2018-19 రాష్ట్ర బడ్జెట్‌ రూ. 1,74,453.84 కోట్లు

tsmagazineసాగునీటి ప్రాజెక్టులు, పంటల పెట్టుబడి పథకానికి అధిక నిధులు కేటాయించడం, తదితర కేటాయింపుల ద్వారా 2018-19 రాష్ట్ర బడ్జెట్‌లో అన్నదాతలకు ప్రభుత్వం అగ్రస్థానం కల్పించింది. రైతన్నను ఆదుకొనేందుకు దేశంలోనే ఎక్కడా లేనివిధంగా , రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పంటల పెట్టుబడి పథకానికి రూ, 12,000 కోట్లు కేటాయించటం విశేషం.దీనికి తోడు రైతు కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు రైతుబీమా పథకం అమలుచేస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం బడ్జెట్‌ లో రూ.500 కోట్లు కేటాయించింది.

రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి ఈటల రాజేందర్‌ తెలంగాణ రాష్ట్రంలో వరుసగా అయిదవసారి మార్చి 15న శాసన సభలో బడ్జెట్‌ ను ప్రవేశపెట్టారు. శాసన మండలిలో డిప్యూటీ సి.ఎం కడియం శ్రీహరి బడ్జెట్‌ ను ప్రవేశపెట్టారు. 2018-19 సంవత్సరానికి మొత్తం బడ్జెట్‌ రూ. 1,74,453.84 కోట్లుగా ప్రతిపాదిం చారు. దీనిలో రెవెన్యూ వ్యయం రూ. 1,25,454.70 కోట్లుగా, క్యాపిటల్‌ వ్యయం రూ. 33,369.10 కోట్లుగా ఉంది. దీనిలో ప్రగతి పద్దు క్రింద రూ. 1, 04, 757.90 కోట్లు, నిర్వహణ పద్దు రూ. 69,695.94 కోట్లుగా ప్రతిపాదించారు.

2018-19లో మొత్తం రెవెన్యూ రాబడులు రూ,1,30,975 కోట్లుగా అంచనావేశారు. అందులో రాష్ట్ర స్వంత ఆదాయం రూ.73,751.88 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావల్సిన నిధులు రూ. 29,041.88 కోట్లుగా అంచనా.2018-19 సంవత్సరంలో రెవెన్యూ మిగులు రూ. 5520.41 కోట్లు, ద్రవ్యలోటు రూ. 29,077.07 కోట్లు ఉండగలదని అంచనావేశారు. ద్రవ్యలోటు రాష్ట్ర జి.డి.పిలో 3.45 శాతం.

పంట పెట్టుబడి పథకానికి రూ. 12,000 కోట్లు

రాష్ట్ర అభివృద్ధిలో వ్యవసాయరంగ అభివృద్ధి కీలకమైంది. వ్యవసాయ రంగానికి పునరుజ్జీవం కల్పించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత కల్పించింది.

రైతులకు తక్షణ తోడ్పాటు అందించేందుకు మొదట పంటరుణాలను మాఫీచేసింది. 35,29,944 మంది రైతులకు చెందిన 16,124 కోట్ల రూపాయల రుణాలను ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించి రైతులను రుణ విముక్తులను చేసింది.

సాగునీరు, పెట్టుబడి, గిట్టుబాటు ధరలను ప్రభుత్వం సమకూర్చినప్పుడే రైతుల కష్టాలు తీరుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఒక వైపు సాగునీటి ప్రాజెక్టులను శరవేగంతో పూర్తిచేస్తూనే, మరోవైపు పెట్టుబడి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వమే రైతుకు నేరుగా పంటకు అవసరమైన పెట్టుబడిని అందించే, దేశానికే ఆదర్శవంతమైన వినూత్న నిర్ణయాన్ని తీసుకుంది. 2018-19 ఏడాదినుంచి ఎకరానికి 4,000 రూపాయల వంతున రెండుపంటలకోసం రెండువిడతల్లో ప్రతి రైతుకు మొత్తం 8,000 రూపాయలు ప్రభుత్వం అందిస్తోంది. పునాస పంట పెట్టుబడిని ఏప్రిల్‌ నుంచి, యాసంగి పంట పెట్టుబడిని నవంబర్‌ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పంపిణీ చేయనుంది. ఈ పథకం కోసం ఈ బడ్జెట్‌ లో 12,000 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు.

