సాగునీటి శాఖలో పనిచేస్తున్న ఇంజనీర్‌గా ప్రపంచంలో గొప్ప సివిల్‌ ఇంజనీరింగ్‌ నిర్మాణాలుగా పేరు గడించిన మూడు డ్యాంలు చూడాలని కోరిక చాలా కాలంగా నాలో ఉన్నది. ఒకటి ఈజిప్ట్‌లో నైలు నదిపై నిర్మించిన ఆస్వాన్‌ డ్యాం, రెండోది అమెరికాలో కొలరాడో నదిపై నిర్మించిన హూవర్‌ డ్యాం, మూడోది చైనాలో యాంగ్షి నదిపై నిర్మించిన త్రీ గార్జేస్‌ డ్యాం.

మొదటి రెండు డ్యాంల గురించి 1981-84 మధ్య నాలుగేండ్లు హైదరాబాద్‌ లో బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 3 లో ముఫ్ఫఖంఝా ఇంజనీరింగ్‌ కాలేజిలో సివిల్‌ ఇంజనీరింగ్‌ చదివే కాలంలోనే విన్నాను. వాటి గొప్పదనాన్ని గూర్చి తెలుసుకున్నాను. త్రీ గార్జేస్‌ డ్యాం గురించి మాత్రం 1990 వ దశకంలో సాగునీటి శాఖలో జూనియర్‌ ఇంజనీర్‌ గా చేరిన తర్వాత విన్నాను. ఆ కాలంలో దేశంలో పెద్ద డ్యాంలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్న కాలం. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో నర్మదా నదిపై నిర్మించ తలపెట్టిన ఇందిరాసాగర్‌, సర్దార్‌ సరోవర్‌ డ్యాం, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో భాగీరథి నదిపై నిర్మించ తలపెట్టిన తెహ్రి జల విద్యుత్‌ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉధృతంగా ప్రచారం జరుగుతున్న కాలం. పెద్ద డ్యాంల వలన పర్యావరణానికి, అటవీ సంపదకు వాటిల్లే నష్టాల గురించి దేశవ్యాప్తంగా చర్చజరుగుతున్న కాలం. పర్యావరణవాదులు పెద్ద డ్యాంలకు ప్రత్యామ్నాయంగా చిన్న చిన్న వాటర్‌ షెడ్స్‌ (Water Sheds), చిన్న చెరువులు, కాంటూర్‌ బండ్స్‌, చెక్‌ డ్యాంలని అభివద్ధి చేయాలని ప్రతిపాదిస్తున్నారు. ఆ ఉద్యమాలకు పత్రికల్లో మంచి ప్రాధాన్యత, ప్రాచుర్యం కూడా లభిస్తున్నది. ఆ ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న మేధా పాట్కర్‌, సుందర్‌ లాల్‌ బహుగుణ ప్రతిష్టాత్మక మెగసెసే అవార్డులకు ఎంపిక అయి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.

ఆనాడు దేశ వ్యాప్తంగా జరుగుతున్న చర్చలో ప్రముఖ ఇంజనీర్‌, ఐక్యరాజ్య సమితికి సలహాదారుగా ఉన్న కీ.శే. టి. హనుమంతరావు కూడా పాల్గొన్నారు. పెద్ద డ్యాంల ఆవశ్యకతను నొక్కి చెపుతూ అనేక వ్యాసాలు రాసినారు. చిన్న నీటి పథకాలు పెద్ద డ్యాంలకు ప్రత్యామ్నాయం కాజాలవని వాదించారు. 1986 లో దేశంలో సంభవించిన కరువును ఎదుర్కొని దేశంలో ఆహార సంక్షోభాన్ని నివారించినవి భాక్రానంగల్‌, దామోదర్‌ వ్యాలీ ప్రాజెక్ట్‌ , నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ లాంటి పెద్ద డ్యాంలేనని గణాంకాలతో వివరించారు.

ఈ చర్చ చేస్తున్న సందర్భంగా ఈజిప్ట్‌లో నైలు నదిపై నిర్మించిన ఆస్వాన్‌ డ్యాం ఈజిప్ట్‌ ఆర్థిక ప్రగతికి ఎట్లా దోహదం చేసింది, ఆఫ్రికా ఖండం అంతా కరువు కోరల్లో చిక్కుకొని ప్రజలు ఆకలి చావులకు బలి అవుతుంటే ఈజిప్ట్‌ దేశాన్ని కరువు నుంచి, వరదల నుంచి కాపాడింది ఆస్వాన్‌ డ్యామేనని వివరించారు. ఆ కాలంలో చైనాలో నిర్మాణం అవుతున్న త్రీ గార్జేస్‌ డ్యాం కూడా చైనా ఆర్థిక ప్రగతికి దోహదం చేయనున్నదని జోస్యం చెప్పారు. అట్లా త్రీ గార్జేస్‌ గురించి తెలుసుకోవడం జరిగింది. ఇంటర్‌నెట్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ మూడు డ్యాంల గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోగలిగాను. 2018 ఏప్రిల్‌ లో త్రీ గార్జేస్‌ డ్యాంని సందర్శించే అవకాశం వచ్చింది. ఇప్పుడు వ్యక్తిగత సెలవుపై అమెరికా వచ్చిన తర్వాత హూవర్‌ డ్యాంని 2019 జూన్‌ 8 న సందర్శించాను. హూవర్‌ డ్యాం అమెరికాలో వ్యవసాయ రంగ అభివద్ధికి పునాది వేసిందని, ఆ ప్రేరణతో అమెరికాలో అనేక డ్యాంల నిర్మాణం జరిగి వ్యవసాయాభివద్ధికి దోహదం చేసిందని తెలుసుకున్నాను. హూవర్‌ డ్యాం విశేషాలను తెలుసుకునే ముందు ఈజిప్ట్‌ లో ఆస్వాన్‌ డ్యాం, చైనాలో త్రీ గార్జేస్‌ డ్యాం ఆ దేశాల ఆర్థిక ప్రగతికి చేసిన మేలు గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం.

