adilabad-gandiiమానస్‌ దండనాయక్‌

తెలంగాణ చరిత్రను పరిశీలిస్తే ఎందరో మహనీయులు తమ జీవితాలను త్యాగం చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ నేల మనుగడ కోసం, ఇక్కడి జాతి అభ్యున్నతికోసం, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేశారు. జీవించినన్ని రోజులూ తనకోసం కాకుండా తన ప్రాంతం కోసం తన ప్రాంత ప్రజల కోసం తన ప్రాంత ప్రగతి కోసం కృషిచేసిన త్యాగధనుడు నిరంతర సేవాపరాయణుడు దండనాయకుల రాంచందర్‌రావు పైకాజీ. ‘పైకాజీ’గా ఈ ప్రాంతంలో ఆయన సుప్రసిద్ధుడు.

ఆదిలాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌ (ఒకనాడు జున్‌గావ్‌గా పిలిచే వారు) పట్టణానికి చెందిన పైకాజీ, దండనాయకుల వెంకటరావు శ్రీమతి పెద్దుబాయి దంపతులకు 1889 మార్చి 12వ తేదీన జన్మించాడు. ఆయన జన్మించిన రోజు తెలంగాణ ప్రాంతం అంతా సంబరాలు జరుపుకుంది. కారణం ఆరోజు హోలీ పండుగ. కాముని పున్నమను ఈ ప్రాంతంలో ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. ఆయన బాల్యం అంతా ఆసిఫాబాద్‌లోనే జరిగినా అక్కడ 7వ తరగతి వరకు మాత్రమే ఉండడంతో హై స్కూల్‌ విద్యాభ్యాసం వరంగల్‌లో, అనంతరం విద్యాభ్యాసం ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది.

ఆసిఫాబాద్‌ కోర్టులో న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ఆయన 1911వ సం||లో ప్రారంభించాడు. నిజాం పరిపాలనలో గోండు ప్రాంతంలో ప్రజలు నానా అగచాట్లు పడుతున్న సమయమది. ఆసిఫాబాద్‌ ప్రాంతంలో భూములన్నీ ఎగుడు దిగుడుగా ఉండి సాగుకు అనువుగా ఉండేవి కాదు. వ్యవసాయ యోగ్యంగా ఉన్న భూములు కూడా చాలా తక్కువ. వర్షాధార పంటలే ఎక్కువ వేసే వారు. కరువు కాటకాలు చాలా మామూలు విషయం. అటవీ సంపదమీదనే ప్రజలంతా ఎక్కువగా ఆధారపడేవారు. అక్కడి షావుకార్లు ‘గోండులు కొలామ్‌’ల నుండి అటవీ సంపదను చాలా తక్కువ (అగ్గువ) ధరకు కొని లాభాలు గడించేవారు ఇందులో బీడీ ఆకులు, మంచె తడకలు, టేకు దుంగలు, తపిసి బంక, పత్తి, చారపలుకులు లాంటి ఎన్నో అటవీ సంపదలు ఉండేవి. చుట్టుప్రక్కల 240 గ్రామాల ప్రజలకి ఏ వస్తువుకావాలన్నా ఆసిఫాబాద్‌ వరకు రావాల్సి వచ్చేది. ఎంత జిల్లా కేంద్రమైనా రవాణా సదుపాయం సరిగ్గా లేకపోవడంతో ఈ ప్రాంతం అభివృద్ధిలో బాగా వెనుకబడి పోయింది.

మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండటంతో మరాఠి సంస్క ృతి కూడా ఇక్కడి వారిపై ఎక్కువగా ఉంది. అందుకే రాంచందర్‌రావుని అంతా ఆత్మీయంగా ‘పైకాజీ’ అని సంభోదించేవారు. న్యాయవాద వృత్తిని స్వీకరించిన పైకాజీలో చిన్ననాటి నుండే స్వతంత్ర భావాలతో, దేశం పట్ల అభిమానం, సమాజం పట్ల ప్రత్యేక దృక్ఫథం కలిగిన వ్యక్తి. స్థానిక పరిస్థితులు క్రమంగా ఆయనలోని ఆ భావాలు బలీయమైన శక్తులుగా బలపడేలా చేశాయి. ప్రజలమీద అధికారుల ఆరాచకాలు, దౌర్జన్యాలని ఆయన సహించేవారు కాదు. అధికార్లకు ఎదురుతిరిగేవాడు. పైకాజీ కుటుంబం స్థానికంగా బలమైన సామాజిక నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతోనూ ఆ ప్రాంతంలోని అనేక గ్రామాలపై వారికి వతన్‌దారీ హక్కులు ఉండటంతో కొంతమంది అవినీతి అధికార్లు వారిని ఏమీ చేయలేక మిన్నకుండేవారు.

కొంతకాలానికి ఈ ప్రాంతంలో రజాకార్ల అరాచకాలు క్రమంగా మితిమీరటంతో వారి దౌర్జన్యాలని ఎదుర్కోవడానికి అన్ని వర్గాలకు చెందిన స్థానిక యువకులతో ఆయన ఏర్పాటు చేసిన రక్షక దళాలు రాత్రిళ్ళు గస్తీలు కాసేవి. ఇదే రీతిన చుట్టుప్రక్కల గ్రామాలైన ఘోడవల్లి, బూరుగుగూడా, ఖమానా, వాంకిడి, నవగాం తదితర గ్రామాల్లో కూడా రక్షక దళాలు ఏర్పాటు జరిగి ఆ దళాలు రజాకార్లని వీరోచితంగా ఎదుర్కోవటంతో రజాకార్లకు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో వారి నాయకుడు ‘భక్తావర్‌ఖాన్‌’కి పైకాజీపై తెలియని కసి ఏర్పడింది. ఆ కసి క్రమంగా ‘పైకాజీ’ని తుద ముట్టిస్తే తప్ప ఈ ప్రాంతంలో తన ఆధిపత్యానికి ఎదురు ఉండదని భావించి తాండూర్‌ – కొత్తపేట, కేరమేరి తదితర చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి సుమారు 250 మంది రజాకార్లు ఒకేసారి ఆసిఫాబాద్‌ మీద దాడి చేశారు. ఈ పథకాన్ని ముందే గ్రహించిన పైకాజీ స్థానికులందర్నీ హెచ్చరించి పసిపిల్లలను, ఆడవాళ్ళను, యువకుల సహాయంతో ఆసిఫాబాద్‌కు 5 కి.మీ. దూరంలోని ‘గుండి’ గ్రామానికి తరలించాడు. 3 రోజులపాటు ‘గుండి’ గ్రామంలోనే వేయిమంది ప్రజలు తలదాచుకున్నారు. అందరికీ భోజనాది వసతుల్ని కల్పించి రక్షణ ఏర్పాటు చేసింది పైకాజీనే. ఆ 3 రోజులపాటు ఆసిఫాబాద్‌లో రజాకార్ల దోపిడీ యధేచ్చగా సాగింది. వారిని అడ్డుకునేవారే లేకపోయారు. ఇండ్లలో ఉన్న ముసలి ముతకా జరిగే భీభత్సాలని మౌన ప్రేక్షకుల్లా చూస్తున్నారు తప్ప ఏం చేయలేకపోయారు. ‘పైకాజీ’ మళ్ళీ తప్పించుకున్నాడన్న కోపంతో వారు మరింతగా రెచ్చిపోయారు. గ్రామాల్ని తగలపెట్టడాలు, స్త్రీల మీద అత్యాచారాలు, దోపిడీలు చాలా ఎక్కువ అయ్యాయి. ఈ స్థితిలో గ్రామాల్లో రక్షక దళాలు రజాకార్లను ధీటుగా ఎదుర్కోవడం జరిగేది అప్పుడప్పుడూ పై నుంచి ఆదేశాలు రావటం, దాంతో రక్షక దళాల్లోని యువకులపై అక్రమ కేసులు బనాయించటం ఆ కేసులని ‘పైకాజీ’ ధీటుగా వాదించి యువకులకు బెయిలు ఇప్పించి బయటికి తీసుకురావటం నిత్యకృత్యంగా మారిపోయేది. ఇదే సమయంలో 1940 ప్రాంతంలో క్రమంగా బాబేఘరి పోరాటం ప్రారంభమైంది. న్యాయమైన హక్కులకోసం, భూమి మీద పట్టుకోసం ‘కొమురం భీము’ నాయకత్వంలో గోండులు, కొలాంలు ఏకమై నిజాం అధికారుల ఆకృత్యాలకు వ్యతిరేకంగా విజృంబించారు. వారందరి మీద అక్రమకేసులు బనాయించబడ్డాయి. అందులో చాలా కేసులని రాంచందర్‌రావు పైకాజీ వాదించాడు. చివరికి ‘కొమురం భీము’ తరఫున వకాల్తా చేసింది పైకాజీనే.

