madapati-hanumantha-raoజి.వెంకటరామారావు

మాడపాటి హనుమంతరావు గారు ఒక వ్యక్తి కాదు. ఒక మహాసంస్థ.

సజీవమైన విజ్ఞాన సర్వస్వము. తెలంగాణ పండించిన ముత్యాలపంట హనుమంతరావుగారి జీవిత చరిత్రమే తెలంగాణ ఆంధ్రోద్యమ చరిత్ర. వారి జీవితమే పంతులు గారి జీవితము. ఆయన బ్రిటీష్‌, నిజాం రాజ్యాల సరిహద్దులలో ఉన్న ఎర్రుపాలెం వాస్తవ్వుడు గనుక నిజాం ఆంధ్రులందరిలో ముందు మేల్కొన్నారు. తన దేశీయుల్ని మేల్కొలిపినాడు. నిజాం రాజ్యంలో ‘తెలుగువీరుడు. 1904లో హనుమకొండలో శ్రీరాజరాజ నరేంద్ర ఆంధ్రభాషానిలయంలో సన్నని జాలుగా బయలుదేరిన ఆయన ఆంధ్రోద్యమం గోల్కొండ పత్రికలో పరిపుష్టినందుకుని, ఆంధ్రమహాసభలలో వాహినిగా ప్రవహించింది. అందుకే ఆయన ఆంధ్రపితామహుడు. అందరికి పూజ్యుడు. గౌరవపాత్రుడు.

మాడపాటి వారు 1885 సంవత్సరం జనవరి 2వ తేదీన జన్మించారు. ఐదు సంవత్సరాల వయసులోనే తండ్రి చనిపోగా, సూర్యాపేటలో ఉద్యోగం చేస్తున్న మేనమామ దగ్గర పెరిగారు. హన్మకొండలోని ఉన్నత పాఠశాలలో చేరి మద్రాసు యూనివర్సిటీ మెట్రిక్యులేషన్‌ పరీక్ష పాసయ్యారు. అనంతరం వరంగల్‌ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో నెలకు 40 రూపాయల వేతనంపై మీర్‌మున్షీ (హెడ్‌క్లర్క్‌) ఉద్యోగంలో చేశారు. ఎనిమిది సంవత్సరాలు ఆ ఉద్యోగంలో ఉండి హైదరాబాద్‌కొచ్చి ‘లా’ పరీక్ష ప్యాసై ప్రాక్టీసు పెట్టారు. వకాలత్‌ విడిచి పెట్టేనాటికి ఆయనకు నెలకు ఆరువందల ఆదాయం వచ్చేది. పంతులుగారి సేవ రాజకీయ పార్టీల ద్వారా జరగలేదు. నిర్మాణాత్మకమైన సంస్థలద్వారా జరిగింది.

ఒకానొక పరాభవాగ్నిలోంచి పుట్టింది నిజాం ఆంధ్రోద్యమం. అది 1921 సంవత్సరం నవంబరు 12వ తేది వివేక వర్ధనీ ఉన్నత పాఠశాలలో హైదరాబాద్‌ హిందూ సంస్కార సభ జరుగుతున్నది. ఆ సభలో అనేకమంది ఇంగ్లీషు, ఉర్దూ, మరాఠీ భాషలలో మాట్లాడుతున్నారు. ఆంధ్ర ప్రతినిధులు మాడపాటి హనుమంతరావు, ఆలంపల్లి వెంకటరామారావు, ఇద్దరూ ప్రసిద్ధులే. ఇద్దరూ హైకోర్టు న్యాయవాదులే. హనుమంతరావు తెలుగులో మాట్లాడినారు. మహారాష్ట్ర బాహుళ్యమైన సభవారు విసుక్కున్నారు. కాని విన్నారు. ఆలంపల్లివారు లేచి సభలో మాట్లాడటం మొదలు పెట్టిన సభలో వున్నవారు నిరసన చప్పట్లు కొట్టినారు. ఆయన లక్ష్యం చేయక మాట్లాడుతూనే ఉన్నాడు. సభవారు అల్లరి చేసారు. వినలేదు. సభవారు తమ వీపులు సభావేదిక వైపు తిప్పి వినమన్నారు. ఈ దుశ్చర్య, అవమానం ఆంధ్రులు భరించలేకపోయారు. ఆ రాత్రికి రాత్రే టేకుమాల రంగారావు ఇంట్లో సమావేశమై కర్తవ్యం ఆలోచించారు. ఆంధ్రుల అభిమాన సంరక్షణ కోసం, ఆంధ్రుల వ్యక్తిత్వ నిరూపణ కోసం ఒక సంఘం స్థాపించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ సంఘం పేరు నిజాం రాష్ట్ర ఆంధ్రజనసంఘం అధ్యక్షుడు రావు బహదుర్‌ సామల వెంకటరెడ్డి, కార్యదర్శి మాడపాటి హనుమంతరావు. ఒక దీపం వెలిగింది. అది ప్రజలకు దారి చూపి నడిపించింది తరువాతనే మహారాష్ట్ర కన్నడ పరిషత్తులు ఏర్పాడ్డాయి.

