అలనాటి పూర్వీకులను యాదికి తెచ్చే మన ‘మల్లూరు’
బృహత్ శిలాయుగంనాటి అవశేషాలు భారతదేశంలో చాలా చోట్ల కనిపించినా, ఇటువంటి వాటికి ప్రత్యేకంగా పేరు తెచ్చుకున్నది తెలంగాణా, దక్కను ప్రాంతం. తెలంగాణా నలుమూలలా బృహత్ శిలా సమాధులు వేలాదిగా ఉన్నా, సంఖ్యలోగానీ, ఆకర్షణలోగానీ మల్లూరు తర్వాతే వాటిని గురించి చెప్పుకోవాలి.
తెలంగాణాలో అత్యంత చూడచక్కని పల్లెల్లో ‘మల్లూరు’ ఒకటి. దాని చుట్టూ ఉన్న గుట్టలమీదనుంచి చూస్తే ఈశాన్యంగా ప్రవహించే గోదావరి మనసును ఉల్లాస భరితం చేస్తుంది. ఇప్పటిదాకా ఇది చరిత్రాత్మక లక్ష్మీ నరసింహస్వామి గుడికే ప్రసిద్ధి. కానీ మల్లూరు గుట్టలమీద కోట బయటి ప్రహరీగోడ వెంబడి కనిపించే వేలాది బృహత్ సమాధులపై ఎవరి దృష్టి మళ్ళలేదు. గుడి పూజారిని అడిగితే 450 వేల రాక్షస గుళ్ళు ఉన్నాయంటాడు. కానీ అది కొంచెం గొప్పకుపోయి చెప్పినా, నేనయితే వాటిని అక్కడ వందల సంఖ్యలోనే చూశాను. (450 వేలు కాకపోయినా కనీసం అది 450). ఇంత పెద్ద సంఖ్యలో అదీ ఒక చోట కనిపించే అత్యంత అరుదైన ప్రదేశం మల్లూరు.
బృహత్ శిలా నిర్మాణాలు
ఇంచుమించు ఓ పదేళ్ళ క్రితం అనుకుంటా. చరిత్రకందని కాలం నాటి ఇటువంటి ప్రాంతాలు వరంగల్ జిల్లా ఏటూరు నాగారం చుట్టుపక్కల ఉండే అవకాశముందన్న సమాచారం నాకందింది. స్థానికుల సాయంతో ఇక్కడ అన్వేషణ చేద్దామనుకున్నా. కొన్నేళ్ళ క్రితం పసుల బుచ్చయ్య అనే వ్యక్తి వచ్చి నన్ను కలిశాడు. ఆయన ‘నాయక్ పోడ్’ తెగకు చెందినవాడు. తన తెగ పుట్టుపూర్వోత్తరాలు తవ్వితీయాలని ఉందని చెప్పాడు. మల్లూరు గుడిని ఆయన తెగకు చెందినవారు కట్టారని దాని మంచీచెడూ నిన్న మొన్నటిదాకా వారే చూసేవారని చెప్పుకుంటారు. తను నాయకపోడ్ తెగకు చెందిన మరో ఐదారుమందిని మాతో బయలుదేరడానికి సిద్ధం చేశాడు. డిసెంబరు 26, 2014న వాడిగూడెం రాజుపేటవైపునుండి మల్లూరు గుట్ట ఎక్కాం.గుట్ట పై భాగం భూమట్టానికి 600 అడుగులకు పైన ఉన్నట్టనిపించింది. కిందినుంచి మనకు కనిపించినట్లుగా గుట్టపైకి నేరుగా ఎక్కడం కుదిరేది కాదనిపించింది. మాతోవచ్చిన దోస్తులు సావ్లం సత్తయ్య, ఆక తిరుపతి, షెగ్గం పుల్లయ్యలు మాకు గుడ్డెలుగుగుట్ట, కోట గుట్టలమధ్యనుంచి పైకి దారి చూపారు. నిజం చెప్పాలంటే మేం ఒక కచ్చా తోవన వెళ్ళాం. బహుశా 1950ల్లో ఈ గుట్టలున్న అడవినుంచి వెదురు బొంగులను కాగితం మిల్లులకు లారీల ద్వారా చేరవేయడానికి దారి ఏర్పాటు చేసుండవచ్చు.
