చార్మినార్‌ జోన్‌లో కొత్తగా రూపొందించిన మీర్‌ ఆలం ట్యాంక్‌ పార్కును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి ప్రారంభించారు. ప్రభుత్వ మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిషోర్‌, లేక్స్‌ విభాగం అడిషనల్‌ కమిషనర్‌ హరిచందనలతో కలిసి పార్కును నగరవాసులకు అంకితం చేశారు.

దాదాపు రూ. 2.51 కోట్ల వ్యయంతో మీర్‌ ఆలం ట్యాంక్‌కు చింతల్‌మెట్‌ వైపు నిర్మించిన సర్వాంగ సుందరంగా రూపొందించిన పార్కు నెహ్రు జూలాజికల్‌ పార్క్‌కి అత్యంత సమీపంలో ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ప్రతి జోన్‌లో రెండు మేజర్‌ పార్కులను నిర్మించాలన్న జీహెచ్‌ఎంసీ ప్రణాళికలో భాగంగా ఈ పార్కును జీహెచ్‌ఎంసీ అతితక్కువ కాలంలో పూర్తిచేసింది. పాతబస్తీలో ఇమ్లీబన్‌ పార్కు అనంతరం రెండో అతిపెద్ద పార్కుగా దీనిని నిర్మించారు. హైదరాబాద్‌ రాష్ట్రానికి అప్పటి ప్రధాన మంత్రిగా వ్యవహరించిన మీర్‌ ఆలం బహదూర్‌ చేత 1804 లో ఈ సరస్సు నిర్మించబడింది. హైదరాబాద్‌ మూడవ నిజాం అయిన మీర్‌ అక్బర్‌ అలీ ఖాన్‌ సికందర్‌ జాహ్‌ ఆసిఫ్‌ జాహ్‌ హయాంలో అతని చేత ఈ సరస్సు నిర్మాణమయింది.

ఈ పార్కు ప్రారంభించిన అనంతరం చీఫ్‌ సెక్రటరీ మొత్తం పార్కులో ఏర్పాటుచేసిన ఓపెన్‌ జిమ్‌, చెస్‌, పచ్చీసు తదితర క్రీడా నమునాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, మూసీ రివర్‌ఫ్రంట్‌ అభివద్ధి అధికారి కె.అశోక్‌ రెడ్డి, అర్బన్‌ బయోడైవర్సిటీ డైరెక్టర్‌ రామ్మోహన్‌, రాజేంద్రనగర్‌ డిప్యూటి కమిషనర్‌ రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

చార్మినార్‌ జోన్‌లో రెండో అతిపెద్ద పార్కు


చార్మినార్‌ జోన్‌లో ఇమ్లీబన్‌ పార్కు అనంతరం మీర్‌ ఆలం పార్కు రెండో అతిపెద్ద పార్కుగా రూపొందింది. 6.5 ఎకరాల విస్తీర్ణంలో రూపొందించిన ఈ పార్కులో అర్బన్‌ బయోడైవర్సిటీ విభాగం ద్వారా లైటింగ్‌, దక్కన్‌ శైలి పెయింటింగ్‌లు, ఓపెన్‌ జిమ్‌, పిల్లల ఆట వస్తువులు, పౌంటెన్‌లు, మినీ సైన్స్‌ పార్కు, దక్కన్‌ శైలి శిల్పాలను, చిత్రాలను ఏర్పాటు చేశారు. పార్కు ప్రవేశ ద్వారంలోనే దక్కన్‌ శైలి శిల్పాలు, చిత్రాలతో కూడిన ఎంట్రీ ప్లాజా ప్రతిఒక్కరిని ఆకట్టుకునేవిధంగా ఉంది. ఈ చెరువులో 6.8 కిలోమీటర్ల వాకింగ్‌ ట్రాక్‌ను 8మీటర్ల వెడల్పుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పచ్చీసు, చెస్‌ క్రీడల నమూనాలు

ఈ మీర్‌ ఆలం ట్యాంక్‌లో చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా ఆట వస్తువులు ఏర్పాటు చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ఆదరణ ఉన్న పచ్చీసు ఆట మాదిరి, చెస్‌ ఆట మాదిరి నమూనాలను ఈ పార్కులో రూపొందించారు. పంచతత్వ వాకింగ్‌ ట్రాక్‌ మరో ఆకర్షణీయంగా ఉంది. మీర్‌ ఆలం ట్యాంక్‌ జూపార్కు వైపు ఉన్న ప్రధాన గేట్‌ వద్ద పెద్ద ఎత్తున పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలు, చెత్తను పూర్తిగా తొలగించి పార్కు చుట్టూ మొక్కలు నాటడంతో పాటు పార్కులో ప్రత్యేకంగా ఓపెన్‌ జిమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ లేక్స్‌ విభాగం ద్వారా మిరాలం చెరువు కట్ట పటిష్టత, పెన్సింగ్‌ ఏర్పాటు, పాత్‌-వే, లైటింగ్‌, గ్రీనరి, బ్యూటిఫికేషన్‌ పనులను చేపట్టారు.

Other Updates