రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌

tsmagazine

హైదరాబాద్‌ మహానగరంలో మెట్రో రైలు వల్ల కాలుష్యం, ట్రాఫిక్‌ బాధల నుంచి విముక్తి లభిస్తుందని, అందుకే నగర ప్రజలందరూ మెట్రోను తప్పకుండా ఉపయోగించుకోవాలని, తాను తరచు ప్రయాణిస్తుంటానని రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. మెట్రోరైల్‌ కారిడార్‌-1లోని అమీర్‌పేట-ఎల్‌.బి.నగర్‌ మార్గాన్ని గవర్నర్‌ నరసింహన్‌ అమీర్‌పేటలో జెండాఊపి ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మెట్రో ప్రయాణం కాలుష్యం, ట్రాఫిక్‌ సమస్యలనే కాకుండా ఖర్చును కూడా తగ్గిస్తుందన్నారు. మెట్రోలో ప్రయాణించడం వల్ల పెట్రోల్‌, డీజిల్‌ ఖర్చు కూడా ఉండదని అన్నారు. రైలు టికెట్ల కొనుగోలుకు, షాపింగ్‌కు ఒకటే కార్డు ఉపయోగించేలా స్మార్ట్‌కార్డ్‌ తయారుచేస్తే ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన సూచించారు. ఇది ప్రజల మెట్రో అని, దీన్ని అందరు కలిసి కాపాడుకోవాలని కోరారు. హైటెక్‌ సిటీ మెట్రో మార్గాన్ని డిసెంబరు 15లోపు పూర్తి చేయాలని గవర్నర్‌ కోరారు. ప్రతి మెట్రో స్టేషన్‌ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.

tsmagazine
అమీర్‌పేటలో మెట్రోరైల్‌ను ప్రారంభించిన అనంతరం అందులోనే ఎల్‌.బి.నగర్‌ వరకు ప్రయాణించారు. గవర్నర్‌తో పాటు ఐటీశాఖా మంత్రి కేటీఆర్‌, హోంమంత్రి నాయిని, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని, ఎక్సైజ్‌ మంత్రి పద్మారావు, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కే.జోషీ, మున్సిపల్‌ శాఖా ముఖ్య కార్యదర్శి అర్‌వింద్‌ కుమార్‌, మెట్రోరైల్‌ ఎం.డి. ఎన్‌వీఎస్‌ రెడ్డి తదితరులు ప్రయాణించారు. మార్గమధ్యంలో ఎంజీబీఎస్‌ వద్ద ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన మెట్రోస్టేషన్‌ను గవర్నర్‌ సందర్శించారు.

tsmagazine
ఎంజీబీఎస్‌ మెట్రో స్టేషన్‌ ప్రత్యేకతలను మెట్రో అధికారులు గవర్నర్‌కు వివరించారు. ఆసియాలోనే అతిపెద్ద స్టేషన్‌లలో ఇదీ ఒకటని తెలిపారు. కారిడార్‌-1, కారిడార్‌-2 స్టేషన్లను ఇది కలుపుతుందని తెలిపారు. స్టేషన్‌ ప్రాంగణాన్ని అత్యంత ఎత్తుగా, విశాలంగా విమానాశ్రయం మాదిరిగా తీర్చి దిద్దారు. దీన్ని చూసిన అనంతరం గవర్నర్‌ ఎల్‌.బి.నగర్‌ వరకు వెళ్ళారు. అక్కడ కేటీఆర్‌ మెట్రో రైలుకు సంబంధించిన సాంకేతికత, వ్యయం, ప్రజా సౌకర్యం తదితర విషయాలను గవర్నర్‌కు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌తో వివరించారు. సాంకేతికత, నాణ్యత విషయంలో ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని పేర్కొన్నారు. ప్రీకాస్ట్‌ పద్ధతిలో నిర్మాణం చేపట్టి ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా రికార్డు సమయంలో పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌ నగరానికి ఇదొక ముందడుగని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇప్పటికే ప్రారంభమైన మెట్రో మార్గంలో ప్రస్తుతం నిత్యం లక్ష మందికి పైగా ప్రయాణిస్తున్నారన్నారు. కొత్త మార్గంతో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందన్నారు. ఎల్‌.బి.నగర్‌-అమీర్‌పేట 16 కిలోమీటర్ల మార్గంతో కలిపి మొత్తం 46 కిలోమీటర్లు అందుబాటులోకి వస్తుందని కేటీఆర్‌ తెలిపారు. ఇది దేశంలోనే రెండో పొడవైన మార్గంగా కేటీఆర్‌ తెలిపారు.

తిరిగి వెళ్ళేటపుడు గవర్నర్‌, మంత్రి కేటీఆర్‌ ఖైరతాబాద్‌ స్టేషన్‌లో దిగి స్మార్ట్‌బైక్‌ సైకిళ్ళపై రాజ్‌భవన్‌ చేరుకున్నారు. ప్రారంభమైన మొదటిరోజు ఎల్‌.బి.నగర్‌, అమీర్‌పేట మార్గంలో ప్రయాణీకులు వెల్లువెత్తారు. రద్దీ వేళల్లో ఆరున్నర నిమిషాలకు ఒకటి, మిగతా సమయాలలో ఎనిమిది నిమిషాలకు ఒకటి చొప్పున రైళ్ళ ఫ్రీక్వెన్సీనీ నిర్ణయించారు.

Other Updates