ఎంతో కష్టపడి, ప్రాణాలు అర్పించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, ఈ రాష్ట్రంలో పరిశ్రమలకు ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలుకుతున్నాం, భూములు, నీరు, విద్యుత్ మీరు ఏది కోరితే అది అందిస్తున్నం, మీరు మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పారిశ్రామికవేత్తలను కోరారు. ఏప్రిల్ 22న మెదక్‌జిల్లా జహీరాబాద్‌లోని మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీలో 250 కోట్ల రూపాయల పెట్టుబడితో కొత్తగా ఏర్పాటు చేసిన ఆటోమోటివ్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఆంధ్ర పాలకుల ఏలుబడిలో దగాపడ్డ తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాల కల్పన జరగాలన్నారు.
పారిశ్రామికవేత్తలకు తాము ఎర్రతివాచీ పరిచి ఆహ్వానిస్తున్నామని, తమ రాష్ట్రంలో పరిశ్రమలు పెడితే తమతో చిట్‌చాట్ చేసినంత సమయంలో అనుమతులు ఇప్పిస్తామని, నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామని, ప్రభుత్వం వైపు నుంచి అన్ని సహాయ సహకారాలను అందిస్తామన్నారు. తాము ఇంతగా సహాయ సహకారాలు అందిస్తున్నపుడు పరిశ్రమల యజమానులు కూడా తమ రాష్ట్ర యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించి ప్రోత్సహించాలని సూచించారు. తాను ప్లాంట్‌లో తిరుగుతున్నపుడు కొన్ని యంత్రాలు విదేశాలలో దిగుమతి చేసుకున్నవని తెలిపారన్నారు. అది నాకు బాధకలిగించిందన్నారు.
ఇప్పటికైనా అన్ని యంత్రాలు మన దేశంలో తయారైనవే వాడేవిధంగా చూడాలన్నారు. మేడిన్ ఇండియా, మేకిన్ తెలంగాణగా పరిస్థితులు మారిపోవాలని ఆయన కోరారు. హైదరాబాద్ పరిశ్రలమకు నిలయంగా కావాలని, ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. శామ్‌సంగ్ పరిశ్రమల వారు 100 మిలియన్ డాలర్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారని, మెదక్‌జిల్లా సదాశివపేటలో ఎమ్‌ఆర్‌ఎఫ్ పరిశ్రమ ప్రతినిధులు ఇటీవలే తనను కలిసి రూ. 980 కోట్లతో పరిశ్రమను విస్తరించి వెయ్యి మందికి అవకాశం కల్పిస్తామన్నారని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో పరిశ్రమలకు కరెంటుకోతలు ఉండేవని, తమ ప్రభుత్వంలో పరిశ్రమలకు ఎలాంటి కరెంటుకోతలు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
పరిశ్రమలకు నిరంతరాయంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని, దీనిపై పారిశ్రామికవేత్తలు ఫోన్లు చేసి మరీ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు పునాదిరాళ్ళకే పరిమితమయ్యాయని, అభివృద్ధి చేసి చూపిస్తున్నది తమ ప్రభుత్వమే అన్నారు. పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చి తెలంగాణలో పరిశ్రమలు స్థాపించడంతో పాటు స్థానిక యువకులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించి దగాపడ్డ తెలంగాణను అభివృద్ధిలో ఉరకలెత్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తన్నీరు హరీష్‌రావు, జూపల్లి కృష్ణారావు, శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎం.పి. బీబీపాటిల్, ఎమ్మెల్యే గీతారెడ్డిలతో పాటు పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.