నాగబాల సురేశ్‌కుమార్
తెలుగునాట తేనెకన్నా తీయని
తెలుగుభాషను వెలుగుభాషగా మార్చిన మహా కవి పుంగవులెందరో.. ఎందరెందరో.. వారిలో.. వ్యాస విరచిత భారతేతిహాసాన్ని కమనీయ కథా సంవిధానంతో కావ్య కల్పతరువులుగా ఆంధ్రీకరించిన కవిత్రయము నన్నయ, తిక్కన, ఎఱ్ఱాప్రగడలు, సరళమైన తెలుగుభాషను సుసంపన్నం చేసిన మహాకవులు. వారంతా నిత్య స్మరణీయులు. ఆ ముగ్గురూ ఒక ఎత్తైతే, వ్యాసభాగవతాన్ని భక్తిరస కావ్యంగా తెలుగువారి కందించిన సహజకవి బమ్మెర పోతన మరొక ఎత్తు. పోతన భాగవతంలోని ఒక పద్యమైనా రాని తెలుగువారు లేరనటం అతిశయోక్తి కాదు. తెలుగువారి హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న విశిష్టకవి మన పోతనామాత్యుడు. నన్నయ మొదలు విశ్వనాథ వరకుగల కవులతో సరితూగగల స్థాయిలో మహాకావ్య రచన గావించిన, అమూల్య సాహిత్య సంపదను తెలుగువారి కందించిన అద్వితీయ కవితా విశారదుడు, వాగీశ్వరీమంత్రసిద్ధిని పొందిన మహనీయుడు పుంభావసరస్వతి ”మన వానమామలై” వరదాచార్యులవారు.
”పోతన చరిత్రము” వ్రాసి ”అభినవ పోతన”గా వాసికెక్కిన శ్రీమాన్ వానమామలై వరదాచార్యులు మహాకవుల మన్ననలొందిన కవికుల తిలకుడు. ”నా తెలంగాణా కోటి రతనాల వీణ”యని ఎలుగెత్తి చాటిన దాశరథి కృష్ణమాచార్యులకు అతి సన్నిహితుడు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, పద్మవిభూషణ్ ఆచార్య సి. నారాయణరెడ్డికి అత్యంత ఆప్తుడు మన వరదాచార్యులు. ”మన వానమామలై” తెలంగాణా కవులలోనే అగ్రగణ్యుడు, అపూర్వ సాహితీ దురంధరుడు. ”మణిమాల”గా వెలువడిన పద్యకృతి ”విప్రలబ్ధ, జయధ్వజం, ఆహ్వానం” వంటి గేయకృతులు, ఎన్నో వ్యాసాలు, మరెన్నో నాటకాలు, బుఱ్ఱకథలు ఎన్ని వ్రాసినా.. తెలుగు సాహిత్యంలో ఆయనకు సుస్ధిరస్థానాన్ని, పేరు ప్రఖ్యాతుల్ని, గౌరవాదరాలను సముపార్జించి పెట్టింది మాత్రం ”పోతన చరిత్రము”. తొలి తెలుగు కవుల శైలికి దీటైనదీ అపూర్వగ్రంథం. అనేకానేక అలంకారాలతో, అష్టాదశ వర్ణనలతో, పట్టు సడలని కథాసంవిధానంతో మహాభాగవత కర్త మహాకవి బమ్మెరపోతన జీవిత విశేషాలను అద్వితీయ ప్రబంధంగా అందించిన వారు మన వరదాచార్యులు.
కళలకు కాణాచి, కాకతీయుల రాజధాని, పలువురు సాహిత్యకారులు కొలువుదీరిన నేల ఓరుగల్లు. ఓరుగల్లు సమీపంలోని ”బమ్మెర” గ్రామం పోతన్న జన్మస్థలమైతే, అదే ప్రాంతానికి చెందిన ”మడికొండ” గ్రామం మన వరదన్న జన్మస్థలం కావడం యాదృచ్ఛికం. పోతన్నకు సిద్ధుడు తారకమంత్రోపదేశం చేసి, ”వాణి నీ జిహ్వాగ్ర మందుండు”నని దీవిస్తే, వరదన్న వాగీశ్వరీ మంత్రోపాసన చేసి వరసిద్ధిని పొందాడు. పోతన్నకు రామచంద్ర విభుడు స్వప్నంలో సాక్షాత్కరిస్తే, వరదన్నకు రామతారక మంత్రోపదేశం లభించింది. నిర్ధనత్వంలోనూ, నిరాడంబరత్వంలోనూ, నిరుపమాన కవితాశక్తిలోనూ, ఇరువురికి సామ్యం ఉంది. ఇద్దరు మహాకవుల జీవితాలలోగల సాదృశ్య ఘట్టాలను చూసి తెలుగు రచయితల సంఘం ఈ మహానుభావునికి ”అభినవ పోతన” బిరుదునిచ్చి సత్కరించింది.
