తెలంగాణ రాష్ట్రం యావత్ భారత దేశానికి దిక్సూచిగా నిలిచిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్‌లో ప్రారంభించారు. ధర్మరాజ్‌పల్లి గ్రామానికి చెందిన రైతులకు ముఖ్యమంత్రి పంట పెట్టుబడి మద్దతు, రైతుబంధు పథకం, కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను కరీంనగర్ జిల్లానుండి ప్రారంభించడం ద్వారా వందశాతం విజయాలను సాధిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 58 లక్షలమంది రైతులకు 12వేల కోట్ల పెట్టుబడిని అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ బ్యాంకులకు 6వేల కోట్లను అందజేశామని, బ్యాంకర్లు రైతులకు నగదు అందజేయడంలో ఇబ్బందులు కలిగించవద్దని ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటినుండి దేశంలో ఎక్కడాలేని విధంగా వినూత్న కార్యక్రమాలను అమలుచేస్తూ దేశంలోనే 20 శాతం సొంత రాబడి కలిగిన రాష్ట్రంగా గుర్తింపు పొందామన్నారు. అదే విధంగా క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ కింద 28 శాతం చేసే రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు. ప్రజల దీవెనలతో అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నామని సీఎం తెలిపారు.
గతంలో ఎన్నడూలేని విధంగా రికార్డుస్థాయిలో కేవలం వంద రోజుల్లో, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ రికార్డులను ప్రక్షాళన చేశామని అన్నారు. తద్వారా రాష్ట్రంలోని 2 కోట్ల 90 లక్షల ఎకరాల భూమిలో 2 కోట్ల 38 లక్షల ఎకరాల భూమిని వ్యవసాయ భూమిగా గుర్తించడం జరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. రైతుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచి వారికి అవసరమైన సహాయం అందించేందుకుగాను రాష్ట్రంలో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశామని తెలిపారు. సమన్వయ సమితి సభ్యులు పెట్టుబడి పథకం పంపిణీలో తమవంతు బాధ్యతలను నిర్వర్తించాలని సీఎం సూచించారు.
రాష్ట్రంలో జూన్ 2నుండి నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రారంభిస్తు న్నామని, ప్రస్తుతం ఉన్న 141 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలతోపాటు మండల తహశీల్దార్లకు రిజిస్ట్రేషన్ అధికారాలను కల్పించామని అన్నారు. నూతన రిజిస్ట్రేషన్ సంపూర్ణ వివరాలను ‘ధరణి’ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయని ప్రజలు వీటిని ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. అదేవిధంగా రైతులకు ఎటువంటి మార్టిగేజ్ లేకుండా, పాస్‌బుక్‌లు తీసుకోకుండా బ్యాంకర్లు పంట రుణాలు ఇచ్చే విధంగా జూన్ 2నుండి అమలులోకి తెస్తున్నట్లు సీఎం తెలిపారు. భవిష్యత్తులో పట్టాదారు పేరు మాత్రమే ఉంటుందని అనుభవదారుని పేరు ఉండదని ఆయన అన్నారు.
జాతీయ ఉపాధి హామీ పథకాన్నీ వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, అన్ని పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలని ప్రస్తుతం ఉన్న ధరలో 4వ వంతు పెంచాలని సీఎం అన్నారు.
