tsmagazine

కవి బుక్క సిద్ధాంతి పూర్వ కల్వకుర్తి తాలూకా, మహబూబ్‌నగర్‌ జిల్లా, ఎల్లమ్మ రంగాపురం గ్రామ నివాసి. ఇంటిపేరు వావిళ్ళ. అందువల్ల ఈయనను వావిళ్ళ సిద్ధాంతి అనిూడా వ్యవహరించేవారు. వీరు బుక్కవారు. ఊరూరా సంచారం చేస్తూ బుక్క, గులాల్‌ అమ్మేవారు. ‘బుక్క’ ఒక సుగంధ ద్రవ్యం. దీన్ని తుంగ ముస్తెలతో తయారు చేస్తారు. శుభ కార్యాలలో జనం సంతోషంతో ఈ బుక్కను చల్లుకొని ఆనందించేవారు. తాము భర్తృహరి వంశీయులుగా చెప్పుకుంటారు వీరు.

బుక్క సిద్ధాంతి తాను రచించిన తెలంగాణా తొలి రామాయణం బతుకమ్మ పాట అవతారికలో తమ వృత్తాంతం గురించి.

”ఆరు కాండంబులు ఉయ్యాలో-హరిరామ కథయిది ఉయ్యాలో
యెల్లమ్మ రంగపురి ఉయ్యాలో-వేడ్కతో నెలకొన్న ఉయ్యాలో
వావిళ్ళ వంశజుడు ఉయ్యాలో-వరగుణ లక్ష్మయ్య ఉయ్యాలో
పణతి రామమ్మను ఉయ్యాలో-పరిణయంబునుగొని ఉయ్యాలో
మువ్వురు సుతులను ఉయ్యాలో-ముదముతో గనెచాల ఉయ్యాలో
శిద్ధాంతి, వేదాంతి ఉయ్యాలో-శివపంచాక్షరి ఉయ్యాలో”

అంటూ తన తల్లిదండ్రులు రామమ్మ, లక్ష్మయ్యలని, తన ఇరువురు తమ్ములు వేదాంతి, శివపంచాక్షరి అని తెలిపాడు. ఇరువురు తమ్ములు కూడా కవులే. రామాయణం బతుకమ్మ పాట రచనలో వారి భాగస్వామ్యం కూడా వుంది. ఇతడు 19వ శతాబ్దం ద్వితీయార్థంలో జీవించాడు.

బుక్క సిద్ధాంతి వచనం, పద్యం, యక్షగానాది సాహిత్య ప్రకియల్లో రచనలు చేసిండు.

ఇతని రచనలు

రామాయణం బతుకమ్మపాట, కుశలవుల బతుకమ్మ పాట, అశ్వశాస్త్రం, భీమసేన విలాసం (యక్షగానం), కేదారీశ్వర వ్రతం-గౌరీదేవి కథ, సప్తవర్ణాలపై పద్యాలు, లక్ష్మీ సరస్వతీ సంవాదం, అనుభవ వైద్య శాస్త్రము, చివరి నాలుగు గ్రంథాలు అలభ్యం

1) రామాయణం బతుకమ్మపాట: తెలుగు సాహిత్యంలో గోన బుద్ధారెడ్డి 13వ శతాబ్దంలో ద్విపదలో రచించిన ‘రంగనాథ రామాయణం’ మొదటి రామాయణం. అలాగే బుక్క సిద్ధాంతి 85 ఏండ్ల క్రితం రచించిన ‘రామాయణం బతుకమ్మ పాట’ తెలంగాణలో మొదటి ఉయ్యాలపాట. శతాబ్దాల అంతరం వున్నా ఈ కవులిరువురూ మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందినవారే. బుక్క సిద్ధాంతి రామాయణం బతుకమ్మ పాట రచనలో ‘రంగనాధ రామాయణం’ అనుసరణలు కనిపిస్తాయి-

