– మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి


తెలంగాణ పోరాటంలోను, తెలంగాణ సాధించిన తరువాత బంగారు తెలంగాణ నిర్మాణంలోను ఇంజనీర్ల పాత్ర ఎంతో గొప్పదని రవాణా, రోడ్లు,భవనాలు, శాసనసభ వ్యవహారాలశాఖా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కొనియాడారు. వారి కృషి వల్లనే మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు విజయవంతంగా సాగుతున్నాయన్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంజనీర్‌ కాకున్నా సోషల్‌ ఇంజనీర్‌ అని ప్రశంసించారు. కేసీఆర్‌ పట్టుదల, దూరదృష్టి వల్లనే కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయన్నారు. ఇంత గొప్ప కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నర సంవత్సరాలలో పూర్తి చేయడం మామూలు మాట కాదన్నారు. అనితర సాధ్యాన్ని, సుసాధ్యం చేయడంలో కేసీఆర్‌ ముందువరసలో ఉంటాడన్నారు. తెలంగాణలో గొప్ప ఇంజనీర్‌ నవాజ్‌ అలీ జంగ్‌ జయంతిని ప్రభుత్వం ఇంజనీర్స్‌డేగా ప్రకటించిందని, అప్పటి నుంచి ఆయన జయంతిని ప్రభుత్వం జరుపుతోందన్నారు. హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ఇంజనీర్స్‌డే సందర్భంగా తెలంగాణ ఇంజనీర్ల జేఏసీ, రిటైర్డ్‌ ఇంజనీర్ల జేఏసీలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

నవాజ్‌జంగ్‌ ఆసియాలోనే మొట్టమొదటిసారి నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు గేట్లు ఏర్పాటుచేసి నిర్మించారన్నారు. నిజాంసాగర్‌, నిజాం షుగర్‌ ఫ్యాక్టరీలను నిర్మించి నిజామాబాద్‌ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేశారని, అక్కడి రైతుల్లో ఎంతో ఆత్మస్థైర్యం నింపారని అన్నారు. 8వేల ఎకరాలను నిజాం షుగర్‌ ఫ్యాక్టరీకి ఇప్పించి ఆ భూమిలో రైతులు చెరుకు పండించి ఫ్యాక్టరీకి పంపేలా ఏర్పాట్లు చేశారన్నారు. ఇలా రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఎన్నో ప్రణాళికలు రచించినట్లు మంత్రి పేర్కొన్నారు. నవాజ్‌అలీ జంగ్‌ జీవితచరిత్రను పాఠ్యాంశంగా చేర్చడానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు.

తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ వి.ప్రకాష్‌ మాట్లాడుతూ, అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ గురించి మనకు తెలిసింది పదిశాతం మాత్రమేనని, ఇంకా ఎంతో తెలుసుకోవాల్సి ఉందన్నారు. హైదరాబాద్‌ స్టేట్‌ ఉన్నపుడు స్టేట్‌లోని 8 ప్రాంతాలలో ప్రాజెక్టులు కట్టడానికి నవాజ్‌జంగ్‌ ప్లాన్‌లు తయారుచేశాడన్నారు. అనంతరం ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్‌లో ఆయన ప్రతిపాదనలు అటకెక్కించారన్నారు.

ఆ ప్రాజెక్టుల ప్రతిపాదనలకు సంబంధించిన పత్రాలను తాము బయటకు తీశామన్నారు. ఇప్పుడు కేసీఆర్‌ వాటికి ప్రాణంపోసి జలాశయాల నిర్మాణానికి కృషి చేస్తున్నాడని కొనియాడారు. తాను ఆత్మలను నమ్మనని కానీ నవాజ్‌జంగ్‌ ఆత్మ కేసీఆర్‌లో ప్రవేశించిందా.. అనిపిస్తుందన్నారు. నవాజ్‌జంగ్‌ చరిత్రపై వంద పీహెచ్‌డీలు చేయవచ్చన్నారు. నవాజ్‌జంగ్‌ వారసులు ఇబ్బందుల్లో ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.

రోడ్లు, భవనాలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సునీల్‌శర్మ మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అయ్యాక తాగు, సాగునీరు, రోడ్లు ఇతర మౌలిక వసతుల కల్పనలో ఎంతో ముందుందన్నారు. అతితక్కువ వ్యవధిలో బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేయడం ఇక్కడి ఇంజనీర్ల అద్భుతమని కొనియాడారు.

అలీ నవాజ్‌జంగ్‌ జయంతి జులై 11ను ఇంజనీర్ల డే గా ప్రకటించడం ఎంతో గొప్ప నివాళి అని ఇంజనీర్ల జేఏసీ వైస్‌ ఛైర్మన్‌ శ్రీధర్‌రావు దేశ్‌పాండే అన్నారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి అలీ నవాజ్‌జంగ్‌ అని కొనియాడారు. ఇంజనీర్ల జేఏసీ ఛైర్మన్‌ టి.వెంకటేశం సభకు అధ్యక్షత వహించారు.

రిటైర్డు ఇంజనీర్లు పెంటారెడ్డి, వెంకట రామారావు, జ్ఞానేశ్వర్‌, కిషన్‌లకు జీవితకాల సాఫల్య పురస్కారాలను మంత్రి ప్రశాంత్‌రెడ్డి అందచేశారు. వారు ప్రాజెక్టులు, మంచినీటి వసతులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలలో చేసిన కృషిని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్లు, రిటైర్డ్‌ ఇంజనీర్ల సంఘం నాయకులు రవీందర్‌రావు, గణపతిరెడ్డి, రామేశ్వరరావు, చంద్రమౌళి, శ్యాంప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంజనీర్ల జేఏసీ రూపొందించిన సావనీర్‌ను మంత్రి ప్రశాంత్‌రెడ్డి విడుదల చేశారు.

Other Updates