మ|| అవధానంబొక పారిజాత తరువై అందమ్ము లంజిందు, పద్య వితానోజ్జ్వల శాఖలున్‌ గవన విద్యా హృద్య హాస్యోక్తులేచివురాకుల్‌ సరసంపురాగ మధురశ్రీ వాక్సభన్‌ నవ్వులేపువులై విప్ప, వధానికౌ విజయ మొప్పున్‌ బంధురోద్గంధమై

(శతావధాని డా|| గౌరీభట్ల మెట్రామశర్మ)

అవధానము
తెలుగువారికి ప్రత్యేకమైన సాహిత్య క్రీడ. సామాన్యా ర్థంలో అవధానం అనే పదానికి ఏకాగ్రత అని అర్థం. ఇతర భాషలలో లేని సొగసులు అపూర్వ ప్రక్రియలు తెలుగు భాషలో ఉండడం, అందులో అవధాన విద్య ఒకటి కావడంవల్ల, ఈ విద్య బహుళ ప్రచారం, జనాదరణను పొందినది.

ఈ అవధాన విద్య మొదట వేదాలకు సంబంధించినది. వేదంలో జట, ఘన, మాల, శిఖ, మొదలైన భేదాలకు సంబంధించి అడిగిన మంత్రభాగాన్ని ఆపుమన్నచోట ఆపి, చదువుమన్నచోట ప్రారంభించి తన జ్ఞాపకశక్తిని ప్రదర్శించే వ్యక్తిని అవధాని అనేవారు. ఇది ధారణాశక్తికి ఉదాహరణ. కానీ సాహిత్యావధానం మాత్రం ధారణతోపాటుగా, ధార, ధోరణి, ధీ, ధైర్యం అనే అంశాలు ఏకాగ్రతతో కూడి విశిష్ట ప్రక్రియగా రూపుదాల్చింది. ఈ అవధాన ప్రక్రియ తెలంగాణలోనే ప్రారంభమైనట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ అవధానాలు అష్టావధానం, శతావధానం, ద్విశతావధానం, పంచశతావధానం, సహస్రావధానం వంటి అనేక రూపాలతో విలసిల్లుతున్నవి. ఈ అవధాన ప్రక్రియ పదమూడవ శతాబ్దంలో మొలకెత్తి ఇరవయవ శతాబ్దంనాటికి మహావృక్షమై భాసిం చింది. ప్రస్తుతం ఉన్న అష్టావధాన, శతావధాన, ప్రక్రియలకు రూపకల్పన చేసినవారు శ్రీమాన్‌ మాడభూషి వేంకటాచార్యులు. తెలుగుభాషలో అష్టావధాన లక్షణాలను ఛందోబద్ధం చేసిన ఖ్యాతి తిరుపతి వేంకట కవులకు దక్కుతుంది. ఆధునిక కాలంలో సమస్యా, నిషేధాక్షరి, దత్తపది, వర్ణన, అప్రస్తుత ప్రసంగం, వ్యస్తాక్షరి/న్యస్తాక్షరి, ఆశువు, ఛందోభాషణం, స్వీయకవితాగానం, వారగణనం, కావ్యానుకరణం, ఘంటాగణనం, పురాణపఠనం మొదలైనవి అవధానాంశాలుగా ప్రసిద్ధి చెందాయి.

పైన పేర్కొన్న అంశాలేగాకుండా ఇంకా ఎన్నో అంశాలు ఈ అవధాన ప్రక్రియలో ప్రవేశపెట్టబడ్డాయి. అవధానవిద్య నేటి వరకు ఎన్నో నూతన అంశాలతో కూడి పరిపుష్టిని సంతరించుకుంది. 17వ శతాబ్దం నాటికే 20 రకాల అవధానాలున్నట్లు గణపువరపు వేంకటకవి తెలియజేశాడు. నేటికి ఈ సంఖ్య 50కి మించినదని ”అవధాన విద్య ఆరంభ వికాసాలపై” పరిశోధించిన డా|| రాళ్ళబండి కవితాప్రసాద్‌ తెలిపారు. అవధానం కేవలం ఒక విద్య కాదు. అనేక విద్యల సమాహారమైన విద్య. ఆబాలగోపాలాన్ని అలరించే విద్య ఇది. ఒక సాహిత్యపు కసరత్తు, కవిత్వపు సర్కస్‌ఫీట్‌ అని చెప్పవచ్చు.