రైతు బీమా పథకానికి రూ. 500 కోట్లు

రాష్ట్ర వ్యవసాయ రంగంలో ఎక్కువమంది చిన్న, సన్నకారు రైతులే. ఈ రైతుల బాధలు వర్ణనాతీతం. ఒక్క సంవత్సరం పంట రాకపోతేనే ఆ రైతు కుటుంబం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటోంది.అటువంటిది, ఆ కుటుంబ పెద్ద అయిన రైతు మరణిస్తే ఒక్కసారిగా ఆ కుటుంబ పరిస్థితి తల్లక్రిందులవుతుంది. భార్యాపిల్లల భవిష్యత్తు అగమ్యగోచరం అవుతున్నది.కనీస భరోసా లేకుండా పోతోంది. అనుకోని పరిస్థితుల వల్ల అటువంటి కష్టం వస్తే , ఆ రైతుకుటుంబం అకస్మాత్తుగా రోడ్డున పడకూడదని ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ సంకల్పం. ఆ కుటుంబానికి బాసటగా నిలవాలన్న ఆశయంతో రూపుదిద్దుకున్న పథకమే రైతు బీమా పథకం. రాష్ట్రంలోని రైతులందరికీ ఈ పథకం క్రింద రూ. 5 లక్షల బీమాసదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. రైతు బీమా పథకం కోసం ఈ బడ్జెట్‌ లో రూ. 500 కోట్లు ప్రతిపాదించారు.

  • వీటితోపాటుగా, వ్యవసాయ యాంత్రీకరణకు ప్రోత్సాహం రూ. 522 కోట్లు
  • మైక్రో ఇరిగేషన్‌ ప్రోత్సాహానికి రూ. 127 కోట్లు
  • పాలీ హౌజ్‌, గ్రీన్‌ హౌజ్‌ వ్యవసాయానికి రూ. 120 కోట్లు
  • మార్కెటింగ్‌ శాఖ విస్తరణ, అభివృద్ధికి రూ. 132 కోట్లు
  • వ్యవసాయం, మార్కెట్‌ రంగాలకు మొత్తం ఈ బడ్జెలో రూ. 15,780 కోట్లు
  • సాగునీటి ప్రాజెక్టులకు రూ. 25,000 కోట్లు
  • రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. గోదావరి, కృష్ణా నదులపై 23 మేజర్‌, 13 మీడియం ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది.దశాబ్దాల తరబడి పెండింగ్‌ లో వున్న పాలమూరు ప్రాజెక్టును శరవేగంతో పూర్తిచేస్తోంది. ఇప్పటికే పాత పాలమూరు జిల్లాలోఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం జరిగింది. ఈ ఏడాది వర్షాకాలం పంటనాటికి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.

వలస జిల్లాగా పేరుపడిన పాలమూరు జిల్లాకు, ఫ్లోరైడ్‌ బాధిత పాత నల్గొండ జిల్లాకు , తీవ్ర దుర్భిక్షం ఎదుర్కొంటున్న పాత రంగారెడ్డి జిల్లాలోని బీడు భూములకు సాగునీరు అందించేందుకు శాశ్వత పరిష్కారంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా నిర్మిస్తున్నారు.

రికార్డు సమయంలో భక్త రామదాసు ఎత్తిపోతల పథ కాన్ని పూర్తిచేయడం జరిగింది. ఖమ్మం జిల్లాను సస్య శ్యామలం చేసేందుకు గోదావరి నదిపై తలపెట్టిన సీతా రామ ఎత్తిపోతల పథకం నిర్మాణం పురోగతిలో వుంది.

ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, వరంగల్‌ తో పాటు నల్లొండ జిల్లాకు వరప్రదాయినిగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొద్దినెలల వ్యవధి లోనే వాటర్‌ పంపింగ్‌ పాక్షికంగా ప్రారంభించ నున్నారు. మరో రెండేళ్ళలో రిజర్వాయర్లు, కాలువలతో సహా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయనున్నారు. ఈ ప్రాజెక్టుక్రింద 36.75 లక్షల ఎకరాలకు నీరు అందించ డానికి యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి.మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ కొనసాగుతోంది. మొదటి మూడు దశల్లో అధిక శాతం నీటినిల్వ సామర్ధ్యం కలిగిన ప్రధానమైన చెరువుల పునరుద్ధరణ పూర్తయింది. మిగతా పనులు పురోగతిలో వున్నాయి. ఈ ఏడాది నీటిపారుదల రంగానికి రూ. 25,000 కోట్లు ప్రతిపాదించారు.

ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి

ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి నిధులు ఖర్చుచేసే విషయంలో ప్రభుత్వం రెండు మంచి సంప్రదాయాలకు గత ఆర్థిక సంవత్సరం శ్రీకారం చుట్టింది. ఎస్సీ, ఎస్టీ వర్గాల జనాభా నిష్పత్తికి అనుగుణంగా ప్రత్యేక ప్రగతి నిధిని ఏర్పాటుచేసింది. ఈ నిధిలో ఒక ఏడాదికి కేటాయించిన నిధులు ఖర్చుకాకుంటే అవి మరుసటి ఏడాదికి బదలాయింపు జరిగేలా చట్టం చేసింది. ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాల పరిరక్షణకోసం ఇంతటి ఆదర్శవంతమైన చట్టం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదు. ఈ ఏడాది కూడా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక ప్రగతి నిధులను కేటాయించింది.ఈ బడ్జెట్‌లో షెడ్యూల్డ్‌ కులాల ప్రగతి నిధికి రూ.16,453 కోట్లు ప్రతిపాదించారు. షెడ్యూల్‌ తెగల ప్రగతి నిధికి రూ. 9,693 కోట్లు ప్రతిపాదించారు.

