magaదేశంలో అగ్రగామిగా నిలిపేందుకు సంపూర్ణ సహకారం అందిస్తా: రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖరరావు

సిద్ధిపేట జిల్లా అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిందని జిల్లాలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు తనవంతు సంపూర్ణ సహకారం అందిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. సిద్ధిపేట జిల్లా పర్యటనలో భాగంగా కొండపాక మండలం నాగులబండవద్ద 51 కోట్ల 20 లక్షలతో నిర్మించనున్న సమీకృత కలెక్టర్‌ కార్యాలయ భవన సముదాయం, 12 కోట్లతో నిర్మించనున్న పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయానికి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎన్సాన్‌పల్లి శివారులో 715 కోట్లతో నిర్మించనున్న మెడికల్‌ కళాశాల భవనానికి కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సిద్ధిపేట బైపాస్‌ రోడ్‌వద్ద నిర్వహించిన బహిరంగసభలో భారీగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. నాకు జన్మనిచ్చింది, రాజకీయ జన్మనిచ్చింది, మాట్లాడే గళాన్ని చ్చింది, పోరాడే బలాన్నిచ్చింది, తెలంగాణా సాధించే శక్తినిచ్చింది-సిద్దిపేట అని, సిద్ధిపేటకు ఎంత చేసినా ఋణం తీర్చుకోలేనిదని, ఈ గడ్డకు తలవంచి నమస్కరిస్తానని అన్నారు. 1983లోనే సిద్ధిపేట జిల్లాను ఏర్పాటు చేయాలని నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆదిలాబాదు పర్యటన సందర్భంగా సిద్ధిపేట అంబేద్కర్‌ చౌరస్తావద్ద దరఖాస్తు అందించానని గుర్తు చేశారు.

అయినా చేయలేదని, అన్ని రాష్ట్రాలలో పరిపాలన సంస్కరణలు చేపట్టి జిల్లాల సంఖ్యను పెంచినప్పటికీ, పశ్చిమబెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు మాత్రం జిల్లాల సంఖ్యను పెంచలేదని అన్నారు. ఉనికికోసం, నీళ్ళకోసం, నిధులకోసం, ఉద్యోగాలకోసం ఉద్యమం చేసి రాష్ట్రం సాధించుకున్నామని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10 జిల్లాలను 31 జిల్లాలుగా చేశామని, గత దసరా రోజున నేను స్వయంగా సిద్ధిపేట జిల్లాను ప్రారంభించానని ఆయన తెలిపారు. అన్ని జిల్లాలకు కలెక్టరేట్‌ భవనాలు డిజైన్‌ చేసి 1300 కోట్లు మంజూరీ చేసి సంవత్సరం తర్వాత నేడు అదేరోజు పనులు ప్రారంభించుకుంటున్నామని, నేను స్వయంగా సిద్ధిపేట జిల్లా కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులు, పోలీస్‌ కమిషనరేటు భవన నిర్మాణ పనులు ప్రారంభించడంద్వారా నా జన్మ ధన్యమైందని తెలిపారు. సిద్ధిపేట జిల్లా తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయలాంటిదని అన్నారు. ఇక్కడ యువ రాజకీయ నాయకులున్నారని, రాష్ట్ర భారీ నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభివృద్ధికోసం పోటీపడి పనిచేస్తున్నారని అన్నారు. జిల్లా అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

