magaరాష్ట్ర అవతరణోత్సవాలలో సి.ఎం కె.సి.ఆర్‌

తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులందరికీ హృదయపూర్వక నివాళులు సమర్పిస్తున్నాను. ఏ ఆశయం సిద్ధించాలని మనం మహోద్యమం నడిపించామో, సాధించుకున్న స్వరాష్ట్రంలో ఏయే స్వప్నాలు ఫలించాలని తపించామో… ఆ ఆశలు, ఆ ఆకాంక్షలు అన్నింటినీ నెరవేర్చుకునే దిశగా తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో పురోగమిస్తున్నది.

ఆదాయ వృద్ధిరేటులో అగ్రస్థానం

సకల వనరులతో శోభించే సుసంపన్నమైన ప్రాంతం మన తెలంగాణ. కానీ తెలంగాణకున్న ఆర్థిక ప్రతిపత్తి సమైక్య రాష్ట్రంలో మరుగున పడింది. తెలంగాణ రాష్ట్రం అవతరిస్తే దేశంలోనే ఒక ధనిక రాష్ట్రంగా విలసిల్లుతుందని నేను ఉద్యమ సమయంలోనే పదే పదే ప్రకటించాను. ఆనాటి నా మాటలు ఈనాడు అక్షరాలా నిజం అయ్యాయి. ఇటీవల కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ వెల్లడించిన నివేదిక ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో మన తెలంగాణ రాష్ట్రం 17.82 శాతం ఆదాయ వృద్ధిరేటుతో దేశంలోనే అగ్రగామిగా నిలవడం మనందరికీ గర్వకారణం. మన రాష్ట్ర అభివృద్ధికి శుభసూచకం. ఇది గడిచిన మూడు సంవత్సరాలలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన, ప్రణాళికాబద్ధమైన విధానాలవల్ల, మనం పాటించిన ఆర్థిక క్రమశిక్షణ వల్ల వచ్చిన ఫలితమని సగర్వంగా ప్రకటిస్తున్నాను.

ప్రజా సంక్షేమం

సంపదను సృష్టించడంలోనే కాకుండా, ఆ సంపదను సమానత్వం, సామాజిక న్యాయం ప్రాతిపదికలుగా ప్రజలకు పంపిణీ చేయడంలోనూ… అభివద్ధి ఫలితాలను అట్టడుగు వర్గాల ప్రజల దాకా చేర్చడంలోనూ మన రాష్ట్రం అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిందని తెలియచేయడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను.

రాష్ట్రావతరణ జరిగిన తర్వాత అతితక్కువ వ్యవధిలోనే తెలంగాణ ప్రభుత్వం సకల జనులకు సంక్షేమాన్ని పంచింది. పేద ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. 40వేల కోట్ల రూపాయలతో 35 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో సింహభాగాన్ని ప్రజాసంక్షేమానికే వెచ్చిస్తున్నది. 40 లక్షల మంది అసహాయులకు ఆసరా పెన్షన్లు అందిస్తున్నది. పేదింటి ఆడపిల్లల పెండ్లికోసం కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్‌ పథకం అమలు చేసుకుంటున్నాం. పేదలు కడుపునిండా అన్నం తినాలని ప్రతీ ఒక్కరికీ నెలకు ఆరుకిలోల బియ్యం అందించుకుంటున్నాం.

బడుగులు ఆత్మగౌరవంతో జీవించడానికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు నిర్మించబడుతున్నా యి. చదువుకునే పిల్లలందరికీ సన్నబియ్యం బువ్వ అందించబడుతున్నది. పేద విద్యార్థులకు అంత ర్జాతీయ ప్రమాణాలతో విద్యనందించేందుకు కొత్తగా 512 రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటు చేసు కున్నాం. ఎస్సీ మహిళల కోసం ప్రత్యేక రెసిడెన్షి యల్‌ డిగ్రీ కాలేజీలు నడుపుతున్నట్లే, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎస్టీ మహిళా రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీలు ప్రారంభిస్తున్నామనే సంతోషకరమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఎస్సీ, ఎస్టీల జనాభా శాతానికి అనుగుణంగా ప్రత్యేక ప్రగతినిధిని ఏర్పాటు చేసుకుని ఆయా వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేసుకుంటున్నాం. క్షేత్ర స్థాయిలో తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించి, వారి జీతాలు భారీగా పెంచుకున్నాం. స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ ఎవరూ చేయని విధంగా లాయర్లు, జర్నలిస్టుల సంక్షేమం కోసం బడ్జెట్లో నిధులు కేటాయించుకున్నామనే విషయాన్ని తెలియచేస్తున్నాను.

