tsmagazineమామిడాల రాము
సరిగ్గా 30 ఏళ్ల క్రితం సిద్ధిపేట నియోజకవర్గం ఒక మహా ఉద్యమ చైతన్యానికి వేదికగా నిలిచింది. అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆనాడు ఓ గొప్ప పిలుపునిచ్చారు. 1992 నుంచి 1994 సంవత్సరాల మధ్య కాలంలో ప్రతి ఇంట్లో కరెంటు పొయ్యిలు, వాటర్‌ హీటర్లను విచ్చల విడిగా వాడేవారు. దీంతో విద్యుత్‌ సరఫరాలో లో ఓల్టేజీ సమస్యలు ఉత్పన్నమై ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పరిస్థితులను గమనించిన కేసీఆర్‌ స్పందించి, ప్రతి ఒక్కరూ వాటర్‌ హీటర్లు, కరెంటు పొయ్యిలు బంద్‌ చేయాలని.. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని పిలుపు ఇచ్చారు.

కేసీఆర్‌ పిలుపుతో స్పందించిన సిద్ధిపేట నియోజక వర్గం.. సిద్ధిపేట, చిన్నకోడూర్‌, నంగునూరు మండలాలలోని గ్రామాల వారీగా ఏకతాటిపై కొచ్చింది. ప్రతి ఇంట్లో వాటర్‌ హీటర్లు, మోటార్లను గ్రామ చావిడిల వద్దకు తీసుకొచ్చి కాల్చివేశారు.

ఇదే తరహాలో సిద్ధిపేట నియోజక వర్గంలోని గ్రామాల్లో మరోసారి ఓ చైత్యనం వచ్చింది. నిరంతరం 24 గంటల విద్యుత్‌ సరఫరాతో ఆటోమేటిక్‌ స్టార్టర్లు లోడ్‌ ఎత్తుకోక పోవడం (మోటారు స్టార్ట్‌ కాకపోవడం-బావి, బోర్‌ మోటారు) తలెత్తుతున్న సమస్యను ఇబ్బందులను గుర్తించి ఓల్టేజీ సమస్యను అధిగమించాలని ఆటో మేటిక్‌ స్టార్టర్లపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు ప్రత్యేక దష్టి పెట్టారు. విద్యుత్‌ను ఆదా చేయడమే లక్ష్యంగా నాడు కరెంటు పొయ్యిలు, వాటర్‌ హీటర్లు.. ఎలాగైతే వద్దన్నారో.. అదే స్పూర్తితో నేడు ఆటో మేటిక్‌ స్టార్టర్లపై యుద్ధం ప్రకటించారు. ఈ మహా క్రతువుకు కె.సి.ఆర్‌. స్పూర్తిగా ఆటో మేటిక్‌ స్టార్టర్ల తొలగింపుపై సమర శంఖం పూరించారు. తెలంగాణ ఉద్య మంలో ఒక్కొక్క గ్రామం తీర్మానాలు చేసి ఉద్యమానికి ఊపిరి పోసిన తరహాలోనే సిద్ధిపేట నియోజక వర్గమే కాదు.. జిల్లా ప్రజలంతా చైతన్య బాటలో పయనిస్తామని ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్‌ రావు ఆశయానికి సిద్ధిపేట నియోజకవర్గమే కాదు, జిల్లా ప్రజలు జైకొట్టారు. మంత్రి పిలుపు మేరకు ఆటోమేటిక్‌ స్టార్టర్ల వాడకం మేం చేయమంటూ నడుం బిగించి వాటిని మీ ముందే తొలగిస్తున్నామని సాక్షాత్తూ సభా వేదిక ముందు ఆటో మేటిక్‌ స్టార్టర్లు మాకొద్దంటూ విద్యుత్‌ శాఖకు అప్పగించారు.

ఇద్దరిదీ ఒకటే లక్ష్యం.. విద్యుత్‌ ఆదా చేయడమే.. మూడు దశాబ్దాల కథను.. మళ్లీ పునరావతం చేసిన ఇదే స్పూర్తి.. ఇదే ఆలోచన.. నియోజక వర్గంతో పాటు సిద్ధిపేట జిల్లా ప్రజల్లో చైతన్యం కలిగించింది.

