ఇది ఒక అపురూప సందర్భం.. పుట్టినగడ్డ తెలంగాణను అక్షరార్చనతో పూజించుకునే ఘట్టం.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత నిర్వహించుకుంటున్న ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా ఇప్పటివరకూ వివక్షకు, నిరాదరణకు గురైన మన ఘన చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పే అపూర్వ ప్రయత్నం.
ఇక్కడి సాహిత్యం, సంస్కృతి అతిపురాతనమైనవి. కేవలం సంస్కృతం, తెలుగు కవులేకాకుండా ప్రాకృత, కన్నడ భాషా ప్రముఖులు జన్మించిన నేల తెలంగాణ.
‘బృహత్కథ’ ఇక్కడ పుట్టింది. ‘గాథా సప్తశతి’ ఇక్కడే వెలుగు చూసింది. భవభూతి ‘ఉత్తర రామచరిత్ర’ ఈ సీమలో పురుడు పోసుకున్నదే. కన్నడ ఆదికవి పంపన రాసిన అనేక విశిష్ట రచనలు తెలంగాణ భూమినుంచి ఆవిర్భవించినవే. నన్నయకన్నా సుమారు అర్థశతాబ్దంముందే ‘కవిజనాశ్రయం’ అనే ఛందో గ్రంథం ఈ సీమలో వెలుగుచూసింది. ఆదికవి కన్నాముందే పద్యం ఇక్కడి కుర్క్యాల, గూడూరు తదితర ప్రాంతాల్లోని శాసనాల్లో చోటు చేసుకుంది. మొట్టమొదటి దేశి రచన, అచ్చ తెనుగు కావ్యం, మొదటి శతకం, ద్విపద వంటి ఎన్నెన్నో సాహితీ వైవిధ్యాలకు తెలంగాణ వేదిక కావడం ఈ సీమ విశిష్టతకు నిలువెత్తు సంతకం. ఈ భూమిలో సాగిన అక్షరార్చన తెలుగు సాహిత్యానికి దిక్సూచిగా వ్యవహరించింది.
ఉత్తమ పరిపాలకులుగా ప్రతిష్ఠాకరమైన ప్రతిభ ప్రదర్శించిన కాకతీయ రాజుల దార్శనికత, నీటి వినియోగం, రాజ్య నిర్వహణా పద్ధతులు నేటి పాలకుల వరకు దారి దీపాలే. బతుకును తల్లిగా గౌరవించే బతుకమ్మ సంప్రదాయానికి తెలంగాణ వేదిక. ప్రపంచం అంతటికీ ఇది ఆదర్శం. పూలను పూజించడం, ప్రకృతిని ఆరాధించడం మానవజాతి మొత్తానికీ ఆదర్శప్రాయం.
చరిత్రకు అందని కాలంనుంచి అనేక అంశాల్లో అగ్రగామిగా నిలుస్తున్న తెలంగాణ, ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన పిదప కేవలం మూడున్నరేళ్ళ కాలంలో విభిన్న రంగాల్లో విశిష్ట విజయాలను సొంతం చేసుకుంటూ సాగుతోంది. ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తూ, సాహితీ సౌరభాలను ఆస్వాదించే శ్రద్ధాసక్తులు ఉన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతోపాటు ఈ సీమ వైభవ ప్రాభవాలను ప్రపంచానికి చాటి చెప్పాలనే లక్ష్యంతో ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. దేశ, విదేశాలనుంచి ప్రతినిధులను ఆహ్వానించి, తెలంగాణ ఆతిథ్యాన్ని అందించి సత్కరించాలనే ముఖ్యమంత్రి ఆశయాలను కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు పలువురు ప్రముఖులు అంకితభావంతో పరిశ్రమించారు. సాహితీ ప్రముఖులు, అధికారులు, వివిధ జీవనరంగాల్లో విశేషంగా కృషి చేస్తున్న విశిష్ట వ్యక్తులతో సమావేశమై మహాసభల నిర్వహణపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
ఈ క్రమంలో రూపుదిద్దుకున్న తెలంగాణ మాసపత్రిక ప్రత్యేక సంచిక మీ చేతుల్లో ఉంది. కొండను అద్దంలో చూపే ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి!