magaఅంతటా సమాన అభివృద్ధి చేస్తాం: సీఎం కేసీఆర్‌

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి పది జిల్లాలను 31జిల్లాలుగా పెంచి సంవత్సరం పూర్తయిన సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం పక్కా భవనాలకు శంకుస్థాపనలు జరిగాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్ధిపేట, సిరిసిల్ల, సూర్యాపేట జిల్లా కేంద్రాలలో కలెక్టరే ట్‌, ఎస్పీ కార్యాలయం పక్కా భవనాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలు తనకు సమానమేనన్నారు. ఏ ప్రాంతం పైన వివక్ష చూపడం ఉండ దన్నారు. ఏ తండా అయినా కేసీఆర్‌దే. ఏ ఊరు అయినా కేసీఆర్‌దే. నాకు ఆ ఊరు, ఈ ఊరు అన్న తేడా లేదని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులెదురైనా అధిగమించి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు.

కేంద్ర ఆర్థికశాఖ, కాగ్‌ లెక్కల ప్రకా రం.. ఆర్థికవృద్ధిలో దేశంలోనే నంబర్‌వన్‌ స్థానానికి చేరుకున్నం. 21.7% గ్రోత్‌తో అభివృద్ధిలో ముందున్నాం. శాంతిభద్రతలు బ్రహ్మాండంగా ఉన్నయి. పరిశ్రమలు మూడు షిఫ్టులు పనిచేస్తున్నయి. రూపాయి లంచం లేకుండా ఐదు వేల పరిశ్రమలకు అనుమతినిచ్చాం. రైతులకు 17 వేల కోట్ల రుణమాఫీ చేశాం..తెలంగాణ రైతులను ఒక ఆర్గనైజింగ్‌ ఫార్మాట్‌లోకి తీసుకొస్తున్నం. దీంతో పండిన పంటలకు ధర వచ్చేలా చేస్తామని కేసీఆర్‌ పేర్కొన్నారు.

రూ.44వేల కోట్లతో సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నామని, అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నామని కేసీఆర్‌ పేర్కొన్నారు. వృద్ధులకు వెయ్యి రూపాయల పింఛన్‌ ఇస్తున్నం. బీడీకార్మికులను గతంలో ఎవరూ పట్టించుకోలేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా వారికి కూడా నెలకు వెయ్యి పింఛను ఇస్తున్నామని తెలిపారు.

నల్లగొండ, సూర్యాపేటలకు రెండు మెడికల్‌ కళాశాలలు మంజూరు చేస్తున్నట్లు సూర్యాపేట సభలో ప్రకటించారు. సిద్ధిపేట కోమటిచెరువు అభివృద్ధికి రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సిద్ధిపేట సభలో ప్రకటించారు. సిరిసిల్ల సభలో మాట్లాడుతూ దేశంలో ఎక్కడ ప్రవేశపెట్టని విధంగా చేనేత కార్మికులకు ఉత్పత్తి, మార్కెటింగ్‌లో ప్రభుత్వం పూర్తి సహాయ, సహాకారాలు అందిస్తుందన్నారు. బతుకమ్మ చీరలను చేనేత కార్మికుల వద్ద నుంచే కొనుగోలు చేయడం జరిగిందన్నారు.

సూర్యాపేటలో..

తాను మూడున్నర సంవత్సరాల ముందు సూర్యాపేటకు వచ్చి ఎన్నికల సభలో చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. అప్పుడు జిల్లా చేస్తా అన్న మాట నిలబెట్టుకుని జిల్లాను చేసినట్లు తెలిపారు. గతంలో జిల్లాలో తిరిగినప్పుడు ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలు చూస్తే ఏడుపు వచ్చింది, మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లో కండ్లకు నీళ్లు తీసుకొన్నం. సమస్య పరిష్కారం కాలే. సమైక్యవాదులు ఆనాడు మనకు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు విషయంలో మోసం చేసిన్రు. ఒరిజనల్‌ పేరు నాగార్జునసాగర్‌ కాదు. దాని పేరు నందికొండ ప్రాజెక్టు. కట్టుకోవాల్సింది ఇప్పుడున్న కాడ కాదు. 19 కిలోమీటర్ల పైన ఏలేశ్వరం దగ్గర కట్టాల్సి ఉండె. ఆరోజు దగా జరిగింది. మోసం జరిగింది. ఏలేశ్వరం దగ్గర్నే కట్టి ఉంటే నల్లగొండ మొత్తానికి నీళ్ళొచ్చేది. 10లక్షల ఎకరాలు పారేది. చాలా పెద్దమోసం జరిగింది. ఇప్పుడు దాన్ని సరిదిద్దుకుంటున్నాం. మన ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటున్నాము.

