కలెక్టర్లకు పూర్తి స్వేచ్ఛ.. జూన్ నుంచి గొర్రెల పంపిణీ
ఒంటరి మహిళలకు భృతి
నియోజకవర్గానికి 1400 డబుల్ బెడ్‌రూం ఇండ్లు
రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం వుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దశలో వుందని, ఆదాయంలో సగటున 15 శాతం కన్న తక్కువ వృద్ధిరేటు నమోదయ్యే అవకాశాలే లేవని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రానికి వున్న ఆదాయ వనరులు ఈ రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టానికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ వినూత్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలుచేసే విషయంలో అవసర మయిన ఎలాంటి చర్యలనైనా తీసుకునే అధికారాలను, స్వేచ్ఛను జిల్లా కలెక్టర్లకు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇదే క్రమంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి అవకతవకలు జరుగకుండా కలెక్టర్లు అప్రమత్తంగా వుండాలని సూచించారు.
జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఏప్రిల్ 10న ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఉదయం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గొర్రెల పెంపకం కార్యక్రమంపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తే బాగుంటుందనే విషయంపై కలెక్టర్ల సలహాలు, సూచనలను, అభిప్రాయాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మాంసం ఎగుమతుల హబ్‌గా మార్చాలని సీఎం చెప్పారు. గొర్రెల పెంపకందారులు రాబోయే రెండేండ్లలో 20వేల కోట్ల రూపాయల విలువైన లావాదేవీలు జరుపుతారని, గొర్రెల పెంపకం కార్యక్రమం భవిష్యత్తులో తెలంగాణలో శాశ్వత ఆర్థిక ప్రక్రియ కాబోతున్నదని చెప్పారు. రేపటి భవిష్యత్‌కోసం ఈ రోజు విత్తు నాటుతున్నట్లు చెప్పారు. మాంసం ఎగుమతులు బాగా జరిగి గొర్రెల పెంపకం పరిశ్రమ స్థాయికి చేరుకోవాలన్నారు. ఇప్పటికే గొర్రెల పెంపకానికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేశామన్నారు.
‘రాష్ట్రంలో యాదవ, కురుమ కుటుంబాలు 30 లక్షల వరకు ఉంటాయి. ఇది మనకు పెద్ద మానవ వనరు. ఇది మనకున్న నైపుణ్యం. వారిద్వారా మరింత ఎక్కువగా గొర్రెల పెంపకం చేపట్టే విధంగా జిల్లా కలెక్టర్లు చొరవ చూపించి ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించాలి. అందు బాటులో వున్న లెక్కల ప్రకారం రాష్ట్రంలో 44 లక్షల గొర్రె లున్నాయి. మరో 84 లక్షల గొర్రెలను ఇతర రాష్ట్రాలనుంచి కొనుగోలు చేస్తాం. ఒక్కొక్కరికి 20 గొర్రెలు, ఒక పొటేలుతో కూడిన యూనిట్‌ను అందిస్తాం. లక్షా 25వేల విలువైన యూనిట్ ధరలో 75 శాతం ప్రభుత్వం సబ్సిడీగా అంది స్తుంది. మిగతా 25 శాతం లబ్ధిదారులు వాటాధనంగా చెల్లించాలి. బ్యాంకులతో సంబంధం లేకుండానే ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలో నాలుగున్నర లక్షలమందికి లబ్ధి చేకూరే అవకాశం వుంది. త్వరలోనే సొసైటీలలో కొత్త సభ్యులను చేర్పించే ప్రక్రియ ప్రారంభమవుతుంది. 18 సంవత్సరాలు దాటిన గొల్ల కుర్మలు ఎవరైనా 51 రూపాయల సభ్యత్వ రుసుముతో సభ్యత్వం తీసుకోవచ్చు. ఇప్పుడున్న సొసైటీల్లోనే కొత్త సభ్యులను చేర్పించాలా? కొత్త సభ్యులకోసం కొత్తసొసైటీలు ఏర్పాటు చేయాలా? అనే విషయాన్ని కలెక్టర్లే తేల్చాలి’ అని ముఖ్యమంత్రి అన్నారు.