ముందుగా సిద్ధ్దిపేట నియోజకవర్గ పరిధిలో రైతులను చైతన్యం చేసే బాధ్యతను మంత్రి రైతు సమన్వయ సమితికి అప్పగించారు. ఒక దశలో ప్రభుత్వ పక్షాన జిల్లా స్థాయి అవగాహన సమావేశం నిర్వహించింది. 24 గంటల విద్యుత్‌ సరఫరా కోసం ఆటోమేటిక్‌ స్టార్టర్ల తొలగింపు ప్రధాన లక్ష్యంగా ప్రక్రియ చేపట్టింది. ప్రజల సహకారంతో ముందుకు సాగాలని జిల్లా అధికారులు, వ్యవసాయ, విద్యుత్‌ యంత్రాంగం పక్కా ప్రణాళికలు చేపట్టారు. సిద్ధిపేట జిల్లాలో విద్యుత్‌ శాఖ రికార్డ్స్‌ ప్రకారం 1.36 లక్షల విద్యుత్‌ వ్యవసాయ కనెక్షన్లు ఉండగా, వీటిలో 1.20 లక్షల వరకు ఆటోమేటిక్‌ స్టార్టర్లను వాడుతున్నారు. వీటిని పూర్తి స్థాయిలో తొలగించి ఆటోమేటిక్‌ స్టార్టర్లు లేని జిల్లాగా మార్చాలని లక్ష్యాన్ని ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యమ తరహాలో పల్లెల్లో ఏకగ్రీవంగా తీర్మానాలు మొదలయ్యాయి. మొదటగా బంజేరు పల్లి గ్రామం, ఆ తర్వాత ఇర్కోడ్‌, ఎల్లుపల్లి, ఇబ్రహీంపూర్‌, జక్కాపూర్‌, గుర్రాలగొంది, మైసంపల్లి.. ఇలా పలెల్లన్నీ కదులుతున్నాయి.

మోటార్లకు ఆటో స్టార్టర్లు తొలగించాలని.. భూగర్భజలాల పెంపుకు కషి చేయాలని ప్రభుత్వ అధికార యంత్రాంగం, విద్యుత్‌ అధికారులతో కలిసి రైతులకు చక్కటి అవగాహన కల్పించారు. రాష్ట్రం మొత్తం వ్యవసాయానికి 24 గంటల కరెంటు అందిస్తున్నందున ఆటో స్టార్టర్లను బంద్‌ చేయిస్తే, అందరికీ కావాల్సినంత నీరందుతుందని ప్రభుత్వం భావించిందని సిద్ధిపేటలో నిర్వహించిన సదస్సులో జిల్లా కలెక్టర్‌ పి.వెంకట్రామ రెడ్డి తెలిపారు. తెలంగాణ విద్యుత్‌ సరఫరా తీరులో ఎన్నో అనూహ్యమైన మార్పులు జరిగాయని, ఈ ప్రాంతంలో విద్యుత్‌ ఉప కేంద్రాల పెంపుతో ఆధునీకరణ పనులు, లైన్ల విస్తరణ పనులతో అందరికీ మెరుగైన విద్యుత్‌ అందుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ సవివరంగా వివరించారు.
tsmagazine

 

