శ్రీరంగాచార్య
నల్లగొండ జిల్లాలో నకరెకల్లు మండలానికి చెందిన ‘చందుపట్ల’ గ్రామానికి అక్షరభిక్ష పెట్టి అందరూ ఆరోగ్యవంతులుగా వర్ధిల్లవలెననే పట్టుదలతో ఆనాడే తాను ఉచిత హోమియో వైద్యం చేసిన భిషగ్వరుడు, గ్రామాల్లో ‘అస్పృశ్యత’ అనేది లేకుండా కృషిచేసి గాంధేయ సిద్ధాంతాలనే తన జీవితకాలమంతా పాటించి అసిధారావ్రతంగా జీవితాన్ని కొనసాగించి చిరస్మరణీయుడైన తొడుపునూరి నరసయ్యగుప్త (టి. నర్సయ్యసారు) జిల్లావాసులకే గాదు, హైదరాబాదు రాష్ట్రంలోను, కేంద్రంలోను పేరెన్నికగన్న అధ్యాపకుడు, సంఘజీవి.
చల్లమ్మ – రామచంద్రయ్యల పుత్రుడైన ఈయన మిడిల్ (7తరగతి) వరకే ఉర్దూలో చదివి పాఠశాల రోజుల్లోనే పేరుగాంచినాడు. విద్యాభ్యాసం నిమిత్తం ఆయన పడిన బాధలు ఈ గ్రామంలోనే గాక పరిసర పల్లెలకు సైతం కల్గకూడదనే పట్టుదలతో అహరహం కృషి చేసిన ఫలితమే నేడు చందుపట్లలోని ఉన్నత పాఠశాల. చిన్నవయస్సులోనే అంటే 1918-19 సంవత్సరాల్లోనే మిడిల్ ఉత్తీర్ణుడై పాఠశాల అధ్యాపక వృత్తిలో ప్రవేశించిన నరసయ్య జిల్లాలోని అనేక మారుమూల ప్రాంతాల్లో వున్న ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తూ గ్రామ స్థితులు, నిరక్షరాస్యత, అస్పృశ్యతా తాండవం – కరువు కాటకాలను గమనిస్తూ సంచరించి, వీటన్నింటికీ నివారణోపాయం ‘ప్రతి వారికి విద్య’ను అందించటమే అని దృఢంగా విశ్వసించి కృషి చేసిన మహనీయుడు.
తన చందుపట్ల గ్రామంలో నామమాత్రంగావున్న సర్కారీ ప్రాథమిక పాఠశాలను సమకాలం పెద్దల సహకారంతో ప్రభుత్వ స్థాయిలో పైరవీచేసి మిడిల్ స్కూల్ ఏర్పాటు చేయించినాడు. అనంతర కాలంలో ఇదే పాఠశాల బూర్గుల ముఖ్యమంత్రి గా వున్నప్పుడు నాటి నల్లగొండ జిల్లా కలెక్టర్ పరసా వేంకటేశ్వరరావు చొరవతో హైస్కూలుగా రూపుదిద్దుకున్నది. దీనికి నరసయ్య గుప్త, శ్రీరాఘవాచార్యులు, బీరవోల్ రాఘవరెడ్డి, మేడారం బుచ్చయ్య వంటి వారు ఎంతో కృషి చేసినారు. ఈ పాఠశాల శంకుస్థాపన నిమిత్తం బూర్గుల రావటం ప్రారంభోత్సవానికి దామోదరం సంజీవయ్య విచ్చేయటం జరిగింది. అప్పుడు చిన్నతరగతి విద్యార్థులమైన మేము చూచిన గుర్తులు మరుపురావటం లేదు. ఇది ఇప్పటి జడ్‌పి ఉన్నతపాఠశాల. జిల్లా కేంద్రం, తాలూకా కేంద్రాల్లో తప్ప ఎక్కడ హైస్కూల్ లేని నాడు చందుపట్ల హైస్కూల్ చుట్టూ 30 గ్రామాలకు విద్యాభిక్షపెట్టింది. దీనికంతా ముఖ్యమైన వ్యక్తి నరసయ్యగుప్త. ఆయన శాశ్వతంగా ‘అక్షర జీవి’.
నర్సయ్య గుప్త కేవలం అధ్యాపకుడేగాక చిత్ర కళ, కవిత్వం, బహుభాషల వాగ్ధాటి, గ్రంథ రచన కల్గిన ఈయన కృషిని గుర్తించి నిజాం రాజు, ఆస్థాన మంత్రి కిషన్ ప్రసాద్ ఈయనను ఉత్తమ అధ్యాపకునిగా గొప్పగా సన్మానించి యోగ్యతా పత్రం, పతకం బహూకరించటం జరిగింది. అది ఆనాడు స్వగ్రామంలోనే గాక జిల్లా రాష్ట్ర స్థాయి ల్లోను సంచలన వార్తగా నిలిచింది. ఇంకా ప్రిన్స్ మొకరంజా, జవహర్ లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణవంటి మహనీయులు స్వయంగా వీరినభినందించి గౌరవించినారంటే గుప్త వ్యక్తిత్వం ఆనాడే, పల్లె నుండి ఢిల్లీకి ప్రాకటం ‘చందుపట్ల’ గ్రామ ప్రశస్తికొక నిదర్శనం. గుప్తని దర్శించి వారి రచన ‘అస్పృశ్యతానివారణ’ను అంకితం పొందిన సంజీవయ్య కవితాత్మ ఈ పుస్తకంలో పద్య రూపంగా నిలిచింది.
