-వి ప్రకాష్
1970 డిసెంబర్ 16న తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని ఇందిరా గాంధి 1969 ఏప్రిల్ 11న ప్రవేశ పెట్టిన అష్టసూత్ర పథకం పై రాష్ట్ర శాసన సభలో ఆసక్తికరమైన చర్చ జరిగింది.
ఈ చర్చను ప్రారంభిస్తూ తెలంగాణ ఐక్య సంఘటన సభ్యుడు పోల్సాని నర్సింగారావు మాట్లాడుతూ… ”ప్రధాని ప్రవేశపెట్టిన అష్టసూత్ర పథకం 13 ఏండ్లుగా ఆంధ్ర పాలకుల పక్షపాతవైఖరిని ఎదిరిస్తూ తెలంగాణ ప్రజలు జరిపిన బ్రహ్మాండమైన పోరాటాల ఫలితం” అని అన్నారు. ”ఆంధ్ర పాలకులు” అన్న పదానికి సివికె రావు అభ్యంతరం చెప్పగా” అవును రాష్ట్ర పాలకులు ఆంధ్ర పాలకులే” అని నర్సింగారావు నొక్కి చెప్పారు.
”గత సంవత్సరం జనవరి 19న అఖిల పక్ష ఒప్పందం పై సంతకం పెట్టిన వారిలో నేను కూడా వున్నాను. పాలకులకు సద్బుద్ధి కలిగి తెలంగాణలోని ఆంధ్ర ఉద్యోగులను ఆంధ్ర ప్రాంతాలకు బదిలీ చేయడం ప్రారంభించడంతో అక్కడ కూడా ఆందోళన వచ్చింది. తెలంగాణ అభివృద్ధిని చూడవలసింది ప్రాంతీయ సంఘం మాత్రమే. ప్రధానికి గానీ, మరెవరికి గానీ సంబంధం లేదు. ప్రజల దృష్టిని మళ్ళించడానికి ఈ అష్ట సూత్ర పథకం తెచ్చార”ని నర్సింగా రావు విమర్శించారు. ”వాస్తవంగా ప్రాంతీయ కమిటీ ఈ అష్టసూత్ర పథకాన్ని ఆమోదించలేద”న్నారు. ”తెలంగాణ సమస్యను ప్రతి కమిటీ ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడు పొరపాటుగా చిత్రించి, మిగులు నిధుల నిర్ణయంలోనూ, ఉమ్మడి సీనియారిటీ లిస్టు తయారు చేయడంలోనూ తెలంగాణ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తున్నది” అని నర్సింగారావు అన్నారు.
తెలంగాణా ప్రాంతానికి జరుగుతూ వస్తున్న అన్యాయాలు, నిధుల దుర్వినియోగం గురించి అఖిల పక్ష నాయకులు ఏకగ్రీవంగా చేసిన నిర్ణయంలో నుంచి పలు అంశాలను సభ్యుల దృష్టికి ఆయన తెచ్చారు. ”నాయకులు విఫలమైనప్పుడు ప్రజలు తెలంగాణ ఆందోళనను ప్రారంభించారు. ప్రత్యేక తెలంగాణ మినహా మరేదీ ఈ ప్రాంత ప్రజలను సంతృప్తి పరచలేద”ని నర్సింగారావు అన్నారు.
జనాభిప్రాయ సేకరణ జరిపితే రాష్ట్ర విభజనకు
ఇరు ప్రాంతాల్లో సుముఖత – గౌతు లచ్చన్న
అష్ట సూత్ర కార్యక్రమంపై ఒక గంటపాటు జరిగిన చర్చలో పాల్గొంటూ ”ప్రభుత్వానికి, తెలంగాణా వారికి మధ్య పూర్తిగా నలిగిపోయింది. ఆంధ్ర ప్రాంతం” అని లచ్చన్న అన్నారు.