గుట్టకింది భాగమయిన వాడిగూడెం కుంటనుంచి 10 నిమిషాలు నడిచామో లేదో కోటగోడల బయటవైపు బృహత్ శిలా సమాధులు ఎక్కడపడితే అక్కడ వెదజల్లినట్లుగా చాలా కనిపించాయి. ఒక్కచోటనే ఇన్నా? నోటంట మాట రాలేదు. అక్కడ 72 సమాధులున్నట్లు పుల్లయ్య చెప్పాడు. కోట నిర్మాణం పనులు జరిగేటప్పుడు మరణించినవారివయి ఉండవచ్చునని చెప్పాడు.
పుల్లయ్య, మల్లూరు లక్ష్మీనరసింహస్వామి గుళ్ళో వంశపారంపర్యంగా పనిచేస్తున్న సేవకుడు. ఈ 72 సంఖ్యకూ ఆయన తెగకూ ఒక విశేష సంబంధం కూడా ఉంది. 13, 14 శతాబ్దాలనాటి కాకతీయ సామ్రాజ్యంలో 72మంది పద్మనాయకులు (ఆయన తెగ) ఉండేవారని చరిత్ర చెబుతున్నది కదా! అయితే నిజానికి పుల్లయ్య చెప్పినదానికంటే ఎక్కువే ఉండొచ్చునేమో అక్కడ`కానీ లారీలకోసం కచ్చాతోవ వేసేటప్పుడు వాటిని తొలగించి ఉండవచ్చనిపించింది.
బృహత్ శిలా నిర్మాణాలరూపం
మనం మంచెలంటాంకదా (పొలాల్లో కాపలాకు రైతులు విశ్రమించడానికి చేసుకునే ఏర్పాటు). అవే అంత ఎత్తులో కాకుండా తగ్గిస్తే ఎలా ఉంటాయో ఇవి అలా కనిపిస్తాయి. ఇవి రకరకాల సైజుల్లో ఉన్నాయి. ఎక్కువభాగం అందాజాగా 2 మీ. వెడల్పు, 3 మీ. పొడవుతో, ఒక మీటర్ ఎత్తులో ఉన్నాయి. 3 గోడలుగా 3 వైపులనుంచి పెట్టిన రాళ్ళపై మూతగా పెట్టిన రాయి కొలత 3.5 మీ I 2.5 మీటర్లున్నది. ఒక్కో శిల ఒక్కో గోడగా ఉంది. ఆ మంచెలాంటి నిర్మాణానికి ముందు భాగంలో లోపలికి వెళ్ళడానికి దారి విడిచి ఒకటిన్నర అడుగుల దూరంలో రెండు శిలలను ఒకదాని వెనుక మరొకదాన్ని నిలబెట్టారు. ఇవన్నీ ఏకశిలలే.
ప్రతి నిర్మాణం దగ్గర నీటిని నిల్వచేయడానికి 2 మీ I 1 / 4 మీ I 1/ 4 మీ. కొలతలతో తొట్టెలాంటి నిర్మాణాలున్నాయి. వీటిలో చాలామటుకు సిమెంటు రంగులో ఉన్న గట్టి శిలలతో ఏర్పాటు చేశారు. ఈ రకం రాళ్ళు దగ్గర్లో కనిపించకపోవడంతో, బహుశా వీటిని చాలా దూరంనుంచి తెచ్చి ఉండవచ్చనిపించింది. కొన్ని తొట్టెలను పెద్ద తొట్టెకుపైన ఒక శిలలో చెక్కి పెట్టారు. కొన్ని చోట్ల నేలమీద పరిచిన శిలల్లోనే తొట్టెలుగా మలిచారు. ఇప్పటికీ మనం పూర్వీకుల సమాధులవద్ద ఆకుచిప్పల్లో నీళ్ళుంచే ఆచారం ఉంది కదా! చనిపోయిన వ్యక్తి బతికున్నకాలంలో మద్యపాన ప్రియుడయితే ఆ చిప్పల్లో సారా కూడా పోస్తుంటారు.
