కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నాయకత్వంలో అన్ని రంగాల్లో ముందు కెళ్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. భోపాల్‌లో జరిగిన అన్ని రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల సదస్సులో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ… సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ తమ ప్రభుత్వం ముందుకు పోతోందన్నారు. దేశంలోనే అత్యధికంగా పింఛన్లు అందజేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని…దాదాపు 40 లక్షల మందికి ఆసరా ద్వారా ప్రభుత్వం అండగా ఉందన్నారు. గతంలో 200 రూపాయల పింఛన్ మాత్రమే ఇచ్చేవారని…దానిని సీయం కేసీఆర్ 1000 రూపాయలకు పెంచారన్నారు. వికలాంగులకు 15 వందల రూపాయల పింఛన్ ఇస్తున్నామని తెలిపారు.
పేదరికంపై యుద్ధం చేసే లక్ష్యంతో 2014 ఆగస్టులో ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సర్వే నిర్వహించామన్నారు. దీని ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించ గలిగిందని, ఈ సర్వే ఆధారంగా పింఛన్ల పంపిణీలో మార్పులు చేశామని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నుండి ఏ తోడూ లేని దాదాపు లక్ష మందికి పైగా ఒంటరి మహిళలకు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నాం. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
ఇప్పటికే 5765 పంచాయతీలను కంప్యూటరీకరించామని… త్వరలో అన్ని పంచాయతీల్లోనూ ఆన్‌లైన్ సేవలను అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. తెలంగాణా ఏర్పడ్డ తర్వాత అవినీతి రహిత పాలనకు కృషి చేస్తున్నామని, అతి తక్కువగా ఉన్న స్థానిక ప్రతినిధుల వేతనాలను భారీగా పెంచామని తెలిపారు. 2018 ఏప్రిల్ నాటికి రాష్ట్రాన్ని 100 శాతం బహిరంగ మలమూత్ర విసర్జన లేని రాష్ట్రంగా చేసేందుకు పనిచేస్తున్నామన్నారు. ఇప్పటికే 620 పంచాయతీలు, 3 నియోజక వర్గాలను బహిరంగ విసర్జన లేనివిగా ప్రకటిం చామని తెలిపారు.
గ్రామపంచాయితీలను బలోపేతం చేసేందుకు, అన్ని రంగాల్లో గ్రామాలను అభివృద్ధి పర్చేందుకు ‘గ్రామజ్యోతి’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి జూపల్లి తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి పంచాయితీలోనూ ఏడు కార్యనిర్వాహక కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. వీటిలో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, స్వయం సహాయక బృందాలు, ఎన్జీవోలు, సీనియర్ సిటిజన్‌లను సభ్యులుగా నియమించామని తెలిపారు. పారిశుధ్యం, ఆరోగ్యం, వ్యవసాయం లాంటి అన్ని ప్రధాన విభాగాలను ఈ కమిటీలే పర్యవేక్షిస్తాయని తెలిపారు. గ్రామ జ్యోతి కింద 2584 గ్రామాలను ప్రజాప్రతినిధులు, ఎన్జీఓలు దత్తత తీసుకుని…వాటి అభివద్ధికి కృషి చేస్తున్నాయని తెలిపారు. మన వూరు, మన ప్రణాళిక కార్యక్రమం ద్వారా ఏ గ్రామానికి ఏమేం కావాలో వారే నిర్ణయించుకునే అవకాశం కల్పించామన్నారు. తెలంగాణ ఏర్పాటు తరువాత పంచాయతీల్లో పన్నుల వసూళ్లు గణనీయంగా పెరిగాయన్నారు. ఉపాధిహామీ, స్వచ్ఛ భారత్ మిషన్ కింద అదనంగా కేంద్రం నిధులను కేటాయించడం వల్ల రాష్ట్రంలో హరితహారం, మరుగుదొడ్ల నిర్మాణం, పారిశుద్ధ్యంలాంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టుకోగలుగుతామన్నారు. గ్రామపంచాయతీల్లో, మురికివాడల్లో చెత్త సేకరణ, వైకుంఠదామాల నిర్మాణాలకు కేంద్రం మరింత సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు.
13 వ ఆర్థిక సంఘం ద్వారా జిల్లా, మండల పరిషత్తులతో పాటు గ్రామ పంచాయతీలకు నిధులు వచ్చేవని, అయితే 14 వ ఆర్థిక సంఘం మాత్రం గ్రామ పంచాయతీలకే నిధులు విడుదల చేయడం వల్ల… జిల్లా, మండల పరిషత్తులు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నాయని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులతో వారి అవసరాలకు సరిపోవడం లేదన్నారు. జిల్లా పరిషత్తు, మండల పరిషత్తులకు నిధుల కోసం కొత్త యంత్రాంగాన్ని కేంద్రం ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర పంచాయతీరాజ్‌శాఖామంత్రి తోమర్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.