”తెలంగాణా మిగులు నిధుల్లో 36 కోట్లు తినబడినట్లు బ్రహ్మానందరెడ్డి అంటున్నారు, లేదు 43 కోట్లని లలిత్ గారన్నారు. అదీ కాదు తిన్న సోమ్ము 107 కోట్లని తెలంగాణ ప్రాంతీయ సంఘం అన్నది. ఈ తిన్న సొమ్ము ఎక్కడికెళ్ళింది? ఈ సొమ్ములో ఒక్క ‘కాణీ’ ఆంధ్ర ప్రాంతంలో ఖర్చయిందని చూపించండి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ” అని ఆవేశంగా అన్నారు. లచ్చన్న ”ఆంధ్ర ప్రాంతంలో ఇప్పటికిప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ జరిపితే రెండు వేర్వేరు రాష్ట్రాలుగా ఆంధ్ర – తెలంగాణాల విభజనకు ప్రజలు తప్పక సుముఖత వ్యక్త పర్చగలర”ని గౌతు లచ్చన్న స్పష్టం చేశారు.
”అష్టసూత్ర పథకం రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి ఉపయోగించిన రాజకీయ ఎత్తుగడ. అధికార పక్షాన్ని మాత్రమే అది సంతృప్తి పర్చగలద”ని లచ్చన్న విమర్శించారు
ఆంధ్ర ప్రాంత శాసన సభ్యులు (కాంగ్రెస్) పానుగంటి పిచ్చయ్య మాట్లాడుతూ తెలంగాణాను ఉద్ధరించడానికి కేవలం ప్రత్యేక రాష్ట్రవాదులనే భగవంతుడు పుట్టించ లేదు. తెలంగాణాలో వున్న వారంతా తెలంగాణా శ్రేయస్సు కోరే వారని గ్రహించాలి. నిధులు, ఉద్యోగాలలో కొంత అన్యాయం జరిగివుంటే సర్దుబాటు చేసుకోవాలి గానీ గ్రామాల్లోకి వెళ్ళి ఆందోళన లేవదీయరాద”న్నారు. ”అటువంటి ‘లంగ’ వ్యవహారాల వల్ల హడలగొట్టి కొన్ని కోట్లు సంపాదించవచ్చుగానీ ప్రజలకు మంచిది కాద”ని పిచ్చయ్య అంటుండగా మదన్ మోహన్, మాణిక్ రావు, జి. రాజారాం ఆయన మాటలకు అడ్డుతగిలారు. గౌరవ సభ్యుడు వాడిన పదాన్ని ఉప సంహరించుకోవాలన్నారు. బద్రీ విశాల్ పిట్లీ కూడా అడ్డు తగలడంతో స్పీకర్ స్థానంలో వున్న వెంకటరెడ్డి ఆ పదాన్ని ఉపసంహరించుకోవాలని పిచ్చయ్యను ఆదేశించారు.
కమ్యూనిస్టు సభ్యుడు తీగల సత్యనారాయణ మాట్లాడుతూ ”ముఖ్యమంత్రి తీసుకున్న వివిధ చర్యలు తెలంగాణాలోని పరిస్థితులను మరింత క్షీణింపజేస్తున్నాయి. రోజు రోజుకు ఉద్రిక్తత పెరుగుతున్నది. దీనికి బ్రహ్మానంద రెడ్డి మాత్రమే బాధ్యుడ”ని అన్నారు. ”రాజకీయ పరిష్కారం లేకుండా ఏదో చేస్తున్నామనుకోవడం పొరపాటు” అని సత్యనారాయణ హెచ్చరించారు.
మార్క్సిస్టు సభ్యుడు భీం రెడ్డి నర్సింహారెడ్డి మాట్లాడుతూ ”ప్రధాని అష్టసూత్ర కార్యక్రమం ఆమె అధికార ప్రాభల్యం కోసం వేసే ఎత్తుగడలలో భాగం” అని ఆరోపిస్తూ ”అది ప్రజాస్వామిక పరిష్కారం కాద”న్నారు. ఈ చర్చ మరుసటి రోజు డిసెంబర్ 17న మరో రెండు గంటల పాటు ప్రతిపక్ష (పాత) కాంగ్రెస్ సభ్యుడు టి.వి.ఎస్. చలపతి రావు మాట్లాడుతూ ”ముఖ్యమంత్రికి ప్రేమాస్పదమైన తెలుగు భాష మాట్లాడే ప్రజల ఐక్యతా పరిరక్షణకు, తెలంగాణా నాయకులలో విశ్వాసం కల్పించడానికి ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి పదవికి రాజీనామా ఇవ్వాల”ని కోరారు.