ఒంటరి మహిళలు.. కేసీఆర్‌ కిట్‌

పేద మహిళలకు ఉపయోగపడే మరో రెండు మానవీయ నిర్ణయాలను రాష్ట్ర అవతరణ ఉత్సవాలను పురస్కరించుకుని అమలు చేసుకోబోతున్నాం. తమకంటూ ఎవరూ తోడులేక కష్టాలు అనుభవిస్తున్న ఒంటరి మహిళలకు ప్రతీ నెలా వెయ్యి రూపాయల జీవన భతి ఎల్లుండి నుండి లభిస్తుంది. ఈ భృతి వారికి ఎంతో ఓదార్పునిస్తుందని ఆశిస్తున్నాను. మాతా శిశు సంరక్షణ కోసం ఉద్దేశించిన 15 వేల రూపాయల విలువైన ‘కేసీఆర్‌ కిట్‌’ అనే పథకం రేపటి నుంచి అమల్లోకి వస్తుంది. పేదరికం అనుభవిస్తున్న మహిళలు నెలలు నిండిన తర్వాత కూడా కుటుంబం గడవడం కోసం కూలీ పనులకు వెళ్తున్నారు. గర్భం దాల్చిన సమయంలో మహిళలకు మంచి ఆహారం, విశ్రాంతి అవసరం. అందుకే గర్భిణీ స్త్రీలు కూలీకి వెళ్లకుండా, ఇంటి పట్టునే ఉండి పోషకాహారం తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుని పండంటి బిడ్డలకు జన్మనివ్వాలనే తలంపుతో కేసీఆర్‌ కిట్స్‌ అనే పథకం ప్రారంభిస్తున్నాం.

ఈ పథకం ద్వారా గర్భిణీ దశలో స్త్రీలు కూలీ పనులకు వెళ్లలేక కోల్పోయే ఆదాయాన్ని ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. గర్భిణీ స్త్రీలకు మూడు విడతలుగా మొత్తం 12 వేల రూపాయలు అందుతాయి. వారు గనుక ఆడపిల్లకు జన్మనిస్తే ప్రోత్సాహకంగా ఆ తల్లికి మరో వెయ్యి రూపాయలు అదనంగా ప్రభుత్వం అందిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం పెరగాలని, తద్వారా బాలింత మరణాలు, శిశు మరణాలు సంభవించకుండా ఉండాలని, మరీ ముఖ్యంగా భ్రూణ హత్యలు నిరోధింపబడాలని ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఆశిస్తున్నది. ప్రసవానంతరం తల్లీ పిల్ల క్షేమంగా ఉండాలనే తలంపుతో, వారిరువురి సంరక్షణకు ఉపయోగపడే విధంగా 16 వస్తువులతో మదర్‌ అండ్‌ బేబీ కిట్‌ను ప్రభుత్వం అందజేస్తుంది. ఈ కిట్‌లో మూడు నెలల వరకు సరిపోయే విధంగా తల్లీ, బిడ్డలకు అవసరమైన బట్టలు, నాణ్యమైన బేబీ సోప్స్‌, బేబీ ఆయిల్‌, బేబీ పౌడర్‌, దోమతెర, ఆట వస్తువులు, నాప్కిన్స్‌, డైపర్స్‌ తదితర వస్తువులుంటా యి. ఇది మాతాశిశువులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆత్మీయమైన కానుక.

అభివృద్ధి.. మౌలిక సదుపాయాలు

సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ అనతికాలంలోనే అద్భుతమైన ఫలితాలు సాధించాం. విద్యుత్‌ రంగంలో ప్రభుత్వం సాధించిన అపూర్వమైన విజయమే ఇందుకు నిదర్శనం. రాష్ట్రావతరణ జరిగిన వెంటనే ప్రభుత్వం ముందున్న పెను సవాల్‌ తీవ్రమైన విద్యుత్‌ కొరత. ఈ సవాల్‌ను సమర్థవంతంగా అధిగమించాం. ఇవాళ విజయవంతంగా కోతల్లేని నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసే స్థితికి వచ్చాం. రాబోయే కాలంలో మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు కొత్త విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను నిర్మిస్తున్నాం. ఈ సంవత్సరం యాసంగి పంటకాలం నుండే రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ ఇవ్వడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది. ప్రభుత్వం చేస్తున్న కషి ఫలించి, రైతులు మూడు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న కరెంటు కష్టాలు తొలగిపోయేలా దీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

