వివిధ జాతులు..

పలురకాల భాషలు మాట్లాడే ప్రజలు మన దేశంలో ఉన్నారు. అనేక భాషల వారసత్వ స్వరూపం భారతదేశం. మనది భిన్నత్వంలో ఏకత్వం! అంతటి ప్రాధాన్యత ఉన్న భారతదేశంలో రానురాను భాషా, సంస్కృతి, పాశ్చాత్య విధానాలతో కనుమరుగవుతోంది. ఇలాంటి పరిస్థితికి ఎన్నో కారణాలున్నాయి. కానీ, ఒక భాషను బట్టి ఆయా, జాతుల, తెగల సంస్కృతి వికసి స్తుంది. అందువల్ల ఏదైనా భాష అంతరించే దశలో ఉందంటే ఆ భాషను మాట్లాడే జాతి తగ్గిపోతోందని భావించక తప్పదు. కానీ, ఆయా జాతుల, తెగల సంస్తృతికి ప్రతీకలుగా వినిపించే భాషలు అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తున్నది.

మన తెలుగు భాష గురించి పరిశీలిస్తే చాలా వరకు దీన స్థితిలో ఉంది. యువతరం తాము మాట్లాడే భాషలో సహజమైన తెలుగు పదాలు కనుమరుగై ఇంగ్లిషు, హిందీ, ఉర్దూ భాష పదాలే ఎక్కువగా వాడుకలోకి వస్తున్నాయి. ఈ లెక్కన తెలుగుభాషను ప్రభుత్వం, ప్రజలు పరిరక్షించుకోకపోతే తెలుగు తెరమరుగయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని గమనించి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు తెలుగును తప్పనిసరి చేయడం శుభపరిణామం. ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వ హించుకుంటున్నందున రాష్ట్ర ప్రభుత్వం మాతృభాషా బోధనపై దృష్టి సారించడం అభినందనీయం. తెలుగు భాష అమలు, పరిరక్షణకు సంబంధించి కీలకమైన ఈ నిర్ణయాన్ని వచ్చే సంవత్సరం నుంచి పాఠశాల, కళాశాల స్థాయిలో కచ్చితంగా అమలు జరిగేటట్లు చూడాలి. అయితే దీన్ని అమలు చేసే విద్యాసంస్థలకే రాష్ట్రంలో అనుమతి లభిస్తుందని, సాహిత్య అకాడమీ పుస్తకాలనే తెలుగు బోధనకు ఉపయోగించాలని, అన్ని సంస్థలు నామ ఫలకాలను తెలుగులోనే రాయాలని ఆదేశాలు జారీ చేయడం హర్షించదగ్గ విషయం.

కొంత మంది తరతరాలుగా మాట్లాడుతున్న భాష అనేక కారణాల వల్ల రూపాంతరం చెంది సహజత్వాన్ని కోల్పోయి చివరకు చిరునామాగా మిగిలిపోతుంది. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ‘బో’ భాష మాట్లాడ గలిగే ఒకే ఒక్క 85 ఏళ్ల వృద్ధురాలు ‘బోయెసర్‌’ 2010 జనవరి 26న పోర్టు బ్లెయిర్‌ వద్ద చనిపోయింది. ఆమెతో పాటు ఆ భాషా, సంస్తృతి, సంప్రదా యాలు అదృశ్యమయ్యాయి. అండమాన్‌ ప్రజలు మాట్లాడే భాషలు ఎన్నో సరిగా నిర్ధారించలేం. ‘బో’ భాషా మాట్లాడే పెద్ద కుటుంబానికి వారసురా లైన ఈ వృద్ధురాలు చిట్టచివరి వ్యక్తి కావడం విశేషం. కొన్ని నెలల్లో ఆమె చనిపోతారనగా ‘యునెస్కో’ ప్రపంచంలో అవసానదశలో ఉన్న భాషల జాబితా వివరిస్తూ ‘అట్లాస్‌’ విడుదల చేసింది. అందులో భారతదేశం 196 భాషలతో అగ్రస్థానంలో ఉంది. ఆ జాబితాలో 197వ భాషగా ‘తుళు’ చేర్చారు. భాషాపరంగా దేశంలో మృత్యు ఘంటికలు మోగుతున్న ప్పటికీ దాని పరిరక్షణకు మరోవైపు ముమ్మరంగా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో భాషల ప్రాజెక్టును గురించి ‘గూగుల్‌’ ఇటీవల ప్రకటించిన తరువాత ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి. కొన ఊపిరిలో ఒక భాష ఊగిసలాడుతుందంటే త్వరలో అది తెరమరుగవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ భాష మాట్లాడే వారిలో తరాలు మారి, అవసరాలు మారడం వల్లనే ఈ దుర్గతి పడుతోంది. కొత్త తరంవారు తమ భాషను వివిధ అవసరాల వల్ల విడిచిపెడుతున్నారు. ఇతర భాషల కోసం వెంపర్లాడటం వల్ల కొన్ని భాషల పతనానికి కారణమవుతోంది. ఏదైనా ఒక భాషను మాట్లాడేవారు ఆ భాషను ప్రాథమికంగా నిషేధిస్తే ఆ భాష మనుగడ కష్టమవుతుందని భాషా వేత్తలు అభిప్రాయ పడుతున్నారు. ప్రపంచ స్థాయిలో పరిధులు విస్తరిస్తున్నప్పుడు ఉన్నతంగా ఎదగాలన్న ఆకాంక్ష పెరిగినప్పుడు ఆర్థికస్థితి ఇంకా సమర్థం కావాలను కున్నప్పుడు ఆ సమాజం భాషాపరంగా సంక్రమించిన వారసత్వ సంస్తృతీ సంప్రదాయాలను రక్షించేదెవరు? అన్న ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో పాలనాపరంగా ప్రభుత్వమే ధర్మకర్తగా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విస్తరించిన ప్రస్తుత సమాజంలో ఆ భాష విలువలను విస్తరింపచేయానికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయడం తప్పనిసరి. తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను సాకారం చేసేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టింది. కమ్మనైన మన మాతృభాష తెలుగు తన ప్రాధాన్యతను కోల్పోతున్న తరుణంలో దాన్ని కాపాడాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించింది.