జూన్ నుంచి గొర్రెల పంపిణీ
‘రాష్ట్రంలో పశువైద్యుల ఖాళీలన్నీ భర్తీ చేస్తున్నాం. తహశీల్దారు, ఎంపీడీవో, పశువైద్యుడితో కూడిన త్రిసభ్య బృందం మండలస్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలి. ఇతర రాష్ట్రాలకు వెళ్లి అవసరమైన గొర్రెలను కొనుగోలు చేయాలి. ఈ ఏడాది జూన్‌నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ
పథకంపై మరింత అవగాహన కలిగించేందుకు జిల్లాస్థాయిలో కూడా సమావేశాలు నిర్వహించాలి. పశువైద్యానికి కూడా ప్రాధాన్యతనిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంటుకు ఒక సంచార వైద్యశాలను ఏర్పాటు చేస్తున్నాం. అటవీ భూముల్లో గొల్ల, కుర్మల స్వంత భూముల్లో పెద్దఎత్తున స్టైలోగ్రాస్ పెంచుతాం. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. గొర్రెలు కొనుగోలు చేసే సందర్భంలో సొసైటీ సభ్యులను కూడా తీసుకెళితే మంచిది. జిల్లా కలెక్టర్లు అంకితభావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి దోహదపడాలి’.
నియోజకవర్గానికి 1400 డబుల్‌బెడ్‌రూం ఇండ్లు
‘ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1400 చొప్పున డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టాలి. ఆర్డీవో, తహశీల్దారుల సహకారంతో లబ్ధిదారులను ఎంపిక చేయాలి. ఎంపికలో పారదర్శకత పాటించాలి. ఆధార్‌కార్డును అనుసంధానం చేయాలి. గ్రామ సభలోనే లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలి. కలెక్టర్లకు ఈ విషయంలో పూర్తి అధికారాలు వున్నాయి’ అని సీఎం అన్నారు.
రాష్ట్రంలో రెండున్నరనుంచి మూడు లక్షలమంది వరకు ఒంటరి మహిళలు వుంటారని అంచనా. వారికి భృతి ఇవ్వాలని నిర్ణయించినందున లబ్ధిదారులను గుర్తించాలని సీఎం అన్నారు. ప్రావిడెంట్‌ఫండ్ వున్న 81వేలమంది బీడీ కార్మికులను గుర్తించాలన్నారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి ఎంతో బాగుంది. స్టేట్ ఓన్ రెవిన్యూ (ఎస్‌వోఆర్) 2016-17 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 21శాతం వృద్ధి సాధించింది. తెలంగాణ రాష్ట్రంలో 19.5 శాతం వృద్ధిరేటు వుందని కేంద్ర ఆర్థికశాఖ నిర్ధారించింది. తెలంగాణ రాష్ట్రంలో స్థిరమైన ఆర్థిక వృద్ధి వుందని, ఆదాయ వృద్ధిరేటులో 15శాతంకంటే తగ్గే అవకాశం లేదని సీఎం అభిప్రాయపడ్డారు. జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయ సముదాయాల నిర్మాణానికి చొరవ చూపాలన్నారు. వచ్చే ఏడాదినుంచి కొత్త కార్యాలయాల్లో పని జరుగాలన్నారు. పోలీస్ కార్యాలయ సముదాయాలను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా నిర్మిస్తామన్నారు.
అన్నిరంగాల అభివృద్ధే లక్ష్యం
తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిందనే విషయం, ఈ రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలనేదే ప్రభుత్వానికి వున్న ప్రధాన ఎజెండా అనే విషయాన్ని కలెక్టర్లు గుర్తించాలన్నారు. పట్టణ ఆర్థిక వ్యవస్థ ముందంజలో వుందన్నారు. ప్రభుత్వానికి పేదరిక నిర్మూలనే కీలకమన్నారు. మానవ వనరులను గుర్తించాలని సూచించారు.
నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం, ‘మిషన్ కాకతీయ’ రాష్ట్రంలో సరికొత్త ఉత్సాహం తెచ్చిపెట్టిందన్నారు. కృష్ణా నదీ జలాలు అందడంతో పాలమూరు ప్రజలు ఆనందంగా వున్నారన్నారు. రాష్ట్రమంతా సాగునీరు అందితే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా వుంటుందన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని చెప్పిన సీఎం ఉత్తరాది గ్రిడ్‌తో కూడా మనం కనెక్టయ్యామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో గొర్రెల పెంపకం, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల లబ్ధిదారులు… మొత్తంగా 10 లక్షలమంది అర్హులను ఎలాంటి రాజకీయ జోక్యానికి తావివ్వకుండా ఎంపిక చేయాలన్నారు.
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు టీ. హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, కేటీఆర్, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, మిషన్‌భగీరథ వైస్ ఛైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, ఎండీసీ ఛైర్మన్ సుభాష్‌రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ దామోదర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ అనురాగ్‌శర్మ, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో రెండున్నరనుంచి మూడు లక్షలమంది వరకు ఒంటరి మహిళలు వుంటారని అంచనా. వారికి భృతి ఇవ్వాలని నిర్ణయించినందున లబ్ధిదారులను గుర్తించాలని సీఎం అన్నారు. ప్రావిడెంట్‌ఫండ్ వున్న 81వేలమంది బీడీ కార్మికులను గుర్తించాలన్నారు.