ప్రజల ఆరోగ్యం కాపాడాలనే సంకల్పంతో, ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి మిషన్‌ భగీరథ అనే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించాం. యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌ మాసాంతం వరకు నదీ జలాలు అన్ని గ్రామాలకు అందే అవకాశం ఉందని సంతోషంగా తెలియచేస్తున్నాను. ఈ పథకం పూర్తి చేసుకుంటే ప్రజలకు మంచినీటి కష్టాలు శాశ్వతంగా తీరుతాయి. ప్రజలకు మంచినీరు అందించే విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం అవుతుంది.

మరోవైపు రాష్ట్రం నలుమూలలా రహదారులన్నింటినీ చక్కగా తీర్చిదిద్దు తున్నాం. ప్రజలకు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా రవాణారంగాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేస్తున్నాం. పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన టిఎస్‌ ఐపాస్‌ చట్టం సత్ఫలితాలను సాధిస్తున్నది. పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’లో రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఐటి రంగంలో ప్రభుత్వం వినూత్న ఆలోచనలు చేస్తున్నది. దీంతో ఐటి రంగంలో పెట్టుబడులు, ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రంలో పచ్చదనం పెంచడం కోసం 230 కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యంతో చేపట్టిన తెలంగాణకు హరితహారం మూడో దశ కార్యక్రమం వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. తెలంగాణ ప్రజానీకమంతా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాలుపంచుకోవాల్సిందిగా పిలుపునిస్తున్నాను.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టి

గ్రామాల్లో ఉండే మానవ సంపదను సరిగ్గా వినియో గించుకుంటే మహత్తరమైన ఫలితాలను సాధించవచ్చు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయవచ్చుననే సమగ్ర దృక్పథంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రూపొం దించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలాధారమైన వ్యవసాయాన్ని అభివృద్ది చేస్తూ, ఆయా అనుబంధ వృత్తులకు ఆర్థిక ప్రేరణ అందించడం ద్వారా పల్లెలను ప్రగతిబాట పట్టించే సమగ్ర ప్రణాళికలు రూపొందిం చబడ్డాయి.

వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు శాస్త్రీయమైన పద్దతుల్లో, సమగ్రమైన విధానాలను ఇప్పటి వరకు ఎవరూ అవలంబించలేదు. రైతే రాజు అనే పడికట్టు పదాలు చెప్పడంతోనే సరిపుచ్చారు తప్ప, వ్యవసాయాన్ని సంస్కరించే దిశగా బలమైన ప్రయత్నాలేవీ చేయలేదు. సమైక్య రాష్ట్రంలో అమలైన వివక్షాపూరిత విధానాల వల్ల తెలంగాణ రైతాంగం మరింత తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా 35 లక్షల 30వేల మంది రైతుల 17వేల కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసింది. రాష్ట్రంలోని 46వేల చెరువులను పునరుద్ధరించుకునే మిషన్‌ కాకతీయ కార్యక్రమం ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నది. గడిచిన రెండు సంవత్సరాలలో 16వేల చెరువులను పునరుద్ధరించుకున్నాం. ఈ ఏడాది 5వేలకు పైగా చెరువుల్లో పనులు జరుగుతున్నాయి. మిషన్‌ కాకతీయ వల్ల బాగుపడ్డ చెరువులో జలకళ ఉట్టిపడుతున్నది. భూగర్భ జలాలు పెరిగాయి. ఈ పరిణామం గ్రామీణ వాతావరణంలో ఎంతో మార్పు తెచ్చింది.

గతంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు నానా అగచాట్లు పడేవారు. తెలంగాణ ప్రభుత్వం ముందుగానే ఎరువులు, విత్తనాలు సమీకరించుకుని రైతులకు అందుబాటులో ఉంచింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల కొరత లేదు. పాలీ హౌజ్‌, గ్రీన్‌ హౌజ్‌ కల్టివేషన్‌ ను ప్రోత్సహించడానికి పెద్ద ఎత్తన రాయితీలిస్తున్నాం. మైక్రో ఇరిగేషన్‌ లో ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, ఇతరులకు 90 శాతం సబ్సిడీలు కల్పిచాం. వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకో వడానికి పెద్ద ఎత్తున గోదాములు నిర్మించాం. తెలంగాణ వచ్చే నాటికి కేవలం 4లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన 179 గోదాములుంటే, కొత్తగా 17.07 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన 364 కొత్త గోదాములు నిర్మించుకుంటున్నాం. ఇప్పుడు తెలంగాణలో మొత్తం 22.5 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదా ములు అందుబాటులోకి వస్తున్నాయి. రైతులకు 50 శాతం సబ్సిడీపై వ్యవసాయ ట్రాక్టర్లు అందిస్తున్నాం. వ్యవసాయ ట్రాక్టర్లపై రవాణా పన్నును రద్దు చేశాం.

లాభసాటి వ్యవసాయం కోసం ప్రణాళికలు

వ్యవసాయం దండుగ కాదు, పండుగ అని నిరూపించడానికి ఇప్పటి దాకా తీసుకున్న చర్యలు మాత్రమే సరిపోవు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ప్రభుత్వం చాలా ఆలోచన చేసింది. వ్యవసాయ శాస్త్రవేత్తలతో, రైతులతో విస్తతంగా చర్చలు జరిపింది. నిర్థారించుకున్న పటిష్టమైన కార్యాచరణ అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

1. రైతాంగాన్ని సంఘటిత శక్తిగా మార్చడం…

2. ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి పుష్కలంగా సాగునీరు అందించడం…

3. నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడం…

4. ఎకరానికి 8వేల చొప్పున వ్యవసాయ పెట్టుబడి అందించడం…

5. రాష్ట్రం మొత్తాన్ని పంటల కాలనీలుగా విభజించడం…

6. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం…

ఈ ఆరు విషయాల్లో ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు రూపొందించింది.

వ్యవసాయ విస్తరణ

ఎవరు తయారు చేసిన వస్తువులకు వారే ధర నిర్ణయించగలుగుతున్నప్పటికీ, రైతులు పండించిన పంటలకు మాత్రం దళారులు ధర నిర్ణయిస్తున్నారు. రైతులు సంఘటితంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అసంఘటితంగా ఉన్న రైతులను సంఘటిత శక్తిగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వమే పూనుకున్నది. 5 వేల ఎకరాలకు ఒకరు చొప్పున అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ అధికారులను నియమించింది. వారిప్పుడు గ్రామాల్లో సర్వే చేస్తూ, భూముల వివరాలు, రైతుల వివరాలు నమోదు చేస్తున్నారు. సర్వే పూర్తయిన వెంటనే గ్రామంలోని రైతులందరూ సభ్యులుగా గ్రామ రైతు సంఘాలు ఏర్పాటవుతాయి. గ్రామ రైతు సంఘాల సమాహారంగా మండల రైతు సమాఖ్యలు.. మండల రైతు సమాఖ్యల సమాహారంగా జిల్లా రైతు సమాఖ్యలు.. జిల్లా రైతు సమాఖ్యల సమాహారంగా రాష్ట్ర రైతు సమాఖ్య ఏర్పాటవుతుంది. రైతాంగం అధిక దిగుబడులు సాధించడానికి అవలంబించవలసిన ఆధునిక వ్యవసాయ పద్ధతులను అందించడంలోనూ, పండించిన పంటకు గిట్టుబాటు ధర లభింపచేయడంలోనూ ఈ రైతు సంఘాలు విశేషంగా కృషి చేస్తాయి.

కొన్ని శక్తులు ప్రాజెక్టులను అడ్డుకునే దుష్ట ప్రయత్నాలు కొనసాగిస్తున్న ప్పటికీ… ప్రతీ ఏటా 25వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ కేటాయిస్తూ, వీలైనంత తొందరగా సాగునీరు అందించడానికి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వం ముమ్మరం చేస్తున్నది.

రైతులకు ఈ ఏడాది యాసంగి నుంచే 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎకరానికి నాలుగువేల చొప్పున రెండు పంటలకు కలిపి రైతులకు 8వేల రూపాయలు పెట్టుబడిగా అందించబోతున్నాం.