వీరితో పాటు టీఎస్‌ఎస్పీ డీసీఎల్‌ సీఎండీ రఘుమా రెడ్డి, సంచాలకులు శ్రీనివాస్‌ రెడ్డి, విద్యుత్‌ శాఖ అధికారులు సదాశివ రెడ్డి, కరుణా కర్‌ బాబు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్‌ ఆటో స్టార్టర్‌ వాడకం వద్దని రైతులకు అవగాహన కల్పించారు. మొదట్లో రైతులు 150-200 ఫీట్ల లోపే నీళ్లు పడటంతో అంతే లోతులో బోర్లు వేసుకున్నారు. కానీ ఇటీవలి కాలంలో భూగర్భ జలాల మట్టం తగ్గిపోవడంతో 700 ఫీట్ల వరకు బోర్లు వేసుకున్నారు. ఇప్పుడు 24 గంటల కరెంటు ఇవ్వడం వల్ల ఎక్కువ ఫీట్లు ఉన్న బోర్లకు ఎక్కువ నీరు అంది, తక్కువ లోతున్న బోర్లకు నీరుండటం లేదు. దీంతో ఎక్కువ సంఖ్యలో ఉన్న తక్కువ లోతు బోర్లున్న రైతులు ఆందోళన చెందుతున్నా రు. గతంలో రోజుకు కొన్నిగంటల చొప్పున మాత్రమే కరెంటు రావడం తో చాలామంది రైతులు ఆటో స్టార్టర్లు పెట్టుకున్నారు. అవి కరెంటు ఉన్నప్పుడు పనిచేసి, లేనప్పుడు ఆగిపోయేవి. రైతు పొలం దగ్గర ఉండాల్సిన పనిలేదు. కానీ 24 గంటల కరెంటు వల్ల బోర్లు కూడా 24 గంటలు పనిచేస్తున్నాయి. పంటకు అవసరానికి మించి నీళ్లు అందడం కూడా ప్రమాదకర మే. రైతులు దగ్గరుండి మోటార్లు ఆన్‌ ఆఫ్‌ చేయాల్సి వస్తున్నది. అందుకే పగ టిపూట రోజుకు రెండు షిఫ్టుల్లో కరెంటు ఇవ్వడమే మేలన్నది రైతుల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలు. ఈ క్రమంలో ఎన్నో ఏండ్లుగా తెలంగాణ రైతన్న కరెంటు కోసం ఎన్నో కష్టాలు పడ్డాడని, కరెంటులేక నష్టపోయాడని., అలాంటి రైతు ఎప్పుడు కావాలంటే అప్పుడు కరెంటు అందుబాటులో ఉంటే తన వెసులుబాటును బట్టి నీళ్లు పారించుకుంటాడన్నది సర్కారుసంకల్పం. ఇందుకు అనుగుణంగా విద్యుత్తు రంగంలో సాధించిన ప్రగతి రైతుకు అందాలన్నది ప్రభుత్వ సమాలోచన. అందుకే 24 గంటల కరెంటు అందివ్వడంతో పాటు వ్యవసాయానికి 24 గంటల కరెంటు అందిన తర్వాత ఆటో స్టార్టర్లను బంద్‌ చేయిస్తే, అందరికీ కావాల్సినంత నీరందుతుందని ప్రభుత్వం భావించినట్లు సదస్సులో రైతులకు వివరించారు.

ఆటో స్టార్టర్‌ వాడకం వద్దని
మంత్రి హరీశ్‌ రావు పిలుపు..

రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన కరెంటు ఇస్తున్నం. ఇక ముందు కూడా 24 గంటలపాటు కరెంటు ఇస్తం. రాత్రింబవళ్ళు నీళ్లను తోడితే.. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. పంట చివరి దశలో రైతన్నలు ఆగమవ్వొద్దు. ఇందు కోసం ఆచితూచి నీళ్లను పొదుపుగా వాడుకోవాలి. ఆటో మేటిక్‌ స్టార్టర్‌ వినియోగం వల్ల నీటి వథా అధికం అవుతున్నది. రైతుల మేలు కోసం తీసుకున్న నిర్ణయంపై అన్నదాతలు దష్టి పెట్టి అందరూ కలిసి కట్టుగా స్వాగతించాలి.

ఆటో స్టార్టర్‌ నిలిపివేయాలహో..
ఊరూరా చాటింపు.!

ఆటో మేటిక్‌ స్టార్టర్లతో ప్రమాదం పొంచి ఉన్నదని తెలిసి సిద్ధిపేట జిల్లా పల్లెలోని రైతన్నలో కదలిక వచ్చింది. గ్రామాల వారీగా ఆటో మేటిక్‌ స్టార్టర్లు తొలగిస్తామని స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. గ్రామస్తులంతా ఒకే మాటకు కట్టుబడి ఉండాలని ”ఆటో స్టార్టర్‌ నిలిపివేయాలహో..” అంటూ ఊరూరా చాటింపులు చేస్తున్నారు. ఇదే వరుసలో గజ్వేల్‌, దుబ్బాక, హుస్నాబాద్‌, జనగామ నియోజక వర్గ రైతులు ఈ విషయంపై చర్చించి ఆటో స్టార్టర్‌ వద్దంటూ తీర్మానాలు చేసి ఊరూరా తొలగింపు కార్యక్రమాలు చేపడుతున్నారు.
– సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌ పి.వెంకట్రామరెడ్డి

Other Updates