ఆస్వాన్‌ హై డ్యాం
ఈజిప్ట్‌లో నిర్మించిన ఆస్వాన్‌ హై డ్యాం నిర్మాణం పట్ల పర్యావరణ వేత్తలు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ డ్యాం కడితే నైలు నది పర్యావరణం సర్వనాశనం అవుతుందని గుండెలు బాదుకున్నారు. 1960-69 మధ్య నిర్మించిన ఈ డ్యాంలో 4661టిఎంసిల నీరు నిల్వ ఉంటుంది. 2100 మె.వా. విద్యుత్తుని ఉత్పత్తి చేస్తున్నది. ఈజిప్ట్‌ యొక్క మొత్తం ఆహార భద్రతకు పూచీ పడుతున్నది. ఒకసారి డ్యాం నిండితే నాలుగేండ్లు వరద రాకపోయినా ఈజిప్ట్‌ వ్యవసాయాన్ని కాపాడుతుంది. ఈజిప్ట్‌ విద్యుత్‌ అవసరాలను తీరుస్తుంది. 1980- 87 మధ్య కాలంలో ఆఫ్రికా ఖండాన్ని అతలాకుతలం చేసిన తీవ్ర కరువు పరిస్థితుల్లో ఆస్వాన్‌ డ్యాం ఈజిప్ట్‌ని కరువు బారిన పడకుండా కాపాడింది. ఆస్వాన్‌ డ్యాం లేనట్లయితే ఈజిప్ట్‌ని కూడా కరువు కబళించి ఉండేది.

అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు సష్టించిన అన్ని అడ్డంకులను, వ్యతిరేకతలని ఎదుర్కొని ఆనాటి ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ నాజర్‌ సోవియట్‌ యూనియన్‌ వారి సాంకేతిక సహకారంతో డ్యాం నిర్మాణాన్ని పూర్తి చేసినాడు. అది ఈనాడు ఆఫ్రికా ఖండంలో ఈజిప్ట్‌ని సంపద్వంతమైన దేశంగా మార్చింది. దేశ ఆహార భద్రతకు పూచీ పడింది. ఆస్వాన్‌ డ్యాం నిర్మాణానికి 625 మిలియన్‌ డాలర్లు వెచ్చించినారు. ఆస్వాన్‌ డ్యాం తనపై పెట్టిన ఈ భారీ ఖర్చుని ఆణా పైసలతో తన సేవల ద్వారా ఒకే సంవత్సరంలో తిరిగి చెల్లించిందని విశ్లేషకులు ఇప్పటికీ భావిస్తారు.

త్రీ గార్జేస్‌ డ్యాం
యాంగ్షి నదిపై త్రీ గార్జేస్‌ డ్యాం నిర్మాణం జరగాలని చైనా విప్లవ నాయకుడు మావో కలగన్నాడు. ఇంత పెద్ద డ్యాం నిర్మాణం జరిగితే యాంగ్షి నదిలో అనేక పట్టణాలు, గ్రామాలు, చారిత్రిక స్థలాలు మునిగి పోతాయని, లక్షల సంఖ్యలో ప్రజలు నిర్వాసితులు అవుతారని, యాంగ్షి నది పర్యావరణం నాశనం అవుతుందని, డ్యాంలో నిల్వ చేసిన నీటి బరువు వలన భూకంపాలు వస్తాయని .. ఇట్లా పలు విధాల చర్చలు జరిగినాయి. ఈ చర్చ 40 యేండ్లు చైనాలోనూ, అంతర్జాతీయంగానూ సాగింది. మావో తాను బతికి ఉన్న కాలంలో తన కలని నిజం చేసుకోలేక పోయినాడు.

చైనా పీపుల్స్‌ కాంగ్రెస్‌ ఆమోదం పొందలేకపోయినాడు. పెద్ద డ్యాంల నిర్మాణంలో అత్యధికంగా చర్చనీయాంశం అయ్యింది చైనాలో యాంగ్షి నదిపై నిర్మించిన త్రీ గార్జెస్‌ డ్యాం.ఆఖరుకు ఈ చర్చకు ఫుల్‌ స్టాప్‌ పడింది. జియాన్‌ జెమిన్‌ అధ్యక్షుడుగా ఉన్న చైనా ప్రభుత్వంలో ప్రధానిగా ఉన్న లీ పెంగ్‌ చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ సభ్యులను విశ్వాసంలోనికి తీసుకున్నాడు. చైనా పీపుల్స్‌ కాంగ్రెస్‌ ఆమోదం పొందగలిగినాడు. ఆయన స్వయానా ఇంజనీర్‌ కనుక అందరి ఆమోదాన్ని పొందగాలిగినాడు. ఆయన సంకల్పంతో ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణవేత్తలు ఎంత గగ్గోలు పెట్టినా వాటిని బేఖాతరు చేసి చైనా ప్రభుత్వం 22,500 మె.వా. సామర్ధ్యం కలిగిన, ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్‌ ప్రాజెక్టును నిర్మించింది.