ప్రాచీన కాలంనుండి ఆధునిక కాలం వరకు తెలంగాణలోని ఓరుగల్లు, గద్వాల, వనపర్తి, ఆత్మకూరు, దోమకొండ, గోల్కొండ, గోపాల్‌పేట మొదలైన సంస్థానాల అధిపతులు కవిపండితులను పోషించి, సాహిత్య సృష్టికి దోహదపడ్డారు. ఈ సంస్థానాలలో కవితాగోష్ఠులు, అవధానాలు విరివిగా కొనసాగాయి. తిరుపతి వేంకటకవులు సైతం తమ నానారాజ సందర్శనంలో చెప్పిన ”అటు గద్వాలిటు చెన్నపట్టణ మధ్యంగల్గు దేశమ్మునన్‌ చటులస్ఫూర్తి శతావధానములు” చేసినవారే!

ప్రారంభ దశ: (13 శతాబ్దంనుండి 19వ శతాబ్దం వరకు) – అవధాన ప్రక్రియ పదమూడవ శతాబ్దినుండే తెలంగాణాలో ప్రారంభమైంది!
కొలచెలమ మల్లినాథసూరి: ఈయన కాళిదాసు రచనలకు వ్యాఖ్యానం రచించిన మల్లినాథసూరియొక్క తాత. ఈయన కాకతీయ ప్రభువైన రెండవ ప్రతాపరుద్రుని ఆస్థానకవి (1285-1323). రెండవ ప్రతాపరుద్రుడు ఇతనికి కనకాభిషేకం చేశాడు!

శ్లో|| కొలచెల్మాన్వయాభ్దీందు ర్మల్లినాథో మహాయశః||
శతావధాన విఖ్యాతో వీరరుద్రాభి వర్షితః||

దేశభాషలలో తెలుగు భాషకే సొంతమైన అవధానం క్రీ.శ. 13వ శతాబ్దంలో ప్రారంభమైనట్లు తెలుగు సాహిత్యంలోనే తొలి అవధాని, శతావధాని కొలచెలమ మల్లినాథసూరి అని పైశ్లోకం ద్వారా తెలుస్తున్నది.

చరిగొండ ధర్మన: ‘చిత్ర భారతం’ రచించిన తన రచనలో (1480-1530) (ధర్మపురి వాస్తవ్యుడు)

మ|| ”శతలేఖిన్యవధాన పద్య రచనా సంధాసురత్రాణ చి
హ్నిత నామా చరిగొండ ధర్మసుకవీ! నీ వాగ్విలాసంబులా
శితి కంఠోజ్జ్వల జూట కోటర కుటీ శీతాంశు రేఖా సుధా
న్విత గంగా కనకాబ్జ నిర్భర రసావిర్భూత మాధుర్యముల్‌”

అని తనను ‘శతలేఖిన్యవధాన పద్య రచనా సంధా సురత్రాణ చిహ్నిత నాముని’గా పేర్కొనడంవల్ల ఇతనుకూడా శతావధాని అని చెప్పవచ్చు.

హరిభట్టు (1475-1535):
తొలి అష్టఘంటావధాన బిరుదాంకునిగా ప్రసిద్ధుడు. ఇతడు కంభంమెట్టు (ఖమ్మం) నివాసి.

మరింగంటి ఆసూరి సింగరాచార్యులు (1520-1590):
గోల్కొండ ప్రభువైన మల్కిభరామ్‌ (ఇబ్రహీం కుతుబ్‌షా)ను తన కవితావైదుష్యంతో మెప్పించి అగ్రహారాన్ని పొందిన మహాకవి. ఇతడు శతఘంటావధానిగా, అష్టభాషా కవితా విశారదునిగా ప్రసిద్ధి పొందాడు.

తిరుమల బుక్కపట్టణం శ్రీనివాసాచార్యులు:
(1863-1919) శత ఘంటావధానిగా, దక్షిణ, ఉత్తర భారతదేశాల్లో ప్రసిద్ధి పొందాడు. వీరికి తర్కతీర్థ, బాలసరస్వతి అని బిరుదులు ఉన్నాయి. వీరు తిరుపతి వేంకటకవులతో ఆత్మకూరు సంస్థానంలో వాదోపవాదాలు చేసిన మహాపండితుడు.

