అన్ని అడ్డంకులు అధిగమించిన కాళేశ్వరంtsmagazine

తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టుకు ఢిల్లీలో కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి యూ.పీ. సింగ్‌ అధ్యక్షత వహించారు. కేంద్ర జల సంఘం ఛైర్మన్‌ మసూద్‌ హుస్సేన్‌, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి, నీతి ఆయోగ్‌ సలహాదారు, భూగర్భ జల శాఖ కమిషనర్‌, వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు, కేంద్ర జల సంఘానికి చెందిన అన్ని విభాగాల సంచాలకులు, చీఫ్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ ఇరిగేషన్‌- మురళీధర్‌, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ కాళేశ్వరం ప్రాజెక్టు హరిరామ్‌ పాల్గొని కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యాంశాలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియకు సంబంధించి లింక్‌ -1, లింక్‌ – 2, లింక్‌ -3 పనుల పురోగతిని దశ్య రూపకంగా ప్రదర్శించారు. అనంతరం సమావేశం ఏకగ్రీవంగా ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులను మంజూరు చేస్తూ తీర్మానం చేసింది.

ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే మొత్తం 9 కీలక అనుమతులు సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ అనుమతులు ఇచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టుకు సీడబ్ల్య్లూసీ నుంచి అన్ని అనుమతులు లభించినట్లయింది. జలవనరుల మంత్రిత్వ శాఖ ద్వారా ఇన్వ్‌స్టెమెంట్‌ క్లియరెన్స్‌ మాత్రమే మిగిలి ఉంది. అన్ని అనుమతులు ఇప్పటికే రావడంతో ఈ అనుమతి త్వరలోనే వస్తుందని ఈ.ఎన్‌.సీ. తెలిపారు.

ప్రాజెక్టుకు 13 జిల్లాల్లోని 18.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు,18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం మేడిగడ్డ బ్యారేజి నుంచి 195 టి.ఎం.సి ల గోదావరి నీటిని ఎత్తిపోయడానికి కేంద్ర జల సంఘం అంగీకరించింది. యెల్లంపల్లిలో లభ్యమయ్యే 20 టి.ఎం.సి ల నీరు, 25 టి.ఎం.సిల భూగర్భ జలాలు కలుపుకొని

మొత్తం ప్రాజెక్టు నీటి లభ్యత 240 టిఎంసిలు . ఇందులో నుంచి 237 టి.ఎం.సిల నీరు వినియోగించుకోవడానికి కేంద్ర జల సంఘం ఇప్పటికే తన అంగీకారం తెలిపింది. 169 టి.ఎం.సిలు సాగునీటికి, 30 టి.ఎం.సి లు హైదారా బాద్‌ తాగు నీటి అవసరాలు, 10 టి.ఎం.సి లు దారి పొడు గునా ఉండే గ్రామాలతాగు నీటికి, 16 టి.ఎం.సి లు పారిశ్రామిక అవసరాలకు, 12 టి.ఎం.సిలు ఆవిరి నష్టం కోసం వినియోగించే ప్రణాళికను కేంద్ర జల సంఘం ఆమోదం తెలిపింది.

41 సంవత్సరాల సమాచారంతో సిమ్యులేషన్‌ చేసిన ప్పుడు 32 సంవత్సరాలు నీటి వినియోగానికి నీరు అందుబాటులో ఉంటుందని తేలిందని సిడబ్ల్యూసి గతంలోనే తనలేఖలో పేర్కొన్నది. 78 శాతం సక్సెస్‌ రేట్‌ ఉన్న ఈ సిమ్యులేషన్‌ స్టడీస్‌ పట్ల సీడబ్ల్య్లూసీ సంతప్తిని వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