ఒంటరి మహిళలకు భృతి
ఒంటరి మహిళలకు భృతి, కేసీఆర్ కిట్స్ పథకంపై భోజన విరామం తర్వాత ప్రధానంగా చర్చ జరిగింది. ఒంటరి మహిళలకు భృతి ఇచ్చే అంశాన్ని కూడా ప్రధానమైనదిగా గుర్తించాలని ముఖ్యమంత్రి చెప్పారు.
‘ఒంటరి మహిళలను గుర్తించడం క్లిష్టమైన అంశం. కానీ గ్రామస్థాయిలో సరైన పరిశీలన జరిపి లబ్ధిదారులను ఎంపిక చేయాలి. ఒంటరి మహిళలకు భృతి ఇవ్వడం ద్వారా నేరుగా వారికి లబ్ధి చేకూర్చడమే కాకుండా వారి బాగోగులు చూస్తున్న వారికి కూడా సంతోషం కలిగిస్తుందన్నారు.
పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఒంటరి మహి ళలను గుర్తించడం తేలికన్నారు. అయినప్పటికీ పట్టణ ప్రాంతాల్లో కూడా సమర్థవంతంగా వ్యవహరించి గుర్తించా లన్నారు. ఒక ఏడాదికి పైగా భర్తకు దూరంగా వుంటున్న మహిళలను ఒంటరి మహిళలుగా గుర్తించాలన్నారు. వారిలో ఎక్కువ మంది పేదలే వుంటారు కాబట్టి ప్రభుత్వం ఇచ్చే భృతి వారిని ఆర్థికంగా ఆదుకుంటుందన్నారు.
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఒంటరి మహిళలకు భృతి ఇచ్చే కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. అదే రోజు కేసీఆర్ కిట్స్ పథకం కూడా ప్రారంభిస్తామన్నారు. ప్రసవ సమయంలో పేద మహిళలకు ఆర్థిక చేయూత అందించడమే ఈ పథకం ఉద్దేశ్యమన్నారు. ‘తమిళనాడులో అమలవుతున్న కార్యక్ర మాన్ని అధికారులు అధ్యయనం చేసి వచ్చారు’ అని చెప్పారు. ‘నెలలు నిండిన పేద గర్భిణులు, కుటుంబం గడవడం కోసం కూలీ పనులకు వెళుతున్నారు. ఆ దుస్థితిని తొలగించాలనేదే ప్రధాన ఉద్దేశ్యం. గర్భిణీ ప్రసవ సమ యంలో వారి జీవనోపాధికి ఆర్థిక సహాయం అందించడం ప్రభుత్వ లక్ష్యం. ఈ కార్యక్రమం కూడా ప్రభుత్వ ప్రాధాన్యత అంశం. గర్భిణీల పేర్లను నమోదు చేయడానికి ఏఎన్‌ఎంల సేవలను ఉపయోగించుకోవాలి. 12వ వారం ప్రవేశించిన వెంటనే గర్భిణీల నమోదు ప్రారంభం కావాలి. ఆసు పత్రుల్లోనే ప్రసవాలు జరుగాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యం. మాతా, శిశువులకు వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో అందించడం కూడా ఈ పథకం వల్ల సాధ్యమవుతుంది.
12వేల రూపాయల ఆర్థిక సహాయంతోపాటు 2 వేల రూపాయల విలువైన ‘కేసీఆర్ కిట్’ అందిస్తాం. ఆడపిల్ల పుడితే మరో వేయి అదనంగా ఇస్తాం. రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసూతి సేవలను మరింత మెరుగుపరుస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో డాక్టర్ల కొరత వుందని కలెక్టర్లు చెబుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు అదనపు ప్రోత్సాహకాలు అందించాలని సీఎస్‌ను కోరు తున్నాను. ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగే విషయంలో ప్రైవేట్ ఆసుపత్రుల సహకారాన్ని కూడా కోరతాం. అవసర మైన చోట కాంట్రాక్టు పద్ధతిలో వైద్య సిబ్బందిని నియమిం చుకునే అధికారం కలెక్టర్లకు ఇస్తున్నాం. ఆశా వర్కర్లను కూడా ‘కేసీఆర్ కిట్స్’ కార్యక్రమంలో వినియోగించు కోవాలి’ అని సీఎం అన్నారు.