2008 నాటి లెక్కల ప్రకారం త్రీ గార్జెస్‌ డ్యాంలో 12 లక్షల 40 వేల మంది నిర్వాసితులైనారు. వారందరికీ కొత్తగా నిర్మించిన నగరాల్లో, లేదా ఇతర నగరాల్లో పునరావాసం కల్పించినారు. ముంపులోకి వచ్చిన 13 నగరాలు, 140 పట్టణాలు, 1350 గ్రామాలు, 1300 చారిత్రక స్థలాలని వేరే చోటికి తరలించినారు. 24500 హెక్టార్ల పంట భూమి ముంపు బారినపడింది. జలాశయం పొడవు 660 కి మీ, వెడల్పు 1.12 కి.మీ, జలాశయం విస్తీర్ణం 1350 చదరపు కి.మీ, నీటి నిల్వ 1388 టిఎంసిలు. ప్రాజెక్టు నిర్మాణానికి 22.50 బిలియన్‌ అమెరికా డాలర్లు ఖర్చు చేసింది. ఈ ఖర్చంతా రానున్న 10 సంవత్సరాల్లో విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా డ్యాం తిరిగి చెల్లింస్తుందని చైనా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంత భారీ జల విద్యుత్‌ ప్రాజెక్ట్‌ వలన ఏటా 31 మిలియన్‌ టన్నుల బొగ్గు వినియోగం తగ్గనున్నది. ఫలితంగా 100 మిలియన్‌ టన్నుల గ్రీన్‌ హౌజ్‌ గ్యాస్‌ ఉద్ఘారాలు, కొన్ని మిలియన్‌ టన్నుల పొడి రేణువులు (Dust), ఒక మిలియన్‌ టన్నుల సల్ఫర్‌ డై ఆక్సైడ్‌, 3,70,000 టన్నుల నైట్రిక్‌ ఆసిడ్‌, 10,000 టన్నుల కార్బన్‌ మోనాక్సైడ్‌, తగినంత పరిమాణంలో పాదరసం వాతావరణంలోనికి పోకుండా నిరోధించ గలుగుతుంది. 660 కి మీ పరిధిలో దేశీయ నౌకాయానం అభివద్ది అయ్యింది. చవకైన రవాణా మార్గాలు ఏర్పడినాయి. టూరిజం గణనీయంగా పెరిగి ప్రజలకు ఉపాధి కలుగజేస్తున్నది. జలాశయం నిర్మాణం వలన ముంపు బారినపడిన ప్రాంతంలో 1990 వ దశకంలో 13,000 చదరపు కి.మీ గ్రీన్‌ కవర్‌ ని కోల్పోయింది. అయితే చైనా ప్రభుత్వం చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం వలన గ్రీన్‌ కవర్‌ 2008 నాటికల్లా 6000 చదరపు కి.మీ పెరిగినట్లు ఇక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఖీూూ) ప్రకటించింది.

హూవర్‌ డ్యాం
కొలొరాడో నది : కొలరాడో నది ఉత్తర అమెరికా ఖండం నైరుతీ ప్రాంతంలో ప్రవహించే పెద్ద నదుల్లో ఒకటి. నది పొడవు 1450 మైళ్ళు(2330 కి మీ). నది పరీవాహక ప్రాంతం 6,40,000 చదరపు కి.మీ. 97శాతం పరివాహక ప్రాంతం అమెరికాలో ఉండగా 3 శాతం మెక్సికో ఉన్నది. కొలరాడో నదిలో 85 నుంచి 90 శాతం ప్రవాహాలు ఎండాకాలం మంచు కరిగినందువలన చేరేవి. 10 నుంచి 15 శాతం ప్రవాహాలు ఎండాకాలంలో కురిసే వర్షాలు, భూగర్భ ప్రవాహాల (Sub Surface flows) ద్వారా నదిలోకి చేరుతాయి. నదిలో ఏటా సరాసరి 22,500 క్యూసెక్కులు ప్రవహిస్తాయి. అయితే ప్రతీ ఏటా ఎండాకాలంలో ఒక లక్ష క్యూసెక్కులకు పైనే ప్రవహించే సందర్భాలు కూడా

ఉంటాయి. 1884 సంవత్సరంలో అత్యధికంగా 3,84,000 ల క్యూసెక్కులు ప్రవహించినట్టు రికార్డు అయ్యింది. హూవర్‌ డ్యాంని నిర్మించక ముందు కొలరాడో బేసిన్‌ లోని దిగువ రాష్ట్రాలైన కాలిఫోర్నియా, ఆరిజోనా, నెవెడా రాష్ట్రాలు వరదలతో అతలాకుతలం అయ్యేవి. విపరీతంగా ప్రాణ నష్టం,ఆస్తి నష్టం జరిగేది. 1905 లో కొలరాడో నదికి వచ్చిన వరదల్లో కాలిఫోర్నియా రాష్ట్రంలో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరద నష్టాల నుంచి రైతులను కాపాడటానికి, పునరావాసానికి అమెరికా ప్రభుత్వం 10 మిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టవలసి వచ్చిందని రికార్డులు చెపుతున్నాయి.

కొలొరాడో నదీ జలాల ఒప్పందం : ఈ వరదల అనంతరం అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వం కొలరాడో నదిపై డ్యాం నిర్మించవలసిన ఆవశ్యకతను గుర్తించింది. కొలరాడో నది నుంచి వృధాగా సముద్రానికి తరలిపోతున్న నీటిని నిల్వ చేసుకొని వరదలను నియంత్రించడమే కాకుండా వ్యవసాయాభివద్ధికి వినియోగించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. మొదటగా కొలరాడో నదిపై కొన్ని చిన్న డ్యాంల నిర్మాణం జరిగింది. 1920 నాటికి నదిలో లభ్యమయ్యే జలరాశిని నిల్వ చేయగలిగే ఒక పెద్ద జలాశయాన్ని నిర్మిస్తే తప్ప ఆశించిన ప్రయోజనాలు నెరవేరవని కాలిఫోర్నియా, నెవెడా, ఆరిజోనా రాష్ట్రాల ప్రజల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. దక్షిణ కాలిఫోర్నియా రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న లాస్‌ ఏంజిల్స్‌, నెవెడా రాష్ట్రంలో లాస్‌ వేగస్‌, ఆరిజోన రాష్ట్రంలో ఫీనిక్స్‌ నగరాలు, ఇతర పట్టణాలలో గృహ మరియు పారిశ్రామిక విద్యుత్‌ అవసరాలను తీర్చడానికి కూడా పెద్ద డ్యాం అవసరమనే భావన బలపడింది. అయితే డ్యాం నిర్మాణం జరిగితే కాలిఫోర్నియా రాష్ట్రం అత్యధికంగా ప్రయోజనాలను పొందనున్నదన్న అనుమానం బేసిన్‌ లో ఉన్న ఇతర రాష్ట్రాలు వ్యక్తం చేసినాయి. ఈ అనుమానాల నేపథ్యంలో అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వం పురమాయింపుతో వాణిజ్య కార్యదర్శిగా (Secretary of Commerce) ఉన్న హెర్బర్ట్‌ హూవర్‌ నేతృత్వంలో కొలరాడో రివర్‌ బేసిన్లో ఉన్న ఏడు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు సంబంధించి చర్చలు మొదలయినాయి. స్వయానా ఇంజనీర్‌ అయిన హెర్బర్ట్‌ హూవర్‌ చొరవతో సుదీర్ఘ చర్చల అనంతరం 1922 లో ఏడు బేసిన్‌ రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దాన్నే Colorado River Compact-1922 గా పిలుస్తారు.

ఈ డాక్యుమెంట్‌ ప్రకారం కొలరాడో నదిలో ప్రతీ ఏటా లభ్యమయ్యే నీరు 16.5 Million Acre feet (718.74 టిఎంసి) అని లెక్క గట్టారు. ఈ నీటిని బేసిన్‌లో ఉన్న ఎగువ రాష్ట్రాలకు (కొలరాడో, ఉటా, న్యూ మెక్సికో, వ్యోమింగ్‌), దిగువ రాష్ట్రాలకు (ఆరిజోనా, కాలిఫోర్నియా, నెవెడా) సరి సమానంగా 7.5 Million Acre feet (326.70 టిఎంసి) కేటాయించినారు. కొద్దిపాటి నీటిని మెక్సికో దేశానికి కూడా ఇవ్వాలని ఫెడరల్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఒప్పందం Equitable apportionment అనే సూత్రానికి ప్రాధాన్యతనిచ్చి రాష్ట్రాలకు నీటి పంపకాలు జరిపింది. ‘మేము మొదట నీటి వాడకాన్ని మొదలుబెట్టాము కాబట్టి మాకు మొదటి ప్రాధాన్యత’ అన్న సూత్రీకరణని తిరస్కరించింది. కొలరాడో ఒప్పందం, ఆ తర్వాత అంతర్జాతీయంగా నీటి పంపకాలకు ప్రాతిపదిక అయ్యింది. కృష్ణా నదీ జలాల పంపకాల కోసం ఏర్పాటు అయిన బచావత్‌ ట్రిబ్యునల్‌ కొలరాడో ఒప్పందాన్ని కూలంకషంగా చర్చించింది. ఆరిజోనా రాష్ట్రానికి ఈ ఒప్పందం పట్ల అభ్యంతరాలు ఉన్నప్పటికీ డ్యాం నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఆరు సంవత్సరాల తర్వాత ఈ ఒప్పందం ఆధారంగా కొలరాడో నదిపై దిగువన ఆరిజోనా, నెవెడా రాష్ట్రాల సరిహద్దులో బౌల్డర్‌ అనే ప్రాంతంలో డ్యాం నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ 1928 అమెరికా కాంగ్రెస్‌ ఒక చట్టాన్ని చేసింది. అదే బౌల్డర్‌ కాన్యాన్‌ ప్రాజెక్ట్‌ చట్టం -1928 (Boulder canyon Project Act-1928). డ్యాంకు కొలరాడో రివర్‌ డ్యాంగా నామకరణం చేశారు.(1941 లో ఈ డ్యాంకు హెర్బర్ట్‌ హూవర్‌ పేరు మీద హూవర్‌ డ్యాంగా, జలాశయాన్ని బ్యూరో ఇంజనీర్‌ డా. ఎల్‌ వుడ్‌ మీడ్‌ పేరు మీద మీడ్‌ లేక్‌ అని నామకరణం చేశారు.) డ్యాం నిర్మాణానికి నాలుగు లక్ష్యాలను చట్టంలో పేర్కొన్నారు. 1) వరద నియంత్రణ 2) వ్యవసాయానికి, గృహ, పారిశ్రామిక అవసరాలకు నీటి వినియోగం 3) విద్యుత్‌ ఉత్పత్తి 4) దేశీయ జల రవాణా అభివృద్ధి.

