తెలంగాణ ఏర్పాటై ఆరేండ్లు గడిచిన సందర్భంగా ఏటా చేసినట్టుగానే మంత్రి కేటీఆర్‌ ఐటి శాఖ వార్షిక ప్రగతి నివేదికను ఆవిష్కరించారు. అంతకు ముందు అయిదేళ్ల వలె ఈ ఆరవ సంవత్సరంలో కూడా తెలంగాణ ఐటీ రంగం అప్రతిహతంగా ముందుకు దూసుకుపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశంలో ఐటీ మంత్రి కేటీఆర్‌ పర్యవేక్షణలో రాష్ట్ర ఐటీ రంగం కొత్త శిఖరాలను అధిరోహించింది.

రాష్ట్రం ఏర్పడుతున్న క్రమంలో తెలంగాణ రాజధాని హైదరాబాదులో ఐటీ రంగం ప్రగతి కుంటుపడే ప్రమాదం ఉన్నదని కొద్దిమంది చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ మంత్రి కేటీఆర్‌ చేసిన కృషివల్ల మన రాష్ట్రంలో ఐటీ రంగం దినదిన ప్రవర్ధమానమయ్యింది.

తొలి ఏడాదిలో ఇక్కడ ఉన్న ఐటీ పరిశ్రమ అధిపతులతో వరుస సమావేశాలు జరిపి వారికి తెలంగాణ ఒక ప్రగతిశీల రాష్ట్రం అనే భరోసాను కల్పించారు కేటీఆర్‌. తదనంతరం ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక విప్లవాత్మకమైన పారిశ్రామిక విధానం తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దీనివల్ల పారిశ్రామిక అనుమతులు సరళతరం అయ్యాయి. పారదర్శకత పెరిగింది. తొలి ఏడాది చేసిన కృషి, దానికి తోడు సుస్థిర పాలన, నూతన పారిశ్రామిక విధానాలు ఇవన్నిటి ఫలితంగా రాష్ట్రంలోకి పెట్టుబడులు రావడం మొదలైంది.

2015 మే నెలలో తొలిసారి అమెరికాలో పర్యటించిన మంత్రి కేటీఆర్‌ అనేక దిగ్గజ కంపెనీ సీ.ఈ.ఓలను కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టవలసిందిగా ఆహ్వానించారు. గత ఆరేండ్లుగా అనేక వేదిక మీద మంత్రి కేటీఆర్‌ నూతన రాష్ట్రంలో గల అవకాశాలను వివిధ కంపెనీలకు కూలంకషంగా వివరించారు. తత్ఫలితంగానే ఇవ్వాళ ప్రపంచంలోని అనేక ప్రఖ్యాత కంపెనీలు హైదరాబాద్‌ను, తెలంగాణను తమ కార్యకలాపాల స్థాపనకు, విస్తరణకు ఎంచుకుంటున్నాయి.


2020 జనవరి నెలలో స్విట్జర్లాండ్‌ లోని దావోస్‌ నగరంలో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. వరుసగా మూడోసారి తెలంగాణ ప్రతినిధి బృందం ఈ సమావేశాలకు హాజరయ్యి అక్కడ మన రాష్ట్రానికి ఒక ప్రత్యేక పెవిలియన్‌ను నెలకొల్పి సదస్సుకు హాజరైన వారికి రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు. ఈ సమావేశాల్లో అయిదు పానెల్‌ డిస్కషన్లలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ సుమారు 50 మంది పారిశ్రామికవేత్తలు, సీ.ఈ.ఓ.లతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఇందులో అమెజాన్‌, గూగుల్‌, యూట్యూబ్‌, సేల్స్‌ఫోర్స్‌, రాక్వెల్‌ వంటి దిగ్గజ కంపెనీ సీ.ఈ.ఓలు ఉన్నారు.

తెలంగాణ ఏర్పాటైన తొలినాళ్లలోనే రాబోయే అయిదేళ్లలో రాష్ట్ర ఐటీ ఎగుమతులను రెట్టింపు చేస్తామని ప్రకటించిన కేటీఆర్‌ సరిగ్గా అయిదేళ్లలో ఆ మైలురాయిని దాటేటట్టు చేశారు. 2013-14 సంవత్సరానికి సుమారు 57 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఐటీ ఎగుమతులు 2019-20 సంవత్సరాని కి లక్షా ఇరవై ఎనిమిదివేల కోట్లకు చేరుకున్నాయి. అట్లాగే 2013-14లో దాదాపు మూడు లక్ష మంది ఐటీ రంగంలో ప్రత్యక్ష ఉపాధి పొందుతుండగా ఇప్పుడా సంఖ్య రెట్టింపై ఆరులక్షలకు సమీపంలో
ఉన్నది.

2019-20 సంవత్సరానికి తెలంగాణ నుండి ఐటీ ఎగుమతుల వృద్ధి రేటు 17.93శాతం ఉంటే జాతీయ సగటు వృద్ధి రేటు 8.09శాతం మాత్రమే ఉండటం గమనార్హం. అంటే తెలంగాణ వృద్ధిరేటు జాతీయ వృద్ధిరేటు సగటుకు రెట్టింపు కంటే ఎక్కువ అన్నట్టు. రాష్ట్ర అభివృద్ధి పట్ల మన నాయకత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదొక తార్కాణం.

తెలంగాణ ఐటీ రంగం వరుస విజయాలను నమోదు చేసుకోవడానికి మరో ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో వస్తున్న నవీన సాంకేతిక రంగాలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడం. బ్లాక్‌ చైన్‌, వర్చువల్‌ రియాలిటీ, 3డి ప్రింటింగ్‌, బిగ్‌ డేటా, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి రంగాల్లో తెలంగాణ ఎప్పుడో ముందడుగు వేసింది.

