brభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్రాల ఏర్పాటుపై రాజ్యాంగంలో పొందుపరచిన చట్టం వల్లనే నేడు తెలంగాణ స్వరాష్ట్రంగా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు శ్లాఘించారు. ఆ మహనీయునికి తెలంగాణ సమాజం ఎంతో రుణపడి వున్నదని, ఆయన జయంతి ఉత్సవాలు ఎంత ఘనంగా నిర్వహించినా తక్కువేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 

అంబేద్కర్‌ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఏప్రిల్‌ 14న హైదరాబాద్‌ నగరంలోని నెక్లెస్‌ రోడ్డులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, యావత్‌ ప్రపంచానికి తన జీవితమే ఆదర్శంగా గొప్ప సందేశం ఇచ్చిన జాతిరత్నం అంబేద్కర్‌ అన్నారు. ఈ సందర్భంగా దళిత, గిరిజన విద్యార్థులపై కె.సి.ఆర్‌ వరాల జల్లు కురిపించారు. వారి అభ్యున్నతికి 100 గురుకుల పాఠశాలలు, 30 డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో ‘కెజి టు పిజి’ విద్యావిధానాన్ని అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఈ గురుకుల విద్యాలయాల ఏర్పాటుతో ప్రారంభిస్తున్నామని ప్రకటించారు.

అంబేద్కర్‌ 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌ జయంతి సందర్భంగా నగరంలోని యూసుఫ్‌ గూడా ప్రాంతంలో నిర్మించనున్న సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ భవనానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత ట్యాంక్‌ బండ్‌ వద్ద 15 అంతస్తులతో నిర్మించనున్న అంబేద్కర్ టవర్స్‌కు, ఎన్టీఆర్ గార్డెన్స్ సమీపంలో ఏర్పాటు చేయతలపెట్టిన 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహానికి కూడా ముఖ్యమంత్రి భూమిపూజచేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం నెక్లెస్‌ రోడ్డులో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ”అంబేద్కర్‌ గారికి తెలంగాణ సమాజం రుణపడివుంది. చాలామందికి ఈ విషయం తెలియదు. ఆయన లేకపోతే మనకు తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదు. దేశంలో ఏదైనా రాష్ట్రం విడిపోవాలంటే ఖానూన్‌ ఎక్కడ వుండాలి, అధికారం ఎక్కడ వుండాలి అని రాజ్యాంగం రాసిననాడు చర్చ జరిగింది. రాజ్యాంగ నిర్మాణ సభలో అంబేద్కర్‌ మినహా మిగిలిన వందశాతం సభ్యులు ఆ అధికారం రాష్ట్రాలకే వుండాలని వాదించారు. ఒక్క అంబేద్కర్‌ మాత్రమే ఆ అధికారం కేంద్రం దగ్గర వుండాలన్నారు. అప్పటికి సాయంత్రం కావడంతో తానెందుకు కేంద్రం వద్ద అధికారం వుండాలని అంటున్నదీ మరునాడు నోట్‌ ఇస్తానని అన్నారు. ఆ రాత్రంతా నిద్రమానుకొని కష్టపడి ఒక నోట్‌ తయారుచేసి, తెల్లవారి ఆ నోట్‌ సభ్యులకు ఇచ్చారు. అది చదివిన తరువాత వందశాతం ‘మీరు చెప్పిందే కరెక్టు. ఈ అదికారం కేంద్రం వద్దనే ఉండాలని మేం కూడా ఒప్పుకుంటున్నాం’ అని అందరూ చెప్పారు. ఆనోట్‌లో ఆయన రాసిందేమిటంటే… ‘రాష్ట్రాల్లో కూడా కొన్ని బలహీన ప్రాంతాలు వుండచ్చు. బలమైన ప్రాంతాల వాడు ఈ బలహీన ప్రాంతాన్ని పట్టి పీడిస్తుండొచ్చు. కాబట్టి బలహీనుడు మొర పెట్టుకోవా లంటే కేంద్రం దగ్గరకు వచ్చే వెసులుబాటు వుండాలి.’ అని అంబేద్కర్‌ చెపితే, అందుకు అందరూ అంగీకరించారు. ఆ నాడు అంబేద్కర్‌ గారు రాజ్యాంగసభలో వాదించి, బలహీనంగా వున్నవాళ్ళకు కచ్చితంగా కేంద్రం అండగా వుండాలని ఆ చట్టాన్ని తయారుచేసిన పుణ్యం వల్ల ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ సమాజం ఆయనకు రుణపడి వుంది. అందుకే ఇక్కడ అంబేద్కర్ 125 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించాం” అని ముఖ్యమంత్రి తెలిపారు.