హూవర్‌ డ్యాం నిర్మాణం
అమెరికా బ్యూరో ఆఫ్‌ రిక్లమేషన్‌ (US Beauro of Reclamation) ఇంజనీర్లకు గతంలో డ్యాంల నిర్మాణంలో అనుభవం ఉన్నప్పటికీ ఈ స్థాయిలో డ్యాం నిర్మాణానికి పూనుకోవడం ఇదే మొదటిసారి. ఆనాటికి బౌల్డర్‌ కాన్యాన్‌ డ్యాం ప్రపంచలోనే అతి ఎత్తైన డ్యాం. ఈ డ్యాం వలన ఏర్పడే జలాశయం ప్రపంచంలో అతి పెద్దది. పెద్ద డ్యాంల నిర్మాణం సందర్భంగా వచ్చే ప్రశ్నలు, సవాళ్లు బౌల్డర్‌ డ్యాం మీద కూడా వచ్చాయి. ఇంత ఎత్తైన డ్యాం నిర్మాణానికి అవసరమయ్యే సాంకేతిక పరిజ్ఞానం బ్యూరో ఇంజనీర్లకు ఉందా? ఈ డ్యాం అన్ని రకాల ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడుతుందా? డ్యాం బ్రేక్‌ అయితే ఏర్పడే నష్టాల గురించి అధ్యయనం జరిగిందా? ఈ ప్రశ్నలు, సవాళ్ళను అధిగమించి బ్యూరో ఇంజనీర్లు తమ మేధస్సును ధారపోసి డ్యాం డిజైన్లను రూపొందించినారు. వందలాది చిత్ర పటాలను తయారు చేసినారు. డ్యాం నిర్మాణానికి పక్కా కార్యాచరణ తయారు చేసినారు. హూవర్‌ డ్యాం ఎత్తు 726 అడుగులు, పొడవు 1,244 అడుగులు, డ్యాం అడుగున వెడల్పు 660 అడుగులు, పైన వెడల్పు 45 అడుగులు. డ్యాం నీటి నిల్వ సామర్ధ్యం 1243 టిఎంసిలు. జలాశయం విస్తీర్ణం 640 చదరపు కిలోమీటర్లు. జలాశయం పొడవు 180కి.మీ. డ్యాం విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం 2080 మెగావాట్లు. 1931 లో డ్యాం నిర్మాణం ప్రారంభం అయ్యింది. మొదట కార్మికులు, ఇంజనీర్ల వసతి, కార్యాలయాల కోసం ఒక గ్రామాన్ని నిర్మించారు. అదే ఈనాడు బౌల్దర్‌ సిటీగా పిలువబడుతున్నది. డ్యాం నిర్మాణం ప్రారంభం అయ్యే నాటికి కొలరాడో ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన హెర్బర్ట్‌ హూవర్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనారు. ఆయన ప్రోత్సాహంతో డ్యాం నిర్మాణం 1935 లో పూర్తి అయ్యింది. రోజుకు మూడు షిఫ్టుల్లో పని చేసి డ్యాంని అనుకున్న సమయానికన్నా రెండేండ్ల ముందుగానే పూర్తి చేయగలిగినారు.

డ్యాం నిర్మాణం కోసం బ్యూరో ఇంజనీర్లు అనేక సాంకేతిక ఆవిష్కరణలు చేసినారు. ఈ ఆవిష్కరణలు హూవర్‌ డ్యాం నిర్మాణాన్ని వేగవంతం చేయడమే కాకుండా డ్యాంల నిర్మాణ సాంకేతికతకు కొత్త చేర్పులుగా ప్రపంచ వ్యాప్తంగా ఇంజనీర్లకు ఉపయోగపడినాయి. అటువంటి ఆవిష్కరణలు కొన్ని:

1) 30 మంది ఒకేసారి మూడు అంతస్తుల్లో డ్రిల్లింగ్‌ చేయడానికి ఒక జుంబో యంత్రాన్ని ప్రవేశపెట్టారు.

2) డ్యాంని Monilithic కాకుండా ఇంటర్‌ లాకింగ్‌ బ్లాకులుగా (Inter Locking Blocks) కాంక్రీట్‌ని వేయడం జరిగింది. ఈ పద్ధతి వలన డ్యాం నిర్మాణం వేగవంతం అయ్యింది.

3) కొలరాడో నదీ జలాలను మళ్ళించడానికి లోయకు రెండు వైపులా 15 మీ వ్యాసంతో రెండేసి సొరంగాలను తవ్వ వలసి వచ్చింది. ఈ టన్నెళ్ళ మొత్తం పొడవు 5 కి.మీ. ఈ సొరంగాల తవ్వకం కోసం డ్రిల్లింగ్‌ యంత్రాలను, కాంక్రీట్‌ గ్యాంట్రీలను, న్యుమాటిక్‌ గ్రౌటింగ్‌ యంత్రాలను ప్రవేశపెట్టారు.