పుల్లగుమ్మి వేంకటాచార్యులు: (19వ శతాబ్దం ఉత్తరార్థం):
మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాలలో నివసించారు. గద్వాల ఆస్థానకవులు, ధర్మాధికారి, శతావధాని, సీతారామభూపాలరావు. విద్యా గురువులు.

ఆధునిక దశ:
శేషాద్రిరమణ కవులు-శతావధానులు:

(1) దూపాటి శేషాచార్యులు (1890) (2) దూపాటి వేంకటరమణాచార్యులు; (1894-1961) వీరిద్దరు శేషాద్రి రమణ సోదర కవులుగా ప్రసిద్ధి చెందారు. వీరు ఆంధ్రప్రాంతంలో జన్మించినా తెలంగాణలోనే స్థిరపడి అధికంగా అవధానాలు చేశారు. శతాధికంగా గ్రంథరచన చేశారు.

విఠాల చంద్రమౌళిశాస్త్రి (1904-1940):
పూర్వపు మెదక్‌ జిల్లా సిద్ధిపేట సమీపంలోని గజవెల్లి గ్రామానికి చెందిన వారు. వీరు యాదగిరి లక్ష్మీనృసింహాలయ ఆస్థాన పండితులుగా వెలుగొందారు. అనేక శతావధానాలు, అష్టావధానాలు చేశారు.

నైజాం రాష్ట్ర ఆద్యశతావధాని శిరశినహళ్‌ కృష్ణమాచార్యులు: (1905-1993): నైజాం రాష్ట్ర ఆద్యశతావధానిగా సుప్రసిద్ధులైన శిరశినహళ్‌ కృష్ణమాచార్యులు, విద్వత్కవి, బహుగ్రంథకర్త, నిజామాబాదు జిల్లాలోని ‘మోర్తాడు’ గ్రామంలో జన్మించాడు. ఆదర్శదేశికోత్తములు, 1929 నాటికే రెండు శతావధానాలు (కోరుట్ల, జగిత్యాల) చేసి ప్రచురించారు.

డోకూరి కోట్ల బాలబ్రహ్మాచార్యులు (1911-1983):
పూర్వపు మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తి సంస్థానంలోని డోకూరు స్వస్థలం. శతా వధాని. బాల్యంనుండే అంధులైనా, అంధత్వం వీరి ప్రతిభా వైదుష్యాలకు అవరోధం కలిగించలేదు. శతావధానాలతోపాటు, సహస్రాధికంగా అవధానాలు చేశారు. పురాణ కథకునిగా, హరికథా భాగవతునిగా, గొప్ప కీర్తిని ఆర్జించారు.

దోర్బల ప్రభాకరశర్మ (1948) (మెదక్‌-రామాయంపేట):
గీర్వాణ కవితాలంకార, సంస్కృత శతావధాన ప్రభాకర, జ్ఞాన సరస్వతి మొదలగు బిరుదులతో సుప్రసిద్ధులైన శతావధాని దోర్బల ప్రభాకరశర్మ అనేక శతావధానాలు, 50పై చిలుకు అష్టావధానాలు భారతదేశంలోని సుప్రసిద్ధ పట్టణాలలో ‘నహిప్రతి’అనే విధంగా నిర్వహించారు.

డా|| గౌరీభట్ల మెట్రామ శర్మ (1957):
పూర్వపు మెదక్‌ జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో జన్మించారు. వీరి తండ్రి గౌరీభట్ల రామకృష్ణశర్మ. శ్లేషకవి, అష్టావధాని. వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని శతావధానాలు, అష్టావధానాలను ఆచరిస్తున్నారు. ‘శతావధాన కవితారామం’ అని వారు తొగుటలో చేసిన శతావధానాన్ని ప్రచురించారు.

డా|| మలుగ అంజయ్య (1960):
రంగారెడ్డి జిల్లా పూడూరు మండలంలోని అంగడి చిట్టంపల్లి గ్రామంలో జన్మించారు. శతావధాని, శతావధానాలతోపాటు 70కిపైగా అష్టావధానాలను నిర్వహించారు.

డా|| రాళ్ళబండి కవితాప్రసాద్‌ (1961-2015):
ఖమ్మంజిల్లా భద్రాచలం వీరి స్వస్థలం. అవధాన విద్యావాచస్పతిగా, ఆశుకవి సమ్రాట్‌గా, ద్విశతావధానిగా సుప్రసిద్ధులు. అవధానాలతో అనేకమైన ప్రయోగాలు చేసి, వైవిధ్యాన్ని ప్రదర్శించారు.