షెడ్యూల్డు కులాల సంక్షేమం

తెలంగాణ రాష్ట్రంలో 2011 జనాభాలెక్కల ప్రకారం షెడ్యూల్డు కులాల జనాభా 50,08,300. ఆనాటి రాష్ట్ర జనాభాలో వీరి శాతం 15.45 శాతం. షెడ్యూల్డు కులాలవారి విద్య, ఆర్థికాభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం పలు పథకాలు అమలుచేస్తోంది. రాష్ట్రంలో 675 వసతి గృహాల ద్వారా 55,576 మంది పిల్లలు లబ్ధిపొందుతున్నారు. 9, 10వ తరగతి పిల్లలకోసం ప్రత్యేక వసతి గృహాలు నిర్వహిస్తున్నారు.వీటిలో 17,373 మంది చదువుకుంటున్నారు. అర్హులైన షెడ్యూల్డు కులాల విద్యార్థులందరికి చదువుకొన్నంత వరకూ పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌ షిప్‌లు ఇవ్వడం జరుగుతుంది. దీనిద్వారా సంవత్సరానికి రెండున్నర లక్షల షెడ్యూల్డు కులాల విద్యార్థులకు లబ్ధి జరుగుతోంది. రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటివరకూ రూ. 1459 కోట్లు స్కాలర్‌ షిప్‌ లు ఇవ్వడం జరిగింది.

రాష్ట్ర సాంఘికసంక్షేమ గురుకులాలలో 1,12,088 మంది విద్యార్థులు చదువుతుంటే, అందులో ఎక్కువభాగం 75,727 మంది బాలికలు వున్నారు. అతి పేద కుటుంబాల నుంచి వచ్చిన ఈ పిల్లలు విద్యారంగంలోనేగాక, ఇతర రంగాలలో కూడా రాణిస్తూ పలు అవార్డులు అందుకుంటున్నారు. షెడ్యూల్డు కులాల శాఖకు ఈ బడ్జెట్‌ లో రూ. 12,709 కోట్లు ప్రతిపాదించారు.

ఎస్సీ యువత స్వయం ఉపాధి పొందేందుకు అమలుచేస్తున్న ఎకానమికల్‌ సపోర్ట్‌ స్కీమ్‌ లో సబ్సిడీలను ప్రభుత్వం గణనీయంగా పెంచింది.గత ప్రభుత్వ కాలంలో సబ్సిడీ గరిష్ట పరిమితి లక్ష రూపాయలుంటే , ఈ ప్రభుత్వం రూ. 5 లక్షలకు పెంచింది. ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తెలంగాణ స్టేట్‌ ప్రోగ్రాం ఫర్‌ రాపిడ్‌ ఇంకుబేషన్‌ ఆఫ్‌ దళిత్‌ ఎంటర్‌ ప్రెన్యూర్స్‌ అనే కొత్త కార్యక్రమాన్ని అమలుచేస్తోంది.

దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిరంతరంగా కొనసాగిస్తోంది. భూమి లభ్యతనుబట్టి కొనుగోలుచేసి, దళితులకు పంపిణీచేయడం జరుగుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 45 మాసాలలో 4,939 మంది దళితులకు 12,745 ఎకరాల భూమిని పంపిణీచేయం జరిగింది. ఈ పథకానికి ఈ బడ్జెట్‌ లో రూ. 1,469 కోట్లు ప్రతిపాదించడం జరిగింది.

షెడ్యూల్డు తెగల సంక్షేమం

2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డు తెగలవారి జనాభా 32.87 లక్షలుగా ఉంది. రాష్ట్రంలో 32 షెడ్యూల్డు తెగలు ఉండగా, అందులో నాలుగు తెగలు పి.వి.టి.జి లుగా పరిగణిస్తారు. రాష్ట్రప్రభుత్వం షెడ్యూల్డు తెగల సంక్షేమానికి పలు అభివృద్ధిపథకాలు అమలుచేస్తోంది.

షెడ్యూల్డు తెగల పిల్లల కోసం 319 ఆశ్రమ పాఠశాలలు, 149 వసతి గృహాలు, 1432 గిరిజన ప్రాథమిక పాఠశాలలు, 163 పోస్ట్‌ మెట్రిక్‌ వసతి

గృహాలు, 85 గురుకుల పాఠశాలలు, 29 మినీ గురుకులాలు, 33 గురుకుల జూనియర్‌ కాలేజీలు, 22 గురుకుల డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సంస్థలలో 2,06,428 మంది విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారు.