నిజాం ప్రభువును కలవటానికి కొమురం భీముని హైదరాబాద్‌ పంపించింది కూడా పైకాజీయే. ఆసిఫాబాద్‌ ప్రాంతంలో గిరిజనులమీద జరుగుతున్న అకృత్యాలను వెలుగులోకి తేవడానికి ఆయన చాలామందికి సమాచారం ఇచ్చేవారు. కొమురం భీముకు బుద్ధి చెప్పాలనుకున్న అవినీతి అధికార్లకు, రజాకార్లకు ఇది ఇబ్బందిగా మారింది. ఈ కేసులు నడుస్తున్న సమయంలోనే భక్తావర్‌ ఖాన్‌ బృందం పైకాజీపై కోర్టులోనే హత్యాప్రయత్నం చేసింది. తల్వార్‌తో పఠాన్‌ పైకాజీ మెడపై వేటు వేయబోయాడు. అదే సమయంలో ఆయన కిందికి వంగడంతో పెద్ద ప్రమాదం తప్పటం, ఆయన అరుపులతో పఠాన్ల బృందం కోర్టు నుంచి పారిపోవటం క్షణాల్లో జరిగిపోయింది. ఈ ఘటన 1940 ప్రాంతంలో జరిగింది. నాటినుండి వందల సంవత్సరాల చరిత్ర కలిగిన బాలేశ్వర స్వామి దేవాలయంలో ‘గండదీపం’ వెలిగించటం ప్రారంభమైంది. ఆ దీపం నాటి నుండీ నేటికీ వెలుగుతూనే ఉంది. కేశవనాథస్వామి రథోత్సవం కూడా అప్పటి నుండే ప్రారంభమైంది.

1934 ప్రాంతంలో ఆసిఫాబాద్‌లో మొత్తం హరిజన గూడెం కాలి బూడిద అయింది. ఆ సంఘటనకు కారణం రజాకార్ల దుశ్చర్య అని చెబుతారు. సుమారు 120 మంది హరిజనులకు ఇంటికి బస్తా జొన్నలు, వారికి కావాల్సిన వంట సరుకులతోపాటు వంద రూపాయలు ఇవ్వటమే కాక గుడిసెలు వేసుకోవటానికి స్థలాన్ని కూడా పైకాజ్‌ీ ఇచ్చాడు. ఆర్తులకు ఇలాంటి దానాలు ఎన్నో చేసిన దానశీలి పైకాజీ. అందుకే ఆయన్ని పేదసాదలు ఆసిఫాబాద్‌, సిర్పూర్‌, చెన్నూర్‌, లక్షెట్టిపేట తాలూకాల్లో అమితంగా అభిమానించేవారు. 1936 ప్రాంతంలో చాందాలో జరిగిన గాంధీజీ సభకు ఆయన హాజరయ్యాడు. గాంధీజీ మాటలతో ఆయన తీవ్రంగా ప్రభావం చెంది ఆసిఫాబాద్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌కు బలమైన క్యాడర్‌ను తయారు చేశాడు. ఈ ప్రాంతాన్ని కాంగ్రెస్‌కు కంచుకోటగా తయారు చేసాడు.