ఆ కాలంలో తెలంగాణా మండలంలో పురాణ కాలక్షేపానికి బక్కయ్యశాస్త్రి పెట్టింది పేరు. బక్కయ్యశాస్త్రి కుటుంబం వైదిక కార్యకలాపాలకు, నియమ నిష్టలకూ పెట్టింది పేరు. ఆయన ధర్మపత్ని సీతాంబ మహాసాధ్వి, భర్తకు తగ్గ ఇల్లాలు. ఈ పుణ్యదంపతుల కనిష్ట సంతానమే మన వరదన్న, తండ్రినుండి సంగీత సాహిత్యాలతో పాటు పాండిత్యాన్ని, తల్లినుండి సౌమ్యతనూ, మంచితనాన్ని పుణికిపుచ్చు కున్న మహనీయుడు. అగ్రజులైన వేంకటాచార్యులు, లక్ష్మణాచార్యులు, జగన్నాథాచార్యులు సహితం బహుముఖ ప్రజ్ఞాశాలురే కావడంవల్ల ఆ ఇల్లొక విజ్ఞాన నిలయంగా భాసిల్లేది. ప్రజాకవి కాళోజీ, పల్లా దుర్గయ్య, ఆచార్య బిరుదురాజు రామరాజువంటి మహానుభావులు ఆ ఊరి వారేకాక, ఆచార్యులవారికి ఆత్మీయులు. వీరందరి ప్రోత్సాహంతో ఎదిగిన మహాకవి మన వానమామలై. వరదన్న పుట్టి పెరిగింది మడికొండలోనే అయినా స్థిరపడింది తాతముత్తాతల ఊరైన చెన్నూరులోనే. ‘చెన్నూరు’ గ్రామం అడవుల జిల్లాగా ప్రసిద్ధిగాంచిన ఆదిలాబాదులో వుంది. ఇక్కడ గోదావరి నది ఉత్తరవాహిణిగా ప్రవహిస్తోంది. పద్దెనిమిదవ యేట మేనమామ కొదుమగుళ్ళ జగన్నాథాచార్యుల ఏకైక పుత్రిక ‘వైదేహి’తో ఆచార్యుల వివాహం జరిగింది.
వరదన్నకు చిన్ననాటనే బాల్యగురువైన కాళోజీ రంగారావు శ్రీరామ తారక మంత్రోపదేశం గావించారు. మంథెనవాసి మేనమామ తిరువరంగం గోపాలాచార్యులు ఆచార్యులకి వాగీశ్వరి మంత్రోపదేశం చేయగా, ఖాజీపేట సమీపంలోగల మెట్టుగుట్టపై ఎనభైరోజులు కఠోరదీక్షతో ఉపాసించి వాణీ కటాక్ష వరసిద్ధిని పొందిన విద్వద్వరేణ్యులు వరదన్న, అమ్మ కృపా కటాక్ష వీక్షణాలతో ఆయన జన్మధన్యమైంది. నాటినుండి ఆ కలం సాహిత్యవనంలో హలమై సంచలనాలకు శ్రీకారమైంది. మంగళ హారతులతో మొదలిడి, గోపాలబాలుని లీలలను ‘దాగుడుమూతలు’ పద్యకావ్యంగా వ్రాసి తొలినాళ్ళలోనే అనేక సామాజిక, ఆధ్యాత్మికాంశాలను వస్తువులుగా గైకొని, వస్తువైవిధ్యంతోపాటు వర్ణనాత్మకమైన ‘మణిమాల’ను వెలువరించారు. ‘జయధ్వజం, ఆహ్వానం’ లఘుకావ్యాలు. ప్రణయశృంగారము కావ్యవస్తువుగా గైకొని ‘విప్రలబ్ధి’ గేయకావ్యం వ్రాసి పలువురి ప్రశంసలందుకున్నారు మన వరదన్న.