”ఉద్రేకాలు తారాస్థాయిని అందుకొన్నాయి. వాతావరణం ఆగ్రహాపూరితంగా వున్నది. సమస్యపరిష్కారానికి అన్ని పార్టీల నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేయాల”న్నారు. మిగులు నిధుల గురించి ప్రస్తావిస్తూ ”వాటిని ఆంధ్ర ప్రాంతం పద్దుల్లోంచి తీయరాద”ని కోరారు.
”తెలంగాణకు ఖర్చుకాకుండా మిగిలిన ధనం ఒక లెక్కకు వచ్చినప్పుడు రాష్ట్రం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేసిన సహాయాన్ని పరిగణలోకి తీసుకోవాల”ని చలపతిరావు పేర్కొన్నారు. ”కేంద్ర సహాయ నిధులను కూడా 2ః1 నిష్పత్తిలో వుండేటట్లు చూడాల”ని ఆయన అన్నారు.
”భార్గవ కమిటీ నివేదికను ఆమోదించడంలో మంత్రివర్గం నిర్ణయంలో భాగస్వాములైన తెలంగాణ మంత్రులు ఆ నివేదికను ప్రాంతీయ సంఘం ఆమోదించేటట్లు చూడాల”ని అన్నారు.
కొత్త కాంగ్రెస్ సభ్యుడు పి. నరసారెడ్డి మాట్లాడుతూ ”రెవెన్యూ ఖాతా నుంచి అభివృద్ధి కార్యక్రమాలపై పెట్టిన సొమ్మును తీసివేసిన తరువాత తెలంగాణ మిగులు నిధులు తేలగలవు. తెలంగాణా మిగులు నిధులు నికరంగా 30 కోట్లు”ని అన్నారు.
శాంతియుతంగా రాష్ట్ర విభజన – మదన్ మోహన్
”తెలంగాణ సమస్యకు శాంతి యుతంగా రాష్ట్రాన్ని విభజించడమే పరిష్కారమ”ని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ సభ్యుడు మదన్ మోహన్ అన్నారు.
”ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రులు కేవలం భాషా ప్రాదిపదిక పై మాత్రమే విడిపోలేదు, విడిపోవాలని కోరినప్పుడు వారి మనస్సులలో తమకు జరిగిన అన్యాయాలు కూడా కలవ”ని అన్నారు. ”తమకు అన్యాయాలు జరిగినందునే తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నారు. ఇందుకు ఇరు ప్రాంతాల్లోని తెలుగు ప్రజలు సమైక్యం కావాలనే నినాదం అవరోధం కాబోద”ని మదన్‌మోహన్ అన్నారు.
రాష్ట్ర సమగ్రతకు కృషి చేయాలి – ఉప ముఖ్యమంత్రి జె.వి.
రెండు గంటల పాటు అష్ట సూత్ర పథకంపై జరిగిన చర్చకు ప్రభుత్వం తరఫున తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉప ముఖ్యమంత్రి జె.వి. నర్సింగారావు సమాధానమిచ్చారు.
”అఖిలపక్ష ఒప్పందం నిర్ణయాలకు, ఆంధ్రప్రదేశ్ సమగ్రతను పరిరక్షించగలమని గైకొన్న దీక్షకు కట్టుబడి ఉండాల”ని సభ్యులకు జె.వి. నర్సింగారావు విజ్ఞప్తి చేశారు.
