వెనకబడ్డ పాలమూరు జిల్లాను తెలంగాణలో అగ్రగామిగా నిలపడమే తమ లక్ష్యమని రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కే. తారక రామారావు అన్నారు. ఒక రోజు మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి పట్టణ సమీపంలోని ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై 145 కోట్ల రూపాయల రుణాలను లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఒకప్పుడు వలస జిల్లాగా, కూలీల జిల్లాగా పేరు పొందిన మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రస్తుతం అన్ని రంగాలలో ముందుందని అన్నారు. 82745 మంది వీధి వ్యాపారుల, చిన్న, మధ్యతరహా, సూక్ష్మ పారిశ్రామిక వేత్తల, పట్టణ మహిళలకు 145 కోట్ల రూపాయల రుణాలు అందించడం, భారతదేశంలోనే అతి పెద్దదైన అర్బన్‌ ఎకో పార్కును ప్రారంభించడం, ఆర్‌ అండ్‌ బి బైపాస్‌ రహదారిలో 10,000 మొక్కలను ఒకే రోజు నాటడం, 250 మంది వీది వ్యాపారులకు ఉచితంగా షాపును అందించే సౌకర్యం ఏర్పాటు చేయడం, 660 మంది లబ్ధిదారులకు మార్కెట్‌ విలువ ప్రకారం సుమారు రెండు కోట్ల విలువ చేసే 660 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను ఇవ్వటం, ఇవన్నీ మహబూబ్‌నగర్‌ జిల్లా ముందుకు వెళుతుందనటానికి ఉదాహరణని తెలిపారు.

కోవిడ్‌ ఉన్నప్పటికీ పేదు, రైతు, మహిళ కార్యక్రమాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో వున్నారని ఆయన తెలిపారు. ఎన్నో కష్టాలకోర్చి రైతు బంధు పథకం ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 18 వేల కోట్ల రూపాయలు వెచ్చించి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళు కడుతున్నాము అని తెలిపారు. కోవిడ్‌ వల్ల పరిశ్రమలు, వ్యాపారులు దెబ్బతిన్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని మహబూబ్‌నగర్‌ జిల్లాలో సుమారు 2500 మందికి పది వేలు చొప్పున రుణాలు ఇవ్వడం సంతోషమని తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 450 కోట్లతో మెడికల్‌ కాలేజీ మంజూరు కావడం, సాగునీటి ప్రాజెక్టులు రావటం, మహబూబ్‌నగర్‌ జిల్లా అభివృద్ధిలో ముందుకు వస్తున్నదని తెలిపారు. తెలంగాణలో మహబూబ్‌నగర్‌ జిల్లాను అగ్రగామి జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఉదండాపూర్‌, కర్వేన రిజర్వాయర్‌ను కూడా పూర్తి చేసుకోవడంతో పాటు, పట్టణ అభివృద్ధికి కూడా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరి ముందుకు తీసుకెళ్తామని, పేద అభివృద్ధి కార్యక్రమాలను దూకుడుగా అమలు చేస్తామని ఆయన పిలుపునిచ్చారు.

ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ, మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒకే రోజున అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించడం జరిగిందని, ముఖ్యంగా 2087 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద అర్బన్‌ ఎకో పార్కును, మెడికల్‌ కళాశాలను ప్రారంభించామని, గతంలో జిల్లా ఆస్పత్రిలో ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కావని, ప్రస్తుతం డాక్టర్ల‌ సంఖ్య, నర్సుల సంఖ్య పెరిగిందని 14 రోజులకు ఒకసారి తాగునీరు వచ్చేదని ఇప్పుడు రోజు వస్తున్నదని, రోడ్లు, డ్రైనేజీ జంక్షన్ల అభివృద్ధి ఎన్నో చేపట్టామని, కోవిడ్‌ సమయంలో కూడా రైతు బంధు, రైతు బీమా అమలు చేస్తున్నామని తెలిపారు.

మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, భూత్పూర్‌ను కలిపి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీగా చేయాలని మున్సిపల్‌ మంత్రికి విన్నవించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. రుణమేళాలో 145 కోట్ల రూపాయల రుణాలను లబ్ధిదారుకు ఇస్తున్నామని, ఉమ్మడి జిల్లా మొత్తం రుణాలు ఇవ్వాలని ఆయన డిసిసిబి బ్యాంకు అధికారులను ఆదేశించారు. దివిటి పల్లిలో ఐటి ఇండస్ట్రీ వస్తే యువతకు ఉపాధి దొరుకుతుందని, అంతేకాక జిల్లాకు 1000 ఎకరాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ రాబోతోందని ఆయన తెలిపారు.

ఈ సమావేశానికి హాజరైన మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ సభ్యులు మన్నే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రజలు గడిచిన 60 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, గత 6 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకోవాలని సూచించారు. రైతుకు మార్కెట్‌ ధర కల్పించడం, పల్లెల్లోనూ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరున అభివృద్ధి చేయటం, ప్రజలకు ఏం కావాలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించి పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ స్వర్ణ సుధాకర్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకట రావు, శాసనసభ్యులు వెంకటేశ్వర్‌ రెడ్డి, డాక్టర్‌ లక్ష్మారెడ్డి, చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి, రాజేందర్‌ రెడ్డి, డాక్టర్‌ అబ్రహం, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, అంజయ్య, నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, చెన్నూరు శాసన సభ్యులు బాల్క సుమన్‌, డిసిసిబి ఛైర్మన్‌ నిజాం భాషా తదితయి హాజరయ్యారు.

Other Updates