కేంద్ర ప్రభుత్వ అనుమతుల ప్రక్రియకు మహారాష్ట్రతో కుదిరిన ఒప్పందమే కీలకంగా చెప్పాలి. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం వేసిన అడుగులు పరిశీలిస్తే…. తెలంగాణ-మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి చరిత్రాత్మక ఒప్పందం 2016 ఆగస్టులో కుదిరింది. ముంబైలోని సహ్యాద్రి అతిథి గ హంలో రెండురాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖరరావు, దేవేంద్ర ఫడ్నవీస్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మధ్య గతంలోకుదిరిన ప్రాజెక్టుల ఒప్పందాలు, భవిష్యత్తులో నిర్మించే ప్రాజెక్టుల పరిశీలనకు అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటుపై ఈ ఒప్పందం కుదిరింది. నీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావు, మహారాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి గిరీశ్‌ మహాజన్‌, అక్కడి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి సతీష్‌ ఎం గవాయ్‌, తెలంగాణ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శైలేంద్ర కుమార్‌ జోషి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ ఒప్పందంతో రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల నిర్మాణంలో అంతర్రాష్ట్ర మండలి క్రియాశీల పాత్ర పోషిస్తుంది. గోదావరి నదీ జలాల వివాద ట్రిబ్యునల్‌-1979 (తదుపరి నివేదిక 1980) తీర్పులకు అనుగుణంగా రెండు రాష్ట్రాల మధ్యఅంతర్రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణాలన్నింటికీ ఈ బోర్డు పర్యవేక్షణ సంస్థగాపని చేస్తుంది. లెండి, ప్రాణహిత (తుమ్మిడిహట్టి బ్యారేజీ), కాళేశ్వరం (మేడిగడ్డ బ్యారేజీ) ప్రాజెక్టులతోపాటు, పెన్‌గంగపై రాజాపేట బ్యారేజీ, ఛనాఖా-కొరటా బ్యారేజీ, పింపరాడ్‌ బ్యారేజీ, లోయర్‌ పెన్‌గంగ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబం ధించిన అన్ని అంశాలను బోర్డు పర్యవేక్షిస్తుంది.సందేహాలు, అను మానాలు, సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తుంది. తమ భూభాగంలో ముంపుని తగ్గించి 160 టీ.ఎం.సీల నీటిని తరలించుకున్నా తమకు అభ్యంతరం లేదని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ తెలపడంతో, రాష్ట్ర ప్రభుత్వం ముంపు ప్రభావాన్ని తగ్గించి సీడబ్ల్యూసీ నిబంధనలకు అనుగుణంగా ప్రాజెక్టును రీ-డిజైన్‌ చేయాలని నిర్ణయించింది.

గోదావరి నదిలో కాళేశ్వరం వద్ద నీరు పుష్కలంగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలోనే మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మించేలా ప్రాజెక్టును సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలోని నిపుణుల బందం రూపకల్పన చేసింది. ఈ ప్రతిపాదనపై అధ్యయన నివేదికను ఇవ్వాలని వ్యాప్కోస్‌ సంస్థకు సర్వే బాధ్యతలను అప్పగించింది. వ్యాప్కోస్‌ ఇచ్చిన సర్వే నివేదిక మేరకు ప్రభుత్వం ప్రాజెక్టును రీ-డిజైన్‌ చేసింది. పాత డిజైన్‌ ప్రకారం లిఫ్ట్‌ చేసిననీటిని నిల్వ చేయడానికి అవసరమైన సామర్థ్యం మేరకు జలాశయాలను ప్రతిపాదించలేదు. కానీ సీడబ్ల్యూసీ సూచనల మేరకు జలాశయాల సామర్థ్యాన్ని 11 టీ.ఎం.సీల నుంచి 141 టీ.ఎం.సీలకు పెంచారు. గోదావరి నదిపై మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద మూడు బ్యారేజీలను ప్రతిపాదించారు. రోజుకు రెండు టీ.ఎం.సీల నీటిని ఎత్తిపోసేలా రీ-డిజైన్‌ చేశారు. సుందిళ్ల నుంచి ఎల్లంపల్లి జలాశయానికి నీటిని తరలించి అక్కడి నుంచి పాత మార్గంలో మిడ్‌ మానేరు, అనంతగిరి, రంగనాయక సాగర్‌, మల్లన్న సాగర్‌, కొండపోచమ్మ రిజర్వాయర్‌ వరకు నీటిని తరలించాలని రీ-డిజైన్‌ చేశారు.