అన్యభాషల ప్రభావానికిలోనై తెలుగు భాషను మరుస్తున్న సందర్భంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి తెలుగు భాషపై ప్రత్యేక దృష్టి పెట్టి దేశ విదేశాల్లోని తెలుగువారిలో జిజ్ఞాస పెంచి, ప్రజలందరి భాగస్వామ్యంతో రాష్ట్రమంతా పండుగలా నిర్వహిస్తున్నారు.

వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ప్రపంచతెలుగు మహాసభల సన్నాహక సదస్సులకు విశేష స్పందన లభించింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులో జరిగిన సన్నాహక సదస్సుల్లో పాల్గొన్న అక్కడి తెలుగువారు, కోర్‌ కమిటీ సభ్యులతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. అలాగే మలేసియా తెలుగు సంఘం ప్రతినిధులు పుట్టినింట పండుగకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా భాషను బతికించేందుకు విశేష కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ కృషిని, దృఢసంకల్పాన్ని తెలుగు భాషాభిమానులు ప్రశంసిస్తున్నారు. తెలుగు భాష గొప్పదనాన్ని చాటి చెప్పేందుకు ఆయన చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. ప్రత్యేక బస్సులు, రైళ్లలో ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాద్‌కు చేరుకుంటామని ఉత్సాహాన్ని కనబరిచారు. మహాసభల కోసం సేవాదృక్పథంతో వలంటీర్లుగా పనిచేస్తామని ముందుకొచ్చారు.

తేనెలొలికే తెలుగు.. కమ్మనైనది అమ్మభాష.. మధురమైన మాతృభాష ఇలా భాష గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. వర్ణించడానికి పదాలు చాలవు. అందుకే, ప్రభుత్వం మాతృభాష పరిరక్షణకు నడుంబిగించింది. మరుగునపడుతున్న మాతృభాషకు జవసత్వాలు నింపేందుకు కీలక నిర్ణయం తీసుకున్నది. తెలుగు భాష, సంస్తృతి, సాహిత్య వికాసమే లక్ష్యంగా ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు శ్రీకారం చుట్టడం ఆహ్వానించదగిన పరిణామం. రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలుగు భాష పరిరక్షణకు నడుంబిగించారు. తెలుగు భాషకు ప్రాచీనహోదా కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషిచేసింది.

ముఖ్యమంత్రి స్వయంగా తెలుగు భాషావేత్త కావడం, ఇంటర్మీడియట్‌ వరకు తెలుగు అమలుకు, తెలుగు మహాసభల నిర్వహణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడం సంతోషం. ఆధునిక కాలపు అవసరాలకు అనుగుణంగా తెలుగును మనం ఏవిధంగా ముందుకు తీసుకుపోవాలో అందరం కలిసి చర్చించాలి. ప్రపంచ నలుమూలల నుంచి భాషావేత్తలు, సాహితీవేత్తలు ప్రతినిధులుగా పాల్గొంటున్న ఈ మహాసభలు అనేక విషయాలపై చర్చలు జరపడంతోపాటు, స్పష్టమైన భాషా విధానానికి నాంది పలకనున్నాయి. ప్రజలు రాజకీయంగా, నైతికంగా, సాంఘికంగా, సాంస్తృతిక పరంగా చైతన్యం కావాలి. ప్రజలకు అవసరమైన భావ చైతన్యానికి ‘భాషే’ ఆధారం అన్న సంగతి మరచిపోకుండా సృష్టించే సాహిత్యం ప్రజలను ఆలోచింపజేయాలి. ఉత్తేజపరిచి కార్యోన్ముఖులను కావించాలి. ఈ దిశగా ఒక స్పష్టమైన కార్యాచరణ తెలుగు మహాసభల ద్వారా రూపొందించి అమలు జరిగేలా చూడాలి. సమభావం కోసం నిలిచే శక్తులుగా అభివృద్ధి కావాలని మానవాళికి సందేశమివ్వాలి. అలాగే తెలుగు పరిమళాలను విశ్వవ్యాప్తం చేయాలి. గుండెల నిండుగా ఈ తెలుగు పండుగను జరుపుకోవాలి.
tsmagazine

గడ్డం కేశవమూర్తి

Other Updates