డా|| నలిమెల భాస్కర్
తెలుగులో తెలంగాణ తెలుగు మళ్ళీ ఇతర ప్రాంతాల తెలుగుకన్నా కొంత విలక్షణమైనది. ఎట్లా చెప్పగలం? చూద్దాం: ఉదాహరణకు ఆంగ్లంలో ‘బెంచ్’ అనే మాట వుంది. అది ఆధునిక ప్రమాణభాషలో బెంచీ అవుతుంది. తెలంగాణలో మాత్రం ‘బేంచి’గా మారుతున్నది. అట్లాగే ‘ఛెయిర్’ అనే ఆంగ్లపదం తెలంగాణలో ‘చేర్’ అని చేరిపోతుంది. ‘ఈడ అన్ని బేంచీలే వున్నాయేమిరా, ఒక్క చేరన్న ఎయ్యలేదేందిరా?’ వంటి వాక్యాలుగా వున్నవి. మారిన బేంచి, చేర్లే! బనియన్ ‘బనీను’గానూ, బకెట్ ‘బకీటు’లానూ, పెయింట్ ‘పేంటు’గానూ, ఫెయిల్ అయ్యాడు ‘ఫేల్’ అయిండు రూపంలోనూ, ‘నెయిల్ కట్టర్’ నేల్ కట్టర్’గానూ, థియేటర్ ‘థేటర్’గానూ.. ఆంగ్లపదాలు తెలంగాణలో మార్పుకు గురౌతాయి.
పదమధ్యంలో పూర్ణానుస్వారాన్ని నిలుపుకోవడం తెలుగు భాషా లక్షణం. ఆ లక్షణం నాగుంబాము, ఆంబోతు, తాంబేలువంటి పదాలతో తెలంగాణలో సలక్షణంగా వుంది. ఈ నిండుసున్నాను నిలుపుకున్న తెలంగాణ భాష ఆంగ్ల పదాలు కొన్నింటిని తనలోనికి తెచ్చుకునేటప్పుడు ఆ పదాల్లో లేని ‘సున్నా’ను పెట్టింది. క్లాసుమేట్ తెలంగాణలో క్లాసుమెంటు అయ్యిండు. మేనేజర్ ‘మేనింజర్’గా మేనేజ్ చేస్తున్నాడు. గ్యాస్‌నూనె గాంచునూనెగా మారిపోయింది.
ఇవిగాక, మరికొన్ని తమాషాలు జరిగిపోయినై. చూద్దాం: రోడ్డువెంబడి విద్యుత్ స్తంభాలు వుంటాయి. స్తంభాలపైన క్రాస్ ఆర్మ్‌లువుంటై. ఆ క్రాస్ ఆర్ములమీదే విద్యుత్ తీగలు వుంటాయి. అడ్డంగా భుజం ఆకారంలో వుంటుంది కనుక దాన్ని క్రాస్ ఆర్మ్ అన్నాం. ఇది తెలంగాణలో ‘కాసారం’ అయ్యింది. వాళ్లు దాచారం, అన్నారం, పోచారం, గంగారంవంటి వూళ్ళ పేర్లు విన్నారు కనుక ఆ మోస్తరుగానే, ఆ అలవరుసలలోనే కాసారం అయ్యింది. ఈనాటి కుటుంబ సంక్షేమం మునుపు ‘కుటుంబ నియంత్రణ. నియంత్రణ అంటే కంట్రోలు. దాన్నే బర్త్ కంట్రోలు అనేవాళ్లు. బర్త్ అంటే పుట్టుక. ఆ పుట్టకల్ని నియంత్రించేది వేసక్టమీ ఆపరేషన్. ఈ బర్త్ కంట్రోల్ అనే పదం గమ్మత్తుగా జానపదుల నోట ‘బర్తకంట్రోలు’ అయ్యింది. అప్పట్లో ట్యూబెక్టమీ లేదు. అంతా పురుషుల వేసెక్టమీయే! ఆంగ్లంలో బర్త్ తెలంగాణలో బర్త (భర్త) అయ్యింది. వాణ్ణి కంట్రోలు చేస్తే పుట్టుకలుండవు కదా!
‘ఈ మోటార్ ఎన్ని ఆస్పర్లు? మాది అయితే ఐదు ఆస్పర్ల మోటర్ వంటి వాక్యాల్లోని ఆస్పర్లు ఏమిటి? అవి ‘హార్సు పవర్లు’. గుర్రానికి వున్న శక్తి, వేగంతోనే మోటార్ల శక్తిని అంచనా వేస్తారు. హార్సు పవర్లు ఎంత కుదింపుగా ‘ఆస్పర్లు’ అయ్యాయో గమనించండి. అట్లాగే మెకానిక్కుల దగ్గర వర్కు షాపుల్లో స్పానర్సు వుంటాయి. అవ్వి తెలంగాణలో ‘పానాలు’ అవుతాయి. తెలుగులో ప్రాణం వుంది కనుక ఆంగ్ల స్పానర్లు తెలంగాణ పానాలు అవుతేనే ఆ పదానికి ప్రాణాలొస్తాయి.
