అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలలో రెండవరోజు జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ కే.చంద్రశేఖరరావు మున్సిపల్ కొత్త చట్టం బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ చట్టంలో ఎన్నో ప్రజోపయోగ నిబంధనలను తేవడం జరిగిందన్నారు. ముఖ్యంగా పనులు నిర్ధిష్ట సమయంలో పూర్తి చేయడానికి ఇందులో పొందుపరిచామన్నారు. ప్రతి విషయానికి ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండే విధంగా పొందుపరిచామన్నారు. అంతా ఆన్‌లైన్‌లో జరిగేవిధంగా మార్పులు చేశామన్నారు. 75 గజాల స్థలం కలిగిన పౌరులు 1 రూపాయితో రిజిస్ట్రేషన్ చేసుకుని, సంవత్సరానికి వంద రూపాయలు పన్ను చెల్లించాలని, వారు మున్సిపాలిటీ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోవాల్సిన పనిలేదని తెలిపారు. ఇక్కడి నుంచి మున్సిపాలిటీ వారు కొలతలు చేయాల్సిన అవసరం లేదని, ఇండ్లు నిర్మించుకునే ప్రజలే తమకు తామే స్వంత డిక్లరేషన్ ఇచ్చి ఇండ్లు నిర్మించుకోవచ్చని తెలిపారు. అయితే ఇందులో ప్రజలు ఏవైనా అవకతవకలకు పాల్పడితే 25రెట్లు అదనంగా జరిమానా విధించే విధంగా చట్టాన్ని తయారు చేశామని చెప్పారు. జీ ప్లస్ వన్ వరకు నిర్మాణానికి ఎలాంటి అనుమతులు అక్కరలేదని తెలిపారు.
ఇక హరితహారాన్ని కచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. నాటిన మొక్కల్లో 85శాతం బతికితేనే అక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులు ఉంటారని, లేదంటే ఇద్దరి ఉద్యోగాలు ఊడిపోతాయని చట్టంలో పొందుపరిచినట్లు సీఎం తెలిపారు. ఆన్‌లైన్‌లో పర్మిషన్‌కు దరఖాస్తు చేస్తే 15 రోజుల్లోపు అనుమతి ఇవ్వకుంటే అనుమతి ఇచ్చినట్లుగానే భావించి భవనాలు నిర్మించుకోవచ్చని తెలిపారు. ఇలా ఎన్నో ప్రజోపయోగమైన చట్టాలు, నిబంధనలు ఇందులో పొందుపరిచామని దీన్ని సభ్యులు ఆమోదించాలని కోరారు. అనంతరం టీఆర్‌ఎస్ సభ్యులతో పాటు ఎంఐఎం, బీజేపీ ఇతర సభ్యులు ఆమోదించారు. కాంగ్రెస్ పార్టీ వైపున భట్టి విక్రమార్క మాట్లాడుతూ అవి సక్రమంగా అమలు జరిగేలా చూడాలని అప్పుడే వాటికి సార్ధకత చేకూరుతుందన్నారు.
ఈ చట్టంతో పాటు ఈ సమావేశాలలో మరో నాలుగు బిల్లులను ప్రవేశపెట్టి సభలో ఆమోదింపచేశారు. తెలంగాణ సంచాయతీరాజ్ సవరణ బిల్లును పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబల్లి దయాకర్‌రావు ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. అలాగే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ సవరణ బిల్లు, తెలంగాణ రాష్ట్ర రుణ విముక్తి కమీషన్ బిల్లులను కూడా సభ ఆమోదించింది.
అనంతరం సభ మున్సిపల్ కొత్త చట్టాన్ని ఆమోదించడంతో సభ నిరవధికంగా వాయిదా పడింది.