స్వాతంత్య్ర లబ్ధికి పూర్వం నుండే అస్పృశ్యతానివారణకై కృషి చేసి గ్రామంలోని హరిజన బాల బాలికలందరినీ చేరదీసి విద్యాబోధన చేసి వారిని గొప్ప వ్యక్తులుగా మార్చిన గుప్త ఆనాడే పేర్ల చివర్ల వుండే ‘గాడు’ (నర్సి’గాడు’), వెంకటి’గాడు’ మొ||) పదాలను తొలిగించి. నర్సయ్య, వెంకటయ్యలుగా మార్చి ప్రచారం చేసి పాఠశాల రికార్డుల్లోను ‘గ్రామనాంచా’లోను మార్పులు చేయించిన ఆదర్శజీవి. వీరి ‘నవభారతం’ గ్రంథం రాజేంద్ర ప్రసాద్‌కి అంకితమయింది. దీని హిందీ అనువాదం ఇతర రాష్ట్రాల్లో బాగా వ్యాప్తి చెందటం ఆనందంగా వుండేది. నర్సయ్య గుప్త ‘అస్పృశ్యతానివారిణి’ గ్రంథానికి 1958-59వ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ కృతిగా నిర్ణయించి ఆనాడే రూ. 1016లతో ఘన సన్మానం చేసింది. ఇదేగాక జిల్లా, రాష్ట్ర స్థాయి వైశ్య సంఘాల వారు ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ వివిధ భాషల సాహిత్య సంస్థలు వీరిని గొప్పగా సత్కరించడం వలన ఆనాడే నల్లగొండ జిల్లాలోని ‘చందుపట్ల’ ఎంతో ప్రసిద్ధిగాంచింది. చాలకాలం పాఠశాల అధ్యాపకుడుగా, కొంతకాలం ప్రధానోపాధ్యాయునిగా పని చేసి వేలకొద్ది శిష్య సంపదను సమకూర్చుకున్న గుప్త పదవీ విరమణ తర్వాత కూడా ‘మానవ సేవయే మాధవసేవ’గా భావించి ఉచిత హోమియో వైద్యం చేస్తూ చుట్టు ప్రక్కల గ్రామాల్లో ఎందరికో అపరధన్వంతరిగా కీర్తి గాంచిన నరసయ్య ఇంకా ‘గాంధీ జయంతి’, ‘బుద్ధ జయంతి’ ‘పంచ వర్ష ప్రణాళికలు’ ‘వాసవీ జయంతి’, గ్రామస్వరాజ్యానికి నాంది మొదలైన రచనలతో పాటు తన భావాలను మామూలు జనాలకు తెలియపరచటానికి గేయ నాటికలు బుర్రకథలు, అనేక గేయాలు, చిన్న చిన్న పద్యాలను రచించి విద్యార్థులచే కంఠస్థం చేయించి గ్రామాల్లో గొప్ప చైతన్యం కల్గించారు. ఆనాడే గ్రామంలో పెద్దయిల్లు. ఇద్దరు కుమారులు, ఒక బిడ్డ, అందరినీ చందుపట్లలో చదివించి తర్వాత నల్లగొండకు నివాసం మార్చి కుమారులను ఉన్నత విద్యావంతుల చేసినాడు. (అధ్యాపకులుగా పనిచేసి రిటైరయి సూర్యాపేట, నకరెకల్లులో వున్నారు).
నల్లగొండ నివాసం వీరికి బాగా గుర్తింపు తెచ్చింది. పులిజాల రంగారావు, ముప్పారం నారాయణరెడ్డి, దేవవ్రత, కంచినేపల్లి వెంకటరామారావు, రావి నారాయణ రెడ్డి వంటి వారి సహకారంతో నేటి రామగిరి పాఠశాలను స్థాపించి అభివృద్ధి పరచినాడు. చివరి జీవితంలో వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి రామగిరిలోని ఒక యింట్లో కాషాయాంబరధారియై సూత్ర యజ్ఞం చేస్తూ వేదాంత, తాత్త్విక బోధలను, గాంధీ సిద్ధాంతాలను బోధిస్తూ నిరీహా జీవనం గడుపుతూ 1971 సంవత్సరంలో స్వర్లోక వాసులైనారు.
అస్పృశ్యులు అట్టడుగు వర్గాలవారనుకునే వారిని తన యక్కున చేర్చుకుని విద్యాబుద్ధులగరపి, సాహిత్యోప జీవులుగా మార్చిన గుప్తగారిని ఇప్పటికీ స్వగ్రామంలోనే గాదు, జిల్లా వ్యాప్తంగా గుర్తు చేసుకోవటం ఆయన స్వార్థ రహిత జీవన తపోవిశేషంగా భావించవచ్చు.
‘గ్రామ మందు నొకడు గణనీయుడుండిన
గ్రామఖ్యాతి దిశల గాంచి వెలుగు’