జిల్లా కలెక్టర్‌ పనితీరుపై ముఖ్యమంత్రి ప్రశంసల జల్లు

జిల్లాలో కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి రాత్రిపగలు తేడా లేకుండా అభివృద్ధి పనులను వేగవంతంగా అమలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖరరావు ప్రశంసించారు. జిల్లాలో రెండు పడకల గదుల నిర్మాణంలో అత్యధికసంఖ్యలో ఇండ్లు మంజూరు చేసి త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారని అన్నారు. జిల్లాకు ప్రత్యేకంగా మరో వెయ్యి డబుల్‌ బెడ్రూం ఇండ్లు అదనంగా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కోమటి చెరువు అభివృద్ధికి మరో 25 కోట్లు అదనంగా మంజూరు చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. త్వరలో రంగనా యకసాగర్‌కు గోదావరి నీరు తెస్తానని, రంగనాయక సాగర్‌ను ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలోని లేనివిధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం అన్నారు. రాష్ట్రంలో రైతులకు 24 గంటలు కరెంటు సరఫరా చేస్తున్నామన్నారు. ఒంటరి మహిళలకు వెయ్యి రూపాయల పెన్షన్‌ అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన బాలింతలకు కేసీఆర్‌ కిట్‌లు అందిస్తున్నామని, ఆడపిల్ల పుడితే 13వేలు, అబ్బాయి పుడితే 12వేలు అందిస్తున్నామని తెలిపారు. దీనివల్ల గతంలో ఆసుపత్రుల్లో 1లక్షా 60వేలు ప్రసవాలు జరిగితే నేడు 4 లక్షల 50వేలకు పెరిగిందని సీఎం తెలిపారు. ప్రభుత్వ వైద్యులకు ఈ సందర్భంగా సెల్యూట్‌ చేస్తున్నానని అన్నారు. పేదల సేవలో పనిచేస్తున్న డాక్టర్లు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. రాష్ట్రంలో రైతులు అప్పులపాలు అయినారు. అందుకే 17వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశామని అన్నారు. ప్రపంచంలో ఎక్కడాలేనివిధంగా వచ్చే సంవత్సరంనుంచి ఎకరాకు 8వేల చొప్పున రెండు పంటలకు పెట్టుబడులు అందిస్తామని అన్నారు. రాష్ట్రంలో రైతులకు కరెంటు కోతలు లేవు, విత్తనాల, ఎరువుల కొరత లేదు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ఇన్ని చేసినా రైతులు సంఘటితంగా లేక ఒకేతీరు పంటలువేసి నష్టపోతున్నారు. ఈ సంవత్సరం 50లక్షల ఎకరాల్లో పత్తి పంట వేశారు. అందుకే రైతులు సంఘటితంగా ఉంటేనే మద్ధతు ధర లభిస్తుందన్నారు. ఇలాంటి విషయాల్లో ఎక్కడాలేనివిధంగా ప్రభుత్వమే పూనుకుని రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేసిందని అన్నారు. రైతులు ఈ సమితులను సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిద్ధిపేటకు రైలు వస్తుంది, సాగునీరు వస్తుంది. వృత్తి పనులను ప్రోత్సహిస్తున్నాం. 5వేల కోట్లతో రాష్ట్రంలో 84 లక్షల గొర్రెల పంపిణీకి ఇప్పటికే 25 లక్షలు పంపిణీ చేశామన్నారు. సిద్ధిపేటను గొప్ప పట్టణంగా, వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు.

రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ మిషన్‌ భగీరథ ద్వారా రాష్ట్రంలోని ప్రజలందరికీ ఇంటింటికీ తాగునీరు అందించేందుకు కృషి చేసిన అపరభగీరథుడు మన ముఖ్యమంత్రేనని అన్నారు. 25 ఏండ్ల క్రితం సిద్దిపేట శాసనసభ్యులుగా చేసిన పను లను ఇప్పడు సీఎంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసిన మహోన్నత వ్యక్తి అన్నారు. హరితహారంలో దేశంలోనే అగ్రాగామిగా నిలిచిందని అన్నారు. జిల్లాకు మంచి కలె క్టర్‌ను ఇచ్చిన సీఎం అని కొనియాడారు. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు జిల్లా అభివృద్ధికి ఒక కుటుంబంలా పనిచేస్తున్నామని అన్నారు. హుస్నాబాద్‌, చేర్యాల ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయని ముఖ్యమంత్రి ఆశీస్సులతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, ఫారూక్‌ హుసేన్‌, భూపాల్‌రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, వీ సతీష్‌కుమార్‌, రసమయి బాలకిషన్‌, జెడ్పీ చైరపర్సన్‌ రాజమణీ మురళీయాదవ్‌, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్‌, డీజీపీ అనురాగ్‌శర్మ, జిల్లా కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, జిల్లా నలుమూల లనుంచి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు.

Other Updates