ఆర్థిక అభివృద్ధి పథకాల క్రింద వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది లబ్ధిదారులకు సహాయం చేయడం జరుగుతుంది. భూమి అభివృద్ధి పథకం క్రింద 5,000 మంది షెడ్యూల్డు తెగల లబ్ధిదారులకు సాగునీటివసతి కల్పించడం జరుగుతుంది. రాష్ట్రంలోని ఐ.టి.డి.ఎ ప్రాంతాలలోని 354 షెడ్యూల్డు తెగల గ్రామాలకు, 619 ఆవాసాలకు తారురోడ్లు వేయడానికి ప్రతిపాదించారు. గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలను ప్రభుత్వం గ్రామ పంచాయితీలుగా గుర్తించబోతున్నది. షెడ్యూల్డు తెగల శాఖకు ఈ బడ్జెట్‌ లో రూ. 8,063 కోట్లు ప్రతిపాదించారు.

బి.సిల సంక్షేమానికి రూ. 5,920 కోట్లు

రాష్ట్రజనాభాలో 52 శాతం ఉన్న వెనుకబడిన తరగతుల సర్వతోముఖాభి

వృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రంలోని 450 ప్రీమెట్రిక్‌ వసతి

గృహాలు, 250 కాలేజీ వసతిగృహాల ద్వారా 73,301 మంది విద్యార్థులు లబ్ధిపొందుతున్నారు. పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌ షిప్‌ పథకం క్రింద 7,58,093 మంది విద్యార్థులకు ట్యూషన్‌, మెయింటెనెన్స్‌ ఫీజు ఇవ్వడం జరుగుతోంది.ఈ పథకం క్రింద ఆర్థికంగా వెనుకబడిన 88,708 మంది విద్యార్థులకు కూడా ప్రయోజనం కలుగుతోంది.

మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల

విద్యాలయాల ఆధ్వర్యంలో 192 గురుకుల పాఠశాలలు, 19 గురుకుల కళాశాలలు, ఒక మహిళా డిగ్రీ కళాశాల, 40,075 మందికి అద్భుతమైన విద్య అందిస్తున్నారు. ఇందులో 119 గురుకుల పాఠశాలలు గత సంవత్సరం జూన్‌ 12న ఒకేరోజున ప్రారంభించబడి చరిత్ర సృష్టించాయి.

తమ వృత్తులద్వారా సమాజానికి సేవచేస్తున్న నాయీబ్రాహ్మణులు, రజకులు, మేదరి, వడ్డెర, విశ్వకర్మలు, గౌడ తదితర కులవృత్తుల వారందరికీ అవసరమైన ఆర్థిక సహకారం ఇచ్చి, పరికరాలు పంపిణీచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కనీసం గుర్తింపునకు కూడా నోచుకోకుండా, అత్యంత వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్న ఎం.బి.సి కులాల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుచేశారు. దీనికి ఈ ఏడాది బడ్జెట్‌ లో 1,000 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు.

వెనుకబడిన తరగతుల అభివృద్ధికి బడ్జెట్‌లో రూ. 5,920 కోట్లు ప్రతిపాదించారు.

మైనారిటీల సంక్షేమానికి రూ. 2,000 కోట్లు

తెలంగాణలో ఎస్సీ, ఎస్టీల లాగానే మైనారిటీలు కూడా పేదరికం అనుభవిస్తున్నారు.అందుకే, ఎస్సీ, ఎస్టీల సర్వతోముఖాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలన్నీ, మైనారిటీ లకూ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మైనారిటీ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ను బలోపేతం చేసింది. మైనారిటీల సంక్షేమానికి ప్రతీయేటా నిధులు పెంచుతోంది.

మైనారిటీల విద్యపై ప్రత్యేక శ్రద్ధపెట్టిన ప్రభుత్వం, గత నాలుగేళ్ళలో 206 గురుకుల విద్యాసంస్థలను ప్రారంభిం చింది. వీటిలో 47,818 మంది విద్యార్థులు నాణ్యమైన విద్య నేర్చుకుంటున్నారు. ఈ విద్యాసంస్థలకు బడ్జెట్‌లో రూ. 735 కోట్లు ప్రతిపాదించారు. ముస్లిం అనాథపిల్లలకు ఆశ్రయం ఇస్తున్న అనీస్‌ ఉల్‌ గుర్బాకు 4300 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. భవన నిర్మా ణానికి 20 కోట్లు కేటాయించారు.

మైనారిటీ యువతకు స్వయంఉపాధి పథకంలో సబ్సి డీని 50 నుంచి 80 శాతానికి ప్రభుత్వం పెంచింది. రంజా న్‌, క్రిస్‌ మస్‌ వేడుకలకు ప్రతీ సంవత్సరం 2 లక్షలమందికి కొత్త దుస్తులు పంపిణీ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 8,934 మంది ఇమామ్‌, మౌజమ్‌లకు రూ. 15,00 చొప్పున భృతి అందిస్తున్నది.

