ennelaeluguఅన్నవరం దేవేందర్‌

తెలంగాణ పల్లెల ఇండ్లముందు దృశ్యం పేరుమోసిన చిత్రకారుడు పెద్ద క్యాన్వాస్‌మీద బొమ్మ దించినట్టు కన్పిస్తది. ఇల్లు, పెద్దర్వాజ కడుప వాకిలి అరుగులు, దీపం పెట్టుకునే దిగూడు ఇవన్నీ అందంగనే ఉంటయి. దర్వాజ శేరేడులు జాజురంగుతోని ఉంటయి. లేకుంటే ఆస్మాన్‌రంగులనే ఉంటయి. కడప మాత్రం పసుపురంగు. రంగుల కాంబినేషన్‌ పల్లెలకు ప్రత్యేకత. పల్లె ఆడోల్లు గిట్లనే రంగురంగుల చీరలు కడుతరు. ఆస్మాన్‌రంగు బాలనాగమ్మ, రంగు, పోకరంగు ఇట్లా ముదురు రంగుల చీరలు, రైకలు ఏసుకుంటరు. కడుపకు పచ్చరంగు ఏసినాకాని పసుపుతోని పుదిస్తరు. ఎర్రటి, తెల్లటి బొట్లు పెడుతరు. అప్పుడు ఇంటి ముందట అందమే వేరుంటది. కడుప ఇవతల పెద్ద వాకిలి ఉంటది. వాకిలి అంతా పచ్చగ పెండతోని సాన్పు సల్లుతరు. తెల్లారి లేేస్తేనే ఊర్లల్ల ఆడోల్లు చేసే మొట్టమొదటి పని చీపురు పట్టుకొని వాకిలి ఊడ్సుడు. అటు తర్వాత పెండ నీళ్లను సల్లుడు దీన్ని వాకిలి ఊడ్చి సాన్పుసల్లుడు అంటరు. అయినంక తలెగండ్లె అంటే బయట ఎర్రమన్ను అలుకుతోని అటూఇటు కడుపలాగ అలుకుతరు.

ఎర్రమన్ను అలుకుడు ఎండినంక అండ్ల పంచపాలతోని ముగ్గేసుడు ఓ అందం. ముందుగ సుద్ద ముగ్గు ఏసి తర్వాత పచ్చబొట్టు, తెల్లబొట్టు, ఎర్రబొట్టు, పిండితో చేసిన రంగులు బొట్లుబొట్లుగా పెడుతరు. గోడలకు మాత్రం తెల్లని సున్నంల నీళ్లు కలిపి కోడి ఈకతోని తీనెలు గీస్తరు. ఇవన్నీ కంటికి ఇంపుగ అన్పిస్తయి. మల్ల వాకిట్ల సాన్పుసల్లినంక చేతివేళ్ల సందులకెల్లి సుతారంగ రాలిపడే సుద్దతోని ముగ్గులు ఏసుడు. మహా అందమైన డిజైనులు, మనం చిన్నప్పటినుంచి సూస్తున్నందున ఈ పనులన్నీ పశనతు పట్టి సూస్తలేముగని ఇంటిముందల ఆడోల్లు పుదిచ్చే అలుకు, వాకిలి కడపలలో ఒక కళాత్మకత నిండి ఉంటది. పిడికిట్ల సుద్దపొడి పట్టుకొని రెండు ఏళ్ళ సందులకెల్లి కొంచమే గీతలాగ భూమిమీదికి ఇడవడం మల్లా ఆ గీతలన్నీ చిలులుగా, చెట్లుగ, లతలుగ, రథాలుగా ఆకృతులు పొందడం మామూలు విషయంకాదు. వాల్ల చేయి ఏళ్ల మధ్యనే కళ దాగి ఉన్నది. ఇంటిముందు వాకిలిసల్లి కసంత ఎండినంక ముగ్గు ఏస్తరు. ఆ తర్వాత కడపల్ల అలకుపూత అయినంక పెద్ద దర్వాజాలు కడిగి బొట్టు పెట్టుడు అటెన్క ఇంట్ల కడుపలు అన్ని కడిగి పసుపురాస్తరు. ఇండ్లన్ని కళాత్మకతకు నిదర్శనాలు. ఇంటిలోపల ఎన్కట ఎర్రమన్నుతోని అలికి ఆరినంక ముగ్గులు ఏసేవాల్లు ఇప్పుడు రానురాను అందరి ఇండ్లల్ల బండలు అయినయి.

ముగ్గులల్ల సుత రకరకాల సుక్కల ముగ్గులు ఇప్పుడు వచ్చినయి. అంతకుముందు గీతలముగ్గులే ఉండే ఈ ముగ్గులు వేయడం కూడా అందరికి పురాగరాదు, కొందరే అండ్ల నిష్ణాతులు ఉంటరు. అంటే ఇంటింటికీ ఉండరు. కొందరికే పాటలు పాడే రాగం వస్తది. కొందరికే బొమ్మలు దించే కళ వస్తది. మరి కొందరికే ముచ్చటను కథలాగ వైనంగ చెప్పస్తది. కొందరికే పచ్చీస్‌ మస్తు ఆడస్తది అట్లనే ముగ్గులు సుతవైనంగా ఏసేటోల్లు ఉంటరు.

