అంగట్లకుపోతె ఎడ్లు, మ్యాకలు, గొర్లు, కోళ్లు అటుఇటు ఆగం ఆగం తిరిగే ఎవుసం చేస్కునేటోల్లు కన్పిస్తరు. కొత్తోల్లకు ఆగం కనపడుతదికని అందరు ఊరోల్లే సుట్టాల్లెక్కనే ఉంటరు. సూశిన మొకాలె కన్పిస్తయి. పది ఇరువై ఊర్లకొక అంగడి ఉంటది. అంగడి అంటే సంత కూడా అంటరు. అక్కడ ఎడ్లు అమ్ముడు కొనుడు ఉంటయి. అయితె అమ్మెటోల్లు, కొనెటోల్లు అందరు ఎవుసం చేసి బతికెటోల్లె.
ఎద్దును అమ్ముతాంటే దు:ఖం వస్తది. ఇన్ని రోజులు దానితోని నాగలి దున్నిపిచ్చుకొని, పంట పండించి, కచ్రం కట్టి మెదిలిన రైతు పైసల అక్కెరకు లేదా ఎల్లక అమ్మినప్పుడు వచ్చే లోలోన దు:ఖం చెప్పరానిది. అట్లనే ఆవులను, మ్యాకలను సుత అమ్ముతరు. అంగడి అంటె పెద్దగ ఉంటది. వారానికి ఒక్క దినమే నడుస్తది. ఒక దగ్గర కుండలు అమ్ముతరు, ఒక దగ్గర బట్టలు, ఒక దగ్గర గొంగడ్లు, ఒక దగ్గర నులుక సుట్టలు, ఒక దగ్గర నవారు, ఇంకోదగ్గర తాళ్లు దందెల్లు కన్పిస్తయి. అంగడి అంటె ఊల్లెవాడల లెక్కనే చాటలు
ఉంటయి. ఒక దిక్కుపోతె కూరగాయలు, ఇంకో దిక్కు పోతె పాతబట్టలు, ఇంకో దిక్కు పోతె దినుసులు ఉంటయి. అన్ని వస్తువులు అమ్మెటోల్లు, కొనెటోల్లు సుట్టుముట్టు ఊర్లోల్లు కన్పిస్తరు. ఎడ్లు పసురాలు అమ్మే తావు ఈ అంగడికి కొంచె దూరం ఉంటది. అంగట్ల మిరపకాయ బజ్జీలు, జిలేబి కాన్నించి అరొక్క వస్తువు దొరుకుతది. అయితె అంగట్ల చాలామంది అనుకోకుంట ల్సుకుంటరు. ఇట్లా కల్సుకునే క్రమంలో సుట్టాలకు మతులావులు చెప్పిపంపుతరు. బిడ్డలు, ఇయ్యపురాండ్లు, బావలు, బావమర్దులు కూడా ఏదోపనిమీద అంగట్లకు వస్తుంటరు. అక్కన్నే మాట్లాడుకుంటరు.
చాలా రోజుల తర్వాత కల్సుకున్న గిరిజన తెగల ఆడవాళ్లు ఒకరికొకరు కన్పిస్తే అలయ్‌బలయ్‌లాగ పట్టుకొని ఏడుస్తుంటరు. ఏడుసుడు అంటే వట్టి ఏడ్సుడు కాదు శోకం పెట్టుకొని దీర్ఘంగ దు:ఖపడుతరు. తర్వాత నిమ్మలంగ అన్ని ముచ్చట్లు అంగట్లనే తిరుక్కుంట మాట్లాడుకుంటరు. ఒక దగ్గర చెట్టు కింద కూసొని తిరిగి ఎవల బాట వాల్లు పడుతరు.
అంగడి ఒక కలయిక, ఒక కూడలి. ఒక సరుకుల మార్పిడి వ్యవహారం కన్పిస్తది. ఎన్కటికాలంల ఏదన్న వస్తువు కావాలంటే వారం ఆగినంక వచ్చే అంగట్ల తెచ్చుకునుడే ఉంటది. పప్పు, ఉప్పు, చింతపండు దొరికే దుకాణాలు ఎప్పుడూ ఉన్న అంగట్ల ఇతర వస్తువులు ఎక్కువ కన్పిస్తాయి. ముఖ్యంగా చేతివృత్తుల వాళ్ళు, కుల వృత్తులవాళ్ళు తయారు చేసిన వస్తువులు ఇక్కడ ఎక్కువగా అమ్ముడుపోతయి. అంగట్లకు ఎక్కువగా నడిచి, సైకిళ్లమీద వచ్చే వాళ్ళు కన్పిస్తరు. కానీ ఇప్పుడు చిన్నచిన్న వ్యాపారాలు చేసికునే వాళ్ళు చిన్న మోటార్ సైకిల్లు వాడుతున్నరు.
ఇగ అండ్లకు వచ్చే మనుషులు మాత్రం ఎక్కువ ఆటోలల్ల వస్తున్నరు. ఎన్కట ఎడ్ల బండ్లల్లనే వచ్చుడు, పోవుడు ఉండేది. ఎడ్ల బండ్ల మీదనే అంగట్లకు ఉల్లిగడ్డలు, కందగడ్డలు, అల్లం, ఎల్లిపాయలు అమ్మడానికి వస్తుంటరు. అట్లనే ఎర్రమన్ను అమ్మేటోల్లు సుత బండ్ల మీదనే అమ్ముతరు. ఇవేగాకుండా ఇట్లా అమ్ముకునే చిరు వ్యాపారులు రోజుకో అంగడి చొప్పున వారంల నాలుగైదు అంగల్లకు పోయి అమ్ముకుంటరు.
కొందరు ఊర్లల్లకు ఎడ్లబండి కట్టుకొని ఉల్లిగడ్డ అమ్ముకస్తరు. ఉల్లిగడ్డ పండినోల్లు ఇద్దరు ఆలుమొగలు బండి కట్టుకొని ఊరూరికి తిరిగి పైసలకు, వడ్లకు అమ్ముతరు. ఎక్కడ రాత్రి అయితే అక్కన్నే పండుకుంటరు. పల్లెల్లోనే గాకుండ ఆదివాసి గిరిజన ప్రాంతాల్లో అంగడి జోరుగా సాగుతుంది. అటవీ ప్రాంతంలో దుకాణాలు ఎక్కడ ఉండయి కాబట్టి అక్కడి గిరిజనులు అంగల్ల మీదనే ఆధారపడుతరు. బియ్యం, గ్యాసునూనె, కారంపొడి, అటుకులు, పప్పు, కూరగాయలు, మంచినూనె, అంగట్లనె కొన్కుపోతరు. అంగడిలో దోపిడి సుత గిరిజనులకు అధికంగనే ఉండేది. మైదాన ప్రాంత ఊర్లల్ల జరిగే అంగల్లల్లో ఇంత దోప్కం ఉండది. ఏది ఏమైనా ఎడ్ల అంగడి పల్లె మనుషులకు కలయికల వేదిక.
అన్నవరం దేవేందర్