ముదిగొండ నాగవీరేశ్వరశాస్త్రి (1887-1964):
సికింద్రాబాద్‌లో జన్మించిన వీరు విద్వత్కవి, అష్టావధాని.

యామవరం రామశాస్త్రి (1883):
మెదక్‌ జిల్లాలోని కుక్కునూరులో జన్మించారు. వీరు అష్టావధానాలు. ప్రతిభావంతంగా నిర్వహించారు.

రాళ్ళబండి రాఘవశాస్త్రి (20వ శతాబ్దారంభం):
మెదక్‌ జిల్లా క్షీరసాగరంలో జన్మించిన వీరు అనేక అష్టావధానాలు నిర్వహించారు. గోల్కొండ పత్రికకు సంపాదకత్వం కూడా వహించారు.

సంగీత అష్టావధాని పేరక రంగాచార్యులు (1904):
హైదరాబాద్‌లోని గౌలిగూడలో జన్మించారు.

గౌరీభట్ల నారాయణశాస్త్రి (20వ శతాబ్దం ప్రారంభం):
వీరి వారసత్వమంతా అవధానులే. గౌరీభట్ల రామకృష్ణశర్మ వీరి కుమారుడు. వీరు అష్టావధానిగా అనేకచోట్ల అవధానాలు నిర్వహించారు.

పులిగోటి ఆనందమాంబ (20వ శతాబ్దం పూర్వార్థం):
కరీంనగర్‌ జిల్లా కొడిమ్యాలలో జన్మించిన ఈమె ఆధునిక కాలంలో అష్టావధానాలను నిర్వహించిన తొలి మహిళావధాని.

మామిడిపల్లి సాంబశివశర్మ (1920):

కరీంనగర్‌ జిల్లాలోని వేములవాడలో జన్మించిన మామిడిపల్లి సాంబశివశర్మ తెలుగు, సంస్కృత భాషల్లో విద్వత్కవి, అష్టావధాని, హరిదాసు, నటుడు, గాయకుడు, స్వాతంత్య్ర సమరయోధులు, వేములవాడ రాజరాజేశ్వర దేవాలయ ఆస్థానకవి.

గౌరీభట్ల రామకృష్ణశర్మ (1920):
ఏకవీర కుమారీయము అనే వ్యర్థికావ్యంతో శ్లేషకవిగా పేరుపొందిన అష్టావధాని గౌరీభట్ల రామకృష్ణశర్మ. కవిశార్దూలకిశోర బిరుదాంకితులు.

చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు (1924-1967):
వరంగల్‌ జిల్లా వేల్పుగొండలో జన్మించారు. విద్వత్కవి, అష్టావధాని, హరికథకులు.

ఆచ్ఛి వెంకటాచార్యులు (20వ శతాబ్దం పూర్వార్థం):
కరీంనగర్‌ ఆవునూరు గ్రామంలో జన్మించారు. అనేక అష్టావధానాలు నిర్వహించారు.

పార్వెళ్ళి గోపాళకృష్ణశర్మ (20వ శతాబ్దం పూర్వార్థం):
కరీంనగర్‌ జిల్లాలో జన్మించారు. అష్టావధానిగా ప్రసిద్ధులు.

మఱ్ఱిముచ్ఛాల శ్రీనాథశర్మ (20వ శతాబ్ధం పూర్వార్థం):
మెదక్‌ జిల్లా మఱ్ఱిముచ్ఛాల ప్రాంతానికి చెందిన వీరు వివిధ ప్రాంతాలలో అష్టావధానాలు నిర్వహించి పేరు పొందారు.

శాస్త్రుల విఠాలశర్మ (20వ శతాబ్ధం పూర్వార్థం):
మెదక్‌జిల్లా శివంపేట వాస్తవ్యులు. సంస్కృతంలో అవధానాలను నిర్వహించారు.

శాస్త్రుల రఘురామశర్మ (20వ శతాబ్దాం ఉత్తరార్థం):
అష్టావధానిగా, బహుగ్రంథకర్తగా పేరుగాంచారు. అష్టావధానాలతో పాటు విజ్ఞాన సర్వస్వాల రచనలో ప్రఖ్యాతి పొందారు. స్వర్ణకంకణ సత్కార గ్రహీత.