బండి ‘పంక్చర్ అయితే తెలంగాణలో ‘పంపుచారు’ అయినట్లు లెక్క. పిల్లల దగ్గరుండే షార్పునర్ ‘చాకుమారు’గా మారుతుంది. సైకిల్ టైర్లకు బురద చిత్తకుండా రక్షణకు వుండే మడ్‌గార్డు ‘మడ్గర్’ అయితీరుతుంది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ క్రమంగా ట్రాన్సుపరంగా రూపాంతరం చెందుతుంది. పూర్వం ఊళ్ళల్లో గ్రామ పంచాయతీ వద్ద రేడియోలుండేవి. జనాలదగ్గర అప్పటికింకా రేడియోసెట్లు లేని కారణంగా గ్రామ పంచాయతీ రేడియో ద్వారా వార్తలు వినిపించేవారు. బయట లౌడ్ స్పీకర్లు పేద్ద గరాటు ఆకారంలో వుండేవి. మధ్యలో పెద్ద గ్లాసులాగా ఓ నిర్మాణం వుండేది అందులో. అందుకే ఆ లౌడ్‌స్పీకర్‌ని ‘పోనిగిలాస’ అనేవాళ్ళు. ఫోన్లో మాట్లాడినట్లు వార్తలు వినిపించే గ్లాసు ఆకారం కలిగిన వస్తువు కాబట్టి అది పోనిగిలాస. ఈ రూపాంతర పదాలన్నీ పల్లె ప్రజల సృజనశీలతకు ఉదాహరణలు. వాళ్ళ ఉచ్ఛారణ విధేయతకు దృష్టాంతాలు. ఇక.. ఇంగ్లీషు ‘బుషర్టు’ తెలంగాణలో బుస్కోటు. నిజానికి అది బుష్‌షర్టు అట! బుష్ అంటే సుభాష్ చంద్రబోస్ ధరించిన షర్టు లేదా కోటు. బోస్ ధరించిన అంగీ క్రమంగా బుష్ షర్టు అయ్యి తెలంగాణలో బుస్కోటు అయ్యింది.
ఇంకా.. ఆంగ్లంలోని ‘బ్యాంక్’ తెలంగాణలో బ్యాంకుగానూ, బేంకుగానూ వ్యవహారంలో వుంది. చిత్రంగా ఇంగ్లీషులో ‘టెంపరరీ’ అనే పదం తెలంగాణలో టెంపర్వరీ అవుతుంది ప్రజలనోట. టెంపరరీ టెంపర్వరీ అవటం ఏమిటని వర్రీ అవకండి. భాషలో యిది సహజం. దీన్ని వర్ణాగమం అంటారు. పేద, ఆలు కల్సి పేదరాలు అయినప్పుడు రుగాగమం రాలేదా! ఈ ఆగమాలు సాధారణమే! ఆగమాగం కానవసరం లేని మార్పులివి.
ఇంగ్లీషులోని గ్లాస్ ‘గిలాస’, క్లాస్ ‘కిలాస్’, ప్లేట్ ‘పిలేట్’, స్లేట్ ‘సిలేట్’, కార్డు ‘కారటు’, గ్రూపు ‘గురూప్’ (అరే! ఏమో అందరూ చేరి గురూపులు కడుతున్నరేందిరో.. అనే వాక్యం వుంది తెలంగాణలో గూడుపుఠాణి అర్థంలో). స్నో (ముఖానికి పూసుకునేది) సునో, స్లోప్ ‘సులోప్’, స్లో ‘సులో’, స్విచ్చు ‘సిచ్చు లేదా సుచ్చు, బొల్టు ‘బోలోటు’, త్రెడ్స్ ‘తిరేట్లు’ (కొన్ని రకాల మేకులకు త్రెడ్సు వుంటాయి), బ్రష్ ‘బుర్సు’.. ఇట్లా వందలాది ఇంగ్లీషు మాటలు మారుమాటకు అవకాశం ఇవ్వకుండా మార్పుకు గురవుతాయి. తెలంగాణలో అందరూ యిలాగే మాట్లాడుతారని చెప్పడంకాదుగానీ అత్యధిక శాతం ప్రజలు మాటతీరు యిది. ఎలైట్‌వర్గాలు అంటే శిష్టజనుల భాషావ్యవహారం వేరు విధంగా వుంటుంది.
శ్రేష్ఠమైన బియ్యాన్ని తెలంగాణలో ‘నంబర్ ఏక్ బియ్యం’ అంటాం. ఇందులోని ‘నంబర్’ ఆంగ్లం. పూర్వం సర్కారు వృక్షాలకు నంబర్లు వేసేవాళ్లని ‘నంబర్ అందారోల్లు’ అనే వాళ్లం. ఆ నంబరూ ఇంగ్లేషే! ‘వాడు వీణ్ణి నంబర్ మీద తీసుకున్నడు’లోని నంబర్ సైతం అంగ్రేజీయే! నంబర్ మీద తీసుకునుడు అంటే చెడామడా తిట్టడంవంటి ధ్వజమెత్తడం. తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వం అనరు-సంటర్ల ఎవడున్నడురా అంటారు. ఆ సంటర్ ఆంగ్ల సెంటర్. ప్రతి మనిషికీ ‘ఏకాగ్రత’ చాలా అవసరం అనరు. ‘దమాక్ సంటర్ల ఉండాలే’ అంటరు. ఈ సంటరూ ఆంగ్లమే! ఉద్యోగానికి వయోపరిమితి అయిపోయింది అనరు-‘ఏజ్‌బార్ అయ్యింది’ అంటారు. అలవోకగా ఆంగ్లపదాల ఏరువాక సాగిస్తారు.