రాష్ట్రంలోని కోటి ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు ఇప్పటికే వివిధ ప్రాజెక్టులను చేపట్టామని, కొన్ని ప్రాజెక్టులు పూర్తి అవడంతోపాటు మరికొన్ని నిర్మాణదశలో ఉన్నాయని అన్నారు. వరంగల్ జిల్లాకు దేవాదుల, ఖమ్మం జిల్లాకు సీతారామ ప్రాజెక్టుతోపాటు పాలమూరు, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులద్వారా సాగునీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు, అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ, ఎగువ మానేరు డ్యాం, మధ్యమానేరు డ్యాం, వరద కాలువలద్వారా కరీంనగర్ జిల్లా సస్యశ్యామలం అవుతూ ఇతర జిల్లాలకు సాగునీరు అందిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం పొరుగు రాష్ట్రాలతో సోదరభావంగా ఉంటూ ప్రాజెక్టుల ఒప్పందం చేసుకున్నామని, కేవలం ఒప్పదంతోనే ఆగకుండా సీడబ్ల్యూసీ ఆమోదం పొందినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రైతులతోపాటు గిరిజనులు, దళితులకు వందశాతం డ్రిప్ ఇరిగేషన్‌పై, చేనేత రంగానికి 50 శాతం సబ్సిడీ, మత్స్య కార్మికులకు సబ్సిడీపై వాహనాలు, మరబోట్లను అందిస్తున్నామని ఆయన అన్నారు. ఎన్నడూలేని విధంగా రైతాంగానికి 5 లక్షల బీమా సదుపాయం వర్తింపజేశామని, ప్రతి 5వేల ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారిని నియమించామని అన్నారు.
సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, 130 కోట్ల జనాభాగల భారతదేశంలో మైనార్టీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం 4వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తే మన రాష్ట్రం 2వేల కోట్లను కేటాయించిందని ముఖ్యమంత్రి తెలిపారు. త్వరలోనే అగ్రకులాల పేదలకు కూడా పథకాలను ప్రకటించి ప్రభుత్వం అండదండగా ఉంటుందని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేందుకు చేపట్టిన పనులు ముగింపు దశలో ఉన్నాయని త్వరలోనే మిషన్ భగీరథను కూడా ప్రారంభించుకోనున్నామని సీఎం తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంగా పటిష్ఠంగా విధుల నిర్వహణ ద్వారా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తొందని సీఎం తెలిపారు. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరిన మేరకుఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి 500 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సభాముఖంగా తెలిపారు.
రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ రైతుల ఆర్థికాభివృద్ధి గురించి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీసుకున్న పెట్టుబడి పథకం దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిందని అన్నారు.గత ప్రభుత్వాలు కేవలం మాటలకు పరిమితమై కాలయాపన చేశాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే రాష్ట్రంలో చేపడుతున్న పథకాల పరిశీలనకు వివిధ రాష్ట్రాలనుండి బృందాలు వస్తున్నాయని ఇది మన రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. యావత్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని, ప్రజల జీవితాల మార్పుకే సాధించుకున్న తెలంగాణ ప్రభుత్వం ప్రజాహిత కార్యక్రమాలతో అన్ని వర్గాల ప్రజల హృదయాల్లో చెదరని ముద్ర వేసుకుందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.జిల్లానుండి సివిల్స్‌కు ఎంపికైన చింతా కుమార్ గౌడ్, సాయినాథ్‌రెడ్డిలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ముఖ్యమంత్రి కార్యాలయపు ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, రెవిన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సీ పార్ధసారధి, భూ పరిపాలన విభాగపు డైరెక్టర్ వాకాటి కరుణ, వ్యవసాయ కమిషనర్ జగన్మోహన్, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్‌కుమార్, రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్, సంతోష్‌కుమార్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, శాసనమండలి సభ్యులు నారదాసు లక్ష్మణరావు, పాతూరి సుధాకర్‌రెడ్డి, ఐడీసీ ఛైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, జిల్లా పరిషత్ ఛైైర్‌పర్సన్ తుల ఉమ, శాసనసభ్యులు రసమయి బాలకిషన్, గంగుల కమలాకర్, దాసరి మనోహర్‌రెడ్డి, చెన్నమనేని రమేష్‌బాబు, వొడితెల సతీష్, బొడిగె శోభ, పుట్ట మధు, కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ కొండూరి రవీందర్ రావు, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ అక్బర్ హుస్సేన్, బీసీ సంక్షేమసంఘం సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.