప్రదాయ యుగంనుండి ఆధునిక కాలంలోకి అడుగుపెడుతున్న నాటి తీరుతెన్నులకు జయ భారత్ ఒక ప్రతిబింబం. ఆంధ్రకేసరి పేరుతో మరొక పత్రిక ప్రారంభమైంది. హిందీ ప్రచారసభ ప్రచురణగా ”స్రవంతి” పత్రిక ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడక పూర్వమే ప్రారంభమైంది. సినారె సంపత్కుమార, సుప్రసన్నవంటి ఎందరెందరో ప్రసిద్ధులు ఆనాడు స్రవంతిలో రచనలు చేశారు.
సుప్రసిద్ధ గాంధేయవాది బోయినపల్లి వెంకటరామారావు 1950 ప్రారంభంలో కరీంనగర్ కేంద్రంగా సారస్వత జ్యోతి పేరుతో ఒక మాసపత్రికను ప్రారంభించారు. ఈ పత్రిక ఆరంభాన్ని పురస్కరించుకుని ఆనాటి తెలంగాణ ప్రముఖులు సారస్వత జ్యోతికి అభినందనలు తెలిపారు. ఏ ప్రాంతంలో అయినా సాహితీరంగంలో మరుగున పడిన స్థానికులైన ప్రతిభావంతులు ఉంటారు. వారిని గుర్తిస్తే తమ రంగంలో ఎదుగుతారు. సారస్వత జ్యోతి ఈ సత్యాన్ని గుర్తించింది. కరీంనగర్ ప్రాంతపు ప్రతిభావంతులకు సారస్వత జ్యోతి చోటును కల్పించింది. ఈ పత్రిక సుదీర్ఘకాలం వెలువడలేదు. ప్రచురించిన కొన్ని సంచికలు మాత్రం ఆనాటి కరీంనగర్ ప్రాంతపు సాహిత్య చైతన్యానికి ప్రతిరూపాలు. ఇటువంటిదే మరొక పత్రిక పల్లెటూరు. సురవరం ప్రతాపరెడ్డి మిత్రుడు మల్యాల దేవప్రసాద్ మెదక్‌జిల్లా సంగారెడ్డినుండి వెలువరించారు. మెదక్ జిల్లాలో ప్రచురితమైన తొలి తెలుగు పత్రిక కూడా ఇదే. పల్లెటూర్ల అంశాల్ని ప్రముఖంగా ప్రస్తావించడం ఈ పత్రిక ప్రత్యేకత. అంతేకాదు స్థానిక ప్రతిభను గుర్తించడం కూడా పల్లెటూరులో ప్రస్ఫుటమైంది.
ఈ వ్యాసాన్ని ముగించే ముందు-ఆనాటి తెలంగాణనుండి వెలుగు చూసిన రెండు దినపత్రికల్ని గురించి తప్పకుండా చెప్పాలి. నిజానికి 1940 ఆరంభంలో తెలంగాణలో తెలుగు దినపత్రికను నిర్వహించే పరిస్థితులు లేవు. అప్పటికింకా గోలకొండ కూడా దినపత్రికగా మార లేదు. ఈ వాతావరణంలోనూ దినపత్రికను స్థాపించేందుకు బుక్కపట్టణం రామానుజాచార్యులు ముందుకు వచ్చారు. ఆయన ప్రతిభావంతుడైన పాత్రికేయుడు. తెలుగుతోపాటు ఇంగ్లిష్ పత్రికా రచనలోనూ సిద్ధహస్తుడు. బుక్కపట్టణం ”తెలంగాణ”పేరుతో ఒక దినపత్రికను ఏర్పాటు చేశారు. అది కొద్ది మాసాలు మాత్రమే నడిచింది. తెలంగాణలో ఇది తొలి తెలుగు దినపత్రిక. బహుముఖ ప్రజ్ఞాశాలి అడవి బాపిరాజు హైదరాబాద్‌నుండి వెలువడిన మీజాన్ దినపత్రిక సంపాదకులుగా ఉన్నారు. ఇదీ 1940ల నాటి పత్రికే. జీఎం కలకత్తా వాలా అనే ఆయన ఒకేసారి తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూల్లో పత్రికను ప్రచురించారు. అందులో తెలుగు మీజాన్ సంపాదకులుగా బాపిరాజు తన ప్రతిభను కనబరచారు. తెలుగు దినపత్రికా రచనలో మీజాన్ కొత్త మైలురాళ్లను స్థాపించింది. వార్తా శీర్షికల విషయంలో, వ్యాసాలలో భాషాపరంగానూ మీజాన్ వినూత్నమైన రీతిని చూపించింది. తరువాత కాలంలో తెలుగు పత్రికారంగాల్లో దిగ్గజాలుగా పేరెన్నికగన్న తిరుమల రామచంద్ర, విద్వాన్ విశ్వం, రాంభట్ల కృష్ణమూర్తివంటివారి ప్రస్థానం మీజాన్‌లో ప్రారంభమైంది. ఎంతోమంది అజ్ఞాత ప్రతిభావంతుల్ని బాపిరాజు మీజాన్ పత్రిక ద్వారా ప్రోత్సహించారు.
ఈ వ్యాసంలో పేర్కొన్న పత్రికలేకాదు, మరెన్నో పత్రికలు తెలంగాణలో ప్రచురణను పొందాయి. వాటిలో కొన్ని సామాజికరంగ పత్రికలు, మరికొన్ని రాజకీయ పత్రికలు. ఆనాటి తెలంగాణలో తెలుగు పత్రికలు స్థాపించినవారు కేవలం అక్షర జగతికే పరిమితంకాలేదు. తమ సామాజిక బాధ్యతల్ని సంపూర్ణస్థాయిలో నిర్వహించారు. పాండిత్య, వ్యక్తిత్వాలతో తెలంగాణ సమాజంలో ఆదర్శమూర్తులుగా ఎదిగారు. ఒద్దిరాజు సీతారామచంద్రరావు, రాఘవరంగారావు, సురవరం ప్రతాప రెడ్డి, దేవులపల్లి రామానుజరావుల విశిష్ట జీవితాలు ఇందుకు మంచి ఉదాహరణలు.
డాక్టర్ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి