తెలంగాణాలోని
వివిధ ప్రాంతాలలో ఇంకా ఎంతో అముద్రిత సాహిత్యం వివిధ ప్రక్రియల్లో వుండి వెలుగులోనికి రావడంలేదు. మన తెలంగాణంలోని కవులు, పండితులకు తగిన ప్రాచుర్యం లభించనట్లే, మన సాహిత్యం కూడా ఎక్కడెక్కడో పడి జీర్ణదశకు చేరుతున్నది. అట్టి అముద్రిత గ్రంథ సంపదలో ఆసూరి మరింగంటి సింగరాచార్యులు రచించిన ‘తారక బ్రహ్మరామ శతకం’ ఒకటి.
ఆబాలగోపాలము ఆవరించే విధంగా అనేక ప్రక్రియలతో విశిష్టంగా వెలిగింది. ఈ ప్రక్రియల్లో శతకానికి పెద్దపీట. నాటినుండి నేటి దాకా అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నది శతక ప్రక్రియ. పద్య సంఖ్య, మకుట నియమం, వృత్త నియమం, రసనియమం ప్రధానంగా ఉండే శతకాలను గురించి పరిశోధించిన సాహితీ పరిశోధకులు వస్తు వైవిధ్యాన్ననుసరించి అనేక విభాగాలుగా శతకాలను వింగడించారు. ఆధునికయుగంలో కూడా విస్తరించిన ఈ శతక ప్రక్రియలో పిల్లి, పెద్దపులి, బీడీ, పొగచుట్ట, పకోడి, విసనకర్ర మొదలైన ఎన్నో అంశాలపై శతకాలు వచ్చాయంటేనే దీని గొప్పదనం తెలుసుకోవచ్చు.
ఏ ఒక్క శతకంనుండైనా ఒక్క పద్యమైనా రానివాళ్ళు తెలుగునేలపై ఉండరేమో! దీన్నిబట్టే ఇదెంత బలమైన ప్రక్రియో, దీని ప్రత్యేకత ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణా సాహిత్యంలో సుప్రసిద్ధులైన మరింగంటి కవుల్లో, మొదటి వరుసలో నిలబడే ప్రతిభావంతుడు సింగరాచార్యుల వారు. 1520-1590లలో జీవించిన ఆచార్యులవారు శతఘంటావధాని. దశరథరాజ నందన చరిత్ర, నిర్యోష్ఠ్యా అచ్చాంధ్ర సీతా కల్యాణం వంటి గొప్ప కావ్యాలు రచించి నాటి గోల్కొండ నవాబు మల్కిభరాంచే ప్రశంసింపబడ్డాడు. ఆచార్యులవారు రచించిన ‘తారక రామబ్రహ్మ రామ శతకం’ ఇప్పటివరకు ముద్రణకు నోచుకోలేదు. వంగూరి సుబ్బారావు శతక కవుల చరిత్రలో దీన్ని గురించి చెప్పారు. అయితే అన్ని శతకాల్లాగా కాకుండా ఇందులో మధ్యమధ్య వచనాలు చోటు చేసుకొని అనేక రామాయణ విశేషాలు కనిపిస్తాయి. శ్రీరామచంద్రుడు సాక్షాత్తూ శ్రీమహా విష్ణువేనని నిరూపించే ప్రమాణాలు ఇందులో ఉన్నాయి. దీనివల్ల ఇదొక ”లఘుకావ్య” రూపం సంతరించుకుంది. ఎప్పుడో జక్కీపల్లి జగ్గకవి పంచీకరణ పద్యశతకం చెప్పిన రీతిలో ఇది కనిపిస్తుంది. ఇది కవి పేర్కొన్నట్టు ”తారకబ్రహ్మ రామ శతకమైనా మకుటం మాత్రం ”సీతాపతీ!” అని ఇందులోని 106 మత్తేభాల్లోనూ పొందుపరుపబడింది. ఇవికాక ఏడు శార్దూల వృత్తాలు, ఒక సీసపద్యం కలిపి 114 పద్యాలున్నాయి. 26 తాళపత్రాలున్న ప్రతిలో అక్కడక్కడ చిల్లులుపడి కొంత అసమగ్రత ఏర్పడింది. ఈ కవి కథాకథన శీలుడు కావడం మూలంగా ఇతర రామకథా కావ్యాల్లో చెప్పని ఎన్నో విషయాలు చెప్పి స్వామిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. శ్రీరాముడు నారాయణ స్వరూపుడని, సీతామాత లక్ష్మీ స్వరూపిణి యన్న దృఢమైన భావంతో అన్ని బంధాలనూ దేవతా సంబంధాలుగా నిరూపించే యత్నంచేశాడు. ఈ ఉద్దేశ్యాన్ని తెలుసుకునే విధంగా అక్కడక్కడ ఈ విధమైన శీర్షికలతో విషయాన్ని స్ఫురింపజేశారు. రెండు, మూడు పద్యాలకైతే సుదీర్ఘ వివరణ కూడా ఉంది. శ్రీరామ జననం మొదలు రామావతార పరిసమాప్తి వరకు తాను తారకబ్రహ్మరామునే ప్రతిపాదింప దలచినట్లు స్పష్టపడుతుంది.