ఆయా జిల్లాలలో ఉండే వర్షపాతం, ఉష్ణోగ్రతలు, గాలివేగం, భూముల రకాలను బట్టే ఎక్కడ ఏ పంట వేస్తే అధిక దిగుబడి వస్తుందో ప్రభుత్వం గుర్తిస్తుంది. దాన్ని బట్టి రాష్ట్రం మొత్తాన్ని పంటల కాలనీలుగా విభజించడం జరుగుతుంది. దీని వల్ల రైతులంతా ఒకే పంట వేసి నష్టపోయే పరిస్థితి ఉత్పన్నం కాదు. పండిన పంటకు మార్కెటింగ్‌ సమస్య తలెత్తదు.

పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం కోసం రాష్ట్ర రైతు సమాఖ్యకు 500 కోట్ల రూపాయల నిధిని ప్రభుత్వం అందిస్తుంది. పంటల కొనుగోలు కోసం ఆ మూలధనాన్ని వినియోగించి, రైతులకు కనీస మద్దతు ధర రావడానికి రైతు సంఘాలు కృషి చేస్తాయి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు దేశంలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయని విధంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ఈ ప్రణాళికలో రైతులు నిబద్ధతతో భాగస్వాములు కావాలి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేశానికే ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ రైతులు కార్మోన్ముఖులు కావాలని ఆకాంక్షిస్తున్నాను.

వివిధ రంగాలలో.. గౌరవ పురస్కారాలు

సాహిత్యం: వెలపాటి రామారెడ్డి, ఆశారాజు,

జూపాక సుభద్ర, అస్లామ్‌ ఫార్శొరీ(ఉర్దూ).

శాస్త్రీయ నృత్యం: రాఘవరాజ్‌ భట్‌,

మంగళభట్‌, బీ.సుధీర్‌రావు.

పేరిణి నృత్యం: పేరిణికుమార్‌.

జానపదం: దురిశెట్టి రామయ్య, కేతావత్‌ సోమాలాల్‌, గడ్డం సమ్మయ్య.

సంగీతం: మాలిని రాజోల్కర్‌, వార్షి బ్రదర్స్‌.

సామాజిక సేవ: వందేమాతరం ఫౌండేషన్‌, యాకుబ్‌ బీ.

జర్నలిజం: ఓరుగంటి సతీష్‌(నమస్తే తెలంగాణ),

పీవీ శ్రీనివాస్‌(టీ న్యూస్‌), బిత్తిరి సత్తి, సావిత్రి (రవి-శివజ్యోతి) వి6, ఏ.రమణకుమార్‌ (జై తెలంగాణ టీవీ),ఎండీ మునీరొద్దీన్‌. అనిల్‌ కుమార్‌ (ఫోటో జర్నలిస్ట్‌), హెచ్‌.రమేష్‌బాబు (సినిమా జర్నలిస్ట్‌).

వైద్యులు: బీరప్ప(నిమ్స్‌), చారి (వెంకటా చారి)

ఉపాధ్యాయులు: ఏ.వేణుగోపాల్‌

(టీఎస్‌ఎంఎస్‌జేసీ) కరీంనగర్‌

అంగన్‌వాడీ టీచర్లు: ఎం.భిక్షపమ్మ.

ఉద్యమ గణం: కొడారి శ్రీను, వొల్లాల వాణి, అవునూరి కోమల, అభినయ శ్రీనివాస్‌.

చిత్ర లేఖనం: తోట వైకుంఠం

శిల్పకళ: శ్రీనివాస్‌రెడ్డి

శాస్త్రవేత్త: ఎస్‌.చంద్రశేఖర్‌ (ఐఐసీటీ డైరెక్టర్‌)

కామెంటరీ (యాంకరింగ్‌) : మడిపల్లి దక్షిణామూర్తి

అర్చకుడు: పురాణం నాగయ్యస్వామి,

కొక్కెర కిష్టయ్య (మేడారం)

ఆధ్యాత్మికవేత్త: సంత్‌శ్రీ సంగ్రామ్‌ మహారాజ్‌,

ఉమాపతి పద్మనాభ శర్మ, మహమ్మద్‌ ఖాజా షరీఫ్‌ షేక్‌ ఉల్‌ హాదీత్‌ మౌల్వీ, పెనుమల్ల ప్రవీణ్‌ ప్రభు సుధీర్‌ (బిషప్‌/ఫాదర్‌)

