వైద్యో నారాయణో హరి.. కాని ఇక్కడ వైద్యుడు నారాయణుడు ఒక్కడే అతడే వైద్యనారాయణుడు అతడే వైద్య లక్ష్మీనారసింహుడు యాదగిరీశుడు.. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం…
అని స్వామి వారిని స్మరించినంతనే అపమృత్యు దోషాలన్ని తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. పంచనారసింహ క్షేత్రమైన యాదాద్రి పుణ్యక్షేత్రంలో ప్రతీ సంవత్సరం పాల్గుణ మాసం శుద్ధ పాడ్యమి మొదలు 11రోజుల పాటు స్వామి వారి బ్రహ్మూెత్సవాలు ఘనంగా జరుగుతాయి. అయితే ఈ సారి ఒక ప్రత్యేకత ఉంది. యాదాద్రి అభివృద్ధి పనులు జరుగుతున్నందున నూతనంగా నిర్మించిన బాలాలయంలోనే ఈ సారి బ్రహ్మూెత్సవాలను నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి వారు యాదగిరిగుట్టను యాదాద్రిగా నామకరణం చేశాక జరుగుతున్న రెండవ బ్రహ్మూెత్సవాలుగా చెప్పవచ్చు. ఒకవైపు చినజీయర్ స్వామివారి పర్యవేక్షణలో వైటిడిఏ అధికారుల నిరంతర పర్యవేక్షణలో యాదాద్రి అభివృద్ధి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. హేవళంబినామ వత్సరంలో వచ్చే దసరా నాటికి గర్భాలయ పనులు పూర్తిచేసుకుని నూతన దేవాలయంలో స్వామి వారు బ్రహ్మూెత్సవాలు జరుపుకోనున్నాము. ఈ సంధికాలంలో ఈసారి బాలాలయంలో ఉత్సవాలు నిర్వహించుకోవడం విశేషం. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు గర్భాలయ దర్శనంతో పాటు ప్రక్కనే ఉన్న ఆలయ మండపంలో స్వామి వారి సేవలను తిలకించే భాగ్యం కూడా లభించింది. బ్రహ్మూెత్సవ కాలంలో యాదాద్రికి వచ్చిన భక్తులు యాదగిరీశుని ఉత్సవ శోభను చూసి మైమరచిపోయారు.
ఫిబ్రవరి 27వ తేదీ నుండి మార్చి 9వ తేదీ వరకు బ్రహ్మూెత్సవాలు అంగరంగవైభవంగా నిర్వహించారు. మొదటి రోజు విష్వక్సేనారాధన, స్వస్తివాచనం, అంకురారోపణంతో బ్రహ్మూెత్సవాలు మొదలయ్యాయి. రెండవరోజు ధ్వజస్థంభంపై ధ్వజపటాన్ని ఎగురవేశారు. ముక్కోటి దేవతలకు బ్రహ్మూెత్సవాలకు ఆహ్వనిస్తూ విష్వక్సేనుల వారితో కబురు పంపారు. దేవతాహ్వానాన్ని స్వాగతించిన ముల్లోకాల్లోని దేవతలు యాదాద్రికి తరలివచ్చి బ్రహ్మూెత్సవాలను జరిపించారా అన్నట్టుగా ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ద్వజారోహనం మొదలు ఏడు రోజుల పాటు స్వామి వారు వివిధ అవతారాలలో భక్తులకు దర్శనభాగ్యం కలిగించారు. ఒక్కొక్క అవతార సేవకు ఒక్కో విశిష్టత ఉంది. స్వామివారికి ప్రతీ రోజు నిర్వహించిన అలంకారసేవలకు సాయంకాలం నిర్వహించిన వాహనసేవలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. భక్తులను రక్షించడానికి స్వామి వారు ఏ ఏ రూపాలను ధరించారో తెలియజేస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అలంకారసేవలను నిర్వహించారు.
మొదటి రోజు స్వామి వారు దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దశావతారాలలో మొదటిది మత్య్సావతారం. సోమకాసురుడు అనే రాక్షసుని నుండి వేదాలను రక్షించడానికి శ్రీమహావిష్ణువు ఈ అవతరమెత్తారు. ఈ అవతార విశిష్టతను తెలియచేస్తూ మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రెండవరోజు పూర్ణావతారంగా పిలువబడే కృష్ణావతారంలో నారసింహుడు దర్శనమిచ్చారు. మూడవరోజు వటపత్రశాయిగా అలంకారసేవ నిర్వహించారు. వటము అనగా మఱ్ఱి చెట్టు అని మఱ్ఱి ఆకుపై శయనించిన చిన్నిక్రిష్ణుని అవతారంలో స్వామి కనిపించారు. సృష్టికి మూలం తానేనని తనలోనే ఈ ప్రకృతి అంతా కలదని మర్రిగింజలో ఒక మహావృక్షం ఎలా దాగి ఉన్నదో అలాగే తనలో ఈ ప్రకృతి అంతా ఆవరించి ఉన్నదని తెలిపడమే ఈ అవతార విశిష్టత. ఇక మూడవరోజు ఇంద్రుని గర్వం కారణంగా ప్రమాదంలో ఉన్న గోవులను గోపబాలురను రక్షించిన గోవర్ధన గిరిధారి అవతారంలో స్వామి వారు దర్శనం కలిగించారు. నాలుగవ అవతారంగా రాక్షసుల బారినుండి దేవతలను కాపాడిన జగన్మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చి భక్తులను సమ్మోహనులను చేశారు. భగవానుని అన్ని అవతారాలు అపూర్వములే అయినప్పటికి మానవ అవతారంలో ధర్మాన్ని, సత్యవ్రతాన్ని ఆచరించి ఆదర్శవంతమైన నడవడికను లోకాలకు అందించిన ఆదర్శమూర్తి అయిన రాముని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలంకార సేవలతో పాటు హంసవాహనం, పోన్నవాహన, సింహవాహన, అశ్వవాహన సేవలను కూడా నిర్వహించారు.
ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం……. అశ్వవాహన సేవలో స్వామి వారు పల్లకిపై అమ్మవారిని ఊరేగింపుగా తీసుకుని వచ్చి భక్తజనుల నడుమ స్వామి వారి ఎదుర్కోలు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టువస్త్రాలతో, స్వర్ణాభరణాలతో దేదీప్యమా నంగా అలంకరించిన కల్యాణమూర్త్తులను ఎదురెదుగా నిల్చుండబెట్టి శాస్త్రోక్తంగా ఎదుర్కోలు మహోత్సవాన్ని నిర్వహించి కల్యాణ గడియలను నిర్ణయించారు.
అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీనారసింహస్వామి కళ్యాణం
భక్తజన పరిపాలకుడు ఆశ్రిత జన రక్షకుడు అయిన శ్రీ శ్రీ లక్ష్మీనారసింహస్వామి కళ్యాణం జగత్ కళ్యాణము అని అనేక పురాణములు పేర్కొన్నవి. హిరణ్యకశ్యపుని వధించిన తర్వాత ఉగ్రరూపంలో ఉన్న నారసింహుని శాంతింపచేయడానికి ప్రహ్లాదుడు లక్ష్మీ అమ్మవారితో నారసింహస్వామి కళ్యాణం జరిపించాడని నృసింహపురాణంలో చెప్పబడింది. బ్రహ్మూెత్సవములలో లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం చూచిన వారికి ఇహపర సౌఖ్యములు కలుగుతాయని, నృసింహ అనుగ్రహము కలిగినచో సమస్త దేవతల అనుగ్రహం లభిస్తుందని వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు పేర్కొన్నాయి. యాదగిరీశుని పరిణయ సంబురాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మొదట బాలాలయంలో స్వామి వారి కల్యాణం జరిపించారు. ఈ కళ్యాణోత్సవంలో ప్రభుత్వ చీఫ్ విప్ గొంగిడి సునీత దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. కాగా సమాచార శాఖ చీఫ్ కమీషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు కల్యాణసేవలో పాల్గొన్నారు. అదే రోజు రాత్రి స్వామి వారు భక్తజనకోటికి దర్శనభాగ్యంకల్పించడం కోసం యాదగిరిగుట్ట జెడ్ పి హైస్కూల్ ప్రాంగణంలో కల్యాణాన్ని జరిపించారు. విద్యుత్ దీపాలతో, పుష్పశోభితంగా అలంకరించిన కల్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను వేంచేయింపచేసి వేదపండితుల వేదమంత్రోఛ్చారణల నడుమ కల్యాణ క్రతువును నిర్వహించారు. భాజాబజంత్రీలు ఒకవైపు మిరుమిట్లుగొలిపే బాణాసంచా కాంతులు మరొకవైపు. తెలగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు, యంపి బూరనర్సయ్యగౌడ్ ప్రభుత్వ పక్షాన పట్టువస్త్రాలను సమర్పించారు. కల్యాణోత్సవాన్ని ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించే మహద్భాగ్యం కల్పిస్తూ దూరదర్శన్ , శ్రీ వేంకటేశ్వరా భక్తి ఛానెల్‌తో పాటు పలు ఛానెల్లు ప్రత్యక్షప్రసారం చేశాయి. ఈ కల్యాణోత్సవంలో వైటిడిఏ అధికారులు కిషన్ రావు, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, ఇవో గీత, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. దివ్య విమాన రధోత్సవం…..వైనతేయవాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమివ్వగా గుట్ట క్రింద దివ్యవిమాన రధోత్సవం కన్నుల పండుగగా సాగింది. వివిధ పుష్పమాలికలతో శోభాయమానంగా అలంకరించిన రధంపై స్వామి వారు తరలిరాగా స్దానిక మహిళలు మంగళహారతులను పట్టారు.
మరుసటిరోజు విష్ణుపుష్కరిణిలో చక్రతీర్ధం ఉత్సవం, చివరగా బ్రహ్మూెత్సవాలలో అలసిసొలసిన స్వామి అమ్మవార్లకు శతఘటాభిషేకం, అనంతరం శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు ముగిశాయి.