తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని, విత్తన భాండాగారంగా తీర్చిదిద్దాలని, తాత్కాలిక ఉపశమనాలు కాకుండా , రైతు సమస్యల పరిష్కారానికి శాశ్వత ప్రాతిపదికపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న తరుణంలో రైతు ఆత్మహత్యలు అందరినీ కలవరపరుస్తున్నాయి.
వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో రైతు సమస్యలు ఎదుర్కోవడం మనకు కొత్తేమీ కాదు. చేతికొస్తోందనుకున్న పంట ప్రకృతి వైపరీత్యా వల్ల కళ్ళముందే నేలపాలు కావడం, వేసిన విత్తనాలు కల్తీవి కావడంతో సరిగా మొలకెత్తక పోవడం, మొలకెత్తినా ఆశించిన దిగుబడి రాకపోవడం, దిగుబడి వచ్చినా గిట్టుబాటు ధర లభించక పోవడం, అతివృష్టి, అనావృష్టి …ఇలా రైతు నష్టపోవడానికి సవాలక్ష కారణాలు. ముఖ్యంగా తెలంగాణలో వ్యవసాయం వర్షాధారం. కాకతీయు కాలం నుంచీ రైతులకు ఆదరువుగా వున్న గొలుసుకట్టు చెరువు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి పాలకుల నిర్లక్ష్యం వల్ల నిరుపయోగంగా మారిపోయాయి. కొన్ని ఆక్రమణలకు గురై నామరూపాలు లేకుండా పోయాయి. దీంతో చెరువుల్లో నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. భూగర్భ జలమట్టాలు పాతాళానికి చేరాయి. ఎన్ని బోర్లు వేసినా నీరు పడని దుస్థితి. బోర్లు వెయ్యడానికే తమ సర్వస్వం ధారబోసి దివాళాతీసిన రైతుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అదృష్టం బాగుండి నీరు పడినా వ్యవసాయ పంపుసెట్లకు అవసరమైన మేరకు విద్యుత్ సరఫరా అందలేదు.
మరోవంక కృష్ణా, గోదావరి నదులు తెలంగాణలో ప్రవహిస్తున్నా వాటి నీటిని సాగుకు యోగ్యంగా మలచే విస్తృత ప్రయత్నం ఏదీ చిత్తశుద్ధితో జరగలేదు. ఫలితంగా వ్యవసాయం కుంటుపడింది. రైతు బతుకు ఛిద్రమైంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి రైతు బతుకును మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు . ముందుగా అప్పు ఊబిలో కూరుకుపోయిన రైతన్నను బయటపడేసి, వారికి కొత్త రుణాలు అందిచే లక్ష్యంతో 17 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది. ఇందులో ఇప్పటికే రెండు విడతలుగా 8,500 కోట్ల రూపాయలను బ్యాంకులకు చెల్లించింది, మిగిలిన మొత్తాలకు బ్యాంకులకు హామీనిచ్చింది. గతంకన్నా భిన్నంగా విత్తనాలు, ఎరువులు రైతులకు సకాలంలో అందుబాటులో ఉంచింది. కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేసింది. మిషన్ కాకతీయతో గొలుసుకట్టు చెరువుకు పూర్వవైభవం సంతరించుకొంటోంది. 81 వేల కోట్ల రూపాయలతో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తిచేసేందుకు ప్రభుత్వం పథక రచన చేసింది. భారీ సబ్సిడీలపై వ్యవసాయ యంత్రాల సరఫరా, మార్కెట్లలో రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా ఈ-మార్కెటింగ్ విధానం, గిట్టుబాటు ధరలు లభించేవరకూ రైతులు తన పంటను నిల్వ ఉంచుకొనేందుకు వీలుగా పెద్దసంఖ్యలో గోదాముల నిర్మాణం వంటి ఎన్నో కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. పంట మార్పిడిని ప్రోత్సహిస్తోంది. భారీ సబ్సిడీలు అందిస్తోంది. ఇన్ని చేసినా, ఉమ్మడిపాలనలో వాటిల్లిన కష్ట నష్టాల నుంచి తేరుకొనక ముందే, ఈ ఏడాది జూన్ మాసంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు రైతులను కొంతమేరకు నిరుత్సాహానికి గురిచేశాయి.
అందుకే, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకొనేందుకు ఇప్పటివరకూ చెల్లిస్తూ వచ్చిన లక్షా 50 వేల రూపాయల పరిహార మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ. 6 లక్షలకు పెంచింది. మరణించిన రైతు కుటుంబాలలోని ఆడపిల్లలకు మతాలకు అతీతంగా కల్యాణలక్ష్మి పథకాన్ని అమలుచేస్తామని ప్రకటించింది. రైతు సమస్యలను ధైర్యంగా అధిగమించాలని, ప్రభుత్వం వారికి అన్నివిధాలా అండగా నిలుస్తుందని భరోసా నిచ్చింది.
రైతే దేశానికి వెన్నుముక, రైతే రాజు, జై కిసాన్… వంటి నినాదాలను ఆచరణలో చూపేందుకు, రైతుకు మేమున్నామంటూ గుండెధైర్యం ఇచ్చేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలసి ముందుకు రావాల్సిన తరుణమిది.