రుక్మాభట్ల రాజమౌళిశాస్త్రి (20వ శతాబ్ధం పూర్వార్థం):
మెదక్‌ జిల్లా గజవెల్లి ప్రాంతానికి చెందిన వీరు అష్టావధానాలు నిర్వహించారు.

దూపాటి సంపత్కుమారాచార్య (1932):
వీరు ఓరుగల్లులో జన్మించారు. ప్రసిద్ధ అవధానిగా, సత్కవి, ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరు పొందారు. రెండు పదుల పైచిలుకు అవధానాలు దిగ్విజయంగా పూర్తి చేశారు.

డా|| అందె వెంకటరాజము (1933):
పూర్వపు కరీంనగర్‌ జిల్లాలోని కోరుట్లలో జన్మించిన వీరు 86 పై చిలుకు అష్టావధానాలను స్వరాష్ట్రంలోనేగాక, రాష్ట్రేతర ప్రాంతాల్లో నిర్వహించారు.

కోవెల సుప్రసన్నాచార్యులు (1936):
విద్వత్కవి, అవధాని, విశ్వవిద్యాలయాచార్యులు, ప్రఖ్యాత రచయిత, పరిశోధకులు. ఓరుగల్లు పట్టణంలో జన్మించారు. కాకతీయ విశ్వ విద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా పనిచేసి విశ్రాంతి పొందారు. శతాధికంగా అష్టావధానాలు నిర్వహించారు.

గుమ్మన్నగారి లక్ష్మీనృసింహశర్మ (1937-2011):
అవధానిశశాంక, ఆశుకవితా కేసరి అనే బిరుదు వహించిన వీరు 300లకుపై చిలుకు అష్టావధానాలు, రాష్ట్ర, రాష్ట్రేతరాల్లో నిర్వహించి పేరు పొందారు.

డా|| ఇందారపు కిషన్‌రావు
(1941 ఆదిలాబాద్‌ జిల్లా తాండూరులో జననం): ప్రసిద్ధ అష్టావధాని, సత్కవి, ఆదర్శ దేశికోత్తములు, బహుభాషాకోవిదులు. శతాధికంగా అవధానాలను నిర్వహించారు.

ఆరుట్ల రంగాచార్యులు (1942):
వరంగల్‌ జిల్లా గణపురం మండలం నశికల్‌ గ్రామంలో జన్మించిన వీరు అష్టావధాని.

అష్టకాల నరసింహరామ శర్మ (1943):
కవితా సుధాకర, అవధాని శిరోమణి, బ్రాహ్మీ విభూషణ మున్నగు బిరుదాంచితులైన అష్టావధాని. సిద్ధిపేట జిల్లాలోని చిన్నకోడూరులో జన్మించారు. నూటనలభై ఎనిమిదిపై చిలుకు అవధానాలను చేసి, అనంతసాగర్‌ (మెదక్‌)లో సరస్వతీదేవి ఆలయాన్ని ప్రతిష్టించారు. సుప్రసిద్ధ కవి, అవధానిగా, వాస్తు దేవాలయ, జ్యోతిష్య, భూగర్భ జల పండితుడు, బహుగ్రంథ రచయితగా, ఉత్తమ ఉపాధ్యాయునిగా పేరు పొందారు. ‘అవధాన సరస్వతి’ అనే వారి అవధానాల సంపుటిని ప్రకటించారు.

ప్యారక శేషాచార్యులు (1948):
మెదక్‌ నరసాపురంలోని శివంపేటలో జన్మించారు. ఉత్తమకవి, విమర్శకులు, ఉత్తమ ఉపాధ్యాయులు, అష్టావధాని, శతాధిక అష్టావధానాలు నిర్వహించారు.

డా|| అవధానం రంగనాథ వాచస్పతి:
(1949-2017): ఇంటిపేరులోనే అవధానాన్ని రంగరించుకున్న ఈయన జన్మించింది కలసపాడులోనైనా, కామారెడ్డి ప్రాచ్య కళాశాల ఉపన్యాసకులుగా స్థిరపడ్డారు. ఉత్తమ విమర్శకులు, పరిశోధకులుగా పేరు పొందారు. తండ్రి అవధానం చంద్రశేఖరశర్మ నుంచి వారసత్వంగా ఈ విద్య వీరికి లభించింది.వందకుపైగా అష్టావధానాలను రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల్లో నిర్వహించారు.

ముద్దు రాజయ్య (1950):
అష్టావధాని. ఆసిఫాబాద్‌ సమీపంలోని అచలాపూర్‌ గ్రామంలో జన్మించారు. యాభైకిపై చిలుకు అష్టావధానాలను వివిధ ప్రాంతాల్లో నిర్వహించారు.

తిగుళ్ళ శ్రీహరిశర్మ (1951):
సిరిసిల్ల సమీపంలోని చీర్లవంచలో జన్మించారు. అవధాన కళాభూషణ, అవధాన ప్రవీణ, అవధాన కేసరి, అవధాన చతురాస్య, అవధాన కళా వాచస్పతి మున్నగు బిరుదులతో గీర్వాణాంధ్రఉభయభాషల్లో విద్వత్కవులుగా ప్రసిద్ధి చెందారు. తెలుగులో 108 పై చిలుకు, సంస్కృతంలో 10 పై చిలుకు అవధానాలు నిర్వహించారు.

తిగుళ్ళ రాధాకృష్ణ శర్మ (1956):
గజ్వేల్‌ సమీపంలోని అంగడి కిష్టాపూర్‌లో జన్మించారు. ప్రఖ్యాత అష్టావధాని, ఉత్తమ ఉపాధ్యాయులు. 50కి పై చిలుకు అష్టావధానాలను దిగ్విజయంగా నిర్వహించారు.

డా|| వేదాటి రఘుపతి (1956):
సత్కవి, అష్టావధాని, పరిశోధకులు, ఉత్తమ ఉపన్యాసకులుగా పేరుపొందిన ఈయన నల్లగొండ జిల్లా నమిలె గ్రామంలో జన్మించారు.

డా|| అయాచితం నటేశ్వర శర్మ (1956):
ప్రసిద్ధ అవధాని. తెలుగు, సంస్కృత భాషల్లో విద్వత్కవులు. వీరి రచనలు 50కిపైగా ముద్రితమయ్యాయి. వీరు పూర్వపు నిజామాబాద్‌ జిల్లా సదాశివనగర్‌ మండలం రథాల రామారెడ్డి గ్రామంలో జన్మించారు.

బెజుగాను రామమూర్తి (1956):
మధురకవి బిరుదాంచితులు. కామారెడ్డిలో జన్మించారు. డెబ్భైకిపైగా అవధానాలను రసరమ్యంగా నిర్వహించారు.

డా|| గణపతి అశోకశర్మ (1961):
నిజామాబాద్‌ జిల్లా రామడుగులో జన్మించిన ఈయన సత్కవి, అవధాని, ఉత్తమ ఉపాధ్యాయులు. యాభైకిపైగా అష్టావధానాలు నిర్వహించారు.

గౌరీభట్ల రఘురామశర్మ (1963):
అవధానుల వంశంలో జన్మించిన వీరు అష్టావధానిగా, పరిశోధకు లుగా ప్రసిద్ధులు. గౌరీభట్ల నారాయణశాస్త్రి వీరి తాత, గౌరీభట్ల రామకృష్ణశర్మ వీరి తండ్రి. జి.యం. రామశర్మ వీరి అన్న. వీరందరూ అవధానులే. వీరు పూర్వ మెదక్‌ జిల్లా వెంకట్రావుపేటలో జన్మించారు. 96 అష్టావధానాలను ఇప్పటివరకు దిగ్విజయంగా పూర్తి చేశారు.

జంట అష్టావధానులు డా|| ముదిగొండ అమరనాథశర్మ (1968), ముత్యంపేట గౌరీశంకరశర్మ (1968):
ఈ జంట అవధానులు పూర్వ మెదక్‌ జిల్లా దుబ్బాక మండలంలోని లచ్చపేటలో జన్మించారు. ఉభయ భాషలలో రసవంతంగా, జంట అవధానాలను 30కిపైగా నిర్వహించారు.

డా|| బోచ్కర్‌ ఓం ప్రకాశ్‌ (1978):
నైజాం రాష్ట్ర ఆద్యశతావధాని శిరశనహళ్‌ కృష్ణమాచార్యులు జన్మించిన మోర్తాడు గ్రామంలోనే వీరు జన్మించారు. స్వస్థలం నిజామాబాదు జిల్లా జక్రాన్‌పల్లి. సత్కవి, అష్టావధాని, భువన విజయ రూపకాలలో నటుడు, ఉత్తమ ఉపాధ్యాయులు. 25పై చిలుకు అష్టావధానాలను రసరమ్యంగా నిర్వహించారు.

