– రమణా రెడ్డి


ఆలోచనల రూపాంతరం ప్రజ్వలించే జ్యోతిగా, మానవతకు మార్గదర్శకమై, తమ ఉనికిని, ఆకాంక్షను, ఆత్మగౌరవాన్ని చాటుకొని వందలాది త్యాగమూర్తుల బలిదానాల చరిత్ర భావితరాలకు ఆదర్శంగా నిలవాలి అని మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆకాంక్ష. మలిదశ సబ్బండ వర్ణాల తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నుండి ఆవిర్భవించిన మహానాయకుడు ఆయన. నేడు మనం సగౌరవంగా తెలంగాణ గడ్డపై తలెత్తుకొని ఇది నా తెలంగాణ అని అనగలుగుతున్నామంటే అది ఆయన త్యాగ ఫలితమే. ఆయన ఆలోచనల ప్రతిబింబమే ఈ తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం.

తెలంగాణ ఆవిర్భవించిన తొలి సంవత్సరంలోనే చేయాల్సిన మహాత్కార్యాలలో అమర వీరుల స్మృతి చిహ్నం ప్రధానమైనది. దానికి గాను తమ తమ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ముందు ఉంచడం జరిగింది. పరిశీలనకు వచ్చిన డిజైన్స్‌ ఏవీ సంతృప్తిదాయకంగా ఆయనకు అనిపించలేదు. ఎందరో త్యాగధనుల ఆకాంక్షలలో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం వారిని గొప్పగా తలుచుకోవాలనేది తన ఆలోచన. స్మారకం ఏదైనా ‘వస్తు’ ప్రాధాన్యత కన్నా ‘విషయ’ ప్రాధాన్యత ఉన్న అంశం. గన్‌ పార్క్‌ లో ఉన్న తొలి దశ తెలంగాణ ఉద్యమ చిహ్నం, తెలంగాణ దేవతామూర్తులైన సమ్మక్క – సారలమ్మలు ఇందుకు నిదర్శనం.


మలిదశ ఉద్యమం సాధించిన తెలంగాణ చరిత్ర భావితరాలకు నిక్షిప్తమై మార్గదర్శకం కావాలి. కనీ, వినీ ఎరుగని అద్భుతంగా నిర్మించాలి. ఈ ఆలోచనల ప్రతిబింబమే తెలంగాణ స్మారక స్మృతి చిహ్నం. ఇక్కడ మనం వేసే ప్రతి అడుగు నివాళి అర్పించాలి. ఇది ఒక నిక్షిప్త చరిత్ర, ఒక స్ఫూర్తి, ఒక దివ్యదష్టి. మన ముఖ్యమంత్రి ఆలోచనలో ఎంతత్వరగా నిర్మించాము అనేదానికంటే ఎంత గొప్పగా నిర్మించాము అనేది ముఖ్యం. తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ఒక చారిత్రక కట్టడం, అద్భుత అర్కిటెక్చర్‌ కానుందని ధృడంగా నమ్ముతున్నాం. ఇది తెలంగాణ చరిత్రను భావితరాలకు, ప్రపంచ పర్యాటకులకు అవగాహన చేసే మ్యూజియం. ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి వ్యక్తి మనసు ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అనే పులకరింతతో నినదించాలి.

లుంబిని పార్క్‌ లోని దాదాపు నాలుగు ఎకరాల స్థలంలో నిర్మించే ఈ కట్టడం ప్రధాన ప్రవేశద్వారం బోట్స్‌ క్లబ్‌ మార్గంగుండా, నిష్క్రమణ ద్వారం లుంబిని పార్క్‌ ప్రవేశద్వారం ప్రక్కన ఉంటుంది. ఏడు అంతస్తుల ఈ కట్టడం, నూటయాభై అడుగుల ఎత్తు, వంద అడుగుల వెడల్పుతో స్టెయిన్లెస్‌ స్టీల్‌ లోహంతో నిర్మించబడుతుంది. ఎనభై ఐదువేల చదరపు అడుగుల మ్యూజియం ప్రధాన కట్టడంలో ఇరవై ఐదు వేల చదరపు అడుగుల స్థలాన్ని మ్యూజియంకుగాను కేటాయించడం జరిగింది. దాదాపు నాలుగువేల చదరపు అడుగుల టెర్రస్‌ గార్డెన్లో అద్భుతమైన వృక్షాలను ప్రతిష్టించే అవకాశం ఉంటుంది. మిగతా ప్రదేశాన్ని అత్యవసర అవసరాలైన కన్వెన్షన్‌, ఆఫీస్‌ రూమ్స్‌, స్టోర్రూమ్‌, రీసెర్చ్‌ హాల్‌, టాయిలెట్లకు గాను కేటాయించడం జరిగింది. రెండు సెల్లార్‌ అంతస్తులలో రెండు లక్షల చదరపు అడుగుల స్థలం ఉంది. ఇందులో నాలుగు వందల కార్లు, అయిదువందల ద్విచక్ర వాహనాలు పార్క్‌ చేసుకొనే సదుపాయం కల్పించబడింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే ఈ కట్టడంలో వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల సందర్శనార్థం ప్రత్యేక అవసరాలను డిజైన్‌ చేయడం జరిగింది. వీల్‌ఛైర్‌, స్ట్రోలర్‌ నడుపుకునే విధంగా మార్గాలు ఉంటాయి. లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ఇతర ప్రత్యేక ద్వారాలు నిర్మించబడనున్నాయి.