4) డ్యాం నిర్మాణ ప్రాంతం ఎండ వేడిమి ఎక్కువగా ఉండే ఎడారి ప్రాంతం. కాంక్రీట్‌ క్యూరింగ్‌ కోసం పైపుల చల్లటి నీటిని సరఫరా చేసినారు.

5) డ్యాంని ఎత్తైన లోయలో నిర్మిస్తున్న కారణంగా Aerial Cable way system అభివృద్ధి చేసినారు

6) పెద్ద ఎత్తున కాంక్రీట్‌ ఉత్పత్తి కోసం అత్యాధునిక Batching Plants నిర్మించారు. అంతకు ముందు ఇటువంటి కాంక్రీట్‌ బ్యాచింగ్‌ ప్లాంట్స్‌ లేవు.

7) బండ రాళ్ళ నుంచి రక్షణ కోసం కార్మికులకు గట్టి హేల్మెట్లను రూపకల్పన చేసినారు.

డ్యాం ఫోర్‌ షోర్లో ఆరిజోనా రాష్ట్రం వైపు ఒకటి, నెవెడా రాష్ట్రం వైపు ఒకటి స్పిల్‌ వేలను నిర్మించారు. వీటి నీటి విడుదల సామర్ధ్యం 2 లక్షల క్యూసెక్కులు. వీటి నుంచి నీటిని వదిలితే నయాగారా జలపాతం నుంచి పారే నీటి పరిమాణంతో సమానం. డ్యాం నిర్మాణానికి 2.60 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ 18 మిలియన్‌ టన్నుల స్టీల్‌ ని వినియోగించినారు. ఈ కాంక్రీట్‌ తో అమెరికా పశ్చిమ తీరంలో ఉన్న శాన్‌ ఫ్రాన్సిస్కో నగరం నుంచి తూర్పు తీరంలో ఉన్న న్యూయార్క్‌ నగరానికి (సుమారు 4,600 కి మీ) నాలుగు లేన్ల రోడ్డును నిర్మించవచ్చు.

ఇంత పెద్ద డ్యాంని నిర్మించడం ఆనాటి బ్యూరో ఇంజనీర్లకు ఒక సవాలుగా నిలచింది. హూవర్‌ డ్యాం నిర్మించిన కాలం ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం ఆవరించిన కాలం. డ్యాం నిర్మాణానికి 21 వేల మంది కార్మికులు నిరంతరం పని చేశారు. 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. డ్యాం నిర్మాణం పూర్తి అయిన తర్వాత అది తన లక్ష్యాలను నెరవేర్చడంలో సఫలం అయ్యింది. బేసిన్‌ రాష్ట్రాల్లో తరచుగా సంభవించే వరదల పీడ పోయింది. ఆరిజొనా రాష్ట్రంలో లాస్‌ వేగాస్‌, కాలిఫోర్నియా రాష్ట్రంలో ఏంజిల్స్‌ వంటి నగరాలు, అనేక పట్టణాల తాగు నీరు, పారిశ్రామిక అవసరాలకు నీటిని అందిస్తున్నది. విద్యుత్తును అందిస్తున్నది. హూవర్‌ డ్యాం ద్వారా విడుదల అయ్యే నీరు నెవెడా, ఆరిజోనా, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో కోలోరాడో రివర్‌ అక్విడక్ట్‌, సెంట్రల్‌ ఆరిజోన ప్రాజెక్ట్‌ కాలువల ద్వారా, ఆల్‌ అమెరికన్‌ కాలువ ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది. మొత్తంగా డ్యాం మూడు దిగువ రాష్ట్రాల్లో 18 మిలియన్‌ ప్రజలకు సేవలు అందిస్తున్నది.

హూవర్‌ డ్యాం ఫలితాలు – వ్యవసాయాభివృద్ధి
ఈ డ్యాం నిర్మాణం ద్వారా వచ్చిన అనుభవంతో అమెరికాలో అన్ని ప్రధాన నదులపై అనేక డ్యాంల నిర్మాణం చేపట్టినారు. 1942 లో కొలంబియా నదిపై గ్రాండ్‌ కూలీ (Grand Coulee) డ్యాం నిర్మాణం పూర్తి అయింది. 1940-80 మధ్య కాలంలో కొనసాగిన ఈ డ్యాంల నిర్మాణంతో 1940 తర్వాత అమెరికాలో వ్యవసాయ విస్తరణ వేగంగా కొనసాగింది. వ్యవసాయాభివద్ధిని అంచనా వేయడానికి హూవర్‌ డ్యాంకి ముందు, తర్వాత అన్న అంశం విశ్లేషకులకు ప్రామాణికంగా మారింది. 1940 కి ముందు అమెరికాలో డ్యాంల మొత్తం నీటి నిల్వ సామర్ధ్యం చాలా తక్కువ. అది 1978 నాటికి 40 Million acre feet (1742 టిఎంసి)లకు పెరిగింది. 1940 తర్వాత దేశ వ్యాప్తంగా బ్యూరో వారు నిర్మించిన డ్యాంల వలన సాగునీరు అందుబాటులోకి వచ్చింది. దీని ఫలితంగా సాగునీరు అందే ఆయకట్టు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 1910-1940 మధ్య కాలంలో 20 మిలియన్ల ఎకరాల సాగు భూమి స్థిరంగా ఉన్నది. 1940-78 మధ్య కాలంలో అది 43 మిలియన్‌ ఎకరాలకు పెరిగింది. ఇది అమెరికాలో సాగు అవుతున్న మొత్తం విస్తీర్ణంలో 7.5 శాతం అయినప్పటికీ మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల్లో 55 శాతం విలువ కలది కావడం గమనార్హం.

