ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ సుహృద్భావ సందేశం

అమరావతి ప్రస్థానం అద్భుతంగా సాగాలిఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు విశేష ఆకర్షణగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అమరావతి నిర్మాణానికి పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

అక్టోబర్‌ 22న విజయదశమి రోజు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నగర నిర్మాణానికి ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేశారు. ఈ వేడుకకు రావలసిందిగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడు స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఇంటికి వచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని మన్నించి మన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరై, అమరావతి ప్రపంచంలోనే అద్భుత నిర్మాణం కావాలని మనసారా ఆకాంక్షించారు.

సభలో కె.సి.ఆర్‌ ప్రసంగించడానికి లేవగానే సభా ప్రాంగణమంతా హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. ప్రసంగం ముగిసేవరకూ ప్రజల నుంచి చక్కటి స్పందన లభించింది. ముందుగా కె.సి.ఆర్‌ కి స్వాగతం పలుకుతూ, చంద్రబాబు నాయుడు బొకే అందించగానే, కె.సి.ఆర్‌ చెయ్యి పైకెత్తి ప్రజలకు అభివాదం చేశారు. సభ ముగింపులో కె.సి.ఆర్‌ కు చంద్రబాబు జ్ఞాపికను అందచేస్తున్న సమయంలో కూడా సభికుల నుంచి మంచి స్పందన లభించింది.

ముందుగా వేదికపై వున్నవారిని పేరుపేరునా ప్రస్తావించిన కె.సి.ఆర్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

” ముందుగా నాతరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున , ప్రజలందరి తరఫున మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి రోజున ప్రారంభించిన ఏ పని అయినా తప్పకుండా విజయవంత మవుతుంది.. దసరా రోజున ప్రధాని చేతులమీదుగా అమరావతి శంకుస్థాపన జరగడం శుభప్రదం. ఈ ప్రస్థానం అద్భుతంగా సాగాలి. అమరావతి ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా, అద్భుతంగా నిర్మాణం కావాలి. ఇందుకోసం కావలసిన అన్ని సహాయ, సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది” అని కె.సి.ఆర్‌ అన్నారు.

సభ ముగింపులో ప్రధాని మోదీ స్వయంగా పిలిచి కె.సి.ఆర్‌ను, చంద్రబాబు నాయుడిని తనకు ఇరువైపులా నిలిపి చేతులు కలిపినప్పుడు కూడా ప్రజల హర్ష ధ్వానాలతో సభా ప్రాంగణం మార్మోగి పోయింది.

అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వచ్చి కె.చంద్రశేఖర రావును ఆహ్వానించడం పట్ల, అందుకు ప్రతిస్పందించి కె.సి.ఆర్‌ ఈ సభకు హాజరు కావడం పట్ల ప్రధాని మోదీతోపాటు, పలువురు నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తంచేశారు.

తెలంగాణ ప్రజల స్నేహభావానికి , పొరుగువారి శ్రేయస్సును ఆకాంక్షించే స్వభావానికి ఈ సభ నిదర్శనంగా నిలిచింది.

Other Updates