tsmagazine
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఏ ఇతర శాఖ ప్రయత్నించని విధంగా పౌరసరఫరాల శాఖ ఐటి ప్రాజెక్టులో భాగంగా కఠినమైన ఈ-పాస్‌ (ఎలక్ట్రానిక్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌) విధానాన్ని 17000 రేషన్‌ షాపుల్లో విజయవంతంగా అమలు చేసింది. గత పది నెలలుగా ఐటి బందం, జాయింట్‌ కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, అసిస్టెంట్‌ పౌరసరఫరాల శాఖ అధికారులు, డిప్యూటీ తహసిల్దార్లు, సిస్టం ఇంటిగ్రేటర్‌ ఓయాసిస్‌ సంస్థతో కలిసి రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలలో సైతం పర్యటించి ఆ ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని ఎన్‌ఐసి, యుఐడిఎఐ సర్వర్లతో అనుసంధానం చేసి, వేలిముద్రలు, బయోమెట్రిక్‌ డాటాను పంపే విధంగా చర్యలు తీసుకున్నారు.

డీలర్లు, రాజకీయ నాయకులు, లబ్ధిదారుల నుంచి ఎదురైన సవాళ్లను అధిగమించి ప్రతిష్ఠాత్మక ఈపాస్‌ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేశారు. అర్హులైన లబ్ధిదారులకు రేషన్‌ సరుకులు అందజేయడంలో, మిగులు సరుకులను తూకంలో తరుగుదల లేకుండా ప్రభుత్వానికి తిరిగి అప్పగించడంలో ఈపాస్‌ విధానం ఎంతో సహాయపడింది.

ప్రజా పంపిణీ వ్యవస్థలో లబ్ధిదారులకు చేరవలసిన రేషన్‌ సరుకులు పక్కదారి పట్టకుండా, రేషన్‌ డీలర్ల అక్రమాలకు చెక్‌ పెట్టడంలో ఈ-పాస్‌ (ఎలక్ట్రానిక్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌) విధానం విజయవంతమైంది.

2016 మార్చ్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 1545 షాపుల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పౌరసరఫరాల శాఖ ప్రారంభించింది. అయితే ఈ యంత్రాలు కేవలం వేలిముద్రల ద్వారా నిత్యావసరాల సరుకుల పంపిణీకి మాత్రమే ఉపకరించేవి. నగదురహిత లావాదేవీల నేపథ్యంలో అందుకు వీలుగా పౌరసరఫరాలశాఖ యంత్రాల్లో విప్లవత్మాక మార్పులు చేపట్టింది. గతంలో కంటే మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు తక్కువ ధరకే మిషన్లను ఏర్పాటు చేసింది. ఈ-పాస్‌కు అదనంగా… 4 ఇంచుల స్క్రీన్‌ ఉన్న ఆండ్రాయిడ్‌ యంత్రం, ఐరిస్‌ స్కానర్‌, బ్లూటూత్‌ గల బరువు తూచే ఎలక్ట్రానిక్‌ వేయింగ్‌ మెషీన్‌, కార్డు స్వైపింగ్‌ సదుపాయం, ఆధార్‌ ఎనేబుల్‌ పేమెంట్‌ సిస్టం (ఏఈపీఎస్‌), అడియో వాయిస్‌ ఓవర్‌వంటి అంశాలను పొందుపరిచారు.

కొంతమందిలో వేలిముద్రలు అరిగిపోవడం, తదితర కారణాలతో బయోమెట్రిక్‌ విధానంలో ఉన్న సమస్యలను అధిగమించడానికి నూతనంగా ఐరిస్‌ స్కానర్‌ను, గ్రామీణ ప్రాంతాల ప్రజలను దష్టిలో పెట్టుకుని వాయిస్‌ ప్లేయర్‌ విధానాన్ని తీసుకువచ్చారు. ఈ నూతన ఈపాస్‌ యంత్రాలను ప్రయోగాత్మకంగా 2017 ఏప్రిల్‌లో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 800 రేషన్‌ షాపుల్లో అమలు చేసింది. ఈ విధానం విజయవంతం కావడంతో దశలవారీగా 10 నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్‌ షాపుల్లో యంత్రాలను ఏర్పాటు చేసింది. ప్రతి దశలోనూ 3 నుంచి 4 జిల్లాలను అనుసంధానించారు.

పంపిణీ చేస్తున్న వివరాల ప్రింట్‌తోపాటు సరకులు అందజేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లో జరుగుతుంది. కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరి వేలిముద్రనైనా తీసుకుని సరుకులు అందజేస్తారు. దాంతోనే తీసుకున్న సరకుల వివరాలు, ఎంత పరిమాణమన్నది రశీదు రూపంలో వస్తుంది.

జిల్లాలో ఎక్కడి నుంచైనా చౌక ధరల దుకాణాల ద్వారా లబ్ధిదారులు రేషన్‌ సరుకులు తీసుకునే (రేషన్‌ పోర్టబిలిటీ) విధానాన్ని 31 జిల్లాలకు విస్తరిస్తున్నారు. ఈ విధానం ద్వారా తమ జిల్లాలోని ఏ రేషన్‌ షాపు నుంచైనా సరుకులు తీసుకోవచ్చు. ఈ విధానాన్ని మార్చ్‌ 1వ తేదీ నుండి అమలు చేయబోతున్నారు. డీలర్ల మధ్య పోటీతత్త్వం పెంచి లబ్ధిదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలన్న ప్రధాన ఉద్దేశంతో 2017 జూన్‌ ఒకటోవ తేదీ నుండి హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 2017 జూన్‌ నుండి 2018 జనవరి వరకు ఎనిమిది నెలల్లో మొత్తం 26,65,631 లావాదేవీలు జరగగా, ఇందులో 12,26,833 లావాదేవీలు ఎక్కడి నుంచై రేషన్‌ (పోర్టబిలిటీ) విధానం ద్వారా జరిగాయి. సమయ పాలన పాటించని డీలర్‌లపై ఎక్కడి నుంచైనా రేషన్‌ విధానం తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. లబ్ధిదారులు తమకు నచ్చిన షాపు నుంచి సరుకుల తీసుకోవడం ప్రారంభించడంతో డీలర్‌ల మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది. నిజాయితీగా లబ్ధిదారులకు మైరుగైన సేవలు అందిస్తున్న రేషన్‌ షాపుల్లో అత్యధిక లావాదేవీలు జరుగుతున్నాయి. సమయ పాలన పాటించని షాపులు, సరుకులు సరఫరాలో అక్రమాలు జరుగుతున్న షాపుల నుంచి క్రమంగా లబ్ధిదారుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ విధానాన్ని ఒకటి, రెండు నెలలు పరిశీలించిన తరువాత రాష్ట్రంలో ఎక్కడి నుండైనా (పోర్టబిలిటి) రేషన్‌ తీసుకునే విధానాన్ని అమలు చేయడం జరుగుతుంది.
tsmagazine

ప్రతి నెల 1 నుండి 15 వరకు ఖచ్చితంగా రేషన్‌ సరుకుల పంపిణీ

రేషన్‌ షాపుల ద్వారా లబ్ధిదారులకు ప్రతి నెల 1వ తేదీ నుంచి 15 వరకు సరుకులు పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టారు. ఇక నుంచి రేషన్‌ షాపులకు సెలవు ఉండదు. గ్రేటర్‌ హైదర్‌బాద్‌ పరిధిలో ప్రతి శుక్రవారం రేషన్‌ షాపులకు సెలవు ఉంటుంది. త్వరితగతిన 15 రోజుల్లోనే లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేయాలనే సంకల్పంతో శుక్రవారం సెలవును రద్దు చేశారు. ఫిబ్రవరి 1 నుండి ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ఇందుకోసం సరుకుల రవాణా తేదీల్లో, క్లోజింగ్‌ బ్యాలెన్స్‌ (సిబి), రిలీజ్‌ ఆర్డర్‌ (ఆర్‌ఓ)లో మార్పులు చేశారు. 16వ తేదీన పౌరసరఫరాల శాఖ కేంద్ర కార్యాలయం నుండి జిల్లాలకు సరుకుల కేటాయింపులు జరుపుతారు. ఇందుకు 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు డీలర్‌లు డీడీలు కట్టడానికి తుది గడువుగా విధించారు. ఈ తేదీల్లో డీడీలు కట్టిన డీలర్ల రిలీజ్‌ ఆర్డర్‌లను స్థానిక ఏసిఎస్‌ఓ / ఎంఆర్‌ఓలు సంబం ధిత మండల స్థాయి నిల్వ కేంద్రానికి వెంటనే పంపిస్తారు. రిలీజ్‌ ఆర్డర్‌లు అందుకున్న వెంటనే గోదాం ఇన్‌చార్జ్‌లు సరుకుల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తారు. 30వ తేదీ లోగా రేషన్‌ దుకాణాలకు సరుకులు చేరేలా ఏర్పాట్లు చేశారు. 1వ తేదీ నుండి అన్ని 17000 రేషన్‌ షాపుల్లో సరుకుల పంపిణీ ప్రారంభమవుతుంది.

మొబైల్‌ ఫోన్‌కు రేషన్‌ సమాచారం

రేషన్‌ సరుకులకు సంబంధించిన సమాచారాన్ని లబ్ధిదారులకు ఎస్‌ఎమ్‌ఎస్‌ రూపంలో అందిస్తున్నారు. రేషన్‌ డీలరుకు గోదాము నుంచి సరుకులు అందగానే లబ్ధిదారు చరవాణి (సెల్‌ఫోన్‌)కి, మీకు రేషన్‌ సరకులు వచ్చాయనే సంక్షిప్త సమాచారం(ఎస్‌ఎమ్‌ఎస్‌) చేరుతుంది. దీని ఆధారంగా లబ్ధిదారులు తమ సరుకులను తీసుకెళ్లవచ్చు.

తూకంలో తేడాల నివారణకు చర్యలు

మండల స్థాయి నిల్వ కేంద్రాల (ఎం.ఎల్‌.ఎ. పాయింట్‌) నుండి వచ్చే ప్రతిబస్తాకు 1 నుండి 2 కేజీలు తూకంలో బియ్యం తక్కువగా వస్తున్నాయని డీలర్ల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. దీన్ని అధిగమించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని, గోదాముల నుండి డీలర్లకు 100 శాతం తూకంతో సరుకులు పంపిణీ చేయడానికి కషి చేస్తున్నామని పౌర సరఫరాలశాఖ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలియజేశారు.

Other Updates