‘బతుకమ్మ’ తెలంగాణ ప్రజల గుండె చప్పుడు. బతుకమ్మ పండుగ తెలంగాణ సొంతం. వ్యవసాయమే ప్రధాన జీవికయైన జనం తమను చల్లగా చూడమని, మంచి బ్రతుకును ప్రసాదించమని ప్రకృతి మాతను కొలిచే పూల పండుగ ఇది. జానపదుల సమైక్య, ఆత్మీయ, ఆధ్యాత్మిక మానవ సంబంధాల సమ్మేళనమే ఈ సంప్రదాయ సంబరం. గ్రామీణ ప్రజలతో మమేకమైన సిద్ధాంతి తన కవిత వారి నోళ్ళలో నిరంతరం నానుతూ వుండాలని,చిరస్థాయి కావాలని అభిలషించి, రామాయణ కథను సరళమైన మహబూబ్‌నగర్‌ మాండలికంలో రచించి, ప్రచురించి, ప్రచారంలోకి తెచ్చాడు. ఈ గ్రంథం 90 పేజీల్లో వుంది.

రామాయణం బతుకమ్మపాట రచనలో సిద్ధాంతికి ఒక నిశ్చితమైన ప్రణాళిక ఉన్నట్లు శ్రద్ధగా చదివితే అవగత మౌతుంది. వాల్మీకి రామాయణ ఛాయలోనే బాలకాండము, అయోధ్యకాండము, అరణ్యకాండము, కిష్కింధకాండము, సుందరకాండము, యుద్ధకాండము అనే ఆరు కాండ లున్నవి. చరణాల చివర్లలో ఉయ్యాల, వలలో అను వంతలను పలుకవలసిన చోట్లను సూచించాడు. ఈ కృతిని రంగాపురం వేంకటేశ్వరునికి అంకితం ఇచ్చాడు.

వాల్మీకి రామాయణంలోలేని, జనశ్రుతిలో వున్న కథలను తన గ్రంథంలో చొప్పించాడు. అవాల్మీకాలైన రంగనాథ రామాయణంలోని కథలను సందర్భానుకూలంగా ప్రవేశపెట్టాడు. ఆ కథలు..
tsmagazine

కాకాసురుని కథ, లక్ష్మణరేఖా వృత్తాంతం, కొడుకైన రావణునికి తల్లి కైకసి హితబోధ, ఇంద్రజిత్తు నాగాస్త్ర ప్రయోగం,

శుక్రుని సలహాతో రావణుడు చేసిన శత్రుసంహార హోమం, కాలనేమి వృత్తాంతం, మాల్యవంతుని వృత్తాంతం, విభీషణుని సూచనతో రాముడు రావణుని నాభిని బాణంతో ఛేదించడం.

ఈ కథలేకాక జనశ్రుతిలోవున్న అహల్యాశాప విమోచనం, శూర్పణఖ ప్రేరణతో రావణుడు సీతను అపహరించడం వగైరా కథలను తన రచనలో పొదివిండు. సిద్ధాంతి ప్రాంతీయాభిమానంతో కల్వకుర్తి తాలూకాలోని శ్రీరామక్షేత్రం శిరుసనగండ్ల, కొల్లాపురం ప్రాంతాల్లో సీతారాముడు వనవాస కాలంలో సంచరించారని, నల్లమల అడవులను కూడా దర్శించారని వర్ణించాడు-అది కవికున్న స్వతంత్రం!

ద్విపద పద్యమే కొద్ది మార్పులతో బతుకమ్మ పాట ఔతుంది. ప్రతిపాదనలో 9 మాత్రలున్నాయి. రెండింద్ర గణాలతోపాదం-ఇలాంటి రెండు పాదాలతోపాట. రెండవ పాదం మొదటి యతి, ప్రాసయతి విధించాడు. బతుకమ్మ పాటలు తెలంగాణ ప్రజల కష్టసుఖాల కలపోతలు. అలాంటి తెలంగాణ ప్రజల జీవన మూలాలున్న బతుకమ్మ పాటను రామాయణం బతుకమ్మ పాటగా వ్రాసి, తెలంగాణ జనం చేతుల్లో పెట్టిన అచ్చ గ్రామీణ కవి బుక్క సిద్ధాంతి గొప్ప ప్రజాకవి, ప్రశంసనీయుడు.