అంటే 1940 తర్వాత అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వం కల్పించిన వసతుల కారణంగా సాగు విస్తీర్ణం, వ్యవసాయ ఉత్పత్తుల విలువ గణనీయంగా పెరిగిందని పరిశోధకులు విశ్లేషించారు. ఈ అభివద్ధి అమెరికా అంతటా కనిపించినప్పటికీ పశ్చిమ అమెరికాలో ఉన్న రాష్ట్రాల్లో మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పశ్చిమ అమెరికా రాష్ట్రాల్లో బ్యూరో ఇంజనీర్లు, అమెరికా సైనిక ఇంజనీర్లు, రాష్ట్ర ప్రభుత్వాల సాగునీటి సంస్థలు నిర్మించిన పెద్ద డ్యాంలు, సాగు నీటి ప్రాజెక్టులు 180 ఉన్నాయని, వీటి ద్వారా వ్యవసాయానికి, గృహ అవసరాలకు, పరిశ్రమలకు నీటి సరఫరా జరుగుతున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌ కూడా హూవర్‌ డ్యాంని అమెరికా ఏడు సివిల్‌ ఇంజనీరింగ్‌ అద్భుతాలలో ఒకటిగా పరిగణించింది.

జల విద్యుత్‌ ఉత్పత్తి : డ్యాం వద్ద ఆరిజోనా వైపు ఒకటి, నెవెడా వైపు ఒకటి జల విద్యుత్‌ ప్లాంట్లను నిర్మించారు. ఈ ప్లాంట్ల ద్వారా సంవత్సరానికి సగటున 4 Billion kilowatt-hours విద్యుత్‌ ఉత్పత్తి అవుతున్నది. ఈ విద్యుత్‌ నెవెడా, ఆరిజోనా, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో 1.3 మిలియన్‌ ప్రజల విద్యుత్‌ అవసరాలను తీరుస్తున్నది. 1939-49 మధ్య కాలంలో ఈ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ప్రపంచంలోనే అతి పెద్దది. ఆ తర్వాత ఇంత కంటే పెద్ద జల విద్యుత్‌ కేంద్రాలు ఇతర దేశాల్లో నిర్మాణం అయినాయి. ఇప్పటికీ హూవర్‌ డ్యాం అమెరికాలో ఉన్న అతి పెద్ద జల విద్యుత్‌ కేంద్రాల్లో ఒకటి. విద్యుత్‌ అమ్మకాల ద్వారానే డ్యాం నిర్మాణ ఖర్చులను రాబట్టుకోవడం జరిగింది.

పర్యాటకం
ఇవి కాకుండా హూవర్‌ డ్యాం రూపకర్తలు ఊహించని విధంగా పర్యాటకం ద్వారా ప్రతీ సంవత్సరం మిలియన్ల డాలర్ల ఆదాయం సమకూరుతున్నది. అమెరికా సాంకేతిక పరిజ్ఞానానికి హూవర్‌ డ్యాం ఒక ప్రబలమైన చిహ్నంగా నిలిచింది. తమ దేశానికి గర్వ కారణంగా నిలిచిన హూవర్‌ డ్యాంను అమెరికా ప్రజలకే కాదు అమెరికాను సందర్శించే విదేశీ పర్యాటకులకు కూడా ఒక ప్రసిద్ధ పర్యాటక స్థలంగా రూపొందింది. డ్యాం నిర్మాణం జరుగుతున్నప్పటి నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఇంజనీర్లు, రచయితలు, పాత్రికేయులు, సినిమా నిర్మాతలను విశేషంగా ఆకర్షించింది. హూవర్‌ డ్యాంపై ప్రత్యేక కథనాలు పత్రికల్లో విస్తతంగా అచ్చు అయినాయి. పుస్తకాలు వెలువడినాయి. డాక్యుమెంటరీలు రూపొందించినారు. డ్యాం పూర్తి కాక మునుపే సామాన్య ప్రజలు కూడా డ్యాం సందర్శనకు రావడం ప్రారంభం అయ్యింది. 20 వ శతాబ్దం అంతానికి హూవర్‌ డ్యాం ని సందర్శించే వారి సంఖ్య సంవత్సరానికి 10 లక్షలు పైనే. ఇప్పటికీ హూవర్‌ డ్యాం అమెరికా సందర్శకులకు ఒక ప్రసిద్ధ పర్యాటక స్థలం.

ఫ్రాన్ల్కిన్‌ డి రూస్వేల్ట్‌ సందేశం :
డ్యాం నిర్మాణం పూర్తి అయ్యే నాటికి అమెరికా అధ్యక్షుడిగా ఫ్రాన్ల్కిన్‌ డి రూస్వేల్ట్‌ (Franklin D Roosevelt) ఎన్నిక అయినారు. సెప్టెంబర్‌ 30, 1935 న హూవర్‌ డ్యాం ని జాతికి అంకితం చేస్తూ ఆయన అన్న మాటలని మననం చేసుకోవడం అవసరం.

