maga
కెసిఆర్‌ కిట్ల పథకం

ఆడ బిడ్డకు 15వేలు, మగ బిడ్డకు రూ.14వేల ఆర్థిక సహాయం

తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక, స్వరాష్ట్ర ప్రదాత, బంగారు తెలంగాణ పతాక మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మానవీయతకు మచ్చుతునకలా… కాబోయే అమ్మలకు ఆత్మీయతతో.. పుట్టబోయే బిడ్డలకు ప్రేమతో అందిస్తున్న అరుదైన అందమైన అపురూప కానుక ఇది.

అమ్మకు ఆత్మీయతతో… బిడ్డకు ప్రేమతో తెలంగాణ ప్రభుత్వం, గర్భిణీలు, బాలింతలకు పంచుతున్న కెసిఆర్‌ కిట్ల పథకం ప్రారంభమైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కానుకగా ప్రజలకు అందుబాటులోకి తెస్తూ జూన్‌ 3న పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో సీఎం కెసిఆర్‌ స్వయంగా తన చేతుల మీదుగా ప్రారంభించారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ సి లక్ష్మారెడ్డి, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్‌ పర్యాద కష్ణమూర్తి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్‌, సలీం, ఎమ్మెల్యే పాషా ఖాద్రి, చీఫ్‌ సెక్రటరీ, ఎస్పీ సింగ్‌, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజేశ్వర్‌ తివారి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండి వేణుగోపాల్‌ రావు, చీఫ్‌ ఇంజనీర్‌ లక్ష్మణ్‌ రెడ్డి, కేసీఆర్‌ కిట్‌ సీఈఓ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, ప్రధాన కార్యక్రమంగా తీసుకున్న కెసిఆర్‌ కిట్ల పంపిణీ సజావుగా అమలవుతున్నది. రెండు కాన్పులకు వర్తించే విధంగా ఇక ఒక్కో కాన్పునకు రూ.2వేల విలువైన కెసిఆర్‌ కిట్‌తో కలుపుకుని ఆడ బిడ్డకు రూ.15వేలు, మగ బిడ్డకు రూ.14వేల ఆర్థిక సహాయం అందిస్తున్నది. అలాగే మొదట కేసీఆర్‌ కిట్‌ వెబ్‌సైట్‌ను సీఎం ఆవిష్కరించారు. ఆ తర్వాత మెటర్నిటీ హాస్పటల్లో బాలింతలకు సీఎం కేసీఆర్‌ కిట్‌లను అందజేశారు. మొదటి కేసీఆర్‌ కిట్‌ను మేకల సబిత అందుకున్నారు. కేసీఆర్‌ కిట్‌లను ఆత్మీయంగా అందుకున్న వారిలో రహీదా బేగం, మెహజెమీన్‌, సరితమ్మలు ఉన్నారు. అంతకుముందు సీఎం కేసీఆర్‌ హాస్పిటల్‌ వార్డుల్లో తిరిగారు. వార్డు డాక్టర్లతో పాటు నర్సులను దవాఖాన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కెసిఆర్‌ కిట్‌ లక్ష్యాలు ఇవీ

ఆరోగ్య తెలంగాణ…తద్వారా బంగారు తెలంగాణ సాధన లక్ష్యంగా మాతా శిశు సంరక్షణకు నడుం బిగించింది ప్రభుత్వం. ఆరోగ్యంగా పుట్టే బిడ్డలే భవిష్యత్‌ ఆరోగ్య బంగారు తెలంగాణకు బాటలు. అందుకే గర్బిణీలకు పౌష్టికాహారం అందించడం, రెక్కాడితే గానీ, డొక్కాడని, నిండు చూలాలుగా ఉండి కూడా ప్రసవం వరకు తప్పనిసరిగా పనికి వెళ్ళాల్సిన నిరుపేద గర్భిణీలను పని చేయాల్సిన పరిస్థితుల నుంచి విశ్రాంతి తీసుకునేలా చేయడం ఈ పథకం లక్ష్యం. పని దినాలు కోల్పోయే గర్భిణులకు ఆర్థిక సాయం అందించడం ప్రధాన ఉద్దేశ్యం. మన సర్కార్‌ దవాఖానాల్లోనే ప్రసూతి అయ్యేట్లు చూడటం, సాధ్యమైన మేరకు అవసరం లేని ఆపరేషన్లను తగ్గించడం, ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం ద్వారా తెలంగాణ ఆడపడచుల ఆత్మగౌరవాన్ని పెంపొందించడమనే లక్ష్యాలుగా ప్రభుత్వం కెసిఆర్‌ కిట్ల పథకాన్ని తెచ్చింది.

