ts13

ముఖ్యమంత్రి కే.సీ.ఆర్‌ దిశానిర్దేశం

తెలుగు భాష – సాహిత్యాభివృద్ధి, వ్యాప్తిలో తెలంగాణలో జరిగిన కృషి ప్రపంచానికి తెలిసేలా తెలంగాణలో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆకాంక్షించారు. తోటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ తో పాటు ప్రపంచ నలుమూలల ఉన్న, వివిధ రకాల సాహితీ ప్రక్రియలో తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన వారిని మహాసభలకు ఆహ్వానించి గౌరవించాలని ముఖ్యమంత్రి చెప్పారు.

ఈ ఏడాది అక్టోబర్‌ 22 నుంచి అక్టోబర్‌ 28 వరకూ తెలంగాణ ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మహాసభలకు విజయదశమి పర్వదినం సందర్భంగా సెప్టెంబర్‌ 30న అంకురార్పణ చేయాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ మేరకు ప్రగతి భవన్‌లో అధికారులతో ముఖ్యమంత్రి చర్చించి, మహా సభల నిర్వహణకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాహితీ ప్రముఖులను, తెలుగు పండిట్లను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మహాసభల సందర్భంగా వివిధ సాహిత్య ప్రక్రియలకు సంబంధించిన కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని చెప్పారు.

”తెలుగు భాషాభివృద్ధికి , సాహితీ వికాసానికి తెలంగాణకు చెందిన ఎందరో మహానుభావులు విశేష కృషి చేశారు. అన్ని సాహిత్య ప్రక్రియల్లో తెలంగాణ వారు విశేష ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు. పోతన నుంచి ఆధునిక సాహిత్యం వరకు అనేక రచనలు చేసిన వారున్నారు. ఎన్నో సాహిత్య ప్రక్రియలను సుసంపన్నం చేసిన వారున్నారు. వారందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. సంప్రదాయ సాహిత్యం, అవధాన సాహిత్యం, ఆధునిక సాహిత్యంలో తెలంగాణ వ్యక్తులు చేసిన కృషి తెలిసేలా సాహిత్య సభలు నిర్వహించాలి. సినీరంగం, పాత్రికేయ రంగం, కథా రచన, నవలా రచన, కవిత్వం, హరికథ, బుర్రకథ, యక్షగాణం, చందోబద్ధమైన ప్రక్రియలు తదితర అంశాల్లో తెలంగాణ సాహితీమూర్తులు ప్రదర్శించిన ప్రతిభాపాటవాలు ప్రధానాంశాలుగా తెలుగు మహాసభలు జరగాలి” అని సిఎం చెప్పారు.

పగటి పూట సభలు, సదస్సులు, రాత్రి సమయంలో పేరిణి నృత్య ప్రదర్శనతో పాటు వివిధ కళారూపాలు ప్రదర్శించాలని సూచించారు. మహాసభల్లో భాగంగా కవి సమ్మేళనాలు, సాహిత్య గోష్టులు, అవధానాలు నిర్వహించాలని సిఎం సూచించారు. మహాసభల సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తత్వ, కవితా పోటీలు నిర్వహించాలన్నారు. తెలంగాణ ప్రముఖులు రాసిన వ్యాసాలు, సాహిత్య రచనలను ముద్రించాలని, తోటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ తో పాటు దేశంలోని ముంబాయి, సూరత్‌, బీవండి, ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు, షోలాపూర్‌, ఒరిస్సా తదితర ప్రాంతాల్లో కూడా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్న వారున్నారని వారందరినీ తెలుగు మహాసభలకు ఆహ్వానించాలని సూచించారు.

అమెరికా, యూరప్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, సింగపూర్‌, మలేసియా, గల్ఫ్‌ తదితర దేశాల్లో కూడా తెలుగు భాష, సాహిత్యానికి సేవలందిస్తున్న వ్యక్తులు, సంస్థలున్నాయని, అందరినీ భాగస్వాములను చేయాలని కోరారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కె. వి.రమణాచారి, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Other Updates