అవుసుల భాను ప్రకాశ్‌ (1979):
మెదక్‌ జిల్లా బూరుగుపల్లి స్వస్థలం. ఇప్పటివరకు 5 అష్టావధానాలు చేశారు. వ్యాఖ్యాతగా, కవిగా రాణిస్తున్నారు.

ఎడ్ల శ్రీకాంత్‌ (1998):
యాదాద్రి జిల్లాలోని నారాయణపురం స్వస్థలం. 9వ తరగతి నుంచి అవధానాలు చేయడం ప్రారంభించి బాలావధానిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు 15పైగా అవధానాలు నిర్వహించాడు.

ఈ విధంగా ఈ అవధాన విద్య తెలంగాణలో దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతున్నది. తెలంగాణ ప్రాంత అవధానులేకాక తెలంగాణేతర ప్రాంత అవధానులకు కూడా ఈ ప్రాంతం వేదికయ్యింది. తిరుపతి వేంకటకవులు, గద్వాల, వనపర్తి, ఆత్మకూరు మొదలగు ఈ ప్రాంత సంస్థానాలలో సన్మానాలు పొందారు. పంచసహస్రావధాని జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి వరంగల్లు, యాదగిరిగుట్ట వంటి ప్రాంతాలలో వారి పంచ సహస్రావధానాలను నిర్వహించారు. ఆధునిక కాలంలో లలితకళా తోరణం, రవీంద్రభారతి ప్రాంగణాలు వేదికలై అవధానాలకు ఊతమిచ్చాయి. డా|| మేడసాని మోహన్‌ పంచసహస్రావధా నం, డా|| మాడుగుల నాగఫణిశర్మ బృహద్ద్విసహస్రావధానం, సహస్రావధానాలు ఆచరించారు. అవధాన సరస్వతీ పీఠం నెలకొల్పారు. అది కార్యరూపం దాల్చాలి! అట్లే మహాసహస్రావధాని ధారణాబ్రహ్మరాక్షసుడు డా|| గరికిపాటి నరసింహా రావు ఇక్కడే హైదరాబాద్‌లో స్థిరపడి, అనేకాష్టావధానాలు నిర్వహిస్తు న్నారు.

ఈ విధంగా పరిఢవిల్లుతున్న ఈ అవధాన విద్య భవిష్యత్తరాలకు అందించాలంటే నేటి పద్యాభిమానులకు, యువకులకు ఈ విద్యలో ప్రసిద్ధావధానులద్వారా శిక్షణ కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహించి ఇతోధికంగా తోడ్పాటునందించాలి.

ప్రసిద్ధావధానులు పూరించిన కొన్ని అంశాలను ఇక్కడ పరిశీలిద్దాం…
సమస్యలు: ”ముండా! ఈ జగమేలుకో! సడలిపో మోహాంధకారం బిలన్‌” అనే సమస్యను ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యకు జువ్వాడి గౌతమరావు ఈయగా శ్రీరామునిపరంగా ఈ విధంగా పూరించారు.

శా|| ఖండా ఖండము కాలమొక్క సుడిగా కల్పించి నీవాత్మ ని
ష్ఠుండై యీపుడమిన్‌ జనించి అసురస్తోమంబు ఖండింపగా
నిండెన్‌ వెన్నెల లచ్చ సత్త్వేములు మౌనీంద్రాప్తి, పట్టాభి రా
ముండా! ఈ జగమేలుకో…

ముండా! కాస్త ”పట్టాభి రాముండా! అని సంబోధనగా మారింది!

పద్యకోకిల, అష్టావధాని డా|| బోచ్కర్‌ ఓంప్రకాశ్‌కు ‘ఆర్మూరు’ అవధానంలో నాగుల రాజేందర్‌గౌడ్‌ అనే పృచ్ఛకుడు.

”కారమందున తీపిగల్గును కాంచవచ్చును నిక్కమే!” అనే సమస్యనీయగా…

మ||కో|| మారకోటి సమాన తేజుడు మాన్యుడౌ సురగణ్యుడున్‌
ధీరవర్యుడు భక్తపాలుడు ధీవిశేష సుపూజ్యుడౌ
చోరుడై నిజలీలలెన్నియొ చూపె కృష్ణుడు సుందరా
కారమందున!”