మైనారిటీ శాఖకు గత బడ్జెట్‌ లో రూ. 12,00 కోట్లు కేటాయించగా, ఈసారి దానిని గణనీయంగా పెంచి, రూ. 2,000 కోట్లుగా ప్రతిపాదించారు.

tsmagazineవేగంగా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు

నిరుపేదలు కూడా సౌకర్యవంతంగా వుండే ఇండ్లలో , ఆత్మగౌరవంతో జీవించాలనే సదుద్దేశ్యంతో ప్రారంభించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణం వేగం పుంజుకుంది. పేదలపై ఒక్కపైసాకూడా భారం పడకుండా మొత్తం ప్రభుత్వమే భరించి, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కట్టే పథకం ఒక్క తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కాడాలేదు.

రాష్ట్రవ్యాప్తంగా 2,72,763 ఇండ్లు మంజూరుచేయడం జరిగింది. ఇందులో 9,522 ఇండ్లు పూర్తయ్యాయి. 1,68,981 ఇండ్ల నిర్మాణం పురోగతిలో వుంది. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లకి 2018-19సంవత్సరానికి గాను బడ్జెట్‌ లో రూ.2,643 కోట్లు కేటాయించారు.ఈ పథకం అమలుకు ప్రభుత్వం నిధులు సమకూర్చడంతోపాటు వివిధ బ్యాంకులనుంచి, ఆర్థిక సంస్థల నుంచి రుణాలనుకూడా సమకూరుస్తోంది.

మెరుగైన ఆరోగ్యసేవలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం అమలుచేసిన సమగ్ర ప్రణాళికవల్ల ప్రజారోగ్య వ్యవస్థ ఎంతో మెరుగుపడింది. ప్రజారోగ్య వ్యవస్థను విస్తృత పరచడానికి, సౌకర్యాలను మెరుగుపరచడానికి అనేకచర్యలు తీసుకున్నది.ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు మొదలుకొని సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ వరకూ అన్ని ప్రభుత్వ వైద్యశాలలకు ప్రభుత్వం నేరుగా నిధులను అందిస్తోంది. మందుల కొనుగోలుకు నిధులు రెట్టింపుచేసింది. పాత బెడ్లు, బెడ్‌ షీట్లు, సెలైన్‌ స్టాండ్లు ఉండే హాస్పటళ్ల తీరును పూర్తిగా మార్చేసింది. కొత్తవి అందించింది.

రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రభుత్వ ఆస్పత్రులలో డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటుచేసి, ఉచితంగా డయాలసిస్‌ సేవలందిస్తున్నది. 22 ప్రభుత్వ ఆస్పత్రులలో ఐ.సి.యు.లను ఏర్పాటుచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 12 చోట్ల క్యాన్సర్‌ పరీక్షాకేంద్రాలు ఏర్పాటుచేసి, లక్షలాదిమందికి పరీక్షలు నిర్వహిస్తున్నది.

తక్షణ వైద్యం అందించడంకోసం హైదరాబాద్‌ నగరంలో ఎమర్జెన్సీ మోటారుసైకిల్‌ సేవలను ప్రారంభించింది.50 టీకా బండ్లను బస్తీల్లో తిప్పుతూ పేదపిల్లలకు వ్యాధినిరోధక టీకాలు వేయిస్తున్నారు.

రాష్ట్రంలో వైద్యవిద్యను మరింత అభివృద్ధిచేయడంకోసం కొత్తగా వైద్యకళాశాలలను ప్రభుత్వం నెలకొల్పుతోంది. మహబూబ్‌ నగర్‌, సిద్ధిపేట, నిజామాబాద్‌లలో ఇప్పటికే వైద్యకళాశాలలు మంజూరుచేయడం జరిగింది. కొత్తగా సూర్యాపేట, నల్లొండలో ఏర్పాటుచేస్తున్నారు.

గర్భవతులైన మహిళలకు ప్రత్యేక రక్షణ, అదనపు జాగ్రత్తలు, సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని అమలుచేస్తోంది. ఈ పథకం దేశంలో అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. గర్భిణీలు ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్ళడానికి, ప్రసవానంతరం క్షేమంగా తిరిగి ఇంటికి చేరడానికి ప్రత్యేక వాహన సదుపాయాన్ని ప్రభుత్వమే సమకూరుస్తోంది.102 అనే నంబరుకు ఫోన్‌ చేస్తే చాలు ప్రత్యేక సదుపాయాలు ఉన్న వాహనం గర్భిణీ ఇంటిముందుకు వస్తుంది. రాష్ట్రంలో 250 వాహనాలు అమ్మఒడి పథకం కోసం పనిచేస్తున్నాయి. ఈ పథకానికి ఈ బడ్జెట్‌ లో రూ. 561 కోట్లు కేటాయించారు.

tsmagazineకె.సి.ఆర్‌ కిట్‌ పథకం

సురక్షితమైన ప్రసవాల కోసం ప్రభుత్వ ఆస్పత్రులలో చేరేవారికి ప్రభుత్వం కే.సి.ఆర్‌ కిట్లను అందిస్తోంది.ఎంతోమంది పేద మహిళలు గర్భవతిగా వుండే సమయంలో కూడా బతుకుతెరువుకోసం పనిచేయవలసిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. గర్భవతిగా ఉన్న సమయంలో ఆ మహిళ కోల్పోయే ఆదాయాన్ని పూరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గర్భం దాల్చిన నాటినుంచి ప్రసవం జరిగి శిశువుకు 3 నెలల వయసు వచ్చేంతవరకూ మూడువిడతలలో ప్రతివిడతకు నాలుగు వేలరూపాయలవంతున మొత్తం 12,000 రూపాయలను ప్రభుత్వం అందిస్తోంది.ఆడపిల్లను కన్న తల్లికి అదనంగా మరో వెయ్యిరూపాయలు అందిస్తున్నది.

