t-hubతెలంగాణను ఆవిష్కరణల కేంద్రంగా నిలిపే క్రమంలో పల్లెసీమల సృజనాత్మకతకు పెద్దపీట వేస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు తెలిపారు. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని మరింత అభివద్ధి పరిచేందుకు రూ.100 కోట్లతో టీ నిధి పేరుతో ఆర్థిక సహకారం అందించనున్నామని చెప్పారు. టీ-హబ్‌ ఫేజ్‌- 2, రూరల్‌ టెక్‌ పాలసీలతో పల్లెసీమల ఆవిష్కరణలకు ఇతోధిక ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. టీ హబ్‌ 2లో వెయ్యికి పైగా నవజాత సంస్థలకు అవకాశం కల్పిస్తామని వివరించారు. హైదరాబాద్‌లో నవంబర్‌ 12వ తేదీన జరిగిన టీ- హబ్‌ మొదటి వార్షికోత్సవంలో పాల్గొని కేటీఆర్‌ ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో టీ హబ్‌తో పలు సంస్థలు, సంఘాలు ఏడు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల పెంపు-అంతర్జాతీయ మార్కెటింగ్‌, ఇన్నోవేషన్‌ కేంద్రాలతో అనుసంధానం, ఐటీ రంగంలో మార్పులకు అనుగుణంగా శిక్షణ, ఆవిష్కరణలకు కీలక నిబంధనల రూపకల్పన, బ్యాంకింగ్‌ రంగానికి సేవలు తదితర అంశాలు ఈ ఒప్పందాల్లో ఉన్నాయి.

మంత్రి కేటీఆర్‌ ప్రతినిధులనుద్దేశించి మాట్లాడుతూ, టీ-హబ్‌ ఏర్పాటుకు కారణాలు, లక్ష్యాలు, కార్యక్రమాలు, భవిష్యత్‌ కార్యాచరణ తదితర అంశాలను వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఉన్న అపోహలను తొలగించడంతో పాటు ఐటీ రంగానికి కొత్త అభివృద్ధి రూపును ఇచ్చేందుకు పారిశ్రామికవర్గాలతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఆ క్రమంలో ఆవిష్కరణలను ప్రాధాన్యంగా తీసుకొని ఉత్సాహవంతులైన యువత కోసం టీ హబ్‌ను తీర్చిదిద్దామని వివరించారు. పూర్తిస్థాయి సదుపాయాలతో తీర్చిదిద్దిన ఈ కేంద్రంలో ఆవిష్కర్తలు విజయం సాధిస్తే గుర్తింపు- సఫలం కాకపోతే అనుభవం అనే కోణంలో నల్సార్‌, ఐఐటీ, ఐఎస్‌బీ వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు.

ఆవిష్కరణ రంగంలో తెలంగాణను మరింత శక్తివంతంగా రూపొందించే క్రమంలో టీ-హబ్‌ రెండోదశను అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దుతూ ఇటు సాంకేతిక అక్షరాస్యులకు అటు గ్రామీణ ప్రాంత యువతకు ఆవిష్కరణల కేంద్రంగా మారుస్తామని తెలిపారు. రాబోయే తరం ఆవిష్కరణ కేంద్రంగా తెలంగాణను నిలుప డమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు. మాటలు చెప్పడమే కాకుండా నిధులు కూడా ఇచ్చే ముఖ్యమంత్రి ఉండటం వల్ల ఐటీ రంగంలో ముందుకు వెళుతున్నామని తెలిపారు. ప్రముఖ ఆవిష్కర్త రాజురెడ్డి రూపొందించిన కాకతీయ శాండ్‌ బాక్స్‌ తరహాలోనే మరిన్ని ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు తెలిపారు.

టాప్‌-10 స్టార్టప్‌ నగరాల్లో స్థానమే లక్ష్యం..

టీ-హబ్‌ సీఈఓ జై కృష్ణన్‌ మాట్లాడుతూ 2020 కల్లా ప్రపంచవ్యాప్త టాప్‌-10 స్టార్టప్‌ నగరాల్లో హైదరాబాద్‌ను చేర్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. హైదరాబాద్‌ నగర రూపురేఖలను మార్చేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. టీ-హబ్‌లో త్వరలో డిజిటల్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌పై ముందుకు సాగనున్నట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, ఐటీ శాఖ డైరెక్టర్‌ దిలీప్‌ కొణతం, టీ హబ్‌ సీఓఓ శ్రీనివాస్‌ కొల్లిపార, టీ హబ్‌ బోర్డ్‌ సభ్యులు పాల్గొన్నారు.

ఏడు ఒప్పందాలు..

మొదటి వార్షికోత్సవం సందర్భంగా టీ-హబ్‌తో పలు సంస్థలు, సంఘాలు ఏడు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇక్రిశాట్‌,రివర్‌ బ్రిడ్జ్‌ సంస్థలతో టీ హబ్‌ విడిగా రెండు ఒప్పందాలు కుదుర్చు కుంది. వ్యవసాయరంగంలో పనిచేసే రివర్‌ బ్రిడ్జ్‌ సంస్థ, ఇక్రిశాట్‌తో కలిసి టీ హబ్‌ ముందుకు సాగుతూ వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెంచడం, వ్యాపార మెళకువలు, అంతర్జాతీయ మార్కెట్‌ ఆధారంగా ఉత్పత్తి చేపట్టడం, ఆర్థిక సహాయం అందించడం, బడా సంస్థలతో ఒప్పందాలు, ప్రభుత్వాలతో అనుసంధానం వంటి విషయాల్లో కలిసి పనిచేస్తుంది.

కన్సల్టెన్సీ సేవల్లో అంతర్జాతీయంగా ప్రథమ స్థానంలో ఉన్న పీడబ్ల్యూసీ ఇన్నోవేషన్‌ హబ్‌ టీ హబ్‌తో జట్టు కట్టింది. ఈ ఒప్పందం వల్ల 157 దేశాలలో పీడబ్ల్యూసీ ఇన్నోవేషన్‌ కేంద్రాల ఆవిష్కర్తలతో టీ హబ్‌లోని ఔత్సాహికులు అనుసంధానమవుతారు.

తెలంగాణ ఐటీ అసోసియేషన్‌తో కూడా టీ హబ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఐటీ రంగంలో వస్తున్న మార్పులు, కొంగ్రొత్త అవకాశాలను విద్యార్థులకు తెలియజెప్పడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, నూతన నైపుణ్యాలను వివరించడం ఒప్పందంలోని కీలక లక్ష్యాలు.

స్టార్టప్‌లు విజయం సాధించడంలో కీలకమైన నిబంధనలను రూపొందించేందుకు కార్నెగీ పాలసీ హబ్‌ సంస్థ, టీ హబ్‌తో జట్టుకట్టింది. ఆవిష్కరణ విజయపథాన నడిచేందుకు ఇది కీలక పరిణామంగా మారుతుంది.

బ్యాంకింగ్‌ సేవల్లో మెరుగైన మార్పులు తెచ్చేందుకు టీ హబ్‌తో డీబీఎస్‌ ఏషియా హబ్‌ 2 ఒప్పందం కుదుర్చుకుంది. టీ హబ్‌ ఆవిష్కర్తల సేవలను ఈ సంస్థ పొందుతుంది.

విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు గాను సీఎల్‌ ఎడ్యుకేట్‌ సంస్థ టీ-హబ్‌తో జట్టుకట్టింది. సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉద్యోగాలు , ఆవిష్కరణలు ఈ ఒప్పందం లక్ష్యం.

Other Updates