కుశలవ బతుకమ్మ పాట: ఇది రామాయణ కథకు పూరణం. వాల్మీకి మూల రామాయణానికి ఉత్తర రామాయణం ప్రక్షిప్తమంటారు, కానీ కరుణ రసార్ద్రమైన ఈ కథ జనం హృదయాల్లోకి చొచ్చుకొనిపోయి అత్యాదరణ పాత్రమయింది. కుశలవుల చరిత్ర చెప్పనిదే రామాయణం కథ రక్తి కట్టదనుకున్నాడేమో సిద్ధాంతి, సోదరులతో కలిసి ఈ బతుకమ్మ పాటను వ్రాసి ప్రకటించాడు-ఈ రెండవ భాగాన్ని వేపూరి భక్తులు ముద్రించడంతో వేపూరి కుశలవ బతుకమ్మపాట పేర చలామణి అయింది. ఈ గ్రంథాన్ని సిద్ధాంతి రంగాపురం వేంకటేశ్వరునికి అంకితం చేసిండు.

సిద్ధాంతి తాను రచించిన రామాయణ గ్రంథంలో రంగనాథ రామాయణం కథలను, జనశ్రుతిలోకి కథలను ప్రవేశపెట్టిన విధంగానే కుశలవ బతుకమ్మ పాటలో ‘జైన రామాయణం’ కథగా ప్రచారంలో వున్న కథను చేర్చాడు. సీత పాతివ్రత్య విషయంలో వదరుబోతు చాకలి ఆరోపణలు విని రాముడు సీతను అడవుల పాలు చేయడం మూలకథ. కానీ జైన రామాయణంలో ఈ కథను ఇంకొక తీరుగా మలిచారు. మాయా మునికన్య వేషంలో ఒక రాక్షసి రావణుని చిత్రపటాన్ని సీత తల్పం కింద ఉంచుతుంది-రాముడు అపార్థం చేసుకొని సీతను పరిత్యజిస్తాడు. రాముని సోదరి శాంత వాస్తవాన్ని రాముని దృష్టికి తెచ్చినా రాముడు అంగీకరించడు. అడవులకే పంపుతాడు. జనశ్రుతిలో వున్న ఇంకొక కథ! జానపద కథ! ఇది ఏ రామాయణంలోనూ లేదు. వాల్మీకి ఆశ్రమంలో కవలలు పుట్టలేదు. కుశుడొక్కడే పుట్టినాడు-అతణ్ణి వూయలలోవేసి గంగకేగి స్నానం చేసి వస్తాను, బాలుణ్ణి చూచుకొమ్మని వాల్మీకికి చెప్పి వెళ్తుంది. తోవలో కోతులు పిల్లలతోపాటు చెట్లపై చెలరేగి దుముకుతుంటే వాటి నిర్దయకు సీత నిరసనను తెలుపుతుంది. అప్పుడు కోతులు మీ మనుషుల్లాగా బాలుణ్ణి ఒంటిగా విడిచి రావడానికి మీ వలెగాము అంటాయి. ఆమె వెంటనే ఆశ్రమానికి మరలి వస్తుంది. కుశుణ్ణి ఎత్తుకొని పోతుంది. ధ్యానవుగ్నుడైన వాల్మీకి కొద్ది సేపటికి కన్నులు విప్పిచూచి బాలుని కానక వ్యాకుల చిత్తుడై, సీత ఏ అఘాయిత్యం చేస్తుందోనని మంటి బొమ్మను చేసి ప్రాణప్రతిష్ఠజేసి వూయలలో వేస్తాడు. సీత తిరిగివచ్చి చూడగా ఇంకొక బాలుడున్నాడు. జరిగిన విషయం తెలిసి ఆ బాలునికి లవుడని నామకరణం చేస్తారు. వినటానికి ఆసక్తిని రేకెత్తించే ఈ కథను సిద్ధాంతి తన కథలో ప్రవేశపెట్టి జనరంజకం గావించాడు.

ఇతని తమ్ముడు పంచాక్షరి తన గురువుగారైన కోటకదిర చంద్రమౌళీశ్వరస్వామి చరిత్రను ‘ఉమా మహేశ్వర సంవాదం’ పేరిట మూడు ఆశ్వాసాల హరికథగా రచించాడు. ఇది సలక్షణమైన ప్రబంధంగా పేరు గావించింది. ఈ గ్రంథానికి గురుభక్త విజయమనే పేరు కూడా వుంది.