వృత్తిరీత్యా దోమకొండ జనతాకళాశాలలో సాంస్కృతిక కార్యనిర్వాహ కులుగా పనిచేస్తున్న కాలంలో అనేక నాటికలు, బుఱ్ఱకథలు రచించి, విద్యార్థులచేత ప్రదర్శింపజేసి తద్వారా మాతృదేశభక్తిని ప్రబోధిస్తూ ప్రగతిబాటను చూపిన ఆదర్శ కవివరేణ్యులు వరదాచార్యులు. మార్కండేయ పురాణంలోని చిన్నకథను ‘వైశాలినీ పరిణయం’ అనే మహానాటకంగా మలిచి, ‘కావ్యేషు నాటకం రమ్యం’ అన్న మాటను సార్థకం చేశారు మన వానమామలై. ‘అభినవ కాళిదాసు’ అనే బిరుదును కూడా పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి వరదన్న. ‘స్తవరాజ పంచశతి, స్తోత్ర రత్నావళి, సూక్తి వైజయంతి’ వంటి రచనలు ఆయనలోని భక్తిభావ పరిపుష్ఠిని, మానవతా దృక్పథాన్ని, సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని నైతిక విలువలపట్ల గౌరవాన్ని చాటి చెప్పుతాయి.
‘ఆంధ్రకవి వతంస, మధుర కవి, కవికోకిల, ఉత్ప్రేక్షా చక్రవర్తి, మహాకవి శిరోమణి, కవిశిరోవతంస’వంటి ఎన్నెన్నో బిరుదులు వరదన్నను వరించాయి. 1968లో వీరి ‘పోతన చరిత్ర’ కావ్యానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డు లభించటం ఆయన అపూర్వ ప్రతిభకు చిన్న తార్కాణం. 176లో సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయము, వారణాసి వారు ‘విద్యావాచస్పతి’ (డిలిట్) గౌరవ డాక్టరేట్’ను ప్రదానం చేశారు. ఇది తెలుగు సాహిత్యానికి ఆయన అందించిన సేవలకు నిదర్శనం ఆ బిరుదు. వరదాచార్యులకి జరిగిన సత్కారాలకు అంతులేదు. పొందిన బిరుదులకు లెక్కలేదు. అవన్నీ ఒక ఎత్తైతే 1973 మార్చి నెలలో కరీంనగర్ జిల్లా కోరుట్లలో జరిగిన పౌర సన్మానం ఒక ఎత్తు. ఏ కవికీ జరుగని రీతిలో ఆచార్యులవారి అంతేవాసి, ఆచార్యుల గ్రంథాలపై సిద్ధాంతవ్యాసం సమర్పించిన అందే వెంకటరాజం నేతృత్వంలో నాడు జరిగిన సన్మానం ‘నభూతో నభవిష్యతి’ అన్నట్లుగా జరిగింది. సాహితీ దురంధరులు సినారె, దాశరథి, దివాకర్ల, పల్లా దుర్గ య్య, కాళోజీవంటి పలువురు కవి పండితుల సమక్షంలో జరిగిన ఆ ఘన సన్మానం వేలాది ప్రేక్షకులను తన్మయులను చేసింది. నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అపర చాణక్యుడు పధ్నాలుగు భాషలలో పండితుడు, రాజకీయ మేధావి పాములపర్తి వేంకట నరసింహారావు ఆచార్యుల కాలికి గండపెండేరం అలంకరించిన దృశ్యం, అలనాడు అల్లసానిని శ్రీకృష్ణదేవరాయలు గండపెండేరంతో సత్కరించారు. ఆ సభలోనే స్వర్ణకంకణ ప్రదానం, రత్నాభిషేకం వంటి గౌరవ పురస్కారాలకు నోచుకున్న మన వానమామలై పుంభావ సరస్వతిగా పూజలందుకున్న పుణ్యజీవి, ధన్యజీవి.