ఇంతవరకు ఏ ఉద్యమమైనా నగరానికే పరిమితమై ఉండేది. ఆంధ్రులుగా గ్రామ సీమలకు పోయినారు. ఆంధ్రులలో ఐకమత్యం, చైతన్యం, విద్య, స్త్రీలవికాసం మొదలైన వాటికి కారకులయ్యారు. తాము మేల్కొని ఇతరులను మేల్కొలిపారు. ఈ ఆంధ్రసంఘం పెద్ద ఆశయాలతో బయల్దేరింది. ఒక పక్కన గ్రామీణుల విజ్ఞానం వృద్ధి చేసి, వాళ్ళ కళ్ళు తెరిపించడానికి గ్రంథాలయాలు, రైతుల ఇక్కట్లు పోగొట్టడానికి రైతు సంఘాలు, వ్యాపార పరిస్థితులు బాగు పరచడానికి వర్తక సంఘాలను స్థాపించింది. పటేల్‌- పట్వారీల జులంతో, భూస్వాముల వెట్టిచాకిరితో, అధికారుల దౌర్జన్యంతో బాధపడుతున్న నిర్భాగ్యపు ప్రజల శ్రేయస్సుకోసం పనిచేసింది ఆంధ్రజన సంఘం నాయకులు జిల్లాలు తిరిగి ప్రబోధం చేసినారు.

ఆ రోజుల్లో గ్రంథాలయాలు నడ పడం అంత సులభమైన పనికాదు. నాటి ప్రభుత్వ దృష్టిలో గ్రంథాలయాలంటే విప్లవకేంద్రాలే. సూర్యాపేట గ్రంథాల యాన్ని కలెక్టరు మూసి వేయించిన సంగతి పంతులుగారి దృష్టికి రాగానే, ప్రభుత్వం హోం కార్యదర్శి సర్‌ అక్బర్‌కి లేఖ రాస్తూ ‘విజ్ఞాన కవాటాలను ప్రభుత్వం బంధించ తగునా?’ అని గాటుగా లేఖ రాశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ‘గ్రంథాలయం నడపడానికి ప్రభుత్వానుమతి అవసరం లేదని సమాధానమిచ్చింది. పంతులు గారి మాటలకు అంతగౌరవం ఆ రోజుల్లో నాల్గవ ఆంధ్ర మహాసభ కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో 1935 సంవత్సరం జనవరి 26, 27, 28 తేదీలలో జరిగింది. గద్దె నెక్కించడమేకానీ తాను ఎక్కే స్వభావం హనుమంతరావుగారిలో లేదు. సభ్యులు పట్టుపట్టారు. పంతులుగారు అధ్యక్ష పీఠం వహించక తప్పలేదు. అప్పుడే అక్కడే జరిగిన మహిళాసభకు పంతులుగారి అర్ధాంగి అధ్యక్షత వహించారు. భర్త, మరొక వైపు భార్య ఒకేసారి ఒక స్థలంలో జంటగా సాగుతున్న ఆంధ్రమహాసభకు, ఆంధ్రమహిళా సభకు అధ్యక్షత వహించాడం అపురూపం.

పంతులుగారి షష్టిపూర్తి ఉత్సవం 1946 ఫిబ్రవరిలో రెడ్డి హాస్టల్‌ ఆవరణలో మహావైభవోపేతంగా జరిగింది. దీనికి రాజ్‌ బహదూర్‌ వెంకట్రామిరెడ్డి ఆహ్వాన సంఘాధ్యక్షులు కొండా వెంకటరంగారెడ్డి కార్యదర్శి. పంతులుగారి తులాభారం జరుపగా రూ.6400 ఉన్నట్లు తేలింది. ఆ డబ్బును పంతులు గారికి సమర్పించగ, దీన్ని సారస్వత నిక్షేపంగా మార్చి పంతులుగారు వడ్డీతో సహా మహిళా కళాశాలకు విరాళంగా ఇచ్చారు. హనుంతరావు గారు బాలికల కోసం నారాయణ గూడలో స్థాపించిన పాఠశాల ఇప్పుడు వారి స్మారక కళాశాలగా గొప్ప పేరుతో నడుస్తున్నది.

బూర్గుల వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంతులుగారు ఉస్మానియాకు శాశ్వతసెనెటు సభ్యులుగా నియమితులైనారు. అటు తరువాత నాలుగేళ్ళు సిండికేటు సభ్యులుగా ఉన్నారు. ఆయన విద్యారంగానికి చేసిన సేవలను పురస్కరించుకొని ఉస్మానియా విశ్వవిద్యాలయం మాడపాటి వారు 1956లో డాక్టర్‌ రేటు బిరుదు నిచ్చి సత్కరించింది. 1955లో కేంద్ర ప్రభుత్వం పంతులుగారికి ‘పద్మ భూషణ’ బిరుదు ప్రసాదిం చింది. ఆ బిరుదు పొందిన తెలుగు వారిలో ఆయనే ప్రథములు. అనారోగ్య కారణాలతో పంతులుగారు ఢిల్లీ వెళ్ళలేక పోయారు. మరుసటి సంవత్సరం రాష్ట్రపతి డా.బాబు రాజేంద్రప్రసాద్‌ హైదరాబాద్‌ విచ్చేసినప్పుడు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం లో స్వహస్తాలతో వారికి ‘పద్మ భూషణ్‌’ బహూకరించారు.

రాష్ట్రానికి స్వాతంత్య్రం లభించిన తరువాత 1951లో హైదరాబాద్‌ నగర పాలక సంఘానికి పంతులుగారు తొలి మేయరుగా ఎన్నికయ్యారు. ఆయన వెంట ఈ పదవికి మూడు సార్లు ఎన్నికవుతూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ విధాన పరిషత్‌ అధ్యక్షునిగా మాడపాటివారు ఆరేళ్ళు ఆ పదవిలో ఉండి, ఉన్న త ఆదర్శాలతో సభ్యులందరికి మన్ననలు పొందారు.

శాసన మండలి అధ్యక్ష పదవీ విరమణ అనంతరం పంతులుగారు విశ్రాంతి జీవితాన్ని గడుపుతూ 1970 నవంబరు 11వ తేదీన తమ 86వ ఏటా కాల ధర్మం చెందారు.

Other Updates