బృహత్ శిలా నిర్మాణాల్లో ఆశ్చర్యకరంగా నేలమీద రోటి గుంటలు కూడా కనిపించాయి. చనిపోయిన వ్యక్తి ఆహార ధాన్యాలను దంచుకోవడానికి చేసిన ఏర్పాటు ఇది. లోహయుగంలో ఎవరయినా చనిపోతే, వారు బతికుండగా ఉపయోగించిన వంటపాత్రలు, సామాన్లు, ఆయుధాలు ఆ సమాధిలో ఉంచడం ఆచారంగా ఉండేది. ఇది వారి ఆత్మలకోసం చేసిన ఏర్పాటు (పునర్జన్మను నమ్మేవారు కనుక).
ఈ బృహత్ శిలా నిర్మాణానికి చుట్టూ చక్కగా మలిచిన శిలలను గజం ఎత్తులో గుండ్రటి ఆకారంలో కేంద్ర నిర్మాణంనుంచి 5 మీటర్ల దూరం వరకు ఉంచారు. సమాధి నిర్మాణానికి చుట్టూ గుండ్రటి ఆకారంలో నిలిపిన శిలలకు మధ్య ప్రదేశాన్ని రాళ్ళతో లేదా ప్రత్యేకంగా తయారుచేసిన మెత్తటి బురదలాంటి పదార్థంతో లేదా మృదువైన శిలలతో నింపారు. అంటే మొత్తంగా చెప్పాలంటే ` ఇదంతా చనిపోయిన వ్యక్తికి శాశ్వత నివాసంగా చేసిన ఏర్పాటు. ఎంత శాశ్వతం అంటే కనీసంలో కనీసంగా 2500 ఏళ్ళ ప్రకృతి బీభత్సాలకు తట్టుకుని ఈ నిర్మాణ సంస్కృతి క్షేమంగా నిలబడిరది.
కాలక్రమం
ఇటీవలి కాలం వరకు భారత్‌లో లోహయుగం అంటే క్రీ॥పూ॥ 1000కి క్రీ॥శ॥ 200 సంవత్సరాలకు మధ్యకాలంగా భారత చరిత్రకారులు లెక్కించేవారు. అయితే హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో బయటపడిన బృహత్‌శిలా నిర్మాణాలపై ప్రొఫెసర్ కె.పి. రావు నాయకత్వంలో జరిపిన ప్రయోగాల్లో బృహత్ శిలా సమాధుల సంస్కృతి తెలంగాణాలో క్రీ.పూ. 2వేల ఏళ్ళనాటి నుంచే ఉందని తేలింది. అయితే మల్లూరు నిర్మాణాల్లో ఉపయోగించిన శిలల సైజు, ప్రాచీనతను చూస్తే, అవి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో లభించిన వాటికంటే పూర్వ కాలానికి చెందినవిగా తోస్తున్నది. వీటిని ప్రయోగశాలల్లో తదుపరి పరీక్షలు జరిపేవరకూ మల్లూరు నిర్మాణాలు 4200 ఏళ్ళనాటివని అనుకోవచ్చు. సమాధులలోపలి భాగంలో దొరికిన కుండ పెంకులు చూస్తే మల్లూరు లోహ యుగ సంస్కృతి దాదాపు 3 వేల ఏళ్ళనాటిదనిపిస్తున్నది.
మల్లూరు కోటగోడలు ఉత్తర, దక్షిణాల్లో రెండు కి.మీ. మేర ఉంటాయి. కోట ప్రహరీ ద్వారం ఈశాన్యంలోఉంది. ద్వారబంధంపైకప్పు (లింటల్) దానిపైన చేసిన నిర్మాణాన్ని రెండు దశాబ్దాల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు కూలగొట్టారు. దీనివల్ల ద్వారబంధంమీదగానీ, కోటగోడల మీదగానీ రాజ చిహ్నాలేవీ లేకుండా పోయాయి. కోట పడమటివైపు లోయ ఎంత ఏటవాలుగా కిందికి దిగిపోయి ఉందంటే శత్రువులెవరూ పైకిఎక్కి కోట గోడలకు చేరుకోలేరు. అయినా ఏటవాలు అంత ఎక్కువగా లేనిచోట పైకి ఎగబ్రాక డానికి వీలు లేకుండా గోడలు కట్టేశారు.