తుమ్మిడిహట్టివద్ద 152 మీటర్ల ఎత్తును 148 మీటర్లకు తగ్గించి బ్యారేజీని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా ఆదిలాబాద్‌ జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలని ప్రతిపాదించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాల్లోని 18.20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ణయించింది. శ్రీరాంసాగర్‌ వరద కాలువ, నిజాంసాగర్‌, సింగూరు ప్రాజెక్టుల కింద 18.8 లక్షల ఎకరాల ఆయకట్టును కూడా స్థిరీకరించాలని ప్రతిపాదిం చింది. ఇలా రీ-డిజైనింగ్‌లో భాగంగా కాళేశ్వరం, ప్రాణహిత ప్రాజెక్టులను రూపొందించింది. ఇదే విషయాన్ని మహా రాష్ట్రకు తెలియజేసింది. దీంతో ఆ రాష్ట్ర సీఎం అంగీకారం తెలిపారు. ఫలితంగా ఇరు రాష్ట్రాల సీ.ఎంలు ఒక ఒప్పందం చేసుకుని ఆ ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ ఒప్పందం నేపథ్యంలోఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇస్తూ వచ్చిన వివరణలతో సీడబ్ల్యూసీ సంతప్తి చెందింది. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు2017 నవంబరు 3న అంతర్రాష్ట్ర అనుమతిఇచ్చింది. ఇంతకు మునుపే అంటే. 2017 అక్టోబరు 30తేదీనే హైడ్రాలజీ అనుమతి లభిం చింది. మేడిగడ్డ దగ్గర 75శాతం విశ్వసనీయతతో 284.30 టీ.ఎం.సీల నీటి లభ్యత ఉన్నట్టు సీడబ్ల్యూసీ నిర్దారణ చేసింది. సాగు, తాగునీటి అవసరాల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనులకు ప్రణాళిక తయారు చేసుకోవచ్చని కూడా సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. 2017 నవంబరు 24న తుది అటవీ అనుమతి, 2017 డిసెంబరు 5న తుది పర్యావరణ అనుమతి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ జారీ చేసింది. దీంతో 3,168.13 హెక్టార్ల అటవీ భూమిని విని యోగించుకునేందుకు నీటి పారుదలశాఖకు లైన్‌క్లియర్‌ అయ్యింది.

మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకోవడంతో మొదల యిన కాళేశ్వరం అనుమతుల ప్రస్థానం ఇప్పుడు ఇరిగేషన్‌ ప్లానింగ్‌ మరియు ప్రాజెక్టు అంచనా అనుమతులతో చరమాంకానికి చేరింది. 197కు పైగా కేసులు, అల్లర్లు, ఆందోళనలు, ధర్నాల పేరుతో సాగించిన రచ్చ ఏవీ కాళేశ్వరం ప్రాజెక్టును ఆపలేకపోయాయి. రెండున్నరకోట్ల మంది జీవితాలను ప్రభావితం చేయగల కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తిచేసే లక్ష్యంతో ఆగమేఘాలపై పనులు జరిపిస్తున్నది. గోదావరి జలాల గరిష్ఠ వినియోగంతో బీడు భూములను పచ్చని పంట పొలాలుగా మార్చడం ప్రధాన లక్ష్యంగారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఇంకా శరవేగంతో నిర్మాణం కానుంది.

ఇతర ప్రాజెక్టులకు జీవం పోయడంతోపాటు, పునర్జీవం కల్పించే కొత్త చరిత్రను కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లిఖించబోతున్నది. ఉత్తర తెలంగాణకు వరప్రదాయినిగా ఉన్న గోదావరిని దక్షిణ తెలంగాణకు మళ్లించి, పల్లేర్లు మొలిచిన నేలలో బంగారం పండించనున్నది. మొదటి దశ అనుమతులు లభించిననెలలోపే రెండో దశ అటవీ అను మతులను సాధించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఓ కొత్త రికార్డు సష్టిస్తే… ఏడాది కాలంలోనే 9 కీలక అనుమతులు సాధించడం కూడా చరిత్రలో లిఖించదగిన ఒక రికార్డే అని ఇంజనీరింగ్‌ నిపుణులు భావిస్తున్నారు.

Other Updates