అని పూరించాడు! కారము కాస్త ‘సుందరాకారం’ అయినది.

దత్తపదులు: కల్లు, సారా, బీరు, రమ్ము అనే పదాలతో గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మను భారతార్థంతో పూరింపమనగా…
ఆయువరాజునన్‌ శకుని కల్లుడు. వేల్లిత మాన యోధుడున్‌
న్యాయముతోడ కర్ణు మన సారగ నేలిన ప్రోడపాండవ
శ్రీయలరారు తేజమున చిందెడు లక్ష్మికి బీరు పోవుచున్‌
మాయలు పన్ని వేచెరచి మాయు సుయోధను జూడ రమ్మురా!

”జయసుధ, జయప్రద, విజయశాంతి, జయమాలిని” అనే పదాలతో గీతోపదేశం…
జయసుధ ద్రావు యోగము విషణ్ణతతో గలుగంగ బోదు ని
శ్చయముగ శత్రుమర్ధనము సర్వజయప్రదమౌచు గ్రాలెడున్‌
స్వయముగ స్వాంతము న్విజయశాంతిని బొందుము బాంధవాహిను
మ్మయిన సహాయ మేను భయమా? జయమాలిని నీకు గల్గెడున్‌.

(అష్టకాల నరసింహరామశర్మ, హైదరాబాద్‌, అవధానం)

వర్ణన : ”తెలుగు పద్య విశిష్టత”పై శతావధాని డా|| జియం రామశర్మ వర్ణన

పద్యము భారతీ హృదయ పద్మము, వాజ్మయ దివ్య సద్మమున్‌
పద్యము తెల్గువాని రసవాద్యము, సంస్కృతి వైభవాల వై
శద్యము, హృద్యమాద్యము, స్వజాతికి నర్పితమైన స్వాదునై
వేద్యము, సర్వదా విబుధవేద్యము, దండము పద్యవిద్యకున్‌

ఆశువు: ”క్రికెట్‌కన్నా అవధానం మిన్న” అనే అంశంపై

డా|| రాళ్ళబండి ఆశువు (హైదరాబాద్‌)…

అచట పరుగులహోరు, ఇచట పదముల తీరు,
నెలమినద్దానికి నిదియె ఘనము
అచట బంతుల పోరు, ఇచట బంతుల తీరు,
నెలమినద్దానికి నిది యెఘనము
అచట బ్యాటున కొట్టు, ఇచట మాటలగొట్టు,
నెలమినద్దానికి నిదియెఘనము
అట బంతి యాశుగం బిటపంక్తి ఆశుగం బెలమినద్దానికి
నిది యెఘనము
”సిక్సు” లచట నరయ ‘క్లాసిక్సు’లిచట,
‘టీవి’ యచ్చట ప్రేక్షక ఠీవియిచట
ఇన్ని గుణములు దీపించుచున్న కతన,
క్రికెటుకన్నను అవధాన క్రీడమిన్న

న్యస్తాక్షరి: ప్రతి పాదంలో 7, 14 అక్షరాలు ‘మ’కారం రావాలి. రామాయణార్థంలో (శ్రీసీతారామ కళ్యాణం)…

సరసిజ నేత్ర మంజుల వసంత సమీరణ రేఖవోలె తా
తెరలమరుంగు మాని రవితేజుని మంగళరూపు రామునిం
గరకలితాబ్జ మాల తమకంబున మేల్తలపుల్‌ రహింపగా
నరుతను గూర్ప మ్రోసె దివి నద్భుతమైన బహువాద్య ఘోషముల్‌

(డా|| అవధానం రంగనాథ వాచస్పతి)

కావ్యానుకరణం: ”చిన్నచిన్న రాళ్ళు’ అనే పద్యానికి దూపాటి సంపత్కుమారాచార్యుల కావ్యానుకరణ….

ఆ||వె|| చిన్నచిన్న కట్లు కొన్న బ్లాకు టికెట్లు నవ్వురాని విట్లు నల్లికాట్లు
బ్యాకు బూట్ల పోట్లు బండబూతులు తిట్లు-చెప్పుటెట్లు తెలుగు సినిమ పాట్లు
(1979 మధిర అష్టావధానం) (తెలుగు సినిమాలపై)

డా|| బోచ్కర్‌ ఓం ప్రకాశ్‌
tsmagazine
tsmagazine

Other Updates