దీర్ఘచతురస్రాకారంగా ఉండే కోట మూడు భాగాలుగా ఉంటుంది. స్థానికులు వీటిని ‘‘మూడు కోటలు’’ అంటారు. ఒక భాగంనుంచి మరొక భాగానికి పోవడానికి రెండడుగుల వెడల్పు ఉండే ద్వారాలున్నాయి. ఈశాన్యదిశగా ఒక దానిని దాటి మరో దానిలోకి పోతున్నకొద్దీ, దాటివచ్చిన దానికంటే తర్వాతది పెద్దదిగా కనిపిస్తుంది. ఉత్తరభాగం రాజు జనానా పరివారం, దళాధిపతుల కోసం కాగా, మధ్యలో ఉండేది సిపాయిలు, పదాతి దళాలకోసం, దక్షిణభాగం సాధారణ పౌరులకోసం ఉద్దేశించి నట్లు కనిపిస్తుంది. ఉత్తరభాగంలో దీర్ఘచతురస్రాకారంగా ఉండే బావులున్నాయి. ఇవి వేసవిలో నీటికోసం సిద్ధం చేసినవి అయి ఉంటాయి. అక్కడ కోటగోడకు ఇరువైపుల వేదికలాంటి గద్దెలున్నాయి. రాజుకానీ, దళాధిపతులుకానీ వాటి మీద నిలబడి ఆదేశాలు జారీ చేయడానికి ఉద్దేశించినవి అయి ఉండవచ్చు లేదా ఏదేని ఇతర నిర్మాణంలో భాగం కావచ్చు.
పడమర దిక్కున ఉండే కోటగోడ వెలుపల అసంఖ్యాకంగా ఉన్న బృహత్ శిలా నిర్మాణాలు ఉత్తర గోడ దగ్గర ఉన్నవాటికంటే ఆకర్షణీయంగా ఉన్నయి. రాతి పలకలు అక్కడ చుట్టుపక్కల దొరికినవే.
కోట పడమటిగోడ బయట సహజసిద్ధంగా ఏర్పడ్డ రెండు కుంటలున్నాయి. అయితే అవి నీళ్ళు లేక ఇప్పుడు ఎండిపోయి కనిపిస్తున్నాయి. చింత, ఉసిరిక, శీతావరి మొదలైన చెట్లు కుంటలచుట్టూ దట్టంగా ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే అక్కడ ప్రజలు నివసించినట్లు గట్టిగా అనిపిస్తుంది.
చివరగా అయినా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన దృశ్యం ` ఈశాన్యం దిక్కునుండి మల్లూరు కోట ఎక్కి చూస్తే….. రెండు కి.మీ. వ్యాపించిన గులాబీ రంగు ఇసుక తిన్నెల మధ్యనుంచి నీలం రంగు పులుముకుని గుంభనంగా నడిచివెళ్ళే గోదావరి, పిల్లగాలులకు తలలూపుతూ దాన్ని చుట్టుముట్టిన పంటపొలాలు` కళ్ళకు విందు చేస్తూ కనిపిస్తాయి.
ఈ మల్లూరు ` ఈ బృహత్ శిలా నిర్మాణాలు ` ఈ కోట ` అరుదయినవి ` అపురూపమైనవి ` ఇవి మన సంపద ` ఇవి మన సంస్కృతి ` తర్వాతి తరాల కోసం వీటిని మరింతగా పునరుజ్జీవింపచేద్దాం ` మరింత సజీవంగా మన పిల్లలకు అందిద్దాం ` భారత పురావస్తుశాఖ, తెలంగాణ ప్రభుత్వం కూడా గట్టిగా తలచుకుంటే మరో అద్భుతమైన బృహత్‌శిలా ఉద్యానవనంగా దీన్ని తీర్చిదిద్దడం చిటికెలో సాధ్యమవుతుంది.