2020 సంవత్సరాన్ని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (కృత్రిమ మేధ) సంవత్సరంగా మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. వ్యవసాయం, వైద్య ఆరోగ్య, విద్యా రంగాల్లో కృత్రిమ మేధను వినియోగించే ప్రాజెక్టులపై ఈ ఏడాది దృష్టి సారిస్తామని ఆయన ప్రకటించారు. కృత్రిమ మేధ రంగంలో ఉమ్మడిగా పనిచేయడానికి ఇంటెల్‌, అడోబ్‌, ఎన్వీడియా, ఐ.ఐ.టి-హైదరాబాద్‌, ఐ.ఐ.ఐ.టి-హైదరాబాద్‌ తదితర సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నది తెలంగాణ ప్రభుత్వం.

మంత్రి కేటీఆర్‌ కృషి వల్ల గత ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో నవీన ఆవిష్కరణలకు తోడ్పాటు అందించేందుకు ఏ రాష్ట్రంలో లేనంత సమగ్రమైన వ్యవస్థ ఏర్పాటైంది. తెలంగాణను ఒక అంకుర రాష్ట్రం అని వ్యవహరించే కేటీఆర్‌, ఈ రాష్ట్రంలో అంకుర పరిశ్రమలకు (స్టార్టప్స్‌) ఊతం ఇచ్చేందుకు అనేక విన్నూత్న ఆలోచనలకు ఊపిరి పోశారు. తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ (TSIC), టీ-హబ్‌ (T-Hub), వీ-హబ్‌ (We-Hub), టాస్క్‌ (TASK), టి-వర్క్స్‌ (T-Works), రిచ్‌ (RICH), అనే సంస్థలను స్థాపించి అంకుర పరిశ్రమకు, నూతన ఆవిష్కరణకు తెలంగాణ ఒక సమున్నత వేదికగా మారేందుకు దోహదపడ్డారు.

ఐటీ పరిశ్రము అన్నీ హైదరాబాదులోని మాదాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతంలోనే కేంద్రీకృతం కావడం వల్ల ఉత్పన్నం అయ్యే సమస్యలను అర్థం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం, గత కొన్ని సంవత్సరాలుగా నగరంలోని ఇతర ప్రాంతాలు, రాష్ట్రంలోని ఇతర పట్టణాలలో ఐటీ పరిశ్రమలు స్థాపించేందుకు వీలుగా ప్రోత్సాహకాలు ఇస్తున్నది. హైదరాబాదులో ఉప్పల్‌, పోచారంతో సహా నలుదిక్కులా ఐటీ పార్కులు నెలకొల్పడానికి ప్రత్యేక చొరవ చూపిస్తున్నది.

రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌ నగర్ల‌లో కూడా ఐటీ పార్కుల స్థాపన ప్రక్రియ మొదలైంది. ఇందులో వరంగల్‌, కరీంనగర్‌ ఐటీ పార్కుల్లో కంపెనీల రాక మొదలైంది, మిగతా పట్టణాలలో కూడా ఈ దిశగా పనులు వేగవంతం అయ్యాయి.

పాలనలో కూడా డిజిటల్‌ సేవలు గత ఆరేళ్లలో విస్తృతంగా ప్రవేశపెట్టడం జరిగింది. పౌర సేవలన్నీ మొబైల్‌ ద్వారా అందించే టీ-యాప్‌ ఫోలియో విజయవంతం అయ్యింది. ఏడు లక్షల మంది ఈ యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకుని ప్రభుత్వ సేవలను పొందుతున్నారు. 32 శాఖలకు చెందిన 225 సేవలు ఈ యాప్‌ ద్వారా పౌరులకు లభ్యమవుతున్నాయి.

డిజిటల్‌ చెల్లింపులకోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టి-వాలెట్‌ను పదకొండు లక్షల పైచిలుకు వినియోగదారులు వాడుతున్నారు. దేశంలో ఇటువంటి మొబైల్‌ వాలెట్‌ ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం తెలంగాణ.


కోవిడ్‌ పై పోరుకు సాంకేతిక పరిజ్ఞానం
కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం దానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కూడా విరివిగా వినియోగిస్తున్నది కోవిడ్‌-19పై సమాచారం, నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పౌరులకు తెలియజేసేందుకు ఒక సమాచార వెబ్‌ సైట్‌, ఒక మొబైల్‌ యాప్‌, వాట్సాప్‌ చాట్‌ బాట్‌ ప్రారంభించింది. అలాగే కరోనా గురించి సామాజిక మాధ్యమాలో వ్యాపిస్తున్న తప్పుడు సమాచారం, ఫేక్‌ న్యూస్‌ గురించి ప్రజను అప్రమత్తం చేయడానికి ఫ్యాక్ట్‌చెక్‌ పేరిట ఒక వెబ్‌ సైట్‌ కూడా ప్రారంభించింది తెలంగాణ సర్కార్‌.

‘‘కరోనా వైరస్‌ పై పోరుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నది. అన్ని వేదికలను ఉపయోగించుకుంటున్నది. కరోనా మహమ్మారిపై పౌరులకు ప్రామాణికమైన సమాచారం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ వెబ్‌సైట్‌, చాట్‌ బాట్‌, మొబైల్‌ యాప్‌ తయారుచేసింది. ప్రజలు అధికారిక మాధ్యమాల ద్వారా విడుదల చేసిన సమాచారంపైనే ఆధారపడాలి.’’ అని ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కేటీ రామా రావు అన్నారు.

కొణతం దిలీప్‌

Other Updates