రంగస్థలం: దెంచనాల శ్రీనివాస్‌, వల్లంపట్ల నాగేశ్వర్‌రావు

క్రీడారంగం: తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్‌ (హకీంపేట), ఎండల సౌందర్య (హాకీ)

వేదపండితులు: నరేంద్ర కాప్రే

ఉత్తమ న్యాయవాది: జే. రాజేశ్వర్‌రావు

ఉత్తమ మున్సిపాలిటీ: సిద్ధిపేట

ఉత్తమ గ్రామ పంచాయతీ: శ్రీనివాస్‌ నగర్‌, మానకొండూరు

ఉత్తమ ఉద్యోగి: నేతి మురళీధర్‌ (ఎండీ, టీఎస్‌సీవోబీ), ఎన్‌. అంజిరెడ్డి (ఏఈఎస్‌)

ఉత్తమ రైతు: కండ్రె బాలాజీ (కెరమెరి),

స్పెషల్‌ కేటగిరీ: గడ్డం నర్సయ్య(ఈలపాట)

 

పోలీసు సేవా పతకాలు

మార్చ్‌పాస్ట్‌ బెటాలియన్లకు అవార్డులు:

మార్చ్‌పాస్ట్‌ బెటాలియన్లలో మొదటి బహుమతి 13వ బెటాలియన్‌, మంచిర్యాల (గుడిపేట), రెండవ బహుమతి సీఆర్‌ఐ క్వార్టర్స్‌, హైదరాబాద్‌ సిటీ, మూడవ బహుమతిని హర్యానాకు చెందిన బ్రాస్‌ బ్యాండ్‌ గెలుచుకున్నాయి.

ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీస్‌ పతకం 2016 : ఎం.రామకృష్ణ డీఎస్‌పీ, ఇంటలీజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌, పీ.వెంకటస్వామి హెడ్‌ కానిస్టేబుల్‌ టాస్క్‌ఫోర్స్‌ హైదరాబాద్‌.

ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీస్‌ పతకం 2017 : ఎన్‌.వెంకట శ్రీనివాస్‌, జాయింట్‌ డైరెక్టర్‌, ఏసీబీ హైదరాబాద్‌. మహమ్మద్‌ మొయినొద్దీన్‌, హెడ్‌కానిస్టేబుల్‌, మహబూబ్‌నగర్‌.

తెలంగాణ మహోన్నత సేవాపతకం 2016 : యూ.గౌరీశంకర్‌ రిటైర్ట్‌ ఏఆర్‌ ఎస్‌ఐ, హైదరాబాద్‌ సిటీ. సర్ఫ్‌రాజ్‌ అలీ ఏఏసీ/ఏఆర్‌ఎస్‌ఐ, గ్రేహౌండ్స్‌ హైదరాబాద్‌.

తెలంగాణ మహోన్నత సేవాపతకం 2017 : హెచ్‌.సత్యనారాయణ, కమాండెంట్‌ 10వ బెటాలియన్‌, టీఎస్‌ఎస్పీ, బీచుపల్లి. ఎం.కృష్ణ, ఏఎస్‌ఐ (స్పెషల్‌ ఇంటలిజన్స్‌ సెల్‌, హెడ్‌ క్వార్టర్స్‌, హైదరాబాద్‌). కేవీ రాంనర్సింహ్మారెడ్డి, సీఐడీ డీఎస్‌పీ, హైదరాబాద్‌.

కుల వృత్తులకు ప్రోత్సాహం

గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంతో పాటు ఇతర కులవృత్తులు చేసుకుని బతికే వారే ఎక్కువ సంఖ్యలోఉంటారు. కాల క్రమంలో వచ్చిన మార్పుల వల్ల కొన్ని కుల వత్తులు అంతరించిపోయాయి. కానీ కొన్ని కుల వృత్తుల అవసరం ఇంకా సమాజంలోఉన్నప్పటికీ తగిన ప్రోత్సాహం లేక వాటిని ఆధారం చేసుకుని బతికే వారి జీవితాల్లో చీకటి ఆవరించింది. ప్రభుత్వ పరంగా అలాంటి కుల వృత్తులకు, చేతి వృత్తులకు సహకారం అందించి, వారి జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకే వృత్తిదారుల సంక్షేమం, అభివృద్ధి కోసం భారతదేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా బడ్జెట్‌ కేటాయిం పులు చేసుకున్నాం. కొత్త కార్యక్రమాలను రూపొందించుకున్నాం.