ఆయన ‘భోగినీలాస్యం’ కావ్యగానమంటే పండిత పామరులందరూ చెవికోసుకునేవారు. పోతన చరిత్రలోని ఒక ఘట్టమైన ‘భోగినీలాస్య’ వృత్తాంతాన్ని అపూర్వంగా రూపొందించిన ఘనత మన వరదాచార్యుల వారిది. అనేక నాట్య రహస్యాలను నిష్ణాతులైన నాట్యాచార్యులనుండి తెలుసుకుని ప్రపంచ సాహిత్యంలోనే నృత్యాన్ని వర్ణిస్తూ రచించిన ఇంతటి అమోఘమైన కవిత్వం లేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. వీరు మరాఠీ భాషనుండి అనువదించిన ‘గీతా రామాయణ’ కావ్యం చాలాకాలంపాటు ఆకాశవాణిలో పలుమార్లు ప్రసారం చేయబడి శ్రోతలనలరించింది. ఈ మహాకవి సాహితీ గరిమకు అబ్బురపడ్డ నాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఆచార్యులని నిజామాబాదు జిల్లా దోమకొండ జనతా కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకులుగా నియమించారు. అక్కడ పనిచేస్తున్న సమయంలో, అశేష పాండితీప్రకర్షతో భాసిల్లుతున్న ఆచార్యులకి ఉద్యోగ నిమిత్తం ప్రమాణ పత్రం అవసరం ఏర్పడింది. పట్టాలులేని సహజ పండితుడాయన. పట్టాకోసం ఆంధ్రసారస్వత పరిషత్తువారి విశారద పరీక్షకు కూర్చొని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఆ పరీక్షకు ఆయన రాసిన కావ్యమే ‘మణిమాల’ పాఠ్యాంశంగా వుండటం, గమ్మత్తైన విషయం కాకపోతే మరేమిటి?
1961లో దోమకొండ నుండి బదిలీ అయి చెన్పూరు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. ఉపాధ్యాయులుగా వున్న కాలంలో ఎందరో విద్యార్థులను ప్రభావితులుగా చేశారు. 1972లో
ఉపాధ్యాయ వృత్తిలో పదవీ విరమణ పొందిన తరువాత విధాన పరిషత్ సభ్యులుగా (ఎమ్మెల్సీ)గా ఎంపిక కాబడి 1978 వరకు ప్రజలకు, ప్రభుత్వానికి తమ అమూల్యమైన సేవలందించిన కర్తవ్య పరాయణుడు మన వానమామలై. వరదాచార్యులవారు నిరంతర కవితోపాసకులు. నిరాడంబర జీవన గమనులు. అసమాన మానవతావాదులు, సర్వమానవ సౌభ్రాతృత్వం, కులాతీత, మతాతీత, వసుధైక కుటుంబ వాదులు, నిండు మనస్సు, నిర్మల చిత్తం, చూడగానే ఆకట్టుకోగలిగే స్ఫురద్రూపం, మధుర గంభీర స్వరం, కలిగిన వరదాచార్యులవారిని ఒకసారి చూచినవారు ఎన్నటికీ మరువలేరు. వరదాచార్యుల జీవిత గమనంలో అశనిపాతంలా క్షయవ్యాధి సోకింది. ఆ వ్యాధి ఆచార్యులవారి ఒక ఊపిరితిత్తిని సైతం బలిగొన్నది. చికిత్సకై ఆయన మైసూరులో ఉన్నప్పుడు, విషయం తెలిసిన మైసూరు మహారాణి ఆసుపత్రి ఖర్చులు సర్వం తాము భరించి వారిపై ఆమెకుగల గౌరవాన్ని, అభిమానాన్ని చాటుకున్నారు.
మన వానమామలై అంటే పీవీకి ఎనలేని అభిమానం. అందుకే వారిని పోతనతో పోలుస్తూ ‘పోతన జీవితానికీ, వరదన్న జీవితానికి ఎంతో సామ్యం వుంది. నిర్ధనత్వంలో సామ్యం ఉంది. అమృత హృదయంలో సామ్యం ఉంది. కవితా వైభవంలో సామ్యం ఉంది. ఉదాత్త కల్పనలో సామ్యం ఉంది’ అని పొగడుతూ పోతన్న చరిత్ర వరదన్న వ్రాస్తే, వరదన్న చరిత్ర ఎవరైనా రాయబూనితే బాగుండునని అన్నారు. ఆచార్యుల పోతన చరిత్రను శ్లాఘిస్తూ, డాక్టర్ దివాకర్ల వేంకటావధాని ‘నవ్యకవితా శోభితమయ్యూ, ప్రాచీనతా పరిమళముల గుబాళింపుల బుక్కిలించిన ఆధునికాంధ్ర మహాకావ్యమని’ అన్నారు. ‘ఆచార్యుల వారెంత గొప్ప కవిశేఖరులో అంత నిరాడంబరజీవులని’ మాడపాటి హనుమంతరావు అంటే ‘ఆధునిక తెలంగాణ మహాకవికి నా అభినందనలు’ అని బూర్గుల రామకృష్ణారావు ప్రశంసించారు. ప్రజాకవి కాళోజీ వారిరువురి మధ్యగల అనుబంధాన్ని చెబుతూ ‘వరదన్నకు పోతన్న సంగతి తెలుసు. వరదన్న సంగతి కాళన్నకి తెలుసు. ఇది కవికుల మైత్రి. కన్నీటిలో మున్నీటి మస-పస. రెంటిలోనూ వున్నది ఉప్పెన. రెండూ తెస్తాయి ఉప్పెన, ఇసుక దిబ్బలను చేస్తాయి క్షాళన’ అన్నారు మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు. ‘ఆచార్యులు మట్టిలోనుండి వెలువడిన మణి’ అని కీర్తించారు. ‘నిన్నేమని వినుతింతును అన్నా! వరదన్నా!’ ‘నీ మనసు వెన్న, తనువు వెన్నమాట తీరువెన్న!’ అన్నారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఆచార్య సినారె.