ప్రసవానంతరం తల్లీబిడ్డలకు అవసరమైన వస్తువులతో ప్రత్యేకమైన ఒక కిట్‌ ను కె.సి.ఆర్‌ కిట్‌ పేరుతో అందిస్తున్నది. 2017 జూన్‌ 2 నుంచి ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోంది. ఇప్పటివరకూ 8,26,143 మంది గర్భిణీలు తమ పేర్లు నమోదుచేసుకున్నారు. 1, 78,048 కిట్లు పంపిణీచేయడం జరిగింది. ఈ పథకం వల్ల ప్రభుత్వాసుపత్రులలో ప్రసవాల సంఖ్య రికార్డుస్థాయిలో పెరిగింది. గతంలో కంటే 51 శాతం డెలివరీలు పెరిగాయి. ప్రసవ సమయంలో ప్రతి వెయ్యి డెలివరీలలో శిశుమరణాల రేటు 39 నుంచి 31 కి తగ్గింది. ఈ పథకానికి దేశవిదేశాలకు చెందిన ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల నుంచి అవార్డులు, ప్రశంసలు వస్తున్నాయి.

వైద్యరంగం అభివృద్ధికి ఈ బడ్జెట్‌ లో రూ. 7,375 కోట్లు ప్రతిపాదించారు.

నిరుపేదలకు అందుబాటులో విద్యారంగం

విద్యారంగం అభివృద్ధి చెందితేనే పిల్లలకు సుస్థిర భవిష్యత్తు, సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో 41,337 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 58,66,786 మంది పిల్లలు చదువుకుంటున్నారు.

సర్వశిక్షా అభియాన్‌ పథకం క్రింద గత మూడేళ్ళలో పాఠశాలల్లో మౌలిక వసతులకోసం 44,588 పనులు చేపట్టి 38,182 పూర్తిచేయడం జరిగింది.391 కస్తూరిబా గాంధి బాలికా విద్యాలయాలలో 72,824 మంది బాలికలు చదువుకొంటున్నారు. ఈ విద్యాలయాలలో వసతులు మెరుగుపరచడానికి 92.30 కోట్లు ఖర్చుచేస్తున్నారు.

రాష్ట్రంలో 194 మోడల్‌ పాఠశాలలు వున్నాయి. ఈ పాఠశాలల్లో నమోదు ఏటా పెరుగుతోంది. మధ్యాహ్నభోజన పథకంక్రిందసన్నబియ్యం, వారానికి మూడురోజులు గుడ్లు, లేదా అరటిపండ్లు ఇవ్వడం జరుగుతోంది. ఈ బడ్జెట్‌లో పాఠశాల విద్యకోసం 10,830 కోట్లు ప్రతిపాదిస్తున్నారు.

ఉన్నత విద్య

రాష్ట్రంలో 404 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో వసతులు మెరుగు పరచడానికి ఇప్పటివరకూ రూ. 259 కోట్లు ఖర్చుచేశారు. సాంకేతిక విద్యాశాఖలో క్రొత్తగా 11 పాలిటెక్నిక్‌లు ప్రారంభించారు. వీటికి రూ. 95 కోట్లు ప్రతిపాదించారు.

రాష్ట్రంలో వున్న 131 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 10,634 మంది విద్యార్థులు చదువుతున్నారు.ఈ కళాశాలల్లో మౌలిక వసతులకోసం రూ. 247 కోట్లతో పనులు జరుగుతున్నాయి.

ఈ బడ్జెట్‌ లో ఉన్నతవిద్యారంగానికి రూ. 2, 448 కోట్లు ప్రతిపాదించారు.

రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలకు రూ. 2,823 కోట్లు

విద్యారంగాన్ని అభివృద్ధిచేసేందుకు ప్రభుత్వం కెజి నుంచి పిజి వరకూ

ఉచితవిద్యను అందించాలనే భృహత్తర విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.ఈ 45 నెలల కాలంలో ఈ విధానం అమలు దిశగా తొలి అడుగు వేసింది. బలహీనవర్గాల విద్యార్థులు విద్యాపరంగా అభివృద్ధిలోకి రావాలనే సత్సంకల్పంతో ప్రభుత్వం రెసిడెన్షియల్‌ విద్యావిధానాన్ని ప్రోత్సహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా విరివిగా రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలలు స్థాపించింది. తెలంగాణ రాష్చ్రం ఏర్పడిన తరువాత ఎస్సీలకోసం 104, ఎస్టీల కోసం 53, మైనారిటీల కోసం 192, బి.సిల కోసం 142, మొత్తం 491 కొత్త రెసిడెన్షియల్‌ పాఠశాలలు నెలకొల్పారు. వీటిలో కొన్నిసీట్ల కోటాను అగ్రవర్ణాలలోని పేదల పిల్లలకోసం కేటాయించడం జరిగింది. ఆడపిల్లల కోసం పెద్దఎత్తున రెసిడెన్షియల్‌ మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటుచేశారు. మొదటిదశలో ఎస్సీలకోసం 30, ఎస్టీలకోసం 22 ప్రారంభించారు.

