‘హరీ! నృకేసరీ’-మకుటంతో 108 చంపకోత్పలపద్యాల యందు ధారాళమైన శైలిలో రచితమైన ఈ శతకాన్ని నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం అతి ప్రాచీన గ్రామమైన ‘ఇందుర్తి’లో వెలసిన నృసింహస్వామిని ముఖ్యంగా చేసి-రచించిన కవి-మారేపల్లి వేంకటకృష్ణయ్య.

కవి తెలిపిన ‘ఇందుర్తి’ గ్రామం సుమారు 1800 ప్రాంతందాకా ‘సీమ’గా వ్యవహరింపబడిన విషయం-మరింగంటి వెంకటనరసింహా చార్య కవి చాటువుల ద్వారా తెలుస్తున్నది. ఈనాడీ గ్రామం- మర్రిగూడెం మండలంలో చేరింది. ఇక్కడి నృసింహస్వామి కవి ఇష్టదైవం కావచ్చు. శతకంలోని ఒక్క పద్యంలోనే ఇందుర్తి పురాధివాస ఘనదుష్టనిరాస హరీ నృకేసరీ!’ అని ఉంది. మిగతా పద్యాల్లో ‘హరీ! నృకేసరీ!’ అనే చెప్పినాడు.

కవి యీ శతకాన్ని-10-21 పద్యాల్లో అవతారదశకం, 51-60 రామలీలా దశకం, 61-70 కృష్ణలీలలు, 71-75 పంచాయుధస్తుతి, 76-82 నిరర్థకమెనవస్తు సంచయం, 83-96 పూజారీతి, 98 సార్వవిభక్తిక పద్యం, 99-102 బంధకవిత, తర్వాత స్వవిషయం చెప్పాడు.

శతక పద్యాల్లో తనుడు వ్యవహారంలో వున్న పదాలను బాగా ప్రయోగించి వాటికి స్థిరత్వం కల్పించాడు. వాటిల్లో కొన్ని గొరిమిడి. ఏడ. పందిటి డాకలు.నవాతు (నే బోతు). తన స్వామికి ఆరగింపు చేసే పదార్థాల్లో సేవెలు మణుగుపువ్వులు (మడుగుపూస), అతి రసాలు (అరిశెలు), వడలు, పుణుకులు, అటుకులు, చక్కిలాలు, పాయసం, కరిజకాయలు, మోదకాలు, కలమాన్నం, సూపం, దధ్యోదనం, ఘృతం, పులిఓగిరం (పుళిహోర) మొదలైనవి ఉన్నాయి. వివిధ రకాల ఫలాలతోపాటు ‘పృథుకాల’ను (అటుకులు) చేర్చినాడు. ఇంతేకాకుండా, తన స్వామికి – ‘ప్రసాదపడి’ని ఇప్పించాడు. ”కిరాతకాంతయున్‌ సదుమల బుద్ధి పండులు ప్రసాదపడిచ్చె” ననటం సంప్రదాయపదం. శ్రీవైష్ణవ అర్చకులకు అనుదినం దేవాలయాల్లో యిచ్చే ప్రసాద భాగానికి ‘ప్రసాదపడి’యని వ్యవహారం.

‘పెమ్మయ సింగధీమణీ’ మకుటంగల శతకంలో చెప్పిన విధంగా. ఈ శతకకర్త నిరర్థక పద్యాలని కొన్నిటిని తెలిపినాడు. ఇటువంటివి దాదాపు 12 ఉన్నాయి. వాటిలో ఒకటి – వానలు లేని చేలు, పరివారము బ్రోవని రాజు మేలు. సద్ధానములేని కేలు, ఘనధైర్యము చాలినివాని వాలు. సంతానములేని యాలు. నరనాధ సనాథముగానిప్రోలు. యందాన చెలంగునే మురళి నాదవిలోల హరీ! నృకేసరీ!

స్వామిని సార్వవిభక్తిస్తవంలో ఇట్లా అర్పించాడు-

పాతకహారివీవు. బహుభంగుల నిన్ను సమాశ్రయింతు
నీ చేత శుభంబు చేకురును. చేసేదనీకయినే నమస్కృతుల్‌
ద్రోతును భీతినీవలన రూఢిగ చేయుదు నీకు పూజ-నీ
శ్రీతను వందు నామనసు చేరుతు దేవహరీ! నృకేసరీ!

శతకంలో ఖడ్గ. నాగ. గోమూత్రికా బంధ పద్యాలున్నవి.
తరువాత ‘నిరోష్ఠ్య పద్యం’ ఇట్లా ఉంది.

సితశరజాత నేత్ర, సరసీరుహజాత. హరాది నిర్జరా
హితహరచారు చర్య తటినీశసుతా హృదయేశ, నిత్య-సం
శ్రిత జనరక్షకా, త్రిదశ శేఖర, చక్రధరా, సురేశ స
న్నుత గుణజాల, శైలధరధూత నరాఘ, హరీ! నృకేసరీ!

శతకాన్ని స్వామికిట్లా సమర్పించాడు-
చంపకమాలికాపటలి-జానుగ నుత్పలమాలికాచయం
బింపుగమీపదాబ్జముల కెంతయు భక్తి సమర్పణంబు కీ
ర్తింపుచు చేసితే ననుమతింపుచు నస్మదఘాళి దూల ర
క్షింపునన్‌ సుపర్వ కులశేఖర పూజ్యం హరీ! నృకేసరీ!!

తనను గూర్చి-
పంకజ సంభవీనకుల భవ్యజనుండను మారెపల్లి నా,
మాంక కులాంబురాశి శశికాంతుడనంతు సుతుండ దాసుడన్‌
వేంకట కృష్ణనామకుడ ప్రీతిగచేసితి నీకు నీచరి
త్రాంకితమైన పద్యములు సాష్టశతంబు హరీ! నృకేసరీ!!

శతకకర్త తన కృతి నిర్మాణ కాలాన్ని తెల్పలేదు. కానీ, దీని చివర్లో ‘ప్లవంగనామ సంవత్సర భాద్రపద బహుళ మంగళవారం సాయంకాలం వరకు రాఘవరావు దేశపాండ్యాకి పోల్కంపల్లి రామకృష్ణారావు మఖ్తేదారు పట్టిలింగాల వ్రాసి యిచ్చిన నృసింహ శతకం సంపూర్ణం. శ్రీకృష్ణార్పణమస్తు’-అని ఉంది.

దీని ప్రకారం క్రీ.శ. 1842 అక్టోబర్‌ కాగలదు. చాలా ప్రాచీన మైన యీ కృతిని ‘ప్లవంగ’లో తిరుగవ్రాసినారు. 1874, 1907లోనూ ప్లవంగ వర్షాలు వచ్చినాయి. పరంపర లేఖనాల్లో ఏదో సంవత్సరం పొరపాటు పడినట్లుంది.

రచన కాలం ఎట్టున్నా, మారేపల్లి వేంకటకృష్ణకవి ధన్యుడు. శతకం చిరంజీవిగా నిలిచింది. నావద్ద గల ఎన్నో గుజిలీ కాగితాల పుస్తకాల్లో ఇదొకటి. ఇంతకాలానికైనా దీనికి ‘వెలుగు| వచ్చినందుకు ఆనందిస్తున్నాను.

శ్రీరంగాచార్య

Other Updates