ప్రధాన కట్టడం మధ్యభాగంలో పొడవాటి మ్యూజికల్‌ వాటర్‌ ఫౌంటైన్‌ ఉంటుంది. దానిపై ముప్పై అడుగుల కాంస్య మరియు స్టీల్‌తో తయారుచేసిన స్తూపం నిర్మించబడుతుంది. దారి పొడువునా మౌనాన్ని, ప్రశాంతత, నివాళిని అర్పించే శిల్పాలు ఉంటాయి. ప్రధాన కట్టడమైన దీపాకృతిలోకి ప్రవేశించిన వెంటనే మ్యూజియం ఉంటుంది. ఇది రెండు భాగాలుగా అంటే ఒకవైపు చిత్ర మరియు ఛాయాచిత్ర ప్రదర్శనకు గాను, ఇంకొక వైపు శ్రవణ మరియు దృశ్య చిత్ర ప్రదర్శనకు గాను కేటాయించడం జరిగింది. ఇక్కడ తెలంగాణ చరిత్ర ప్రతిబింబించే అంశాలు ఉంటాయి. ఇక్కడినుండి పై అంతస్తు వెళ్ళడానికి ఎస్కలేటర్లు ఉన్నాయి. ఈ అంతస్తు పూర్తిగా కన్వెన్షన్‌ హాలుకోసం కేటాయించడం జరిగింది. ఈ అంతస్తులో దాదాపు ఏడువందల మందికి పైగా కూర్చోగలిగే హాల్‌ ఉంటుంది. అమరుల సంస్మరణార్థం ఈ అంతస్తు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. ఆ పైభాగంలో టెర్రస్‌ గార్డెన్‌ ఉంటుంది. ఇక్కడినుండి దీపాకృతి ప్రారంభమవుతుంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక స్టేజి నిర్మించడం జరిగింది. ఈ స్టేజి పైనుండి చుట్టూ చూడగలిగే ఏర్పాటు ఉంది. సందర్శకులు సేద తీర్చుకోవడంతోపాటు పిల్లలు, వృద్ధుల అవసరాలకుగాను చిన్న రెస్టారెంట్‌ ఏర్పాటు చేయబడుతుంది. ఇక్కడ చిన్నపాటి తినుబండారాలతోపాటు టీ, కాఫీ, మంచినీరు లభిస్తుంది. రెస్టారెంట్‌ పైన ఉన్న అంతుస్తులో వ్యూపాయింట్‌ ఉంటుంది.

1991 నుండి ప్రవాస భారతీయుడిగా (ముఖ్యంగా జర్మనీ దేశంలో) ఉన్న నేను 2007 సంవత్సరంలో మాతృదేశానికి తిరిగిరావడం జరిగింది. ఈ సమయంలో విస్తృతంగా ప్రపంచ దేశాలను సందర్శించడం జరిగింది. ఈ సమయంలో అక్కడ ఉన్న ఆర్టు గ్యాలరీలు మరియు మ్యూజియంలు సందర్శించడం జరిగింది. ఆ అనుభవమే నేడు ఎలాంటి సమస్యనైనా కళాత్మకంగా పరిష్కరించే అనుభవాన్ని నేర్పింది. 2007లో జర్మనీ నుండి తిరిగి వచ్చిన నేను జిఎమ్మార్‌ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణంలో ఆర్ట్‌ కన్సల్టెంట్‌గా పనిచేయడం జరిగింది. ఎన్నో ప్రయోగాత్మక ఆర్ట్‌ ఎగ్జిహిబిషన్స్‌ ఏర్పాటు చేయడం జరిగింది.

2009లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. కవులు, రచయితలు, గాయకులు, విద్యార్థులు, సబ్బండ వర్ణాలు ఉద్యమంలో భాగమైతున్న సమయం. అంతటి క్లిష్ట సమయంలో కళాకారుల స్తబ్ధత నిజాయితీ కాదనే ఉద్దేశంతో నావంతు పాత్రగా ఉద్యమానికి మద్దతుగా రాష్ట్రవ్యాపితంగా ఎన్నో కళాశిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది.

ఉద్యమానికి సంబంధించిన వందలాది పోస్టర్లు, లోగోలు, బుక్‌ కవర్‌ డిజైన్లు రూపొందించడం జరిగింది. నాడు ముఖ్యమంత్రి స్వయాన నా కళా ప్రతిభను చూడడం, అనేకసార్లు అభినందించడం జరిగింది.

Other Updates