మొదలన్ హోమపు వీతి హోత్రమట, యామూలంబునందొక్కం
డుదయంబై పరమాన్న మిచ్చెనట, తానుర్వీశుడుం దాని నె
మ్మది కౌసల్యకు బెట్టినం గొనుచు నేమాడ్కిన్ నినుంగాంచెనో
యది మర్తత్వముగాగ నేర్చునె అయోధ్యా రామ సీతాపతీ”
అన్న ఒక్క పద్యం చాలు శ్రీరామచంద్రుని అమర్త్యత్వాన్ని సూచించడానికి.
సీతాపహరణ ఘట్టం చెబుతూ ఒక వచనంలో అగ్ని దేవుడు సీతామాతను తన భార్యలైన స్వాహా స్వధల దగ్గర దాచి ఆమె ప్రతిగా వేదవతిని పెట్టిన విషయం చెప్పి, ఆ వేదవతినే రావణుడపహరించినట్లు చెప్పాడు.
”దివిజార్యగ్రణి పర్ణశాల కడకేతేరన్ కృశానుండు గాం
చివడిన్ జానకి నాత్మభార్యల కడన్ శేషస్థలిందాచి వే
దవతింగల్పన జేయ వాడుగొని సంథన్ లంకకుంబోవులా
గవితాన స్థితి నీదు కీలగు నయోధ్యారామ సీతాపతీ!”
అని రావణుడు అపహరించింది వేదవతినేగానీ సీతను కాదని, దీనికి అగిహోత్రుడే కారణమని స్పష్టం చేశాడు.
‘తనచేనంటిన బ్రహ్మహత్య విడయత్నం బేమిటన్ లేని రు
ద్రుని సేతుక్షితి రావణార్థము జడాత్ముల్ నిల్పినారందురా
వనభూమీస్థితి మౌనియోషితతి తీవ్రక్రోధ వాక్యాను వ
ర్తన రూపంబని కానరేమియు నయోధ్యా రామ సీతాపతీ!”
అంటూ దాదాపు 11 పద్యాలలో 11 పురాణాల విషయాలను చెప్పడం ”పెద్దల సమ్మతంగా” చెప్పినట్లు చెప్పుకున్నాడు కవి. శ్రీరాముని కేవలం మర్త్య రూపంగాకాక, అమర్త్య రూపంగా భావించే ఎన్నో ప్రమాణాలను చూపుతూ చెప్పిన ఈ శతకం కవిలోని శరణాగతి తత్త్వానికి ప్రతీకగా భావించవచ్చు.
రచనా సౌందర్య విషయాన్ని చూస్తే ఎన్నో పద్యాల్లోని సుదీర్ఘ సమాస ప్రయోగాలు కవి ప్రతిభను చాటుతున్నాయి. మరొక విశేషం ఈ శతకంలో దర్శనమిస్తుంది. ”తిరునామము” అనే సాహిత్య ప్రక్రియను గురించి మొదటిసారి చెప్పినది సింగరాచార్యులవారే తప్ప, పలువురు పరిశోధకులు భావించినట్టు కూచిమంచి తిమ్మకవి కాదు. ఈ శతకంలోనే ”.. ప్రవర్తన తిర్నామముగాయకోత్తముల యోధ్యా రామ సీతాపతీ” అన్న పాదము, అదే విధంగా మరోచోట ”తెలతిర్నామము చందన ప్రసవము ల్”. అన్న మాటలే యీ విషయానికి ప్రమాణాలు. అంతేగాది తిరునామ ప్రక్రియ తొలిసారి తెలంగాణాలోనే గ్రంథస్థమైనట్లు కూడా చెప్పవచ్చు.
తన కాలంలోనే వ్యాకరణ సమ్మతంగాకుండా కేవలం వ్యవహారంలో మాత్రమే ఉన్న ఒక్క లాగు తెల్వియొ, మన సందు, సోలుపు, ఎనుభై నాలుగు మొదలగు ఎన్నో పదాలను ప్రయోగించడం ఈ శతకంలో కనిపిస్తుంది. శతకం చివర శతక రచనను గూర్చి తెలిపే ముందు తన గురించి కూడా ”ఆంధ్ర భాషా నిర్యోష్ఠ్యాది వింశతికృతుల్…” చెప్పుకొని
”వసుధ దనకు ప్రజోత్పత్తి వత్సరమున
బరగు సద్భాద్రపద సితపక్ష సౌమ్య
వాసరంబున వ్రాసితి వరచతుర్థ
శందు శ్రీ శేషశైలు నుతిందులోన…” అని చెప్పిన దానినిబట్టి కవి ఈ రచన 1560 ప్రాంతమున నిర్ణయించవచ్చు. ఈ శతక రచనను గురించి ప్రథమతః గణించవలసిన పద్యం ఇది.
డాక్టర్ శ్రీరంగాచార్య