గొర్రెల పెంపకంలో అపారమైన నైపుణ్యం కలిగిన గొల్ల, కుర్మలకు 75 శాతం భారీ సబ్సిడీతో గొర్రెల యూనిట్లను పంచే పథకం ఈనెలలోనే ప్రారంభం కాబోతున్నది. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా గొర్ల కాపరుల సొసైటీల సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతున్నది. సభ్యులందరికీ 21 గొర్ల చొప్పున అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి దశలో ఈ పథకం అమలు కోసం 5వేల కోట్ల భారీ వ్యయంతో 84 లక్షల గొర్లను అందించబోతున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నాను. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని యాదవ, కుర్మ సోదరులు 20వేల కోట్ల రూపాయల సంపద సృష్టించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పెద్ద ఎత్తున గొర్ల పెంపకం చేపట్టడం వల్ల మన రాష్ట్రంలో మాంసం అవసరాలు తీరడమే కాకుండా, ఇతర ప్రాంతాలకు మాంసం ఎగుమతి చేసే రాష్ట్రంగా తెలంగాణ మారుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తున్న నీటి వనరులను సాగునీటి కోసమే కాకుండా, చేపల పెంపకానికి కూడా వినియోగించి మత్స్యకారుల జీవితాలు మెరుగు పర్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

చేపల పెంపకానికి అవసరమయ్యే మొత్తం పెట్టుబడిని ప్రభుత్వమే భరించి, లాభాలను మాత్రం బెస్త, ముదిరాజ్‌ తదితర మత్స్యకారులకు అందించాలనే ప్రగతి కాముక దృక్పథంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చేనేత కార్మికులు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారం కోసం సమగ్ర చేనేత విధానాన్ని రూపొందించాం. వారికి అవసరమయ్యే నూలు, రసాయనాలను 50% సబ్సిడీ తో అందించాలని నిర్ణయించాం. చేనేత కార్మికులు నేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆదేశాలివ్వడం జరిగింది. ఈ నిర్ణయాలతో ప్రభుత్వం చేనేత కార్మికులలో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని నింపింది. నవీన క్షౌర శాలలు పెట్టుకునేందుకు నాయీ బ్రాహ్మణులకు లక్ష రూపాయల ఆర్ధిక సహకారాన్ని ప్రభుత్వం అందించబోతున్నది. రజకులకు బట్టలుతికే అధునాతన యంత్రాలను అందించబోతున్నది. విశ్వబ్రాహ్మణులకు వారివారి వృత్తులకు సంబంధించిన పరికరాలు అందించడంతో పాటు, అవసరమైన ఆర్థిక ప్రేరణను ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.

కల్లుగీత వృత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వమే రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది సంఖ్యలో ఈత, తాడిచెట్ల పెంపకం చేపట్టింది. అనివార్య పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ వత్తులకు మారాలనుకునే వారెవరికైనా తగిన ఆర్థిక తోడ్పాటును ప్రభుత్వం తరుఫున అందించబడుతుంది.

అత్యంత వెనుకబాటు తనాన్ని అనుభవిస్తున్న సంచార కులాలు, ఆశ్రిత కులాలు తదితర వర్గాల వారిని అన్ని రకాలుగా ఆదుకుని, అభివృద్ధి చేసేందుకు వెయ్యి కోట్ల బడ్జెట్‌ తో ఏర్పడిన ఎంబిసి కార్పొరేషన్‌, పలు పథకాలను రూపొందిస్తున్నదని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను.

సాగునీరు, తాగు నీరు, విద్యుత్‌, మౌలిక వసతులు, ప్రజా సంక్షేమ పథకాలన్నీ విజయవంతంగా అమలై రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్థిల్లేలా దీవించాలని భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నాను.

”అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలె పుడో” అని ఆర్ధ్రంగా పలికిన మహాకవి దాశరథి కవితా వాక్యాలు నా మదిలో నిరంతరం మెదులుతుంటాయి. కవి స్వప్నించిన శ్రేయోరాజ్యంగా తెలంగాణను తీర్చిదిద్దేంత వరకు త్రికరణ శుద్దితో, అంకితభావంతో అవిశ్రాంత కృషి చేస్తాను. తెలంగాణ అవతరణ దినోత్సవ వేళ మరోసారి రాష్ట్ర ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

జై తెలంగాణ

జై హింద్‌

Other Updates