దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాల వారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో తమ ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకోవడానికి స్థలాలు, నిధులు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి
కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. వీటికోసం నగరంలోని కోకాపేట, ఘట్‌కేసర్‌, మేడిపల్లి, మేడ్చల్‌, అబ్దుల్లా పూర్‌ మెట్‌, ఇంజాపూర్‌ ప్రాంతాల్లో స్థలాలను గుర్తించినట్లు వెల్లడించారు. వివిధ కులాలకు స్థలాల కేటాయించే విషయంపై ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఈటల రాజేందర్‌, జోగు రామన్న, జగదీష్‌ రెడ్డి, చందూలాల్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎంపి వినోద్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి, సీనియర్‌ అధికారులు నర్సింగ్‌ రావు, రామకష్ణరావు, మహేశ్‌ దత్‌ ఎక్కా, శివశంకర్‌, దానకిశోర్‌, బుద్ధ ప్రకాశ్‌, భూపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వివిధ కులాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించారు.

tsmagazine
”తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల వారి సంఖ్య అధికంగా ఉంది. సామాజిక, విద్య, ఆర్థిక రంగాల్లో వారు వెనుకబడి ఉన్నారు. వారి అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. వీటితో పాటు వారి సామాజిక, సాంస్క తిక, విద్య, ఆర్థిక పురోగతికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి, వారి వికాసానికి ఉపయోగపడేవిధంగా ప్రతీ కులానికి హైదరాబాద్‌ లో ప్రభుత్వమే భవనాలు నిర్మిస్తుంది. ఇందుకోసం అవసమైన స్థలాలు సేకరించాం. నిధులు సిద్ధంగా ఉంచాం. దాదాపు 36 సంచార కులాలకు కలిపి హైదరాబాద్‌ నగరంలో 10 ఎకరాల స్థలంలో రూ.10 కోట్ల వ్యయంతో సంచార ఆత్మగౌరవ భవన్‌ నిర్మిస్తాం. సంచార ఆత్మగౌరవ భవన్‌ లో అన్ని సంచార కులాల వారు తమ అభ్యున్నతి కోసం చేపట్టే కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాం. పేదలు పెండ్లిళ్లు చేసుకోవడంతో పాటు విద్య, సాంస్క తిక వికాస కేంద్రంగా అది భాసిల్లుతుంది” అని ముఖ్యమంత్రి వెల్లడించారు.

”రాష్ట్రంలోని అన్ని బిసి కులాలు, ఎస్సీలలో ఉన్న బుడగ జంగాల, ఎస్టీలలో ఉన్న ఎరుకల కులానికి కూడా స్థలం కేటాయించి, భవనం నిర్మించడానికి నిధులు ఇవ్వాలని నిర్ణయించాం. అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించడం దేశంలోనే ఇది ప్రథమం. తెలంగాణ రాష్ట్రం మత సామరస్యానికే కాకుండా, సామాజిక వికాసానికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నది. ఇప్పటికే కొన్ని కులాలకు స్థలాలు కేటాయిస్తూ, ఉత్తర్వులు జారీ చేశాం. మిగిలిన కులాలకు కూడా స్థలం, నిధులు కేటాయిస్తున్నాం. మున్నూరు కాపులకు 5 ఎకరాలు-5 కోట్లు, దూదేకుల కులానికి 3 ఎకరాలు-3 కోట్లు, గంగ పుత్రులకు 2 ఎకరాలు-2 కోట్లు, విశ్వకర్మలకు 2 ఎకరాలు-2 కోట్లు, నాయీ బ్రాహ్మణులు, ఆరె క్షత్రియులు, వడ్డెర, కుమ్మరి, ఎరుకల, ఉప్పర, మేర, బుడిగ జంగాల, మేదర, పెరిక, చాత్తాద శ్రీ వైష్ణవ, కటిక తదితర కులస్తులకు ఒక్కో ఎకరం, ఒక్కో కోటి రూపాయలు, బట్రాజులకు అర ఎకరం, అర కోటి రూపాయలు కేటాయిస్తున్నాం” అని ముఖ్యమంత్రి ప్రకటించారు.