రాష్ట్రంలోని రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో మొత్తం 2,70,135 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒక్కో విద్యార్థిపైనా సాలీనా లక్ష రూపాయలకుపైగా ప్రభుత్వం వ్యయపరుస్తోంది.

ఎస్సీ రెసిడెన్షియల్‌ సంస్థలకు రూ. 1,221 కోట్లు, ఎస్టీ రెసిడెన్షియల్‌ సంస్థలకు రూ. 401 కోట్లు, బి.సి రెసిడెన్షి యల్‌ సంస్థలకు రూ. 296 కోట్లు, మైనారిటీ రెసిడెన్షియల్‌ సంస్థలకు రూ.735 కోట్లు , గురుకుల విద్యాలయాలకు రూ. 170 కోట్లు కలిపి మొత్తంగా ఈ బడ్జెట్‌లో రెసిడెన్షి యల్‌ సంస్థలకి రూ. 2,823 కోట్లు ప్రతిపాదించారు.

మిషన్‌ భగీరథతో ఇంటింటికీ తాగునీరు

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ తాగునీటి అవసరాలు తీర్చేందుకు మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రభుత్వం అమలుచేస్తున్నది. ఈ పథకం ద్వారా శుద్ధిచేసిన నదీజలాలలను నల్లాల ద్వారా ప్రతీ ఇంటికీ ప్రతీ రోజు అందిస్తారు. మిషన్‌ భగీరథ పథకం మన దేశంలోనే ఒక

భృహత్తర తాగునీటి పథకంగా ప్రశంసలు పొందుతోంది. కృష్ణా, గోదావరి జలాల నుంచి శుద్ధిచేసిన 59.94 టి.ఎం.సి.ల నీటిని తెలంగాణలో ప్రతీ ఇంటికీ అందించ బోతున్రు. 1,69,705 కిలోమీటర్ల పైపులైన్‌ తో పల్లెలు, పట్టణాలలోని ప్రతి ఇంటికీ నీరుచేరుకుంటుంది. ఈ మిషన్‌ భగీరథ పథకం ఫలితాలు ఇప్పటికే 5,752 గ్రామీణ ఆవాసాలకు, 15 పట్టణాలకు, 2900 గ్రామాలలో ఇంటింటికీ చేరాయి. ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన నాటినుండి 4 సంవత్సరాల కాలంలోనే పూర్తిచేయడం గర్వకారణంగా వున్నదని ఆర్థిక మంత్రి ఈటల తన ప్రసంగంలో పేర్కొన్నారు.

మిషన్‌ భగీరథ పథకం కోసం ఈ బడ్జెట్‌లో రూ.1,801 కోట్లు ప్రతిపాదించారు. ఈ బడ్జెట్‌ నిధులే కాకుండా వివిధ బ్యాంకుల నుంచి, ఆర్థిక సంస్థల నుంచి నిధులను కూడా ఈ పథకానికి ప్రభుత్వం వినియోగిస్తోంది.

tsmagazineకాంతులీనుతున్న విద్యుత్‌ రంగం

విద్యుత్‌ రంగంలో తెలంగాణ ప్రభుత్వం అనూహ్యమైన ప్రగతిని సాధించింది. అనతికాలంలోనే అద్భుతాలను ఆవిష్కరించింది. చరిత్రలో తొలిసారి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయంతోపాటు, అన్ని రంగాలకు 24 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరాచేస్తున్నది. విద్యుత్‌ కోతలు అనే విషయాన్ని ఇప్పుడు ప్రజలంతా మరచిపోయారు. గత ప్రభుత్వంలో విద్యుత్‌

ఉంటేవార్త, ఈ ప్రభుత్వంలో కరెంటు పోతే వార్త అని ప్రజలు ప్రశంసిస్తున్నారు.

చరిత్రలో ఏనాడూ ఎరుగనంతటి 10 వేల మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌ ఏర్పడినా, డిమాండ్‌ లక్ష్యానికి తగిన స్థాయిలో విద్యుత్‌ సరఫరా చేయగలుగుతున్నాం. విద్యుత్‌ సరఫరాలో వచ్చిన అద్భుతమైన అభివృద్ధి రాష్ట్ర ప్రగతికి ఉత్తేజాన్నిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. పరిశ్రమలు పవర్‌ హాలీడేలు ప్రకటించిన దుస్థితి నుంచి బయటపడి రోజుకు మూడు షిఫ్టుల్లో పనిచేసి అధికోత్పత్తిని సాధిస్తున్నాయి.

సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉంది. రాష్ట్రం ఏర్పడేనాటికి కేవలం 31 మెగావాట్ల సౌర విద్యుత్‌ మాత్రమే అందుబాటులో ఉండేది. నేడు అది 3,283 మెగావాట్లకు చేరుకుంది. తెలంగాణను విద్యుత్‌ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా విద్యుత్‌ రంగానికి ఈ బడ్జెట్లో రూ. 5,650 కోట్లు ప్రతిపాదించింది.

దూసుకు పోతున్న ఐ.టి రంగం

సమాచార సాంకేతిక విజ్ఞానానికి పట్టుగొమ్మగా తెలంగాణ ప్రసిద్ధిపొందింది. రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఐ.టి విధానంతో ఎన్నో అగ్రశ్రేణిప్రపంచ ఐ.టి సంస్థలు తమ కార్యకలాపాలను హైదరాబాద్‌ కు విస్తరించాయి. గూగుల్‌, డిలాయిడ్‌, ఫేస్‌ బుక్‌, కాగ్నిజెంట్‌, ఒరాకిల్‌, ఆపిల్‌, సేల్స్‌ ఫోర్స్‌ , అడోబ్‌ వంటి దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌ నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వినూత్న తరహాలో స్థాపించిన టీ హబ్‌ ద్వారా దాదాపు 200 అంకుర సంస్థలు ప్రేరణ పొందాయి.

గ్లోబల్‌ ఎంట్రర్పెన్యూర్‌షిప్‌ -2017 లోచ్సిన వాగ్దానం మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న తెలంగాణ ప్రభుత్వం వి హబ్‌ను ఆవిష్కరించింది. వి హబ్‌ ప్రారంభ పెట్టుబడిగా రూ. 15 కోట్లు కేటాయించడం జరిగింది.

ఐ.టి ఎగుమతుల్లో మూడేళ్ళపాటు వరుసగా మన రాష్ట్రం జాతీయ సగటును మించింది. గత ఏడాది జాతీయ సగటు వృద్ధిశాతం 10 శాతమైతే, తెలంగాణ రాష్ట్రం 13.85 వృద్ధి శాతం సాధించింది.

రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలలో , గ్రామీణ ప్రాంతాలలో కూడా సాఫ్ట్‌వేర్‌ సంస్థలను, బి.పి.ఓ సంస్థల స్థాపనను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే జనగామ, కరీంనగర్‌, ఖమ్మంలలో కొన్ని సాఫ్ట్‌వేర్‌ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి.ఈ బడ్జెట్‌ లో ఐ.టి రంగానికి రూ. 289 కోట్లు ప్రతిపాదించారు.
tsmagazine

ఇతరముఖ్యమైన కేటాయింపులు

చేనేత, టెక్స్‌ టైల్‌ రంగానికి రూ. 1,200 కోట్లు

హోమ్‌ శాఖకు రూ. 5,790 కోట్లు

పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ. 1,286 కోట్లు

పౌరసరఫరాల రంగానికి రూ.2,946 కోట్లు

గ్రామీణ స్థానిక సంస్థల పరిపుష్ఠికి రూ.1,500 కోట్లు

పట్టణ స్థానిక సంస్థల పటిష్ఠతకు రూ. 1,000 కోట్లు

వరంగల్‌ లో మౌలిక సదుపాయాలకు రూ. 300కోట్లు

కార్పొరేషన్ల అభివృద్ధికి రూ.400 కోట్లు

యాదాద్రికి రూ.250 కోట్లు

వేములవాడ ఆలయానికి రూ.100 కోట్లు

భద్రాచలం ఆలయానికి రూ. 100కోట్లు

బాసర, ధర్మపురి ఆలయాలకు చెరి , రూ.50 కోట్లు

దేవాలయాల కామన్‌ గుడ్‌ ఫండ్‌ కు రూ. 50 కోట్లు

అర్చకుల వేతనాలకు ప్రభుత్వ సాయం రూ. 72 కోట్లు

కోళ్ళపరిశ్రమ అభివృద్ధికి రూ. 109 కోట్లు

ఆరోగ్యలక్ష్మి పథకానికి రూ. 298 కోట్లు

మహిళా శిశుసంక్షేమానికి మొత్తం రూ. 1,799 కోట్లు

బ్రాహ్మణుల సంక్షేమానికి రూ. 100 కోట్లు

జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 75 కోట్లు

అమ్మఒడి పథకానికి రూ. 561 కోట్లు

రవాణా, రోడ్లు, భవనాల శాఖకు రూ. 5,575 కోట్లు

పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధికి 15,563 కోట్లు

కొత్త కలెక్టరేట్లు, పోలీస్‌ భవనాలకు రూ. 500 కోట్లు

సాంస్క తిక రంగానికి రూ. 58 కోట్లు

Other Updates