కెసిఆర్‌ కిట్లు-అందులోని వస్తువులు

ప్రసూతి అయిన తల్లీ బిడ్డలకు 15 రకాల వస్తువులతో… కేసీఆర్‌ కిట్స్‌ రూపంలో ప్రభుత్వం ఇస్తున్నది. దోమతెర, బేబీ మాస్కిటోస్‌, దుస్తులు, రెండు టవల్స్‌, బేబీ న్యాప్‌కిన్స్‌, జాన్సన్‌ బేబీ పౌడర్‌, బేబీ షాంపు, బేబీ ఆయిల్‌, బేబీ సబ్బు, బేబీ సోప్‌ బాక్స్‌, ఆట వస్తువులు ఉంటాయి. అలాగే తల్లి కోసం రెండు చీరలు, రెండు సబ్బులు, కిట్‌ బ్యాగ్‌, ప్లాస్టిక్‌ బకెట్‌ తదితర వస్తువులు ఉంటాయి

ఇవీ లెక్కలు-అంచనాలు

రాష్ట్రంలోని 9 టీచింగ్‌ హాస్పిటల్స్‌, 6 జిల్లా వైద్యశాలలు, మూడు మాతా శిశు సంరక్షణ కేంద్రాలు, 30 ఏరియా హాస్పిటల్స్‌, 114 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 24 గంటలపాటు నడిచే 314 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మరో 365 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొత్తం 841 దవాఖానాల్లో ప్రసూతులు జరుగుతున్నాయి. తెలంగాణలో ఏడాదికి 6,28,319 ప్రసవాలు జరుగుతున్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ప్రస్తుతం 30శాతం నుంచి 40శాతం వరకు ప్రసవాలు ప్రభుత్వ వైద్యశాలల్లోనే జరుగుతున్నాయి. కనీసం 50శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానాల్లోనే జరిగే విధంగా చూడాలని ప్రభుత్వం భావిస్తున్నది. తెలంగాణలో జిల్లాల పునర్విభజన తర్వాత 31 జిల్లాలు ఏర్పడ్డాయి. ఈ 31 జిల్లాల్లో అత్యధికంగా నిర్ణీత లక్ష్యాలకు మించి వరంగల్‌ అర్బన్‌లో 167.96శాతం అవుతున్నాయి. ఆతర్వాత హైదరాబాద్‌ 150.79శాతం, ఆదిలాబాద్‌ 122.14శాతం, సంగారెడ్డిలో 120.38శాతం, సిద్దిపేటలో 102.63శాతం చొప్పున ప్రసవాలు జరుగుతున్నాయి. అత్యల్పంగా మేడ్చెల్‌ జిల్లాలో కేవలం 7.77శాతం ప్రసవాలు జరుగుతున్నట్లుగా నమోదు అయింది. దీంతో మేడ్చెల్‌లో వైద్య పరికరాలు, మందులను అందుబాటులోకి తేవడమేగాక, ప్రసూతులు జరపడానికి అవసరమైన విధంగా వైద్య బందాలను పునర్‌ వ్యవస్థీకరించాలని నిర్ణయించారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సి లక్ష్మారెడ్డి. అలాగే మేడ్చల్‌ జిల్లా కేంద్రంలో వెంటనే ఒక మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇక కెసిఆర్‌ స్వయంగా ఈ పథకానికి రూపకల్పన చేశారు. అనేక సార్లు మంత్రి లక్ష్మారెడ్డి సంబంధిత ఉన్నతాధికారులు, వైద్యాధికారులతో కెసిఆర్‌ కిట్ల పంపిణీపై సమీక్షించారు.

మాతా శిశు సంరక్షణలో దేశంలోనే మనం ది బెస్ట్‌!

తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ మూడేళ్ళల్లో మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. ఈ రేటు దేశ సగటు కంటే తక్కువగా ఉండటం ఒక విశేషమైతే, ఉమ్మడి రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉండటం మరో ప్రత్యేకత. శిశు మరణాలు ప్రతి వెయ్యి మందికి 32 శాతం నుంచి 28 శాతానికి తగ్గింది. అలాగే తల్లుల మరణాల రేటు ప్రతి లక్ష మందికి 92 నుంచి 71 కి తగ్గించగలిగాం. ప్రసవాల మీద ప్రత్యేక శ్రద్ధతో తీసుకున్న అనేక చర్యల కారణంగా ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ప్రసూతుల సగటు కూడా 40 శాతం పెరిగాయి.