పలువురి మన్ననలందిన మహనీయుని జీవితంలో ఆఖరు క్షణాలు గుర్తుకువస్తే ఎవరికైనా దుఃఖం పొంగుకొస్తుంది. అపర సరస్వతీపుత్రులు, విద్వన్మణి, విద్యావిశారదుడు శృతులను, స్మృతులను ఔపోసన పట్టిన కృతికర్తకే స్మృతిపోవడం కాలవైచిత్రి కాక మరేమిటి? 31 అక్టోబర్ తెలుగు సాహిత్య రంగానికి ఒక దుర్దినం. సాహిత్యాభిమానులకు ఒక చీకటి దినంగా మారినరోజు… భారతరత్నం ఇందిరాగాంధీ అమానుషంగా హత్యకు గురైన దురదృష్టకరమైనరోజు.. అదే రోజున అంటే 1984 అక్టోబర్ 31న ఆచార్యులవారు కూడా అంతిమశ్వాస తీసుకున్న అతివిచారకరమైన రోజు. తెలుగు సాహిత్యాభిమానులు, రచయితలు, కళాకారులు, వరదన్న ఆత్మీయులంతా విషాద సాగరంలో మునిగిపోయిన దురదృష్టకరమైన రోజు ఆరోజు.
ఒక జ్యోతి ఆరిపోయింది. ఒక మహాకవిని కాలం తన కబంధ హస్తాల్లో కరిగించివేసింది. వాగ్దేవి హృదయం తల్లడిల్లి మూగబోయింది. ఒక తెలుగు సాహితీ వటవృక్షం కూలిపోయింది. జనహృదయాలలో చెరగని ముద్రవేసిన ఒక సాహితీ దురంధరుడ్ని స్వర్గం తన చెంతకు రప్పించుకుంది. చెన్పూరు గ్రామం శోక సముద్రంలో మునిగిపోయింది. ‘కవికి కళాకారుడికి మరణం వుండదంటారు’ తెలుగు సాహిత్యం
ఉన్నంతకాలం మన వానమామలై కూడా జీవించే వుంటారు. కాలం తన కరాళహస్తాల్లో కరిగించివేసినా, కలంతో ఆయన సృష్టించిన రసరమ్య కావ్యాలు చిరస్థాయిగా భావితరాలవారికి నిత్య గుబాళింపులను అందిస్తాయి. తెలంగాణాలో కవులు – లేరన్న అపప్రథను తొలగించి, విశ్వనాథవంటి మహాకవులచే కీర్తించబడ్డ మహాకవీశ్వరుడు, సాహితీ దురంధరుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, తన జీవితాన్ని అభ్యుదయ రచనలకై అంకితం చేసిన మహానుభావుడు, పండితులతోపాటు పామరు లనుసైతం అలరింపజేసిన ప్రాజ్ఞుడు, ప్రాత:స్మరణీయుడు మన అభినవపోతన, తెలుగుజాతి గర్వించదగిన ఉత్తమ కవిసార్వభౌముడు మన వానమామలై. కాలం వున్నంతకాలం, వెలుగు వున్నంతకాలం వరదన్న సాహిత్య పరిమళాలు గుబాళిస్తూనే వుంటాయి. ఆ సువాసనలే ఆయన శిష్యులకు అభిమానులకు, ఆప్తులకు ఉత్తేజాన్నిస్తాయి.