schoolsవేసవి సెలవుల అనంతరం పునః ప్రారంభమైన పాఠశాలకు వెళ్ళాలంటే చాలా మంది విద్యార్ధుకు బెరుకే (భయం). బడికి వెళ్ళకుండా ఉండేందుకు విద్యార్ధులకు సవాలక్ష సాకులు. తల్లిదండ్రుల బ్రతిమిలాట. అదే తొలిసారి పాఠశాలకు వెళ్ళే చిన్నారుల పరిస్థితి ఇంకా చెప్పేదేముంది. బడికి వెళ్ళనని చిన్నారుల మారాం. పంపేందుకు తల్లిదండ్రుల ప్రయత్నం. చిన్నారుల ఏడుపు…. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా పాఠశాల ప్రారంభంలో అంతటా కనిపించే పరిస్థితి. అన్ని విధాలుగా నచ్చజెప్పి తమ చిన్నారులను బడికి పంపినప్పటినుండి తిరిగి ఇంటికి చిన్నారులు చేరుకునే వరకు తల్లిదండ్రుల ఎదురు చూపులు.

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలో ఎస్సీకాలనీలోని ప్రభుత్వ మండలపరిషత్‌ ప్రాథమిక పాఠశాల పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. ‘బడి’ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని పిల్లలు ఎదురుచూస్తుంటారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గల ఈ పాఠశాలలో మొత్తం 113 విద్యార్ధులుంటే వారిలో అంటే 98 శాతం విద్యార్ధులు పాఠశాల ప్రారంభం రోజే హజరయ్యారంటే ‘బడి’ కి వెళ్ళాలన్న మక్కువ పిల్లలకు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
వందశాతం విద్యార్ధుల నమోదు ఈ పాఠశాల ప్రత్యేకత. మొత్తం విద్యార్థుల్లో ముస్లిం మైనారిటి విద్యార్దులు 3, వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్ధులు 6 మినహా మిగిలిన పిల్లలు అందరూ షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన పిల్లలే. కొణిజెర్ల మండల కేంద్రంలో ఆంగ్ల మాధ్యమంలో బోధించే చాలా ప్రయివేటు పాఠశాలలు ఉన్నా తమ పిల్లలను కావాలని తల్లిదండ్రులు ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే చదివించేందుకు ఇష్టపడుతున్నారు. ప్రయివేటు పాఠశాలల్లో చదివించే ఆర్ధిక స్థోమత ఉన్నప్పటికి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పిస్తున్నారు. కొందరైతే ప్రయివేటు ఆంగ్లమాధ్యమ పాఠశాలల్లో చేర్పించినా వాటి పనితీరు పేరుకే గొప్ప అన్న చందంగా ఉండటంతో అక్కడ మాన్పించి తమ పిల్లలను తిరిగి ప్రాథమిక పాఠశాలల్లోనే చేర్పిస్తున్నారు.

దీనికి కారణం ఒక్కటే. ప్రయివేటు పాఠశాలలకు దీటుగా, ఇంకా చెప్పాలంటే వాటికంటే మిన్నగా ఈ ప్రభుత్వ పాఠశాలలో బోధన ఉండడమే. ఉపాధ్యాయుల అంకితభావం, కమ్యూనిటి భాగస్యామ్యం పాఠశాలకు ఈ ప్రత్యేకత తీసుకొచ్చాయి. పాఠశాలలో పరిశుభ్రత, విద్యార్ధుల క్రమశిక్షణ, ఒకరికొకరు సహకరించుకునే తీరు, విద్యార్ధుల యూనిఫాం పాఠశాలను సందర్శించే ప్రతి ఒక్కరికి ముచ్చట కొలుపుతుంది. తెలుగు మాధ్యమ పాఠశాల అయినప్పటికి ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాష ప్రాధాన్యత, అవసరాన్ని గుర్తించిన ఉపాధ్యాయులు పిల్లలకు ప్రాథమిక స్థాయిలోనే ఆంగ్ల భాషలో తర్ఫీదునిస్తున్నారు. తరచూ జరిగే సంభాషణలను ఆంగ్లంలో విద్యార్ధులు మాట్లాడేలా ఉపాధ్యాయులు ప్రాత్సహిస్తున్నారు. విద్యార్ధులు రెట్టింపు ఉత్సాహంతో ఆంగ్లభాషలో పదాలు వాడడం, దైనందిన సంభాషణలను ఆంగ్లంలో చెప్పడం వంటివి చేస్తూ ఉపాధ్యాయులు, తమ తల్లి దండ్రులే అచ్చెరువునొందేలా చూస్తున్నారు.

ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ గోవిందరావు మాట్లాడుతూ, ఈ పాఠశాల ఎస్సీకానీలో ఉండడంతో 95 శాతం పిల్లలు షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన వారే ఉన్నారు. వీరిలో చాలా మంది పేదకుటుంబాలకు చెందినవారే. వీరికి నాణ్యమైన విద్యను అందిస్తే విద్యార్ధులు, వారి కుటుంబాలకు మంచి భవిష్యత్తును అందించవచ్చని భావించి ప్రణాళికాబద్ధంగా మెరుగైన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ క్రమంలోనే కమ్యూనిటి భాగస్వామ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఆటపాటలతో కూడిన బోధన అందిస్తూ, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం, పిల్లలనుసైతం ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నామన్నారు. పిల్లల్లో నాయకత్వ లక్షణాను పెంపొందించేందుకు కమిటీను ఏర్పరచి అందులో వారిని సభ్యులుగా చేర్చడం, ఒకరికి లీడర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ ప్రోత్సహిస్తున్నామని ప్రదానోపాధ్యాయులు స్పష్టం చేశారు. బోధన ఆకర్షణగా మార్చేందుకు తమ స్వంత ఖర్చుతో బోధన అభ్యాస సామాగ్రి తెల్ల బోర్డు, స్కెచ్‌పెన్‌లను సమకూర్చుతామన్నారు. తమ పిల్లలు చదువులో రాణిస్తుండడంతో తల్లిదండ్రులు పాఠశాలకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. విద్యార్ధులకు ప్రైవేటు పిల్లల మాదిరి ఏకరూప దుస్తులు సమకూర్చాల్సిందిగా వారిని కోరినవెంటనే అంగీకరించారన్నారు. దినపత్రికలు పాఠశాలకు వచ్చేలా ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నారు.
కొణిజెర్ల ఎస్సీ కానీకి చెందిన అమర్లపుడి దేవదాసు తన ఇద్దరు పిల్లలు సిరిచందన, ప్రిన్సిలు ఇదే పాఠశాలో వరుసగా 4, 3 తరగతలు చదువుతున్నారన్నారు. ‘‘గతంలో మా పిల్లలను కొణిజర్లలోని ఓ ప్రయివేటు ఇంగ్లీష్‌ మాధ్యమ పాఠశాలలో ఎల్‌.కె.జి, యు.కె.జి చదివించాను ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాను. ఇప్పుడు పిల్లలు బాగా చదువుతున్నారు. ఫీజు చెల్లింపు తప్పింది. సన్నబియ్యంతో రుచికరమైన పౌష్టికాహరంతో కూడిన మధ్యాహ్న భోజనం ప్రభుత్వం పిల్లలకు పెడుతుంది. చిన్నారులను మాకంటె మిన్నగా ఉపాద్యాయులు చూసుకొంటున్నారు. ఇంతకంటే మాకు కావల్సిందేముంది, అందుకే మా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాము’’ అని అమర్లపూడి దేవదాసు సంతోషంగా తెలిపారు.

స్కూల్‌ కమిటి ఛైర్మన్‌ రాంబాబు, స్థానిక యువకుడు జాన్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు విధుల పట్ల అంకిత భావం, విద్యార్ధులకు బంగారు భవిష్యత్తు అందివ్వాలన్న తపన కాలనీ వాసులను ఎంతగానో ఆకర్షించిందన్నారు. జూన్‌ 17న నిర్వహించిన సామూహిక అక్షర అభ్యాసన కార్యక్రమంలో కాలని వాసులు ఉత్సాహంగా పాల్గొన్నామన్నారు. 23 మంది చిన్నారులను కొత్తగా తల్లిదండ్రలు అక్షరాలు దిద్దించి ఈ పాఠశాలలో చేర్పించారన్నారు.

ప్రయివేటు పాఠశాలలకు దీటుగా రాణిస్తున్న ఈ పాఠశాల కాలనీ వాసుల నమ్మకం, అభినందనలు అందుకోవడమేకాదు, పలువురు జిల్లా కలెక్టర్లతో సహా ఎంతోమంది ఉన్నత అధికారుల ప్రశంసలు అందుకుంది. ఆవార్డు,లు రివార్డులు పాఠశాలకు లభించాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ తొలి వార్షిక సంబురాల్లో భాగంగా జిల్లా స్థాయిలో ఎంపికైన ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఈ పాఠశాలకు చెందిన రాధాకృష్ణ ఒకరు. రాష్ట్ర తొలి వార్షిక వేడుకల్లో ప్రభుత్వం ప్రకటించిన నగదు ప్రోత్సాహక బహుమతి రూ. 25,558ను ఉపాధ్యాయుడు రాధాకృష్ణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా అందుకున్నారు.

Other Updates