ప్రభుత్వ దవాఖానాల్లో పెరుగుతున్న ప్రసవాలు

సీఎం కెసిఆర్‌ దూర దృష్టి, మంత్రి లక్ష్మారెడ్డిల చొరవతో ప్రభుత్వం తీసుకుంటున్న అనేక రకాల చర్యల వల్ల సర్కార్‌ దవాఖానాల్లో ప్రసవాలు 40శాతానికి పెరిగాయి. గుర్తించిన గర్భిణీలకు నెల నెలా పరీక్షలు, పౌష్టికాహారం, ఎక్కడ ప్రసవం జరిగితే మంచిదో, తల్లీ బిడ్డలు క్షేమంగా ఉంటారో గుర్తించడం, వాళ్ళని 108 వాహనాల ద్వారా సమీప దవాఖానాలకు తీసుకెళ్ళడం, సుఖ ప్రసవాలు జరిగేలా చూడటం, ఆతర్వాత పిల్లలకు టీకాలు, తల్లీ బిడ్డలను 102 వాహనాల ద్వారా వారి ఇళ్ళకు చేర్చడం వరకు అన్నీ ప్రభుత్వమే చూసుకుంటున్నది. అలాగే అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో సాధ్యమైన మేరకు సుఖ ప్రసవాలు జరిగే విధంగా చూస్తున్నది సర్కార్‌. అమ్మ ఒడి కింద 102 అనే నెంబర్‌ వాహనాల ద్వారా తల్లిబిడ్డలను క్షేమంగా వారి ఇళ్లకు చేరుస్తున్నాం. ప్రస్తుతం 41 వాహనాలతో నెలకు నికరంగా 1000 మంది గర్భిణీలకు సేవలు అందుతున్నాయి.

సిఎం కెసిఆర్‌ దిశానిర్దేశంతో శ్రీకారం చుట్టిన అమ్మ ఒడి పథకానికే కెసిఆర్‌ కిట్‌ అని నామకరణం చేసింది తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ. తెలంగాణ ప్రభుత్వ, దాని రథసారథి సీఎం కెసిఆర్‌ మానవీయ కోణానికి ఈ కార్యక్రమం మరో మచ్చు తునక. కెసిఆర్‌ కిట్ల పథకం కింద ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసూతి అయ్యే ప్రతి తెలంగాణ తల్లికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది.

ప్రత్యేకంగా రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ట్యాబ్‌లను ఎఎన్‌ఎంలకు ఇవ్వడమేగాక, వారికి కంప్యూటరీకరణ మీద ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇప్పటికే గ్రామాల్లో 2.72లక్షల మంది గర్భిణీలను నమోదు చేయడం జరిగింది. గర్భిణీల నమోదు-కంప్యూటరీకరణ నిరంతర ప్రక్రియ.

లబ్ధిదారు అవడం ఇలా!

ఎఎన్‌ఎంలు ఇంటింటికి వెళ్ళి గర్భిణీలను నమోదు చేసి కంప్యూటరీకరిస్తారు. అదే సమయంలో వారికి మాతా శిశు సంరక్షణ కార్డు ఇస్తారు. నెల నెలా పరీక్షలు చేయిస్తారు. అవసరమైన మందులు అందచేస్తారు. వివిధ పరీక్షల తర్వాత ప్రసవ (ఇడిడి-ఎక్స్‌పెక్టెడ్‌ డెలివరీ డేట్‌) తేదీని కూడా ఇస్తారు. ఇదే సమయంలో గర్భిణీ ఆరోగ్య స్థితిని బట్టి, ఆమె కడుపులో ఉన్న బిడ్డ కదలికలు, ఆరోగ్య స్థితిని బట్టి ఆమె ప్రసవం ఎక్కడ జరిగితే మంచిదో కూడా తెలిపి, అక్కడకు వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేస్తారు. ఇదిలావుండగా, గర్బిణీ ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీ, బ్యాంకు అకౌంట్‌ మరియు ఐఎఫ్‌ఎస్‌ సి కోడ్‌, మొబైల్‌ ఫోన్‌ నెంబర్‌, మాతా శిశు సంరక్షణ కార్డుల ఆధారంగా లబ్ధిదారులని ఎంపిక చేస్తారు. ఆతర్వాత నిర్ణీత సమయాల్లో 4 విడతలుగా వారి అకౌంట్లలో డబ్బులు ప్రభుత్వమే వేస్తుంది.

రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు, ప్రత్యేక అధికారులు

కెసిఆర్‌ కిట్ల పంపిణీ సక్రమంగా జరగడం కోసం వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ చైర్మన్‌గా, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కన్వీనర్‌గా, డిహెచ్‌, ప్రత్యేకాధికారి సభ్యులుగా రాష్ట్ర స్థాయి కమిటీని వేశారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌ గా, డిఎం అండ్‌ హెచ్‌ ఓ కన్వీనర్‌గా కమిటీలు వేశారు. ఇక ప్రతి జిల్లాకో ప్రత్యేక అధికారిని నియమించారు. ఇందుకు అవసరమైన సిబ్బంది నియామకం కూడా పూర్తయింది.

లక్ష్యాలకనుగుణంగా ఏర్పాట్లు

ప్రస్తుతం పెరుగుతున్న ఓపీ, అందునా 50శాతం వరకు చేరాలన్న ప్రసవాల లక్ష్యాలకనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నది తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ. ఇప్పటికే అన్ని వైద్యశాలల ఆధునీకరణ, ఫర్నీచర్‌, వైద్య పరికరాలు, ఆపరేషన్‌ థియేటర్లు, వసతుల కల్పన జరిగింది. ప్రసవాలు అధికంగా జరుగుతున్న చోట్ల ఐసియూలని ఏర్పాటు చేస్తున్నది. పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతి కేంద్రంలో అత్యాధునిక ఓఐసియూ పని చేస్తున్నది. అదే తరహాలో నీలోఫర్‌లోనూ అధునిక సదుపాయాలతో అదనపు భవన సముదాయం పని చేస్తున్నది. సుల్తాన్‌బజార్‌ ప్రసూతి కేంద్రం లోనూ ఐసియుల ఏర్పాటు జరగబోతున్నది. మేడ్చల్‌లో కొత్త మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటుకి మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించారు. ఇక మిగతా అన్ని వైద్యశాలల్లోనూ ఆధునిక సదుపాయాలు కల్పించడం ద్వారా ఇప్పటికే మాతా శిశు సంరక్షణలో ఎంతో ముందంజలో ఉన్న తెలంగాణను మాతా శిశు మరణ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అవిరళ కృషి జరుగుతున్నది. ఈ సదుపాయాలన్నీ కెసిఆర్‌ కిట్‌ పథకం ద్వారా అదనంగా సర్కార్‌ దవాఖాన్లకు వచ్చే గర్భిణీలకు సరిపడా సర్వ సన్నద్ధం చేసింది ప్రభుత్వం.

తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక, స్వరాష్ట్ర ప్రదాత, బంగారు తెలంగాణ పతాక మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మానవీయతకు మచ్చుతునకలా… కాబోయే అమ్మలకు ఆత్మీయతతో.. పుట్టబోయే బిడ్డలకు ప్రేమతో అందిస్తున్న అరుదైన అందమైన అపురూప కానుక ఇది.

4 విడతలుగా ఆర్థిక సాయం

గుర్తించిన గర్భిణీలకు… పరీక్షలు జరుగుతున్న సమయంలోనే అంటే, మాతా శిశు సంరక్షణ కార్డు పొంది, కనీసం రెండు సార్లు పరీక్షలు చేయించుకున్న తర్వాత రూ.3వేలు పౌష్టికాహారం కోసం అందచేస్తారు. అనంతరం ప్రసవం తర్వాత మగ బిడ్డ పుడితే మరో రూ.4వేలు, ఆడ బిడ్డ పుడితే అదనంగా మరో రూ.వెయ్యి కలిపి రూ.5వేలు ఇస్తారు. ఇదే సమయంలో రూ. 2 వేల విలువ చేసే కెసిఆర్‌ కిట్‌ని కూడా అందచేస్తారు. బిడ్డ పుట్టినప్పటి నుండి 3 నెలల కాలంలో టీకాలు తీసుకున్న తర్వాత రూ.2వేలు ఇస్తారు. బిడ్డ పుట్టినప్పటి నుండి 9 నెలల కాలంలో ఇవ్వాల్సిన టీకాలన్నీ తీసుకున్న తర్వాత మరో రూ.3 వేలు అందచేస్తారు. ఇలా ఒక్కో తల్లీ బిడ్డలకు నాలుగు విడతలుగా రూ.12వేలు, ఆడ బిడ్డ కలిగితే మరో వెయ్యి అదనంతో రూ.13వేలు అందుతాయి. రూ.2 వేల విలువైన కెసిఆర్‌ కిట్‌తో కలుపుకుంటే… ఆడ బిడ్డ కు రూ.15వేలు, మగ బిడ్డకు రూ.14వేలు లభిస్తాయి. అయితే, రెండు కాన్పులకు, అదీ సర్కార్‌ దవాఖానాల్లో ప్రసూతి అయిన వాళ్ళకే ఈ పథకం వర్తిస్తుంది.

Other Updates