”అంబేద్కర్ విగ్రహం ఎక్క డ పెట్టాలో స్థలం నిర్ణయించేందుకు మేం ఆలోచిస్తుంటే, అంబేద్కర్‌ నమ్మినటువంటి బుద్ధుడు ట్యాంక్‌ బండ్‌ మధ్యలో వున్నాడు. కాబట్టి బుద్ధుడు ముందు వుండాలి. బుద్దుని బాటలో అంబేద్కర్ గారి విగ్రహం వుండాలి. ఆయన వెనుక మన సెక్రటేరియట్‌ వుండాలని భావించి ఈ స్థలాన్ని ఎంపిక చేసినం. విగ్రహం ఆకాశాన్ని ముద్దాడేంత ఎత్తులో, సగర్వంగా హైదరాబాద్‌ నగరంలో ఒక ల్యాండ్‌ మార్క్‌ లాగావుండాలని భావించి 125 అడుగుల కాంస్య విగ్రహానికి ఈ రోజున శంకుస్థాపన చేసుకున్నం. చాలా ఆనందంగా వుంది. అదే విధంగా ట్యాంక్ బండ్ క్రింద అంబేద్కర్ భవనం వుంది. అది సరైన పదత్ధిలో లేదు. అందుకే అంబేద్కర్‌ విగ్రహం చూపించే దిశలో ట్యాంక్‌ బండ్‌కి ఈశాన్యంగా 15 అంతస్తుల్లో అంబేద్కర్‌ టవర్స్‌కి కూడా ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నం. దానిలో దళిత, గిరిజన సమాజం అభివృద్ధి కోసం అన్ని కార్యక్రమాలు జరుగుతాయి.

సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీ భవనానికి కూడా ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఈ మూడు మంచి ల్యాండ్మా మార్క్ కార్యక్రమాలు మనం తీసుకున్నం. ” అని ముఖ్య మంత్రి కె.సి.ఆర్‌ తెలిపారు. దళిత, గిరిజన బిడ్డలు ఉద్యోగాలు అడిగే పరిస్థితి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థితికి ఎదగాలని, అందుకోసమే తెలంగాణ పారిశ్రామిక విధానంలో ‘టి.ఎస్‌.ప్రైడ్‌’ కార్యక్రమాన్ని చేర్చామని ముఖ్యమంత్రి చెప్పారు. దళిత, గిరిజన విద్యార్ధులు విదేశాలలో చదువుకోవాలంటే రూ. 10 లక్షల స్కాలర్‌షిప్‌ మాత్రమే ప్రభుత్వం ఇచ్చేదని, దానిని ఈ రోజు నుంచి 20 లక్షలకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ ప్రకటించారు. పేదల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు అంబేద్కర్‌ ఏరకంగా తపన పడ్డారో ఆదిశలోనే రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళు, దళితులకు 3 ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమి పంపిణి, కళ్యాణ లక్ష్మీ, బియ్యం పంపిణీ, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌కు పక్కాభవనం హైదరాబాద్‌ నగరంలోని యూసుఫ్‌ గూడ లో నిర్మించ తలపెట్టిన సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ భవనానికి అంబేద్కర్‌ జయంతి రోజున ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు భూమి పూజ నిర్వహించి, శంకుస్థాపన చేశారు. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో 850 చదరపు గజాల స్థలంలో నిర్మించే ఈ భవనానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరుచేసింది. దళితుల మంచిచెడ్డలు తెలుసుకొని, సమాజాన్ని, ప్రభుత్వాన్ని చైతన్య పరిచేవిధంగా మల్లేపల్లి లక్ష్మయ్యతోపాటు, మరికొందరు మిత్రులు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, ఇంతకాలం ఏ ప్రభుత్వం దానికి జాగా కూడా ఇవ్వలేదని సి.ఎం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఈ భవన నిర్మాణానికి జాగా ఇవ్వడంతోపాటు 8 నుంచి 10 కోట్ల రూపాయలు వ్యయపరచి, అద్భుతమైన భావనానికి శంకుస్థాపన చేయడంపట్ల సి.ఎం సంతోషం వ్యక్తం చేశారు.