1969 జనవరి 19వ తేదీన కుదిరిన అఖిలపక్ష ఒప్పందంలోని అన్ని అంశాలను అమలు జరపడానికి ప్రభుత్వం పెక్కు కార్యక్రమాలను ప్రారంభించినట్లు ఆయన సభకు తెలిపారు. ”భార్గవ కమిటీ పేర్కొన్న 28 కోట్ల 34 లక్షల మిగులు నిధుల్లో వివిధ కార్యక్రమాల క్రింద 18 కోట్లు ఖర్చు చేశామ”ని ఆయన స్పష్టం చేశారు.
సర్వీసుల ప్రాంతీయకరణ – ముఖ్యమంత్రి ప్రకటన
ముల్కీ నిబంధనలు సక్రమమైనవేనని 1970 డిసెంబర్ 9న రాష్ట్ర హైకోర్టు ఫుల్ బెంచ్ తీర్పును ప్రభుత్వం అమలు చేయగలదని, సర్వీసుల ప్రాంతీయకరణ విధానాన్ని అమలు జరపగలదని ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి శాసన సభలో ప్రకటించారు. ”రూల్స్‌ను అంగీకరించిన ఉద్యోగుల సంఘాలతో చర్చలు జరిపిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నామ”ని బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ ఫ్రంట్ నాయకులు తప్ప ఇతర సభ్యులంతా ముఖ్యమంత్రి ప్రకటనకు హర్షం వ్యక్తం చేశారు.
”తెలంగాణ ఉద్యోగుల ఆందోళనతో ప్రారంభమైన ఈ ‘తలనొప్పి’ సమస్యకు ముల్కీ నిబంధనల ఆమోదంతోనూ, సర్వీసుల ప్రాంతీయకరణ తోనూ పరిష్కారం కుదరగలద”ని వావిలాల గోపాలకృష్ణయ్య, సివికె రావు తదితరులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
”ముల్కీ నిబంధనలను ధృవీకరించడమంటే సర్వీసుల ప్రాంతీయకరణేనా?” అని మదన్‌మోహన్ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. దీనికి సమాధానమిస్తూ ముఖ్యమంత్రి… ”యువకుడైన నా మిత్రునిపై కఠినంగా ఉండదలచలేదు. ఆయనకు ఇంకా అయోమయంగానే వున్నట్టు ఉంది” అని అన్నారు. ఎన్. రామచంద్రారెడ్డి వివరించడానికి ప్రయత్నించగా ”న్యాయవాది కాని వ్యక్తి న్యాయవాది (మదన్‌మోహన్) చెప్పిన దానికి భాష్యం చెప్పడానికి ప్రయత్నించడం దురదృష్టకరం” అంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
ముల్కీ నిబంధనలు సక్రమమేనని తీర్పు వెలువడినందున తెలంగాణా ప్రాంతంలోని ఉద్యోగాలలో నియమించబడిన వారి పరిస్థితి ఏమిటని ప్రతిపక్ష నాయకుడు అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానం చెప్తూ ”వారి నియామకాలను ఖాయం చేస్తూ, అటువంటి కేసులలో ప్రభుత్వం మినహాయింపులు ఇవ్వగలద”ని హామీ ఇచ్చారు. ”ఈ సమస్య తుది పరిష్కారంలో ప్రభుత్వంతో సహకరించవలసింద”ని ఆయన సభ్యులకు విజ్ఞప్తి చేశారు.
సర్వీసుల ప్రాంతీయకరణను సమర్ధించిన చొక్కారావు
”ప్రభుత్వ నిర్ణయం తెలంగాణా సర్వీసులకు చాలా ప్రయోజనకరం, ప్రమోషన్లు, సీనియారిటీకి చెందిన పలు సమస్యలను ఇది పరిష్కరిస్తుంద”ని ప్రాంతీయ కమిటీ అధ్యక్షుడు చొక్కారావు ‘ఆంధ్రజ్యోతి’ దిన పత్రిక విలేకరితో అన్నట్లు ఆ పత్రిక ప్రచురించింది.