అశ్వశాస్త్రము: ఆధునిక వాహన సదుపాయం లేని నాటి పరిస్థితుల్లో జనం ఎడ్ల బండ్లు, గుర్రాలపైనే ఆధారపడి ప్రయాణం సాగించేవారు. నాడు రంగాపురంలో దొరల ప్రాపకంలో ఉన్న సిద్ధాంతి కవిగానే గాక వైద్యుడుగా పేరున్నవాడు. దొరల గుర్రాలకు సంక్రమించే పలు వ్యాధులకు నిత్య జీవితంలో వాడుకలో వుండే దినుసులతో, చెట్టు చేమలతో మందుల తయారీ, ఉపయోగించే విధానం పల్లె ప్రజల వ్యావహారిక తెలంగాణ, మాండలికంలో చిరుపొత్తంగా రచించాడు. తెలుగులో ఇదొక అరుదైన పుస్తకం. సహదేవ పశువైద్య శాస్త్రం తెలుగులో ప్రాచుర్యంలో వుంది. కానీ కవి పండితులెవ్వరూ అశ్వశాస్త్రం రాసిన దాఖలాలు లేవు. 1935 సంవత్సరం (భావనామ సంవత్సర శ్రావణ శుద్ధ సప్తమి)లో వెలువడిన అశ్వశాస్త్రము వచన కావ్యానికి నేటికి 82 ఏండ్లు. కొండా వీరయ్య ప్రీమియర్‌ ముద్రాక్షరశాల, సికింద్రాబాదులో పుస్తకం అచ్చయింది. నాడు నిజాం ప్రభువు ప్రతినిధులైన దేశ్‌ముఖ్‌ గున్న రెడ్డి దొరలు ఈ పుస్తక ముద్రణకు ద్రవ్య సహాయంచేసి ప్రచురించారు. ఈ వైద్యశాస్త్రం కేవలం దొరల గుర్రాలకేకాక గుర్రాలున్న ఇతర జనానికి కూడా ప్రయోజనకారి అయింది.

గ్రంథం ప్రారంభంలో ఇష్ట దేవతాప్రార్థన చేస్తూ ‘కృతిపతికి నిత్య సంపదలొసగున్‌’ అని ప్రభుభక్తి ప్రకటిం చుకొని అజ్ఞాతవాస కాలంలో విరాటరాజు కొలువులో గుర్రాల ఆలనా పాలనలో సహదేవుడు విరాటరాజుకు ఈ శాస్త్రాన్ని ఎరుక పరిచాడని వివరించాడు. గుర్రాలకుండే సుడుల ఆధారంగా యజమానికి కలిగే శుభాశుభాలను వివరిస్తూ ”మెడమీది జూలులో సుడి శుభం, నెత్తిమీద సుడి వుంటే అశుభం. మెడకింద సుడి వుంటే ఎక్కినవారు

మరణించును అని వాక్రుచ్చాడు. గుర్రానికి వుండే పండ్ల సంఖ్యను బట్టి దాని వయస్సును నిర్ణయించే విధానం చెప్పి, గుఱ్ఱానికి 32 ఏండ్ల జీవితం అన్నాడు. అలాగే గుర్రం పొడవు, వీపు, కడుపు, మెడ, గిట్టలు, చెవులు, ముఖం, కండ్లు, నాలుక, ముక్కులు, గుర్రం రంగు, రోమాలు ఎలా వుండాలో చెపుతూ, ఏయే వర్ణాలు ఎక్కడెక్కడ వుంటే శుభాశుభాలో దీర్ఘంగా వివరించాడు.

అశ్వరోగ చికిత్సా ప్రకరణానికి వస్తే పల్లె ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో అచ్చమైన తెలంగాణ మాండలికాలకు ప్రాణం పోసిండు. అప్పటి అతని అవగాహనకు ప్రశంసించాల్సిందే.

భీమసేన విలాసం (యక్షగానం): నాటి సమాజంలో నేటివలె సినిమాలు, టీవీలు వగైరా వినోద సాధనాలు లేవు. తోలుబొమ్మలాట, యక్షగాన ప్రదర్శనలు ప్రజలకు ప్రధాన వినోద వీక్షణలు. తెలంగాణలో ప్రసిద్ధ యక్షగాన కర్త చెర్విరాల బాగయ్యతోపాటు గ్రామగ్రామాన యక్షగాన రచయితలెందరో వున్నారు. సాధారణంగా యక్షగానాలన్నీ పురాణ కథలాధారంగా వ్రాయబడినవే.

