మౌనం తన ఆభరణం
చిరునవ్వు తన ఆయుధం
ఆరడుగుల అందగాడు కాకపోయినా
ఆజాను బాహుడైన ముఖారవిందమైన వాడు
మును లెట్లా తపస్సు చేస్తారు?
ఆయన పట్టిన దీక్షను చూసి తెలుసుకోవచ్చు
కథలెట్లారాస్తారు?
ఆయన చెప్పిన మాటలు వింటే తెలుస్తుంది
పాండిత్య మెట్లా ఉంటుంది?
ఆయన సంధించిన కలం బాణం బట్టి తెలుస్తుంది
సాహిత్యాన్నెట్లా విమర్షిస్తారు?
ఆయన పట్టుకున్న త్రాసును బట్టి తెలుస్తుంది
కవిత్వమెట్లా రాస్తారు?
ఆయన చేతిలోని సూది అల్లికను చూస్తే తెలుస్తుంది
నిలువెత్తు సాహిత్యమతను
మనల్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తాడు
ఆయన తాబేలు నడిచినట్లనిపించినా
కుందేలు కాళ్ళున్నవాడు
ఆయన మూలకున్న పాత సామాననిపించినా
గుండె తుపాకిలో మందును దట్టించిన వాడు
కదలికలేని మనషుల సమూహంలో
జోకులు పూయించి గలగల నవ్వుల
పరిమళాలు నలుదెసలు వ్యాపింప జేసేవాడు
డబ్బులు పొదుపు చేయటం అందరికి తెలుసు
అక్షరాల్ని పొదుపు చేయటం అమ్మంగికి తెలుసు
రామాయణాన్ని మూడు ముక్కల్లో చెప్పే రసవిద్యను నేర్చినవాడు
ఆరు గజాల కవితావస్త్రాన్ని
అరపేజీ అగ్గిపెట్టెలో బంధించినవాడు
కుమ్మరిని చూసాడో కమ్మరిని చూసాడో గాని
లోహాల్లోంచి ఊహల కలాల పనిముట్లను
తయారు చేసినవాడు
మట్టిలోంచి
పతాక సౌందర్య కవితా వస్తువుల్ని తీసి
ప్రక్రియల ప్రక్రియలుగా
సాహితీ ప్రపంచంలో ప్రతిక్రియలు చెక్కినవాడు
ఆయన కలం గొప్పది
కలం కన్నా అతని కవిత్వం గొప్పది
ఆయన సాహిత్యం గొప్పది
సాహిత్యం కన్నా అతని సృజన చైతన్యం
అంతకన్నా గొప్పది
కవితా ప్రియుడు అతడు
కాళోజీకి వారసుడు
అతడతడే అమ్మంగి
మనందరికి సంపంగి