”ఈ రెండేండ్లలో ఈ అమెరికా జాతీయ ప్రాజెక్టులో ఏంతో సాధించినాము. ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా అమెరికాకే కాదు యావత్‌ మానవ జాతికే మేలు చేసినాము. దేశంలో వ్యవసాభివద్ధికి, పారిశ్రామికాభివద్ధికి పునాదులు వేసినాము. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో మనం వెచ్చించిన పెట్టుబడుల ఫలితాలు లబ్ధిదారులకు చేరుతాయి. వారు దేశంలో పరిశ్రమలను ప్రారంభిస్తారు. వాణిజ్యాన్ని పెంపొందిస్తారు. శ్రమశక్తి, సంపదను సష్టిస్తుంది. నిర్మాణాలలో వినియోగించే వస్తువులు సంపద సష్టికి దోహదం చేస్తాయి. వేలాది మందికి ఉపాధిని కల్పిస్తాయి. బౌల్డర్‌ డ్యాం అందుకు ఒక ప్రబలమైన ప్రతీక. ఇప్పటిదాకా అపారమైన కొలరాడో జలరాశి వధాగా సముద్రంలోకి పరుగెడుతున్నాయి. ఈ రోజు నుంచి ఆ జలరాశి మన జాతీయ సంపదగా రూపు దాల్చింది. ఈ రోజు బౌల్డర్‌ డ్యాంని జాతికి అంకితం చేస్తున్నాను. ఇది మన ఇంజనీరింగ్‌ పరిజ్ఞానానికి ఒక గొప్ప విజయం. అమెరికా జాతి శక్తియుక్తులు, సంకల్ప బలం సాధించిన అద్భుత విజయం. ప్రాజెక్టు పనిలో పాలుపంచుకున్న ప్రతీ ఒక్కరినీ హదయపూర్వకంగా అభినందిస్తున్నాను.”

హూవర్‌ డ్యాంని జాతికి అంకితం చేసిన సందర్భంలో డ్యాం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకంలో డ్యాం నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్ల పేర్లను రాసినారు. డ్యాం నిర్మాణంలో పాలుపంచుకున్న వారి కోసం ఒక స్మారకం, డ్యాం నిర్మాణ సమయంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికులు, ఇంజనీర్ల కోసం ఒక స్మారకం డ్యాం వద్ద ఏర్పాటు చేయడం గొప్ప విషయం.

తెలంగాణా ప్రగతి రథం – కాళేశ్వరం ప్రాజెక్ట్‌
ఈజిప్ట్‌లో ఆస్వాన్‌ డ్యాం(అబ్దుల్‌ నాజర్‌) అయినా, చైనాలో త్రీ గార్జేస్‌ డ్యాం(లీ పెంగ్‌) అయినా, అమెరికాలో హూవర్‌ డ్యాం(హెర్బర్ట్‌ హూవర్‌) అయినా ఆయా దేశాల పాలకుల రాజకీయ సంకల్ప బలంతోనే సాధ్యం అయినాయి. అన్ని అడ్డంకులను, సవాళ్ళను ఎదుర్కొని, నిధులు సమకూర్చి ప్రాజెక్టులను పూర్తి చేసినారు. ఆ ప్రాజెక్టులు వారు ఊహించిన విధంగా ఫలితాలను అందిస్తున్నాయి. ఆయా దేశాల ప్రగతి రథ చక్రాలుగా మారినాయి.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ప్రాజెక్టులు ఆయా దేశాల ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కె సి ఆర్‌ సంకల్ప బలంతో కాళేశ్వరం ప్రాజెక్టు మూడేండ్లలోనే నీటిని ఎత్తిపోయడానికి సిద్ధం అవుతున్నది. నిస్సందేహంగా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా తెలంగాణా రాష్ట్ర ఆర్థిక ప్రగతికి అదే రకంగా దోహదం చెయ్యనున్నది. రూ.80,500 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు కూడా తెలంగాణా రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చబోతున్నది. 2019 జూన్‌ 21న ముఖ్యమంత్రి కెసిఆర్‌ చేతుల మీదుగా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో ప్రారంభోత్సవం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 40 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు, హైదరాబాద్‌ నగరానికి తాగునీరు, పరిశ్రమలకు నీరు అందుతుంది. జలాశయాల్లో, చెరువుల్లో సుమారు 500 టిఎంసిల నీటి నిల్వ సాధ్యం అవుతుంది. 150 కి మీ పొడవున గోదావరి నది సజీవం కాబోతున్నది. మంచి నీటి చేపల, రొయ్యల ఉత్పత్తి గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నది. దేశీయ జల రవాణా అభివద్ధి కానున్నది. పర్యావరణ పర్యాటకం, టెంపుల్‌ టూరిజం, ప్రాజెక్ట్‌ టూరిజం ద్వారా రాష్ట్రానికి అదనపు ఆదాయం సమకూరనున్నది. స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగనున్నవి. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణా ప్రగతి రథంగా (Growth Engine) మారనున్నది.
అమెరికా నుంచి
శ్రీధర్‌ రావు దేశ్‌ పాండే

Other Updates