1948వ సం||లో నిజాం రాష్ట్రం ఇండియన్‌ యూనియన్‌లో విలీనమైంది. 1948 సెప్టెంబర్‌ 14వ తేదీన ఇండియన్‌ ఆర్మీ చాందావైపు నుండి ఆసిఫాబాద్‌ వైపు రాసాగింది. రజాకార్లు ‘బుజ్జిర్‌ఘాట్‌’ బ్రిడ్జిని పేల్చివేసి భారతసేనలు ఇటువైపు రాకుండా తీవ్ర అడ్డంకులు కల్పించారు. పైకాజీ నాయకత్వంలో యువకులు, రజాకార్ల చర్యలను తిప్పికొట్టి ఇండియన్‌ ఆర్మీకి స్వాగతం పలికారు. రజాకార్లు తోక ముడిచి పారిపోయారు. ప్రజలంతా గొప్ప సంబరాలు చేసుకున్నారు. 1952వ సం||లో మొదటిసారిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బలమైన కాంగ్రెస్‌ నాయకుడు పైకాజీకి ఆసిఫాబాద్‌ టిక్కెట్‌ ఇవ్వకుండా ఆదిలాబాద్‌ నియోజకవర్గాన్ని ఆయనకు కేటాయించారు. దీంతో ఈ ప్రాంతంలోని ఆయన అభిమానులు ఎంతగానో నిరాశ చెందారు. సి.పి.ఐ.పార్టీకి చెందిన దాజి శంకర్‌ ఆదిలాబాద్‌ స్థానికుడు కావడంతో ఆయనకు విజయం దక్కింది. దీనికి కారణం కాంగ్రెస్‌లోని ఒక గ్రూపు అని చెప్తారు. పైకాజీ రాజకీయంగా ఎదగటం వారికి ముప్పుగా భావించి ఇలా చేసారని అంటారు. అప్పటి నుండి రాజకీయాలంటే ఆయనకి విముఖత ఏర్పడింది. కానీ కాంగ్రెస్‌లోనే ఆయన తుదిశ్వాస వరకూ కొనసాగారు.

1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో తన 80 సంవత్సరాల వయస్సులో కూడా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. డా|| మర్రి చెన్నారెడ్డి, జె.ఈశ్వరీబాయి, మల్లికార్జున్‌, మదన్‌మోహన్‌లతో పాటు జిల్లాలోని అనేకమంది నాయకులు ఆయన్ని తమ గురువుగా భావించేవారు. ఈ ప్రాంతంలో ఆయన్ని ‘గాంధీ’గా ఆరాధించి జనం పూజించేవారు. ప్రతి 15 ఆగష్టుకు, 26 జనవరికి గాంధీచౌక్‌లో ఆయన ఉపన్యాసాలు వినడానికి జనం తండోపతండాలుగా వచ్చేవారు. ఆయన చేసిన దానాలకు లెక్కేలేదు. కుల మతాలకు అతీతంగా ఆయన అందరినీ ఆదరంగా చేరదీసేవాడు.

అందుకే ఆయన అజాత శత్రువుగా, అంతా భావించేవారు. ఆయన భార్య రంగుబాయి భర్తకు తగిన ఇల్లాలు. ముగ్గురు కూతుర్లు, తారాబాయి, శకుంతలాబాయి, శశికళాబాయి. 3వ కూతురు శశికళ కుమారుడు రమేష్‌బాబును ఆయన దత్తతస్వీకారం చేసాడు. మంథెన, అచ్చలాపూర్‌ అగ్రహారాలలో ఆయన పలుసార్లు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాడు. 1973 అక్టోబర్‌ 10వ తేదీన తన 87 సంవత్సరాల వయస్సులో ఈ ‘ఆదిలాబాద్‌ గాంధీ’ తుది శ్వాస తీసుకున్నాడు. జీవించినన్నాళ్ళూ పేద ప్రజల సేవే శ్వాసగా భావించి, గిరిజనుల ప్రగతే లక్ష్యంగా భావించి తెలంగాణ రాష్ట్రం కోసం కలలుగన్న రాంచందర్‌ రావు పైకాజీ నిజమైన తెలంగాణ త్యాగధనుడు.

Other Updates