ముల్కీపై ముఖ్యమంత్రి ప్రకటన అసెంబ్లీలో జరిగిన చర్చకు ముందు ముఖ్యమంత్రి ముల్కీ నిబంధనల పుట్టు పూర్వోత్తరాలను, హైకోర్టు ఫుల్ బెంచ్ తీర్పు – దాని పర్యవసానాలను వివరిస్తూ ఒక అధికార ప్రకటన చేశారు.
ఆ ప్రకటన సంక్షిప్తంగా :
రాజ్యంగం అమోదించక ముందే నిజాం నవాబు ఫర్మానా ద్వారా ముల్కీ నిబంధనలు అమలులో వున్నాయి. రాజ్యాంగం ఆమోదం తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఈ నిబంధనలను కొనసాగించాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆంధ్ర – తెలంగాణ ప్రాంతాల నాయకుల మధ్య 1958లో జరిగిన పెద్దమనుషుల ఒప్పందం ద్వారా నిబంధనలను గౌరవించింది.
మొదట్లో ఐదు సంవత్సరాలు అమల్లో ఉండాలని ఉద్దేశించిన ఈ ముల్కీ నిబంధనలు తరువాత మరో ఐదేళ్ళు ఆ తర్వాత మరో ఐదేళ్ళు అంటే 1974 వరకు అమలులో ఉండే విధంగా పార్లమెంట్ చట్టంద్వారా పొడిగించబడ్డాయి.
ముల్కీ నిబంధనలను సుప్రీం కోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం 1969 మార్చి 28న రద్దు చేసిన తర్వాత ముల్కీ నిబంధనలు అమలులో వుండడానికి వీలుగా రాజ్యాంగాన్ని సవరించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం మినహా ప్రభుత్వానికి మరో ప్రత్యామ్నాయం కనిపించలేదు. అయినప్పటికీ ఈ విషయం పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన జ్యూరిస్టుల కమిటీ రాజ్యాంగ సవరణకు సుముఖత తెలుపలేదు.
ఈ సందర్భంగా నాల్గవ తరగతి సర్వీసుల్లో (మినిస్టీరియల్ సర్వీసులలో) నియామకాలను వికేంద్రీకరణ చేయాలని మొదటి చర్యగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం సలహాననుసరించి తీసుకున్న మరొక చర్య ఏమిటంటే ఉద్యోగుల ప్రాంతీయకరణ సర్వీసుల ఏకీకరణ. అనేక శాఖలలో కామన్ గ్రేడేషన్ లిస్టులు తయారు చేయడం వల్ల తలెత్తిన వివిధ ఇబ్బందులకు సమస్యలకు పరిష్కారం కల్పించడానికి ఈ చర్య ఉద్దేశించడం జరిగింది.
రాజ్యాంగం ఏర్పడకముందే ఈ నిబంధన ఏర్పడిందన్న కారణంతో రాష్ట్ర హైకోర్టు ఫుల్ బెంచ్ ముల్కీ నిబంధనలు సరైనవేనని తీర్పునిచ్చింది. తెలంగాణా ప్రాంతంలోని ఉద్యోగ నియామకాల అవకాశాలను ఆ ప్రాంత ప్రజలకు రిజర్వు చేయడానికి హామీగా తగిన రక్షణలు కల్పించాలనే తమ లక్ష్యానికి అనుగుణంగానే ప్రభుత్వం కృషి చేస్తున్నది. హైకోర్టు తీర్పుకు సంబంధించినంతవరకు ఈ లక్ష్య సాధనకు రూపొందించిన విధానాల అమలుకు ఈ తీర్పు కట్టుబడి ఉండాలని ప్రభుత్వం కోరుతున్నది.
ఉద్యోగుల సంఘాలు చేసిన కొన్ని సూచనలు, ప్రత్యేకించి ప్రస్తుతం ఉద్యోగంలో వున్నవారి రక్షణకు వీలుగా అవసరమైన అదనపు పదవులు కల్పించాలన్న సూచనను, ప్రతిపాదనకు తుదిరూపం ఇచ్చేటప్పుడు దృష్టిలో వుంచుకోవడం జరుగుతుంది.