kcrrతెలంగాణ రాష్ట్రం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, రాజస్థాన్‌ రాష్ట్రంలోని ‘ఆజ్మీర్‌దర్గా’కు సమర్పించాల్సిన చాదర్‌ను ఏప్రిల్‌ 24న అధికారులకు అందజేశారు. చాదర్‌తో పాటుగా 2.51 లక్షల నజరానాను కూడా ముఖ్యమంత్రి దర్గాకు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మైనారిటీశాఖ కార్యదర్శి ఉమర్‌ జలీల్‌, డైరెక్టర్‌ జలాలుద్దీన్‌లు చాదర్‌ను దర్గాలో సమర్పించారు.

ఆజ్మీర్‌ దర్గాకు పంపిన చాదర్‌ను ప్రత్యేకంగా హైదరాబాదు పాతబస్తీలో తయారు చేయించారు. చాదర్‌మీద దర్గా, మక్కా మదీనా చిత్రాలతోపాటు ‘‘హండ్రెడ్స్‌ ఆఫ్‌ రిగార్డ్స్‌ ఫ్రం కె. చంద్రశేఖరరావు’’ అని కేటాయించారు.

ఆజ్మీర్‌ దర్గాకు తెలంగాణ రాష్ట్రనుండి వెళ్ళే భక్తులకోసం అక్కడ ఆజ్మీర్‌ దర్గా దగ్గర ‘రుబాత్‌ (గెస్ట్‌హౌజ్‌)’’ను నిర్మించాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయం తీసుకున్నది. ఈ రుబాత్‌ కోసం స్థలం కేటాయించాలని ఇంతకుముందే రాజస్థాన్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధర రాజేకు మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేఖ రాశారు. ఈ అంశంలో అక్కడి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది.

ఈసారి దర్గాకు చాదర్‌ సమర్పించిన కార్యక్రమంలో భాగంగా ‘రుబాత్‌’ విషయాన్ని అక్కడి ప్రభుత్వ అధికారులకు గుర్తుచేయాలన్నారు. అధికారులతో మాట్లాడి అంశాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చేవిధంగా కృషి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆజ్మీర్‌ ఉత్సవాలు గొప్పగా జరగాలని, అందరికీ శుభం జరగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్యే షకీల్‌, ఎమ్మెల్సీ సలీం, వక్ఫ్‌బోర్డు అధికారులు, హజ్‌కమిటీ బాధ్యుడు షుకూర్‌, మరికొందరు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

Other Updates