భారత చలనచిత్ర రంగంలో 1935వ సంవత్సరం గొప్ప మలుపును తెచ్చింది.అంతవరకూ చరిత్రకాలు, పౌరాణికాలు, జానపదాలపై దృష్టిపెట్టిన నిర్మాతలు ఇకమీదట సాంఘికాలపై దృష్టిపెట్టారు. దీనితో నటనా సామర్థ్యం కలిగిన పెక్కుమంది నటీనటులు తెరమీదికి వచ్చారు. సీత, పూర్ణభక్త్, చండీదాస్ చిత్రాలు విజయవంతం కావడంతో సాంఘికాలకు మంచి గిరాకీ వచ్చింది.
శరత్ రచించిన దేవదాస్ చలనచిత్రరంగంలో సంచలనం సృష్టించింది. దేవదాసు మామూలు భగ్న ప్రేమికుడుకాదు. తన దగ్గరికొచ్చిన పెన్నిధిని కాలదన్నుకున్న దౌర్భాగ్యుడు. అతడు చేసిన చిన్న తప్పు అతని జీవితాన్నే బలిగొన్నది. అంతేకాదు, కథానాయిక పార్వతిని అతడు జ్ఞాపకం చేసుకోని ఘడియలేదు. అంతటి గొప్ప విషాదపూరితగాధను న్యూ థియేటర్స్ బ్యానర్‌కింద బారువా తెరకెక్కించాడు. దేవదాస్ పాత్రకు కె.ఎల్. సైగల్‌ను ఎన్నుకున్నాడు.
1904లో జలంధర్‌లో జన్మించిన కుందన్‌లాల్ సైగల్ పుట్టుకతోనే గాయకుడు. నటుడుగా స్థిరపడకముందు సైగల్ పంజాబీ జానపదగీతాలను అలవోకగా పాడుకుంటుండే జానపదకళాకారులు, అవి విని లబోదిబోమని మొత్తుకునే వారు. ఆ పాటలు రికార్డుగా వస్తే తమ జీవితం ఏం గాను అని సైగల్ కాళ్ళా వేళ్ళా పడ్డారు. తాను జానపదగీతాలకు రికార్డునివ్వనని హామీ ఇచ్చిన తరువాతనే వాళ్ళు ఆయనను వదిలిపెట్టారు.
ఉర్దూ, పార్సీ కవితలంటే సైగల్ చెవికోసుకునేవాడు. గాలిబ్, ఆర్జూ, జౌక్ మొదలైన కవుల గీతాలను సైగల్ శ్రావ్యంగా పాడుతుంటే ప్రేక్షకులు తన్మయులై వినేవారు. విశ్వకవి ఠాగూరు గీతాలను పాడిన ఏకైక గాయకుడు సైగల్. ఎందుకంటే బెంగాలీయేతరులను తన గీతాలను పాడటానికి ఠాగూరు అనుమతించేవారుకాదు.
బారువా తనమీద పెట్టిన బాధ్యతకు పూర్తి న్యాయం చేకూర్చాడు సైగల్. శరత్‌బాబు సృష్టించిన పాత్రకు ఆయన తన నటనతో కొత్త జీవం పోశాడు. ఆ రోజుల్లో దేవదాసు చిత్రాన్ని ప్రజలు ఎంతగా అభిమానించారంటే దేవదాసు పాత్రకోసం సైగల్ పుట్టాడని ప్రజలు భావించేవారు. ఆ చిత్రంలో ప్రేక్షకుల హృదయాలను దోచుకోవడానికి సైగల్ నటనతోపాటు గానం ఎక్కువ సహాయపడింది. ఆయన కమనీయమైన కంఠం, విగ్రహం, నటన ప్రజలు చాలాకాలం వరకు మరచిపోలేదు. ఈ చిత్రంలో సైగల్ ఒక్కసారే బ్రహ్మాండమైన నటుడైపోయాడు.
సైగల్ తక్కువ చిత్రాలలోనే నటించాడు. 1932 నుంచి 1946 వరకు ఆయన కేవలం 36 చిత్రాలలో నటించాడు. అందులో 29 హిందీ చిత్రాలు, 7 బెంగాలీ చిత్రాలున్నాయి. ఆయన నటించిన దుష్మన్, జిందగీ, స్ట్రీట్ సింగర్, బగన్, సూర్‌దాస్ చిత్రాలు గొప్ప కళాఖండాలైనాయి. సైగల్ చిత్రాలు విజయవంతం కావడంతో ఆయన ఆదాయం బాగా పెరిగింది. నూరు రూపాయలతో మొదలైన పారితోషికం నెలకు పదివేలకు పెరిగింది. దానితో అపరిమితమైన తాగుడుకు అలవాటు పడ్డాడు. దాదాపు తాగుడుకు బానిస అయిపోయాడు. మిత్రులు ఎంతో ప్రయత్నించినా ఆ దురలవాటునుండి ఆయనను దూరం చేయలేకపోయారు. శరీరం శిథిలమైంది. షహాజహాన్ చిత్రంలో నటిస్తున్న రోజుల్లోనే త్రాగుడులేక నిలవలేని పరిస్థితి ఏర్పడింది. దేవదాసులాగా సైగల్ కూడా తను జన్మించిన స్థలంలోనే చనిపోవాలనుకుని, షహాజహాన్ చిత్రం పూర్తికాగానే జలంధర్ వెళ్ళిపోయాడు. అక్కడే 1947 జనవరి 18న కన్నుమూశాడు. భారతచలనచిత్ర రంగంలో సాంఘిక చిత్రాలకు జీవంపోసిన మొదటి నటుడు సైగల.
జి. వెంకట రామారావు