సూర్యాపేటకు నిధుల వరద..

సమాన బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా.. వెనుకబడ్డ సూర్యాపేట జిల్లా అభివృద్ధి కావాలె కాబట్టి జిల్లాలోని 323గ్రామ పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి రూ.15లక్షలు మంజూరు చేస్తున్న. జిల్లాలో 323 తండాలున్నయి. ఒక్కో తండాకు రూ.10లక్షలు మంజూరు చేస్తున్న. సూర్యాపేట పట్టణంలో మూసీకాల్వ బాగు జేస్తందుకు రూ.65కోట్లు మంజూరు జేస్తున్న. మూసీ ఆధునీకరణ ఆర్నెల్లల్ల కావాలె. వచ్చే సంవత్సరం ఆయకట్టు బాగా పెరుగాలె. మూసీ మీద ఆరు, ఏపూరు వాగు మీద మరో ఆరు చెక్‌ డ్యాంలు వెంటనే మంజూరు జేస్తున్న. సూర్యాపేట సద్దుల చెరువు బాగైంది. పుల్లారెడ్డి చెరువు వృద్ధికి నిధులు మంజూరు జేస్త. సూర్యాపేటలో క్రిస్టియన్‌, మైనార్టీలు, వెనుకబడిన వర్గాలున్నయి. సూర్యాపేటకు బంజారాభవన్‌ను మంజూరు జేస్తం. పట్టణంలో అన్నిరకాల అభివృద్ధికి నా నిధుల నుంచి రూ.75కోట్లు మంజూరు జేస్తున్న. రోడ్లవెడల్పు, మౌలిక సౌకర్యాల కోసం ఏం చెయ్యాల్నో ఆలోచన చెయ్యాలె. మీరు అడిగినయన్నీ చేసిన. నాదొక్కటే కోరిక. మీరు మాట తప్పొద్దు. అవసరమున్న మొక్కలు పంపిస్త. ఇంటింటికీ ఆరుమొక్కలు పెంచాలె. ఈ ప్రాంతమంతా అడవిలా మారిపోవాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.

దక్షిణ తెలంగాణలో పాలమూరు, నల్లగొండ నిర్లక్ష్యానికి గురైన జిల్లాలు. అన్నిరకాలుగా దగాపడ్డ జిల్లాలు. కరెంటు ప్రాజెక్టులు మొత్తం ఉత్తర తెలంగాణల్నే పెట్టిన్రు. కొత్తగూడెం నుంచి రామగుండం వరకు గోదావరి ఒడ్డున్నే పెట్టిండ్రు. పవర్‌ బ్యాలెన్స్‌ కావాలె. 23 జిల్లాల రాష్ట్రంల గూడ అన్ని జిల్లాల కంటే అత్యధికంగా విద్యుత్‌ కనెక్షన్లున్న జిల్లా నల్లగొండ. పరిశ్రమలు గూడా సరైన పద్ధతిలో రాలేదు. అందుకోసం ఈరోజే 400కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ప్రారంభించుకున్నం. 60ఏండ్ల చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడూ చేయని విధంగా రూ.24,950 కోట్లతో భారతదేశంలోనే మొట్టమొదటి అల్ట్రా మెగా పవర్‌ప్లాంట్‌ యాదాద్రి విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని దామరచర్ల వద్ద నిర్మిస్తున్నం. ఏడాది, ఏడాదిన్నరలో ఉత్పత్తి ప్రారంభిస్తది. దాంతో నల్లగొండ జిల్లా స్వరూపమే మారుతది. అద్భుతమైన వెలుగు వస్తది. రామగుండంలో ఎన్టీపీసీ 2700 మెగావాట్లు ఉత్పత్తి చేస్తేనే ఆ పట్టణం రూపు మారిపోయింది. ఇక్కడ నాలుగు వేల మెగావాట్లు.. అదికూడా ఎన్టీపీసీ కాదు.. మన జెన్‌కో సొంతం. సౌత్‌ ఇండియాలో నంబర్‌వన్‌.. నేనే కొట్లాడి పెట్టించినానని కేసీఆర్‌ తెలిపారు.

సాగర్‌ ఆయకట్టుకు నీళ్లిస్తాం..