యోగా ఛాంపియన్‌ కు రూ.5 లక్షలు:
బ్యాంకాక్‌లో జరిగిన ప్రపంచ యోగా పోటీలలో ఛాంపియన్‌ గా గెలుపొందిన మహబూబ్‌నగర్‌ జిల్లాకి చెందిన సుందర్‌ రాజ్‌కు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. సుందర్‌ రాజ్‌ తల్లిదండ్రులను కూడా శాలువాతో ముఖ్యమంత్రి సన్మానించారు.

ప్రాజెక్టుల నిర్మాణంలో చైనా కంపెనీలు
రాష్ట్రంలోని ప్రతిజిల్లా సస్యశ్యామలం కావాలనే తలంపుతో ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టాలని పట్టుదలతో వున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. మన సీఎం ఉద్దేశాన్ని అవగతం చేసుకున్న విదేశీ కంపెనీలు తమవంతు సహకారం అందిస్తామని మందుకు వస్తున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణంలో చైనా సంస్థల ఆర్ధిక, సాంకేతిక సహకారం తీసుకుంటామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు. చైనాలో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను, అక్కడ ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రాజెక్టుల నిర్మాణంలో అవలంబిస్తున్న పద్ధతులను అధ్యయనం చేయడానికి ఇంజనీరింగ్‌ నిపుణులను ఆ దేశానికి పంపాలని సిఎం నిర్ణయించారు. చైనాకు చెందిన ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ చైనా గెజౌభా (GEZHOBA) గ్రూప్‌ కంపెనీ లిమిటెడ్‌ చీఫ్‌ రిప్రజెంటేటివ్‌ హుయాంగ్‌ వాన్లిన్ (HUANG WANLIN), ఎగ్జి క్యూటివ్ మేనజర్లు వీమింగ్ (lu weiming), గెజౌభా గ్రూపు భారత ప్రతినిధులు సిహెచ్‌ సంపత్‌ కుమార్‌, జి. వెంకటాచలం తదితరులతో క్యాంపు కార్యాలయంలో రెండు రోజులు సిఎం చర్చలు జరిపారు. నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, సాగునీటి రంగ నిపుణుడు పెంటారెడ్డి, ఇ-ఇన్‌-సీ మురళీధర్‌, సిఇలు హరిరామ్‌, వెంకటేశ్వర్లు తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.

భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో, ముఖ్యంగా ఎగువ ప్రాంతాలకు నీటిని ఎత్తిపోసే ప్రాజెక్టుల విషయంలో విశేష అనుభవం ఉన్న చైనా కంపెనీలు తెలంగాణలో కూడా పనిచేయడం ఎంతో ఉపయుక్తమన్నారు. త్వరలోనే ప్రారంభించే కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ ప్రాజెక్టు తదితర ప్రాజెక్టుల టెండర్లలో పాల్గొనాలని చైనా కంపెనీని ఆహ్వానించారు. తెలంగాణలో దాదాపు రూ .10వలే కోట్ల పెట్టుబడితో ప్రాజెక్టు నిర్మాణానికి కూడా చైనా కంపెనీ ముందుకు వచ్చింది. తెలంగాణ ఇంజనీర్ల బృందం చైనాలో పర్యటించి వచ్చిన తర్వాత తదుపరి విషయాలపై అవగాహనకు రావాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం, నాణ్యత విషయంలో చైనా కంపెనీలు మెరుగైన పని విధానాన్ని కలిగి ఉన్నాయన్నారు. కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణంలో టార్గెట్లు పెట్టుకుని నీటి పారుదల శాఖ పనిచెయాలని సిఎం చెప్పారు. బ్యారేజిల నిర్మాణంతో సంబంధం లేకుండా… పంపు హౌజులు, పైపులైన్లు, కాల్వలు, లిఫ్టుల పనులు ప్రారంభించాలని, ఇందుకోసం వెంటనే టెండర్లు పిలవాలని సిఎం ఆదేశించారు. 2017 చివరి నాటికి కాళేశ్వరం ద్వారా ఎల్లంపల్లికి, మల్లన్న సాగర్‌కు నీరందించాలని చెప్పారు.

Other Updates