సంక్రాంతి పండుగప్పుడు అయితె ఇంట్ల ఉన్న తల్లిపిల్లలు మ్యానకోడండ్లు అందరు ముగ్గు బుట్టలుపట్టుకొని వాకిట్లకు వస్తరు. అందరు కల్సి రకరకాల ముగ్గులు వేస్తరు. ఎన్కట చేయివేళ్లమధ్యనుంచి రాలే గీతల ముగ్గులువేసేవాల్లుగాని ఇప్పుడు అన్నీ రంగు చాక్‌పీస్‌లు రంగుపొడిలే వచ్చినయి.

ఇయ్యాలరేపు అసలు అలుకు అలికేతందుకు జాగలేదు. సాన్పుసల్లేతందుకు వాకిలే లేదు. పట్నాలల్ల అయితె అసలే ఉండది. ఎందుకంటే జాగ మస్తు పిరము. ఊర్లల్ల సుత అంత ఇంట్ల ఇంటిముందల బండ పర్సుకుంటండ్రు. సాబాది బండలవల్ల ఎన్కటి శోభ లేకుంట అయింది. ఎన్కటవాకిట్ల గోడలపొన్న బంతి చెట్లు, గోరంట, పూల చెట్లు, రుద్రాక్ష చెట్లు ఉండేవి. శేదబాయి పొన్న జాలారు ఉండేది. ఆ జాలారు నీళ్లకు రకరకాల చెట్లు పెరుగతయి. పొప్పెడచెట్టు, జామ చెట్టు సుత ఇండ్లల్లనే ఉంటుండే. వాకిట్లనే యాపచెట్లు సుత పెంచుకుందురు. ఎండకాలం ఓ పక్క వాకిట్ల ఎండుగలు ఎండ పోస్తుండిరి. ఆ ఎండుగల కావల కోళ్లు బుక్క కుంట పోరగాండ్లు కట్టెలు పట్టుకోని కూకునుడు ఇంటిముందటినుంచి గొడ్డుమ్యాక మూతి వెట్టకుంట కావలి అదోగమ్మతి. వాకిల్లు నున్నగ ఉంటయి ఎందుకంటె ఎండుగలు అంటె వడ్లు, పెసల్లు, కందులు, బబ్బెర్లు, ఉలువలు, పురుగుపట్టకుండ ఎండపోస్తరు.

తెలంగాణ పల్లెల్లో శ్రమతో కళ లీనమై ఉంటది. మల్లన్న దేవుని దగ్గర ఏసే పట్నాలల్ల ఎంతో కళాత్మకత ఉంటది. చూస్తే అంతా ముగ్గేకాని ఒక అబ్‌స్ట్రాక్ట్‌ చిత్రకారుడు వేసినట్లుగ అందులో రంగుల కలయిక ఉంటది. దీవిలె నోములకు ఇండ్లల్ల దేవుని అర్రల సుత గోడకు పొప్పెడ ఏస్తరు. జాజు రంగుతో ఏసే ఆ పొప్పెడలో పలకలు పలకలుగా ఆర్ట్‌ ఉంటది. జాజు సున్నం, ఎర్రబొట్టు, బాలనాగమ్మ బొట్టు, సున్నం బొట్లు, కోడి ఈకలు, పసుపు పచ్చపిండి, తెల్లపిండి ఇవన్నీ ఇంటిముందు అలంకారానికి వాడే వస్తువులు. పెద్దదర్వాజ తియ్యంగనే గోడకు దిగూడు ఉంటది. ఆ దిగూట్లనే పంచపాల

ఉంటది. అందులోనే రంగులు ఉంటయి. ఇగ గోడ ఈవల మరో దిగూడు ఉంటది. ఆ దిగూడు దీపం పెట్టుకునేటట్టు ఉంటది. అది దీపం వెలుగుకు. దీవిలె అప్పుడు అండ్ల దీపంతలు దీపంపెట్టి సమరు పోసి వత్తి ఏస్తరు.

వాకిల్లు ప్రతిరోజు ఊడ్చి సల్లుతరు గని కడుపలు పుదిచ్చుడు మాతం సుక్రారం సుక్రారం మాత్రమే చేస్తరు. లేకుంటే ఇంట్ల ఏదైన పండుగ పెండ్లి అయినప్పుడు పుదిస్తరు. తెలంగాణ ఇండ్లు వాకిళ్లలో కళాత్మకత ఉట్టిపడుతాయి. పొద్దుగాల ఈ పని అంత అయినంక పొద్దు పొడిచి ఇంటిమీద తన కిరణాల ఎలుగును ప్రసరిస్తడు సూర్యుడు. అప్పుడు ఇల్లు వాకిలి మెరిసిపోతది. పల్లెల్లో వాకిలి అలుకుడు ముగ్గులు ఒక సౌందర్య సంప్రదాయం.

Other Updates