యాదాద్రి భువనగిరి జిల్లాలో 20టీఎంసీల ప్రాజెక్టులు రెండు.. గంధమల్ల, బస్వాపూర్‌ నిర్మాణం జరుగుతున్నయ్‌. పేరుకు ప్రాజెక్టులు అక్కడ ఉన్నయ్‌. లాభపడేది మొత్తం జగదీశ్‌రెడ్డి సూర్యాపేట, నకిరేకల్లే. మూసీ ప్రాజెక్టు 365రోజులు నిండే ఉంటది. ఎండేది లేదు. కొంచెం కాల్వ పెంచితే.. మిడ్‌మానేరు నుంచి వచ్చే ఎస్సారెస్పీ కాల్వ.. కాళేశ్వరం అయిపోతే సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ చరిత్రలో ఊహించని నీళ్ళొస్తయి. సాగర్‌ ఎడమకాల్వ ఉన్నది.. సాగర్‌ల గోదావరిని పడేయండి అని చాలామంది అడుగుతున్నరు. దానికంటే ఉత్తమ ఆలోచన చేసినం. సాగర్‌ ఎడమకాల్వ 42వ కిలోమీటర్‌ దగ్గర పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌ 0.85 టీఎంసీలతో ఉన్నది. ఆ రిజర్వాయర్‌ పైన పారకం ఉన్నది కేవలం 77వేల ఎకరాలే. మిగతా 3.2లక్షల ఎకరాలు పెద్దదేవులపల్లి కిందనే ఉన్నది. బస్వాపూర్‌, గంధమల్లకు నీళ్లు తెచ్చే కాల్వ సైజు కొంచెం పెంచి కేతేపల్లి, నకిరేకల్‌ మండలాల ద్వారా 30కి.మీ. మేర తవ్వితే ఉదయ సముద్రం ప్రాజెక్ట్‌ కింద పానగల్లు వాగులో పడ్తది. డైరెక్టుగ పెద్దదేవులపల్లికి వస్తది. కింద ఉన్న 3.2లక్షల ఎకరాలు రెండు పంటలు నల్లగొండ రైతులు మీసంమెలేసి పండించుకునే పరిస్థితి త్వరలోనే వస్తది. మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, కోదాడ ఎన్‌ఎస్పీ ఆయకట్టు సంపూర్ణంగా పండించుకోవడమే కాదు.. ఆ నీళ్లు మళ్లీ పాలేరుకు కూడా వెళ్లిపోయే పరిస్థితి వస్తదని ఇక సాగునీటి కష్టాలకు తెలంగాణ ప్రజలు దూరమవుతారని సీఎం స్పష్టం చేశారు.

సిరిసిల్లలో..

సిరిసిల్లలో కలెక్టరేట్‌, పోలీస్‌ కమిషనరేట్‌ భవనాలతోపాటుగా అపెరల్‌ పార్క్‌, గ్రూప్‌ వర్క్‌షెడ్‌ పథకాలకు సీఎం కేసీఆర్‌ భూమిపూజచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామన్నారు. వారికి చేనేత బట్టల తయారీలోను, మార్కెటింగ్‌లోను ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పవర్‌లూం, చేనేత కార్మికులను ఆదుకొనేందుకు ఇప్పటికే రూ.వెయ్యి కోట్లతో పలు పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఒక్క సిరిసిల్ల పట్టణానికే రూ.800 కోట్లు వచ్చినయి. నూలుపై ఇప్పటికే పదిశాతం సబ్సిడీ ఇస్తున్నం. చేనేత కార్మికులకు వివిధ రకాల వస్తువులపై యాభైశాతం సబ్సిడీ ఇస్తున్నం. రూ.30 కోట్లతో సిరిసిల్లలో అపెరల్‌ పార్కు ఏర్పాటుచేస్తున్నమన్నారు. ప్రతి నేతకార్మికుడికి నెలకు రూ.15 వేల వేతనం అందేలా పలు పథకాలతో ముందుకు వెళ్తున్నం. నేత కార్మికులకు పని ఉండాలన్న లక్ష్యంతో స్కూల్‌ పిల్లల యూనిఫారాలకు కావాల్సిన వస్త్రాన్ని నేసేందుకు రూ.300 కోట్ల ఆర్డర్‌ ఇచ్చినం ఇలా నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతూ వందల కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నదని సీఎం పేర్కొన్నారు.

మొత్తంగా తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగాలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని, దీనితో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని కేసీఆర్‌ తెలిపారు. ప్రజల ఆశీర్వాదాలతో బంగారు తెలంగాణ సాధించి తీరుతామని ఆయన మరోమారు స్పష్టం చేశారు.

Other Updates