డా|| నలిమెల భాస్కర్
తెలంగాణ తెలుగు భాషకు అనేక ప్రత్యేకతలున్నవి. ఒకవైపు అచ్చతెనుగు పదాలు, మరొకవంక సంస్కృత పదాలు, ఇంకొక దిక్కు ఉర్దూ మాటలు.. అడపాదడపా ఆంగ్లశబ్దాలు.. అన్నీ కలిసి వింత భాషగా మారిపోయినదే తెలంగాణ భాష. శిష్ట వ్యావహరికంలోని ‘సహనశీలి’ తెలంగాణలో ‘ఓపికెమంతుడు’ అవుతాడు. ‘ప్రతిభాశీలి’ తెలంగాణలో ‘తెలివిమంతుడు’గా తెలియజేయబడతాడు. ‘కార్యదీక్షాదక్షుడు’ క్రమంగా ‘పనిమంతుడు’గా పరిణమిస్తాడు. శుచీ, శుభ్రతా పాటించే వాణ్ణి తెలంగాణలో ‘సురువు మనిషి’గా సుబోధకం చేస్తున్నారు కృతజ్ఞుడు క్రమేపీ ‘గురత్తం మనిషి’గా మారిపోతాడు. మిక్కిలి ఆప్యాయతానురాగాలు కలిగిన మనిషిని ‘అత్మగల్ల మనిషి’ అంటున్నారు. దయా హృదయుడు అనేవాడు ‘దయగల్ల మనిషి’ అవుతున్నాడు. మరీ అమాయకుడు ‘ఎడ్డిమొకమోడు’ అవుతాడు. వీడే శిష్టభాషలో వెర్రిబాగులోడు/వెంగళప్ప కూడాను. నిజాయితీపరుడు తెలంగాణలో ‘నియ్యత్‌దారు మనిషి’గానూ, మంచి మనసున్న వ్యక్తిని ‘దిల్దారు మనిషి’గానూ వ్యవహరిస్తున్నారు.
ఇకపోతే… కొన్ని నకారాత్మక, నిందార్థక పదాలు, పదబంధాలు తెలంగాణలో ఎట్లా వాడపడుతున్నాయో పరిశోధనార్హం. ‘అంట్ల వెధవ’ అనే తిట్టు మనం ప్రమాణ భాషలో వింటున్నాం. అది తెలంగాణలో ‘మూతినాకుల్లోడు’ అవుతున్నది. ‘కొంపలు ఆర్చేవాడు’ అనే మాటతీరు ‘కొంపల గుత్తోడు’ అని రూపాంతరంగా కనిపిస్తున్నది. ‘గుండెలు తీసిన బంటు’ అనేవాడు ‘పానాల గుత్తోడు’ అవుతున్నాడు. ‘పాపాత్ముడు’ అనేవాడు చిత్రంగా తెలంగాణ ప్రజల భాషలో ‘పాపాత్ముడు’ అవుతున్నాడు. విషపాతకుడు క్రమేణా ‘ఇసపాత్కుడు’గా పదాదివకారలోపంతో వినబడతాడు. గుండా/గూండా అనేవాడు ‘గుండగాడు’ అవుతాడు. ఆదిలాబాదు ప్రాంతంలో ‘కడ్డుగాడు’ అనే మాట వ్యవహారంలో వుంది. అంటే దుర్మార్గుడు, మొండివాడు, క్రూరుడు మొదలైన అర్థాలున్నాయి. ఇక్కడ ‘కడ్డు’ అనేది ‘కరడు’నుండి ఏర్పడింది. వర్ణసమీకరణంవల్ల కడ్డు అయ్యింది. కరడు లేదా కడ్డు అంటే గడ్డ. ‘కరడు గట్టిన మూర్ఖత్వం’ అంటే గడ్డ కట్టిన అనే కదా! కనుక దుర్మార్గమూ, క్రౌర్యమూ, మౌఢ్యమూ గడ్డ కట్టినవాడు కనుక కడ్డుగాడు. అట్లాగే తెలంగాణలో ‘గిడ్డుగాడు’ అనే పదముంది. అంటే మరుగుజ్జు అని అర్థం. పొట్టివాణ్ణే గిడ్డు అంటుంటారు. ఇది ఉర్దూ మాట. ఉర్దూ అనగానే.. లంగ, లఫంగ పదాలు గుర్తుకొస్తాయి, దుష్టుడు, దుర్మార్గుడు అనే అర్థంలో తెలివి తక్కువ మనిషికి హౌలాగాడు అనే వ్యవహారం వుంది. లుచ్చగాడు అనే తిట్టుమాట కూడా వుంది. మోసగాడు అర్థంలో ‘దోకబాజి మనిషి’, ‘బట్టెబాజి మనిషి’ అనే పదబంధాలు తెలంగాణలో ఉన్నాయి.
