కామన్వెల్త్ ఆఫ్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) యుకేశాఖ ఆధ్వర్యంలో అధికారికంగా బ్రిటన్ బృందం నవంబర్ 9న తెలంగాణ అసెంబ్లీని సందర్శించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రగతి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి రాష్ట్ర ప్రణాళికశాఖ ప్రత్యేక కార్యదర్శి బీపీ ఆచార్య, మిషన్ కాకతీయ ప్రాజెక్టుపై, సాగునీటి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్కే జోషి, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ పథకం అమలు చేయడంవల్ల భూగర్భ జలాలమట్టాలు పెరిగాయని తెలిపారు.
ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ అద్భుత పథకమని బ్రిటన్ అధికారిక బృందం ప్రశంసించింది. తెలంగాణ, యూకేల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావలసిన అవసరంవుందని బ్రిటన్ అధికారుల బృందానికి నేతృత్వం వహిస్తున్న బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు వీరేంద్రశర్మ అన్నారు. ఈ బృందంలో పార్లమెంట్ సభ్యురాలు నుస్రత్‌ఘనీ, లార్డ్‌రాణా (ఎంబీఈ), లండన్ సీపీఏ అధికారిని హెలెన్ గార్డ్నర్, భారత్‌లో బ్రిటన్ దేశ డిప్యూటీ హైకమీషనర్ ఆండ్రూమైక్ అలిస్టర్, బ్రిటీష్ రాయబార కార్యాలయంలోని రాజకీయ ఆర్థిక సలహాదారు నళినీ రఘురామన్ తదితరులు వున్నారు. ఈ బృందం శాసనసభ స్పీకర్ మధుసూదనాచారితోనూ, శాసనమండలి ఛైర్మన్ కె.స్వామిగౌడ్‌లతో విడివిడిగా భేటీ అయ్యారు.