అన్ని కులాలకు స్థలం, నిధులు కేటాయించినందున వెంటనే భవనాల నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలని ఆయా శాఖల అధికారులకు, మంత్రులకు, కుల సంఘాలకు ముఖ్యమంత్రి సూచించారు.

గురుకుల ఉద్యోగుల వేతనాలు భారీగా పెంపు
రాష్ట్రంలోని 29 మినీ గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. హెచ్‌ఎం/వార్డెన్‌కు రూ.5వేల నుంచి రూ.21 వేలకు, సిఆర్టీలకు రూ.4వేల నుంచి రూ.15వేలకు, పిఇటిలకు రూ.4వేల నుంచి రూ.11వేలకు, అకౌంటెంట్‌ కు రూ.3,500 నుంచి రూ.10,000, ఎఎన్‌ఎంలకు రూ.4వేల నుంచి రూ.9వేలకు, కుక్స్‌కు రూ.2,500 నుంచి రూ.7,500కు, ఆయాలకు రూ.2,500 నుంచి రూ.7,500కు, హెల్పర్‌ కు రూ.2,500 నుంచి రూ.7,500కు, స్వీపర్‌కు రూ.2,500 నుంచి రూ.7,500కు, వాచ్‌ మెన్‌కు రూ.2,500 నుంచి రూ.7,500కు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై సీఎం సంతకం చేశారు.

అర్చకులకు ప్రభుత్వ వేతనాలు
రాష్ట్రంలోని దేవాదాయ శాఖ పరిధిలో నిర్వహిస్తున్న దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించే అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఇకపై ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లిస్తుందని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. సెప్టెంబర్‌ 1 నుంచి ప్రభుత్వ ఖజానా నుంచి ఈ వేతనాలు అందుతాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు సవరించినప్పుడు, పూజారుల వేతనాలను కూడా విధిగా సవరిస్తామని. పూజారుల పదవీ విరమణ వయో పరిమితిని 58 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు పెంచుతున్నట్లు సీఎం వెల్లడించారు. జీతాల చెల్లింపు, పదవీ విరమణ వయో పరిమితి పెంపుకు సంబంధించి విధి విధానాలు తయారు చేసి, ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

ఎస్సీ, ఎస్టీల గృహాలకు 101 యూనిట్ల విద్యుత్‌ ఉచితం
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచితంగా గహోపయోగ విద్యుత్‌ అందివ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని, టివిల వినియోగంతో పాటు ఇతర విద్యుత్‌ గహోపకరణాలు పెరినందున విద్యుత్‌ వాడకం ఎక్కువయిందని సీఎం చెప్పారు. తెలంగాణలో విద్యుత్‌ పరిస్థితి మెరుగయినందున, దాని ఫలితం అట్టడుగు వర్గాలకు అందాలని సీఎం అన్నారు. అందుకే 101 యూనిట్ల వరకు విద్యుత్‌ వినియోగించే ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా విద్యుత్‌ అందివ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇందుకోసం అయ్యే విద్యుత్‌ చార్జీలను ప్రభుత్వమే డిస్కమ్‌ లకు చెల్లిస్తుందని సీఎం స్పష్టం చేశారు.

ఇమామ్‌, మౌజమ్‌ల భృతి రూ. 5,000 లకు పెంపు
మసీదుల్లో ప్రార్థనలు చేసే ఇమామ్‌, మౌజమ్‌లకు నెలకు రూ.5,000 భతి ఇవ్వాలని సీఎం ప్రకటించారు. సెప్టెంబర్‌ 1 నుంచి పెరిగిన భతి చెల్లించనున్నట్లు వెల్లడించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మౌజమ్‌, ఇమామ్‌ లకు మొదట నెలకు వెయ్యి రూపాయల భతి అందించారు. ఆ తర్వాత దాన్ని రూ.1500 కు పెంచారు. 2018 సెప్టెంబర్‌ 1 నుంచి ఆ భతిని రూ.5000 పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. రాష్ట్రంలోని మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించే దాదాపు 9,000 మందికి ప్రభుత్వ నిర్ణయం వల్ల మేలు కలుగుతుందని సీఎం అన్నారు.

Other Updates