ఇంకా.. ‘కృతఘ్నుడు’ అనే మాటకు సమానార్థకంగా ‘బెయిమాన్ మనిషి’ అనే సమాసం ఉంది. ఇంకా కృతజ్ఞత మరిచినవాడు అనే అర్థంలో ‘గుర్రపు బెయిమాన్’ అనే మాటతీరు వున్నది. ‘ఈమాన్’ అంటే కృతజ్ఞత, బయీమాన్ అంటే కృతఘ్నత. ‘బే’ అంటే రాహిత్యం, లేనిది, కానిది అని అర్థాలు.
‘మోసగాడు’ అనే వ్యక్తిని ‘మోసకారి’ అనీ, పాపాత్ముణ్ణి ‘పాపకారి’ అనీ, దోషిని ‘దోసకారి మనిషి’ అనీ పిలుస్తారు తెలంగాణలో. మరీ మొండివాణ్ణి ‘మోరుదోపోడు’ అంటారు. మోరత్రోపు నుండి ‘మోరుదోపు’ వచ్చింది. ముఖాన్ని అటూయిటూ తిప్పడం, ఏ పని చేయాలన్నా చేయకుండా మొండికేయడం, మొకం మరోవైపు తిప్పేవాడు మోరుదోపు. ఇది అచ్చ తెనుగు పదబంధం. బానిసను బాంచగాడు/బాంచోడు అంటాడు. బానిసోడు అని మరో మాట ప్రమాణ భాషలో, ‘ఉర్దూమాట’ గులాపోడు తెలంగాణలో అదనం. ఇది ‘గులాము’ నుండి పుట్టింది.
కయ్యాలమారిని తెలంగాణలో ‘కొజ్జోడు’ అంటారు. నిజానికిది ‘కజ్జోడు’ కావచ్చు. కజ్జము అంటే కయ్యం అని అర్థం. ‘గిల్లి కజ్జాలు’లో ‘కజ్జము’ంది. అదే తెలంగాణలో ‘గెలికి కయ్యం’ అవుతుంది. ఆడంగి వెధవ అమాంతం ‘ఆడిగు ల్లోడు’గా అవతార మెత్తుతాడు. పల్లెటూరి బైతు అకస్మా త్తుగా ‘కేడెగాం మనిషి’ అవుతాడు. ఇంకా తెలంగాణలో ఏడ్పుగొట్టోడు, దరిద్రపుగొట్టోడు, పీశిడిగొట్టోడు’ ఉన్నారు. అదిగాక, రేషగొండి (అభిమానధనుడు), కోపగొండి (కోపిష్ఠి) ఉన్నారు. ఇందులో రేషగొండి సకరాత్మక పదమే! పౌరుషవంతుడు అని కూడా అంటారు ప్రమాణభాషలో.
తెలంగాణలో ‘పులెగండోడు’ అనే మాట ఉంది. తిండికి ఎదురుచూసే వాణ్ణి, ఇలా అంటుంటారు. పులకండము అంటే కండ చక్కెర. ప్రతీ ఆహార పదార్థానికి అన్వయిం చబడి వుంటుందేమో! సోమరిపోతు ‘వంగలేనోడు’ అయ్యిండు తెలంగాణలో. నంగనాచి వెధవ ‘నల్లికుట్లోడు’గా మారి ‘కొరగాని వాడు/పనికిమాలిన వెధవ’, ‘నప్ప తట్లోడు’గా అవతరించాడు. చిత్రంగా ‘కుట్రబాజి మనిషి’ అనే సమాసమూ ఉంది. ‘పయోముఖ విషకుంభం’, ‘గోముఖ వ్యాఘ్రం’ క్రమంగా తెలంగాణలో మెత్తని చినాలి అవడం జరిగింది. చినాలి అంటే వేశ్య. మెత్తని చినాలి చేసే వేశ్యరికం పైకి కన్పించదు. ఈ పదబంధం తిక్కన ‘మెత్తని పులి’ (ధర్మరాజును వుద్దేశించి)ని గుర్తుకు తెస్తూ వున్నది. ఇంకా కుక్కపేగులోడు (ఏదీ మనసులో పెట్టుకోనివాడు), నల్లమొకపోడు (నలుగురిలో తలెత్తుకు తిరగలేనివాడు), గంట్లమారోడు (కయ్యాలమారి)… ఇట్లా వందలాది పదాలు తెలంగాణలో విలక్షణంగా ఉన్నాయి.