బుక్క సిద్ధాంతి రచించిన ‘భీమసేన విలాసం యక్షగానానికి ”హృదయోల్లాసి, ఊర్జిత కథో సేతంబు నానా రసాభ్యుదయోల్లాసి విరాట పర్వం” భారతాంతరత కథ మూలం. ప్రేక్షకుల మనస్సునుదోచే కథా గమనంలో, అజ్ఞాతవాసంలో పాండవులు మారువేషాల్లో విరాటరాజు కొలువులో చేరడమే ఒక ఆసక్తికర అంశం! ఇక కీచకుని పరస్త్రీ వ్యామోహం-అతని ప్రాణాలకే ముప్పు తెచ్చిందనే నీతిని జనం ఆహ్వానించారు. ఆదరించారు.

భీమసేన విలాసం వీరరస ప్రధానమైన యక్షగానం. రంగాపురం గ్రామంలో జీవనంసాగించక ముందు సంచార జీవనం సాగించే బుక్క సిద్ధాంతి వనపర్తి సంస్థానం రామకృష్ణాపురంలో నివసించాడని అవతారికలో స్పష్టం చేశాడు. ఈ గ్రంథం 1927 (ప్రభవనామ) సం||లో శ్రీకొండా శంకరయ్య, సికింద్రాబాద్‌ వారిచే ప్రీమియర్‌ ముద్రాక్షరశాలలో ముద్రించబడింది. ద్వితీయ ముద్రణ 1936 (ధాత) సం||లో అమెరికన్‌ ముద్రాక్షరశాల, చెన్నై పట్టణంలో జరిగింది.

భీమసేన విలాసం కథను జనమే జయ మహారాజుకు వైశంపాయనమహర్షి వివరించినట్లుగా వుంది.

యక్షగానం జనరంజకమైన కళ కాబట్టి బుక్క సిద్ధాంతి ప్రధానకథలో మార్పులు, చేర్పులతో, రమణీయ కల్పనలతో రచించాడు. వచన, గాన సంపాదాత్మకమైన యక్షగానారచనలో కందాలు, ద్విపదలు, కీర్తన, గీతము, మత్తకోకిల, శ్లోకము, దర్వులు, వర్ణనలు, కందార్థములు హారతితో యక్షగానం పూర్తవుతుంది.

కేదారీశ్వరవ్రతం-గౌరీదేవి కథ: సిద్ధాంతి ఈ చిరు పొత్తంలో కేదారేశ్వర వ్రత విధానం వివరించాడు. గణపతి పూజతో మొదలిడి, అధ అష్టోత్తర శతనామావళి, అధ సూత్ర గ్రంధి పూజలు వివరించాడు. అంతా సంస్కృతమయం-ఇక గౌరీదేవి కథ, సత్యనారాయణవ్రత తరహా కథలవలె కొన్ని కథలు శివ మహత్య్వాన్ని తెలిపేవి చేర్చినాడు-ఈ చిరుపొత్తం బుక్క సిద్ధాంతి పాండిత్య ప్రకర్షకు ప్రతీకగా నిలుస్తుంది-

ఇలా గ్రామీణ కవి బుక్క సిద్ధాంతి జానపదులనాడి నెరిగి వారి వినోదార్థం రామాయణ బతుకమ్మపాట, కుశలవ బతుకమ్మ పాట, గ్రామస్థుల గుర్రాల పరిరక్షణార్థం సరళ తెలంగాణ మాండలిక భాషలో అశ్వశాస్త్రం సుబోధకంగా రచించాడు. భీమసేన విలాసం బుక్క సిద్ధాంతి విస్తృత సాహిత్య వైభవానికి ఎత్తిన పతాక. ఇలాంటి ప్రజాకవుల కవిత్వం జనం నాలుకలపై సదానర్తిస్తూనే వుంటుంది-ఈ తెలంగాణ పల్లె కవికి ప్రణామాలు.

జి. యాదగిరి

Other Updates